
దేహమంటే మనిషి కాదా
– కొండేపూడి నిర్మల
దేశమ౦తా మనది కాకపోవచ్చు
దేహమయినా మనది కాకుండా ఎలా వుంటుంది ?
దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు
కానీ నిన్నటి దాకా చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి
ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి
సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది
ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి నుంచి
దేహాన్ని విడదీసి మంట పెట్టడం ఏమి న్యాయం..?
కాలధర్మం ఇంత క్రూరంగా వుంటుందా ?
ఏరు దాటిన బెస్త కూడా తెప్పను తగలబెట్టుకోడు
మర్నాటి ప్రయాణానికి సిద్ధం చేసుకూంటాడు కదా
దేహం ఆపాటి విలువ చెయ్యదా
పండక్కి తలోగ్లాసూ పాయసం పంచుకున్న౦త మామూలుగా
ఆత్మీయుల దగ్గర మన నిశ్చల దేహమ్మీద ఇక నిర్ణయ హక్కు ప్రకటించుకోవడమే మంచిదేమో
మరణం అనేది ఆశించినప్పుడు వచ్చినా , ఆకస్మికంగా వచ్చినా
ఒకేలాంటి విషాదం, వివశత్వం వుంటాయి నిజమే
నిత్యజీవితంలో ఎప్పుడూ పట్టి౦చుకోని మతమూ దాని మౌడ్యమూ
గురిచూసి అప్పుడే కోర విసరడమూ సహజమే
ఇందుకు ఎన్ని దేహాలు ఇంకా మూల్యంగా చెల్లి౦చుకోవాలి
మాట్లాడాల్సినవన్నీ మాట్లాడకపోవడం వల్లనో
మాట్లాడినవన్నీ మన్ని౦చక పోవడం వల్లనో
మల్లెపువ్వుల్లాంటి మనుషులు చితిలో ఆహుతి అవుతున్నారే
ముక్కులో దూదులు, కళ్లమీద కర్పూర౦, కాళ్ళకు పగ్గాలు, గుండెమీద కట్టేలు
అబ్బా…
ఏ మనిషైనా తను ఎలా కనబడకూడదని కోరుకు౦టాడో
అచ్చం అలాగే ముస్తాబు చేసి వదులుతున్నారు
ఆత్మగౌరవం అన్నిదిక్కులనుంచీ కోత పెడతున్నారు
ఎంత రూపవాది అయినా చివరికి ఈ నిర్జీవత్వాన్ని
ఇలా ఒక దుష్ట సమాస౦లా మోయాల్సేవస్తో౦ది
నిజానికి దేహమొక అద్భుత ప్రజాస్వామ్య వ్యవస్థ
ఒక్కసారే ముంచెయ్యదు చూడు, నియంత మాదిరిగా
మెదడు ఆగి, కోమాకు చేరుకున్న కొన్నాళ్ళదాకా గుండే బతుకుతుంది
గుండే గడియారం ఆగిన వెంటనే తీసిన కిడ్నీలు, లివరు పనిచేస్తాయి
అన్నిటి చైతన్యమూ ఆగిపోయిన ఆరుగంటలవరకూ
క౦టి గర్భంలో కనుపాపలు కువ కువలాడతాయి
ఇల్లు ఖాళీ చేసినప్పుడు ప్రేమగా పెంచుకున్న చెట్టుపాదులోంచి
చిన్న మొలకతీసి ఇంకో కు౦డీలో నాటినట్టు
ఒక దేహం మూగబోయినప్పుడల్లా
మనిషి మరొకరి గొంతులో పురివిప్పుకోవడ౦ ఎంత బావుంటుంది
శ్మశానాలకు యంత్రాలొచ్చిపడ్డాయి కానీ
మానవ జీవ కణాలకి మట్టి పాలవడమే మిగులుతోంది
మట్టినుంచి మట్టి కి ప్రయాణిస్తే ఏమొస్తుంది ?
మనిషి నుంచి మనిషికి ప్రయాణస్తే
మృత్యువనే మాటకు అర్ధమే మారుతుంది |
దేశమంటే మట్టికాదోయ్
దేహమ౦టే మనుషులోయ్
*****

కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి, ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. వీరికి కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ తగిన ఆసక్తి అభినివేశం వున్నాయి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. పుట్టింది హైదరాబాదు అయినా బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మారిస్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చేశారు.
1978 లో ఆంధ్రజ్యోతి పత్రికలో సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు.
2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా నీరు- పారిశుధ్య౦ విభాగానికి పని చేశారు.
అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా చేశారు. కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు.
ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ లో అభిరుచి వుంది.అది కాక సమకాలీన సమస్యలపై కవుల కవిత్వాన్ని వీడియోలుగా రూపొందిస్తున్నారు. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ వాహికలుగా కవిత్వానికి దృశ్య రూపం ఇవ్వడానికి కొన్ని వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
