జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి

-సాయి పద్మ 

All you have shall someday be given; Therefore give now, that the season of giving may be yours and not your inheritors

– Kahlil Gibran –

నీ దగ్గరున్నదంతా ఏదో రోజు ఇవ్వబడుతుంది; కాబట్టి ఇప్పుడే ఇచ్చేయి, ఇచ్చే సందర్భం నీదిగా మలచుకో, వారసత్వంగా వదలకు. 

–ఖలీల్ జిబ్రాన్ —

పై సూత్రం మాత్రమే తెలిసిన,విశ్వ, విశాఖ సాహిత్య జగమెరిగిన జగద్ధాత్రి గారు , కవయిత్రి, రచయిత్రి, బోల్డు డిగ్రీలు ఉన్న జగద్ధాత్రి గారు , ఉరి వేసుకొని చనిపోయారు. రెండు రోజుల నుండీ సోషల్ మీడియా హోరెత్తుతోంది. విపరీతమైన బాధతో, వేదనతో, విలపిస్తున్నవాళ్ళు కొంతమంది అయితే, ఒక రకమైన స్తబ్దత తో, స్థాణువు ల్లా మారిన నాలాంటి వాళ్ళు కొందరు. ఇకపోతే, కొన్ని బంధాల పర్యవసానాలు ఇంతే అని నిట్టూరుస్తున్న సాంప్రదాయ వాదులు కొందరు అయితే, కాస్త వోపిక పట్టలేక పోయిందా? ఏదో ఒకటి చేసి ఆమెకి ఒక ఆసరా కల్పించేవాళ్ళం అని బాధపడుతున్న అభ్యుదయవాదులు కొందరు. 

ఎవరు ఏం అన్నా.. అమ్మ వెళ్ళిపోయారు. నా పాపా .. నా బంగారు పాపా అని పిలిచే తల్లి లాంటి సాహిత్య ఫ్రెండ్ ని కోల్పోయిన నాకు, నోరంతా చేదుగా ఉంది. ఇలా రాస్తుంటే కూడా, ఆమె గుర్తుకు వస్తున్నారు. నివాళులు రాసేవాళ్ళకి ఆమె పెట్టిన పేరు, తద్దినాల ఎక్తివిస్ట్ లు .. సగం విజయనగరం యాస లో ఆమె మాట్లాడుతుంటే చూసి తీరాల్సిందే. నేను ఆమెకి పెట్టిన పేరు మోడరన్ మధురవాణి. ఉత్తరాంధ్ర యాసలో,కన్యాశుల్కం చేయాలని , చలం పాత్రల ఆడియో ఎనాలిసిస్ చేయాలని.. ఎన్నో కలలు. అన్నీ ఆవిరి చేసేసి,  నన్ను కూడా తద్దినాల ఎక్తివిస్ట్ ని చేసావా అమ్మా ?? 

జగతి అమ్మ నా గురించి రాసిన ఒక పోయెం లో .. 

“అయినా నువ్వేమీ కొత్త కాదు నాకు

ప్రతి సారీ నేనోడిపోతానేమో

అని పడి పోయే సమయాన 

అదాటుగా వచ్చి నన్ను 

ఆదుకుంటావు …..

నాకు తెలుసు …” – నన్ను క్షమించమ్మా .. నేను కలలోనైనా ఊహించని షాక్ తో, అదాటున రాలేకపోయాను. అశక్తురాలిని. 

ఇకపోతే, ఆమె గురించి ఎందుకు రాయాలి ? కేంద్ర సాహిత్య అకాడెమీ మెంబర్ అనా, పేరొందిన రచయిత్రి అనా, లేకపోతే మూడుముళ్ల బంధం తనకి నచ్చకపోతే , నచ్చిన వ్యక్తితో సహజీవనం సాగించిన వ్యక్తి అనా ? తానెంతో ప్రేమించిన కూతుర్ని వొక దశలో తాను వొంటరి దాన్ని చేసి , సహచరుని మానసికంగా, శారీరకంగా కోల్పోయిన తర్వాత , కూతురి ప్రేమ కోసం వెంపర్లాడిన వ్యక్తి అనా ? లేదా  సహచరుని కుటుంబం నుండి మానసిక , శారీరక , ఆత్మిక దాడులు ఎదుర్కొన్న వ్యక్తి అనా…. being Jagadhdhatri is not an easy task, as her life and choices are complicated which hurts traditionalism and the so-called dogma of motherhood and its over glorified values. ఇక్కడ నేను జగద్ధాత్రి గారి, జీవనం లోని కాంప్లెక్స్ రిలేషన్ షిప్స్ గురించిన వొక పార్శ్వం చెప్పే ప్రయత్నం చేశాను. ఆమె జీవితంలో విలన్స్ ఎవరూ లేరు, ఆమె, భర్త, కూతురు, సహచరుని తో సహా. ఆమె దేవత కాదు, వాళ్ళు కూడా ఆమెలా మనుషులే. కోపతాపాలకీ , ఆవేశ కావేశాలకీ ఎవరూ అతీతులు కారు.  ఆమెని నేను ఎప్పటికీ జడ్జ్ చేయను, దయచేసి జడ్జ్ చేసే కామెంట్స్ పెట్టవద్దని కోరుకుంటున్నాను. 

నేను రాస్తుంది , వీళ్ళకోసం .. మనిషి పార్ధివ దేహం బిగుసుకు పోయి పడి ఉన్నప్పుడు కూడా రెండు నిముషాలు మౌనం పాటించలేని వాళ్ళ కోసం, అక్కడ నుండే ఏది ఎలా జరిగింతో స్నేహితులకి వాళ్ళ క్రియేటివ్ లైవ్ టెలికాస్ట్ చేసే అతి ఉత్సాహవంతుల కోసం, సహచరుని మరణంతో కుంగిపోయి, ఉరి వేసుకుందని, భర్త తో డిస్కస్ చేసే అభ్యుదయ వాదుల కోసం, ఎంతో చదువుకొని కూడా డిప్రెషన్, వొంటరితనం వొక రకమైన జబ్బు, అది మనసుల్ని , మనిషిని లోపల నుండి తినేస్తుందని, దానికి మనిషి డిగ్రీల తో, మేధస్సు తో సంబంధం లేదని తెలీని తెలివైన మూర్ఖుల కోసం. 

ఇంకొక ముఖ్య కారణం- ప్రేమ. జగతి మా నుండి షరతులు లేని స్వచ్చమైన ప్రేమ అనుభవించని, తెలుగు కవి, రచయిత, ఫ్రెండ్, పరిచయస్తులు , ఆడా, మగా తేడా లేకుండా ఉన్నారు అంటే నాకు సందేహమే. ఆమెది వొక చిన్నపిల్ల మనస్తత్వం, అతిగా చదువుకున్న చిన్నపిల్ల ఆమె, వొక చిన్న వాక్యం రాస్తే డోరోతీ పార్కర్ తోనో, సిల్వియా ప్లాత్ నో పోల్చగలిగే ,అనలైజ్ చేయగలిగే  జ్ఞానం , Intellectual temperament ఆమెకి ఉన్నా, అది కెరీర్ గా మార్చుకొనే లౌక్యం, తెలివితేటలు ఆమెకి లేవు. కావాలని కూడా అనుకోలేదు. ఎంతమందికి ఘోస్ట్ రైటింగ్ రాసిందో, ఎంతమందిని కవులుగా చేసిందో, వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎంతమంది కధలూ, కవితలూ ట్రాన్స్లేట్ చేసిందో.. ఇంకెంతమందిని పరిచయం చేసిందో. అది అవధులు లేని ఆమె ప్రేమ. ఎవరు అక్షరాన్ని కుదురుగా రాసినా, మురిసిపోయే కొండంత మురిపెం. 

ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది – పాపం పిచ్చిది, అదే ప్రేమ తన మీద కూడా మనుషులు చూపిస్తారని ఆశించింది. మీటింగ్స్ లో వెనుక వరుసలలో కూర్చొని , తన మీద తాను ప్రేమించే మనుషులు చేసే వ్యాఖ్యానాలని విని భరించింది. ప్రేమ , మాతృత్వం , సాంప్రదాయం, కులం పేరుతో జరిగే ప్రతీ హింసా భరించింది. పిత్రుస్వామ్యపు చెంప దెబ్బలు తిని, నా వాళ్ళే కొట్టారనుకొండి అంది. నింఫో మేనియాక్ ఈవిడ, లాంటి వేల్యూ జద్గ్మెంట్లు సహనంగా తీసుకుంది. కవులూ, రచయితలూ అంటే , వాళ్ళేదో దేవలోకం మనుషులు అనుకుంది, మామూలు మనుషులకి ఉన్న నిబ్బరం, సహనం, సహానుభూతి వాళ్లకి ఉండవు… వాళ్ళు పాటించని విలువల ప్రమాణాలూ, విషయాల మీద మాత్రం అందరూ పెద్దలే అని తెలుసుకోలేక పోయింది. బలాలు గ్లోరిఫై చేసి, మార్కెట్ చేసే కాలంలో చిన్న బలహీనత కూడా, సంబంధం లేని వాళ్లకి కూడా బ్రేకింగ్ న్యూస్ అని తెలుసుకోలేక పోయింది. వొక విషయం తప్పు అయినప్పుడు దానికి జెండర్ ఉంటుంది, మాత్రుత్వాలూ, పిత్రుస్వామ్యాలూ, కలగాపులగంగా వాడుకొనే అభ్యుదయాలూ, అని తెలిసి కూడా, వాళ్ళని చెంప దెబ్బ కొట్టలేని ఆశక్తురాలై వెళ్ళిపోయింది. 

నిజానికి, ఆమె ఎప్పుడో చనిపోయింది. ఇంత చదువుకున్న ప్రేమైక మూర్తివి, నీ అక్షరం నీకు ఆలంబన గా చేసుకో , అని చెప్పిన కొందరి హితుల మాటలు విన్నా, మిగతా అందరి కుహనాతనం తెలిసి, వాళ్ళని ప్రేమించి అలిసిపోయింది, తన మాటల్లో చెప్పాలంటే 

“ నాకు బతకాలని ఉంది , అవును ,

అమేయ వసంతానుభూతిలా !!! 

ఎన్నటికీ ఆవిరికాని  ప్రేమ కాసారంలా !!!

ఓడిపోయి తలవంచని అలలా అలా అలా !” 

అది సాధ్యం కానప్పుడు , ఇవ్వటమే తెలిసిన మనిషి, స్నేహితులు కాల్ చేస్తే కట్ చేసి తానే చేసి మాట్లాడే మనిషి, ఎవరి ఋణం ఉంచుకోవటం అలవాటు లేని మనిషి, వెల్లువెత్తిన సానుభూతిని, దాని వెనుక ఉన్న హేళన నీ, అర్ధం చేసుకున్న మేధావి…పాత్రత, అపాత్రత కూడా అనుకోకుండా తనవి అన్న ప్రతీ వస్తువునీ దానం చేసేసి, నిజమైన స్నేహితుల, హితుల ప్రేమని మాత్రం, తన నుదిటి బొట్టు లా ధరించి, ధగధగలాడుతూ, ప్రేమ రధం ఎక్కి వెళిపోయింది…!! 

~~సాయి పద్మ 

25-8-2019  

*****

Please follow and like us:

One thought on “జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి”

  1. Padma Garu, Thank you for putting this out in words. So well. Jagathi is my aunt. I can’t bring myself to use the word ‘was’. She is a unique masterpiece. Anything I write had to go through her. Now I just feel lost. Miss her.

Leave a Reply to Santhi Swaroopa Cancel reply

Your email address will not be published.