
గజల్-ఎదురుచూసి
-జ్యోతిర్మయి మళ్ళ
ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను
ఎదనుతాకి మదిని కలచి మరువలేని తలపయ్యెను
సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను
సఖుని కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను
సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను
మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను
తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యెను
విరహబాధకోర్వలేని హ్రుదయమింక బరువయ్యెను
వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యెను
ప్రియుని రాక కానరాక గుండెకిపుడు గుబులయ్యెను
ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యెను
ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యెను
*****

జ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారిణి. హిందీ సాహిత్య రత్న కావడం వలన హిందీ, ఉర్దు గజళ్లను, ఆస్వాదిస్తూ, అర్ధం చేసుకోగలిగిన జ్యోతిర్మయి , తెలుగు లోగజల్స్ రాస్తారు , స్వయంగా సంగీతాన్ని సమకూర్చి అలపిస్తారు. జ్యోతిర్మయి గజల్ అకాడెమీ వ్యవస్థాపకురాలు. తెలుగు గజల్ను ప్రపంచ వ్యాప్తం చేయాలనే బలమైన సంకల్పం తో విస్తృత కృషి చేస్తున్నారు. పలువురి చేత గజల్స్ రాయించడమే కాదు వాటిని రాష్ట్ర సంస్కృతిక శాఖ వారి సహాయం తో ‘గజల్ గుల్దస్తా’ పేరిట సంకలనంగా తీసుకొచ్చారు. వివిధ నూతన ప్రక్రియలైన ‘గజల్ ఫ్యూజన్’ వంటి కార్యక్రమాలు, అలాగే గాంధీ 150 వ జయంతి వేడుకలలో భాగంగా, బాపు గురించి రచించిన గజల్ కార్యక్రమం, గజల్ పైన ఒక వర్క్ షాప్ ను కూడా సంస్కృతిక శాఖ సహాయం తో నిర్వహించారు. తెలుగు భాష మన పిల్లలందరూ నేర్చు కోవాలి అన్నదే తపన గా అందుకోసం కవితలు, గేయాలు, కథలు , బొమ్మలు , ప్రసంగాలు . చేస్తూ విస్తృత కృషి చేస్తున్నారు. ఇటీవలే బొల్లిమంత శివ రామకృష్ణ ట్రస్ట్. తెనాలి వారు ‘గజల్ జ్యోతి’ అనే బిరుదు తో సత్కరించారు. దాదాపు అన్ని టీవీ ఛానెల్స్ లోనూ , తెలుగు వెలుగు వంటి ప్రసిద్ధ పత్రికలలోనూ ఇంటర్వ్యూలు ఇచ్చారు
