కొత్తకథ 2019

-సి.బి.రావు 

నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము.

ముఖం – రిషిత గాలంకి 

ఈనాడు ఉద్యోగస్తురాలైన మహిళ, ఉద్యోగ బాధ్యలతో పాటు, ఇంటిపనులు కూడా నాలుగు చేతులతో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఐతే ఆమెకు ఉన్నది రెండు చేతులే కావటం, రెండు బాధ్యలతో తీరిక లేక, పని ఒత్తిడితో సతమతమవుతున్నది. ఎన్ని ఒత్తిడులున్నా, ఆఫీస్‌లో నవ్వుతూ బాస్ కు సమాధానం చెప్తూ, సహ ఉద్యోగ్యులతో కలివిడిగా ఉంటూ పనులు నిర్వహించాలి. కోపంలోను, ఒత్తిడిలోను, అయిష్టం ఐనా,  ముఖం పై చిరునవ్వు పులుముకోవాలి. కానీ, దాని వెనకున్న మనసు తనది కదా, ఎక్కువసేపు ఈ మంచి ముఖాన్ని మోయలేదు; బరువుగా ఉంటుంది. ఎప్పుడెప్పు తీసేద్దామా అన్నట్టుంటుంది. భర్తకి మంచి భార్యగా, పిల్లలకి మంచి తల్లిగా ఉండాలి. మంచి ఉద్యోగిగా బాస్ మెప్పు పొందాలి. అందంతో కొల్లీగ్స్ మతి పోగొట్టాలి. ఆఫీస్ లో కొల్లీగ్, తన మంచి పెన్ పోగొట్టినా, పాస్టిక్ నవ్వు ఒకటి తీసి, మొహాన వేసుకుని ఫర్వాలేదులే లతా అని శాంతంగా అనాలి. నేటి స్త్రీ యొక్క బహుముఖాలను నూతన రచయిత్రి  రిషిత చక్కగా ఆవిష్కరించటంలో కృతకృత్యురాలయ్యింది.  

శీలానగర్ రెండో మలుపు: మిథున ప్రభ 

దిగువ మధ్య తరగతి కి చెందిన అమ్మాయి వేదకుమారి. తండ్రి లేడు. కేవలం 10 వ తరగతి చదువుతో  వచ్చిన బస్ కండక్టర్ ఉద్యోగంలో , అందులో ఎన్ని సాధకబాధకాలున్నా, జీవనోపాధికై, ఆమోదించవలసిన  అగత్యంతో, చేరుతుంది. వయసులో ఉన్నా, కాకి చొక్కా చెనుక తన కాంక్షలు, కోరికలను దాచిపెడ్తుంది. అయితే సరైన సమయంలో గంటకొట్టేవాడొస్తే, హృదయం స్పందించదా? ఒక బాంక్ ఉద్యోగి, తన ప్రేమను, వేదకుమారికి చెప్పినప్పుడు, అందరి ఆడపిల్లలానే తనూ వివాహానికి ఔనంది. ఐతే మర్యాదకరం కాని, కండక్టర్ ఉద్యోగం మానివేయాలన్న, అతని షరతుకు, ఆమె అహం దెబ్బతిని, రాజీనామాకు అంగీకరించదు. వివాహ రద్దుతో, ఎప్పటిలా  టికెట్స్ పట్టుకుని బస్ ఎక్కుతుంది. కథ విచారంగా ముగుస్తుంది.

వేద వివాహానికి ఔనంటే? ఒక బాంక్ ఉద్యోగస్తుడి భార్య హోదా దక్కేది. తన తల్లిని  పోషించవలసిన విషయం అతనికి గుర్తు చేసి, వివాహం తరువాత, ఆమె వారితోనె ఉంటుందనే ప్రతిపాదన, అతనితో ఎందుకు చేయలేదు? వేదకుమారి తప్పు నిర్ణయం తీసుకుందా? ఏమైనా శీలానగర్ రెండో మలుపు ఒక మంచి కథ చదివిన అనుభూతిని మిగులిస్తుంది. చక్కగా కథను చెప్పిన మిథున ప్రభ, భవిష్యత్‌లో మరిన్ని మంచి కథలు వ్రాయగలదనే నమ్మకం కలిస్తుంది.  

మత్తయి 5:11 – మెర్సీ మార్గరెట్ 

మార్తమ్మ, ఓబులేషు నాలుగంతస్తుల అపార్ట్మెంట్ లో పనిమనిషి, కాపలాదారుగా పనిచేస్తున్న భార్యాభర్తలు. 206 లో ఉండే నర్సింగ్‌రావు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, ఓబులేషు దంపతులు వ్రతానికి వెళ్ళరు, ప్రసాదం తీసుకోరు. ఎందుకు రాలేదని అడిగితే “బైబుల్ లో ప్రసాదం తినొద్దని ఉందండీ” అని ఓబులేషు అమాయంగా సమాధానం చెప్తాడు. అది ఓబులేషు పట్ల ద్వేషంగా మారి, అతను చెయ్యని నేరాన్ని, అతనికి అంటగట్టి, 13 ఏళ్ళగా పనిచేస్తున్న, అపార్ట్‌మెంట్ లోని ఉద్యోగంలోంచి, తీసివేస్తారు.  మార్తమ్మ, ఓబులేషు రోడ్డున పడ్తారు. సంక్షిప్తంగా ఇదీ మత్తయి 5:11 కథ.  

Thou shalt have no other gods before me అనేది పది ఆజ్ఞలు లో ఒకటి. దీనికి పలువురు, వేరు వేరు వ్యాఖ్యానములు చేయుచున్నారు. నేను తప్ప, అన్య దేవుళ్ళను నీవు తలచవద్దు అని అర్ధం. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చేసి, ఉన్నవీ, లేనివి అర్థం చేసుకుంటున్నారు. Love thy neighbor as thyself అని Old testament  లో మనకు కనిపిస్తుంది. క్రైస్తవ మతం ప్రేమను పెంచుతుంది. అహింసను ఖండిస్తుంది. లోక కల్యాణం కోరుకుంటుంది. నాకొక క్రైస్తవ మత మిత్రుడున్నాడు. ఆఫీస్ లో, తిరుపతి వెళ్ళినవారు, తిరిగివచ్చాక లడ్డు ప్రసాదం ఇస్తే, అభ్యంతరం పెట్టకుండా, స్వీకరించి, తినేవాడు. అతను చెప్పేవాడు, వారికి ఇది ప్రసాదం కావచ్చు, నాకు మాత్రం ఇది లడ్డే. లడ్డు ని లడ్డుగా తినటంలో సమస్య లేదుగా. ఆఫీస్ లో, ఎవరినీ నొప్పింపక, తానొవ్వక అందరికీ మిత్రుడయ్యాడు. బైబుల్ లో ప్రసాదం తినొద్దని ఎక్కడన్నా ఉందా? ప్రసాదం వద్దని తిరస్కరిస్తే, మీ మిత్రుల మనోభావాలు దెబ్బతినవా? నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పే బైబుల్, నీ మిత్రుడిని బాధ పెట్టమని చెప్పదు కదా. ఇలా తిరస్కరించకుండా, ప్రసాదాన్ని, ఆహారం గా చూసి, స్వీకరిస్తే, క్రైస్తవులు, సమాజంలో ఒకరుగా కలిసిపోతారు. 

నీరుగట్టోడు – ఝాన్సి పాపుదేశి 

ఈ కథానాయకుడు అసలు పేరు చిన్నబ్బ. ఐతే, ఆ పేరుతో అతన్ని, చిత్తూరు దగ్గరున్న అతని సొంతఊరువారే గుర్తించలేరు. చెరువులో నీళ్ళను, వూర్లో రైతుల పొలాలకు సమంగా పంచడం వాడి పని కనుక అంటే నీరు గట్టే పని గనక అందరూ వాణ్ణి నీరుగట్టోడని పిలుస్తారు. చిన్నబ్బ, నిమ్నకులానికి చెందినవాడే ఐనా, చెరువు నీటి పరిణామాన్ని అంచనా వేసి, తదనుగుణంగా, రైతుల భూములకు, నీటిని, సమంగా పంచే బుద్ధిజీవి కనుక, ఊర్లో ఒక మర్యాద, పలుకుబడి కలిగుంటాడు. వాతావరణంలో మార్పు వలన, చెరువు పరివాహక ప్రాంతం లో వెలిసిన ఇళ్ళ వలన, చెరువు లో నీరు తగ్గిపోయి, రైతులు బోర్ల పై వ్యవసాయం మొదలెడ్తారు. చిన్నబ్బ, భార్య చనిపోయాక, పట్టణం లో ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గరకు మకాం మారుస్తాడు. కొడుకు పెద్దింటి పిల్ల ప్రేమలో పడ్తే, కొడుకు ఎక్కడ పరువు హత్యకు గురవుతాడో అని భయపడతాడు. కొడుకు వివాహమయ్యాక, కొడుకు, కోడలు అన్యోన్యతకు ముచ్చట పడతాడు కాని, అనుకోని ఒక కొత్త పరిణామం తో పల్లెకు మకాం మార్చవలసి వస్తుంది. ఆ పరిణామం ఏమిటి అనేదే అనుకోని మలుపు.

కథ మనలను వేగంగా చదివింపచేస్తోంది; సమాజం లోని, ప్రజల నాడి పట్టి చూపెడుతుంది. ఝాన్సి పాపుదేశి నుంచి మరికొన్ని చక్కటి కథలు ఆశించవచ్చు. 

అనంతరం – అరుణ పప్పు 

మహి కి తన పాపంటే ప్రాణం. స్కూల్ నుంచి తిరిగి వస్తూ, రహదారి దాటుతున్న సమయంలో, పాప అకస్మాత్తుగా, తన తాత చెయ్యి వదిలి వేస్తుంది. దురదృష్టవశాత్తు, వేగంగా వస్తున్న సిటిబస్ కింద పడి, ప్రాణం విడుస్తుంది. జరిగినదానికి మహి తండ్రి ఖిన్నుడవుతాడు. కాని, ఆ విషాదం మిగిల్చిన మనస్తాపం తదుపరి, మహి, తన తండ్రితో మాట్లాటడం మానివేస్తాడు. ఆ ఇంట్లో ఎవరి మొహానా కళాకాంతులుండవు. అంతా యాంత్రికంగా జరిగి పోయే రోజులలో, ఒక తరుణాన మహి భార్య గౌరి అంటుంది మహితో. “ఇది యాదృచ్ఛికంగా జరిగింది. జరిగినదానికి, మీకన్నా, మీ నాన్నగారు ఎక్కువ బాధపడ్తున్నారు. మీ మౌనం తో వారిని మరింత బాధపెట్టవద్దు. పెద్దవారిని క్షమించండి. అసలు క్షమించడం, అవతలవారికోసం కాదు. మన కోసం. అది మనకు మనం చేసుకునే ఉపకారం. వాస్తవాన్ని అంగీకరించండి.”  మహి తిరిగి వాళ్ళ నాన్న తో ఎప్పటిలా మాట్లాడతాడా? ఆ ఇంట్లో మరలా సుఖశాంతులు వస్తాయా? ముగింపు భవదీయుడు చెప్పటం లేదు. ఇదీ అనంతరం కథ.  

గతం లో ఎన్నో వైవిధ్యమైన ఇతివృత్తాలతో కథలు వ్రాశారు అరుణ. ఆ కొత్తదనం ఈ కథలో లోపించింది. 

ఆగు: కడలి సత్యనారాయణ 

 పూర్ణి అందరిలానే ఆశలున్న పిల్ల. ఆశలు, ఆశలుగానే మిగిలిపోయాయి. తనూ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఇవి జీవితాలు ఎందుకవుతాయి, సినిమా కథలు అవుతాయి. ఇంకేం ఆశ మిగలలేదు జీవితంలో. ఎదో ఒక పని చేస్కొని బతకొచ్చు అనే ఆశ కూడా చచ్చిపోయింది. ఇక బ్రతకడం వృధా అని పూర్ణి రైలు పట్టాలు వైపు నడవసాగింది. తనను ఎవరైన గమనిస్తారేమోనన్న శంకతో, ఎవరూలేని చోటుకు వెళ్ళాలని, వడివడిగా అడుగులేస్తుంటే, ఒకతను “ఆగు” అన్నట్లుగా వినిపించి, ఆగి అతనివైపు చూసింది. “ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుందట.” నవ్వుతూ అన్నాడతడు. చేసేదిలేక, అతని పక్క బల్ల మీద చతికిలపడింది. అతను, నాలుగు నెలలక్రితం పుట్టిన తన కొడుకు అగ్గును చూడటానికి తన ఊరెళ్ళుతున్నాడట. కొడుకు చేసే అల్లరిగురించి చెప్తూ, ముక్కచెక్కలవుతున్నాడు. రావలసిన రైలు వస్తుంది. అతను రైలు ఎక్కుతూ, నువ్వు రావటం లేదా అని ప్రశ్నిస్తాడు. తను తరువాత వస్తానని చెప్తోంది. అతనితో, సంభాషణ తర్వాత, చావాలనే కోరిక ఎగిరిపోతుంది. తన గదికి వెళ్ళి, తన పోర్ట్‌ఫొలియో వైపు చూస్తుంది. వాళ్ళ నాన్న “నా చిన్ని పాప సినిమా హీరోయిన్ అవుతుందా” అంటూ తనను ఎత్తుకుని గిర గిర తిప్పడం గుర్తొస్తుంది. ఇదీ కడలి కథ.

అరుణ పప్పు కథ “అనంతరం”,  మనసును కలిచివేసే బాధ నుంచి బయటపడటం ఐతే, కడలి కథ ఆగు, బాధను తట్టుకునే శక్తి లేక, క్షణికావేశంలో తీసుకునే, అనాలోచిత నిర్ణయం అమలు వైపు సాగుతుంది. అయితే, ఆ చివరి క్షణంలో, తనకు స్వాంతన కలిగే మాటలు ఎవరైనా చెప్పినా, త్వరలో తను కోరుకుంది జరగబోతుందన్న కబురు విన్నా, ఆ ఆవేశం తుస్సుమంటుంది. ఆత్మహత్య నివారించబడుతుంది; నిండు జీవితం 

నిలబడుతుంది. కడలి కథచెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 

వే టు మెట్రొ: కుప్పిలి పద్మ 

ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఎక్కువ మంది విమర్శకులచే ప్రశంశలు పొందినదీ కథ. ఝాన్సి కొత్తపెళ్ళికూతురుగా, అంజిబాబు వెంట సైబరాబాదు లోని, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కు వచ్చింది తొమ్మిదేళ్ళ క్రితం. అంజిబాబు వాచ్‌మేన్ గా పనిచేస్తే, తను నాలుగు ఇళ్ళలో పని కుదుర్చుకుంది. ఝాన్సి పట్టణం వచ్చాక, ఎంతో నేర్చుకుంది. ఇప్పుడు పల్లెటూరి అమాయకత్వం వీడి, పట్టణం లో ఎలా మసులుకోవాలో తెలుసుకుంది. పిల్లలను డొనేషన్ కట్టి మంచి స్కూల్స్ లో చేర్పించింది. వాళ్ళకు మంచి బట్టలు కొంది. తను ఉండే వాచ్‌మెన్  గదిలోకి కావలసిన టి.వి, బీరువా, మంచాలు, ఇంకా కుర్చీలు సమస్తం అమర్చుకుంది. పిల్లదానికోసం కొంత బంగారం కూడా కొన్నది. నిశ్చింతగా ఉంటూ, అత్త, మామలకు నెల, నెలా వారి అవసరాలకై డబ్బు పంపుతూంది. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా. 14 రోజులనాడు అంజిబాబు ఎదో మాయ జ్వరం తో మరణించాడు. ఝాన్సికి మిన్ను విరిగి మీద పడినట్లయ్యింది. కష్టాలు మొదలయ్యాయి. కొందరు, వారు, బయటకు వెళ్ళే సమయాన, ఝాన్సిని ఎదురు రావద్దని అంక్షలు పెట్టారు. కొత్త వాచ్‌మెన్ ను పెడుతున్నాం, గది ఖాళి చెయ్యమని కబురు పంపారు. సెక్రెటరిని వెళ్ళి కలిసింది. వాచ్‌మేన్ ఉద్యోగం మగవారికి మాత్రమేనని, ఆ ఉద్యోగం ఆమెకు ఇవ్వటం వీలుపడదని, కమిటీ వాళ్ళ నిర్ణయమని, సెక్రెటరి చెప్పిన మాటలకు ఖిన్నురాలవుతుంది ఝాన్సి. తన గది ఖాళి చెయ్యవలసిన విపత్కర పరిస్థితిలో, ఝాన్సి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంది అనేది మిగతా కథ. ఝాన్సి తెగువకల మనిషి. నగరం మారుతుంది. ఝాన్సి కూడా, రేపు ఏమి చేయాలో, ఆమె నిర్ణయించుకోగలదు. ఇది ఒక సబల కథ.  అదీ వే టు మెట్రొ కథ.

రచయిత్రి స్త్రీవాది. తన కథా నాయికను ధీరోదాత్త వనితగా తీర్చి, పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడేలా తీర్చిదిద్దడం ప్రశంసనీయం. ఆచరణీయం.   

పైన చెప్పిన రచయిత్రుల కథలే కాకుండా, కొత్త పుంతలు తొక్కిన, లబ్దప్రతిష్టులైన, పలువురు రచయితల కథలు ఈ సంపుటం లో చోటు చేసుకున్నాయి. చదవతగ్గ కథలనేకం ఉన్న ఈ కథల పుస్తకం, మీ గృహ గ్రంధాలయంలో ఉండతగ్గది. Writers Meet సత్ఫలితాలిస్తున్నదని చెప్పటానికి ఋజువు కొత్తకథ 2019. ఈ రచయితల సమావేశ నిర్వాహకులు కె.సురెష్, మొహమ్మద్ ఖదీర్‌బాబులకు అభినందనలు. 

కొత్తకథ 2019 సంపాదకులు కె.సురేష్, మహమ్మద్ ఖదీర్‌బాబు

1/8 డెమో పరిమాణం లో పుటలు 248

ధర రూ.149/-

నవోదయా, కాచిగూడ మరియు ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యం.  

amazon.in లో అచ్చు పుస్తకం మరియు కిండిల్ ఇ పుస్తకంగా లభ్యమవుతుంది.   

*****

Please follow and like us:

2 thoughts on “కొత్తకథ 2019”

  1. ఇది నెచ్చెలి పత్రిక కదా! స్త్రీల కథలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడును.అదే నెచ్చెలి ప్రత్యేకత. ఆ కారణంతోనే పురుషుల కథలు విడిచి, మహిళలు వ్రాసిన కథలపై విశ్లేషణ జరిగినది. గమనించగలరు.

  2. పుస్తక సమీక్ష అంటే పుస్తకం మొత్తాన్ని సమీక్షించడం అనుకుంటున్నాను.
    అన్ని కధలను సమీక్షించలేదు

Leave a Reply to Anil అట్లూరి Cancel reply

Your email address will not be published.