దేహమంటే మనిషి కాదా

– కొండేపూడి నిర్మల

దేశమ౦తా మనది కాకపోవచ్చు

దేహమయినా  మనది కాకుండా ఎలా వుంటుంది ?

దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు

కానీ నిన్నటి దాకా  చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి

ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి

సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది

ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి  నుంచి

దేహాన్ని  విడదీసి మంట పెట్టడం  ఏమి న్యాయం..?

కాలధర్మం ఇంత క్రూరంగా వుంటుందా ?

ఏరు దాటిన బెస్త కూడా  తెప్పను తగలబెట్టుకోడు

మర్నాటి ప్రయాణానికి సిద్ధం చేసుకూంటాడు  కదా

దేహం ఆపాటి విలువ చెయ్యదా

పండక్కి తలోగ్లాసూ పాయసం పంచుకున్న౦త మామూలుగా

ఆత్మీయుల దగ్గర  మన నిశ్చల దేహమ్మీద ఇక  నిర్ణయ హక్కు ప్రకటించుకోవడమే మంచిదేమో

మరణం అనేది ఆశించినప్పుడు  వచ్చినా , ఆకస్మికంగా వచ్చినా

ఒకేలాంటి విషాదం,  వివశత్వం వుంటాయి నిజమే

నిత్యజీవితంలో ఎప్పుడూ పట్టి౦చుకోని మతమూ దాని  మౌడ్యమూ

గురిచూసి అప్పుడే కోర విసరడమూ సహజమే

ఇందుకు ఎన్ని దేహాలు  ఇంకా మూల్యంగా చెల్లి౦చుకోవాలి

మాట్లాడాల్సినవన్నీ మాట్లాడకపోవడం వల్లనో

మాట్లాడినవన్నీ మన్ని౦చక పోవడం వల్లనో

మల్లెపువ్వుల్లాంటి మనుషులు చితిలో ఆహుతి అవుతున్నారే

ముక్కులో దూదులు, కళ్లమీద కర్పూర౦, కాళ్ళకు పగ్గాలు, గుండెమీద కట్టేలు

అబ్బా…

ఏ మనిషైనా తను ఎలా కనబడకూడదని  కోరుకు౦టాడో

అచ్చం  అలాగే ముస్తాబు చేసి వదులుతున్నారు

ఆత్మగౌరవం అన్నిదిక్కులనుంచీ కోత పెడతున్నారు

ఎంత రూపవాది అయినా చివరికి  ఈ నిర్జీవత్వాన్ని

ఇలా ఒక దుష్ట సమాస౦లా  మోయాల్సేవస్తో౦ది

నిజానికి దేహమొక అద్భుత ప్రజాస్వామ్య వ్యవస్థ

ఒక్కసారే  ముంచెయ్యదు  చూడు, నియంత మాదిరిగా

మెదడు ఆగి, కోమాకు చేరుకున్న  కొన్నాళ్ళదాకా గుండే బతుకుతుంది

గుండే గడియారం ఆగిన వెంటనే  తీసిన కిడ్నీలు, లివరు పనిచేస్తాయి

అన్నిటి చైతన్యమూ ఆగిపోయిన  ఆరుగంటలవరకూ

క౦టి గర్భంలో కనుపాపలు కువ కువలాడతాయి

ఇల్లు ఖాళీ చేసినప్పుడు ప్రేమగా పెంచుకున్న చెట్టుపాదులోంచి

చిన్న మొలకతీసి ఇంకో  కు౦డీలో నాటినట్టు

ఒక దేహం మూగబోయినప్పుడల్లా

మనిషి మరొకరి గొంతులో పురివిప్పుకోవడ౦ ఎంత బావుంటుంది

శ్మశానాలకు యంత్రాలొచ్చిపడ్డాయి కానీ

మానవ జీవ కణాలకి మట్టి పాలవడమే మిగులుతోంది

మట్టినుంచి మట్టి కి ప్రయాణిస్తే ఏమొస్తుంది ?

మనిషి నుంచి మనిషికి ప్రయాణస్తే

మృత్యువనే మాటకు అర్ధమే మారుతుంది |

దేశమంటే మట్టికాదోయ్

దేహమ౦టే  మనుషులోయ్

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.