జీవితం అంచున -32 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

సభ  జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్  వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరై వుంటారాని ఆలోచిస్తూ రెండో రింగ్ కే ఎత్తాను. నేను ‘హలో’ అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి ‘హలో’ అన్నాను. 

“హలో అండి, నా పేరు రామం. మీ పుస్తకావిష్కరణకి వచ్చి, పుస్తకం తీసుకున్నాను. చాలా హృద్యంగా, ఆర్ద్రంగా మీ మనవరాలిపై ప్రేమను ఆవిష్కరించారు. అందులో చివరి పేజీలో మీ గత ప్రచురణల వివరాలు వున్నాయి. నాకు మీ పాత నాలుగు పుస్తకాలు కావాలండి. పేమెంట్ ఎంత, ఎలా చేయాలో చెప్పగలరు” అవతలి నుండి ఓ పురుష కంఠ౦.

ఇండియాలో వుండేది చాలా తక్కువ. ఆ కొద్ది రోజుల్లో ఇలాంటి కాల్స్ మామూలే కాబట్టి అతను మాట్లాడుతున్న నంబరుకే ఫోన్ పే చేయమనీ, పోస్టేజీ ఉచితమనీ చెప్పి కాల్ డిస్ కనెక్ట్ చేసాను. ఆరు వందలు ఫోన్ పే చేసి, స్క్రీన్ షాట్ తో పాటు అడ్రస్ పంపాడు ఆ ఆగంతకుడు. మరో రెండు రోజుల తరువాత పుస్తకాలు డిస్పాచ్ అయ్యాయా అని మెసేజ్ చేశాడు. కొరియర్ ట్రాకింగ్ ఐడీ పంపాను. ఆ తర్వాత పుస్తకాలు అందాయని మెసేజ్ చేశాడు. థంబ్ ఎమోజీ పెట్టాను.

అప్పటికి ఊరుకుని ఆ సాయంత్రం “మీవే కాక మరేమైనా మంచి బుక్స్ ఉంటే సజెస్ట్ చేయండి” అని మెసేజ్ చేశాడు.

“సారీ అండీ. నేను ఇండియాలో వుండను. ఇండియా వచ్చినప్పుడల్లా మీరడిగినట్లే అందరినీ కనుక్కుని మంచి పుస్తకాలు కొనుక్కుని పట్టుకెళుతుంటాను” అని జవాబిచ్చాను.

నాలుగు రోజుల తరువాత నా నవల అనాచ్చాదిత ముగించి, మళ్ళీ మెసేజ్ చేశాడు. 

“మీ మొదటి నవలను బ్రేక్ లేకుండా పూర్తి చేసాను. వదల బుద్ధి కాలేదు. ముప్పై మూడేళ్ళు ఆర్మీలో పని చేసి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని రాసారు. నేనూ ఎయిర్ ఫోర్స్ వెటరన్ ను. రాతలోని మీ ఫ్లైర్ తో చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఎయిర్ ఫోర్స్ తర్వాత, పదమూడేళ్లు దుబాయ్ లో పని చేశాను. భార్య పోయాక, ఈ మధ్యనే ఇండియా వచ్చాను. రాగానే ఇక్కడ యూనివర్సిటీలో ఉద్యోగం. సారీ ఇవన్నీ చెబుతున్నందుకు” అని టెక్స్ట్ చేశాడు.  

ఆ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నాడా అనుకున్నాను. నా మనసులో మాట తెల్సినట్టుగా రెస్పాండయ్యాడు. 

“ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నేను జీవితంలో చాలా చూశాను. నవలలో మీ లీడ్ రోల్ నన్ను పెద్దగా బాధ పెట్టలేదు. నాది పెద్ద గీత అయితే, కథలోని ఆ పాత్రది చాలా చిన్న గీత’’ అని మెసేజ్ చేశాడు. 

నాలో కొంచం క్యూరియాసిటీ పెరిగింది.

“ఇంటింటికో రామాయణం ఉంటుందండీ. అది మామూలేగా” అని రిప్లై ఇచ్చాను.

“కానీ నా రామాయణం వేరు. మీకు మంచి కథావస్తువు అవుతుందండీ” అన్నాడు.

“అయితే మీ జీవితంలో ఆ బారెడు కష్టాల గీత ఏమిటో చెప్పండి క్లుప్తంగా” అన్నాను.

“ఒకటని కాదండీ. నాది కట్నం తీసుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఎదురు కట్నం పెళ్ళి. తాను పోయాక గాని తెలియలేదు నాకు, తను అంతకాలం నాతో ఇష్టంగా లేదని.  తన ఫోనులో ఇతరులతో చాట్ చదివాక అర్ధమయ్యింది తన మనసులో నా స్థానం. నా దురదృష్టానికి తోడు తను పోయాక బంధువులబ్బాయితో జరిపించిన నా  కూతురి పెళ్ళి ఆరు నెలలకే విడాకులకు దారి తీయటం. ఒక్కోసారి దృశ్యంలో వెంకటేష్ పాత్రలా అనిపిస్తుంది నాది. ఇలాంటి వాటికి తోడుగా ఇంకా చాలా జరిగాయి నా జీవితంలో. నేను గాయకుడిని. నాతో పాటలు పాడే ఒకావిడ, వాళ్ళమ్మకి హెల్త్ బాలేదని రిక్వెస్ట్ చేసి ఒక లక్ష తీసుకుంది. తిరిగి అడిగితే, సెక్సువల్ హరాస్మెంట్ కేస్ పెడతానంది. ఇలా బోలెడు. ఇవన్నీ ఇలా మెసేజీలో చెప్పుకునేవి కావు. కొన్ని కొన్ని సార్లు దేవుడు లేడనిపిస్తాడు. మళ్ళీ దారిలోకి వస్తాను. భగవద్గీతను, రామాయణాన్నీ అనుసరిస్తూ భోదిస్తూ ఉంటాను.’’ అన్నాడు. 

గాడంగా నిట్టూర్చి “ఐ యాం రియల్లీ సారీ అండి. విల్ టాక్ టు యు లేటర్” అన్నాను. 

మళ్ళీ నాలుగు రోజులు తరువాత కాల్ వచ్చింది. నంబరు చూసాక కొంచం చిరాకు, విసుగు కలిగింది. నా పుస్తకాల పైన విశ్లేషణ వరకూ వినొచ్చు, పాఠకుని అభిప్రాయం తెలుసుకోవచ్చు కాని అతని స్వంత విషయాలు కొంచం విసుగు కలిగించాయి.

అతను కొంచెం మొహమాటంగా “ఝాన్సీగారూ, ఆ రోజు సభలో మీ దీర్ఘ కవితను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయించాలని చెప్పారు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వొచ్చు కదా. మీ అంచనాలకు తగ్గకుండా, ఎక్కడా ఫ్లేవర్ మారకుండా చేయగలను. ఆ హామీ ఇస్తాను మీకు.’’ అన్నాడు. 

“ఆల్రెడీ ఒకరు మొదలు పెట్టారండీ. దాదాపు సగం వరకూ అయ్యింది. అసలయితే రెండు వర్షన్స్ ఒకేసారి ఆవిష్కరించాలనుకున్నాను. అనువాదం డిలే కావటంతో తెలుగు వర్షన్ ఆవిష్కరణ చేసేసాను. ఐ యాం సో సారీ. బట్ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్” అన్నాను.

“బై ఎనీ ఛాన్స్ ఏ మాత్రం అవకాశమున్నా చెప్పండి. నా నంబరు సేవ్ చేసి పెట్టుకోండి” అతని గొంతులో నిరాశ వినిపించింది.

“థాంక్స్ అండీ. తప్పకుండా” అంటూ ఫోను పెట్టేసాను.

మరో పది రోజులు ఎదురు చూసినా నా అనువాదం చేస్తున్న శరత్ బాబుగారి అనువాదం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. నలభై శాతం చేసారనుకుంటా. నాలో ఓపిక, సహనం చచ్చిపోయాయి.

అప్పుడు మాటాడటానికే విసుగనిపించిన రామం నంబరు వెతికి సేవ్ చేసుకుని కాల్ చేసాను.

“రామంగారూ, మీరు నా దీర్ఘ కవితను ట్రాన్స్లేట్ చేస్తానన్నారు కదా. ఇంకా అదే మాట మీద వున్నారా. అనువాదం చేస్తున్నతను తెలుగు అకాడమీ అప్పగించిన పనుల్లో బిజీగా వున్నారట. సమయం పడుతుందంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే వారు చేసినంత వరకూ వదిలేసి, ఆ పై నుండి అనువాదం కొనసాగించగలరా” అని అడిగాను. 

“తప్పకుండానండీ. వారు ఎంతవరకూ చేసారో చెప్పండి. ఆ పైన చేస్తాను” అన్నాడు. అతని గొంతులో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.

“నా సిక్స్త్ సెన్స్ గట్టిగా చెప్పిందండీ మీరు కాల్ చేస్తారని. నా ఐదు పదులు దాటిన జీవితంలో సిక్స్త్ సెన్స్ ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. ఏదయినా నమ్మితే చాలా దృడంగా నమ్ముతాను. నా ముందు ఆంజనేయ స్వామి, వెన్నంటి సాయిబాబా,  కుడి పక్క కృష్ణుడు, ఎడమ పక్క లలితమ్మ నిత్యం నాకు తోడు వుంటారు. నా జీవితాన్ని నడిపే సారధులు వారే” 

అతనేమి అన్నాడో అసలు ఏమి చేప్పాలనుకుంటున్నాడో ఒక్క ముక్క అర్ధం కాలేదు నాకు. కాని ఏదో యుద్ధాన్ని గెలిచిన గర్వం, ఉల్లాసం ఆ గొంతులో స్పష్టంగా తెలుస్తోంది.

అతని మాటలు మనస్తత్వం చిత్రంగా అనిపించాయి. అంత ఎక్సైట్మెంట్ ఎందుకో అంతు పట్టలేదు. అతనికి అనువాదం అయిపోయిన పేజీల సంఖ్య చెప్పి “కంగారు ఏమీ లేదండీ. నిదానంగానే చేయండి” అన్నాను.

ఓ నిమగ్నతతో ఇష్టనైవేద్యపు అర్పణలా ఏకధాటిన అదే రోజు అర్ధరాత్రికి ఐదు పేజీల అనువాదం చేసి పంపేశాడు. అతని స్పీడుకి, అంకిత భావానికి ఆశ్చర్యమేసింది.

దాన్ని పబ్లిషర్ కి పంపాను. పబ్లిషర్ ఫెయిర్ చేసి పంపిన పేజీలను తిరిగి రామంకి పంపాను. వాటిలో అచ్చు తప్పులు, తప్పు పంక్చువేషన్ మార్క్స్ అతనికి నచ్చలేదు. 

“ఝాన్సీగారూ, పబ్లిషర్కి అంతగా ఇంగ్లిష్ నాలెడ్జ్ లేనట్టుంది. పబ్లిషరూ, మీరూ, నేనూ కాన్ఫెరెన్స్ కాల్ చేసుకుని ఎడిట్ చేద్దామా. రాత్రి పది తరువాత నేను ఫ్రీ అవుతాను” అన్నాడు.

“పబ్లిషర్ ని అడిగి చెబుతానండీ” అన్నాను.

పబ్లిషర్ తో మాటాడి ఆ రాత్రి పదింటికి రామంకి కాల్ చేసాను. అతను ప్రతి పదాన్నీ విడమర్చి పబ్లిషర్ కి చెప్పి కరెక్ట్ చేయించే విధానం అద్భుతం. ఎక్కడికక్కడ స్పెల్లింగ్ తో పాటు అర్ధాన్ని కూడా వివరించడం మరీ నచ్చింది. వారిరువురి మధ్యా నేను శ్రోతగా మాత్రమే మిగిలిపోయాను.

ఆ రోజు నుంచీ అనువాదం పూర్తయ్యేవరకూ రోజూ రాత్రి పదింటికి కాన్ఫరెన్స్ కాల్ మొదలయ్యేది. ఒక్కోసారి గంటా గంటన్నరలో పబ్లిషర్ డ్రాప్ అయిపోయినా మేమిద్దరం అనువాదాన్ని ఇంకా మెరుగుపరిచే దిశగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. సమయమే తెలిసేది కాదు. 

ట్రాన్స్లేషన్ పూర్తయిన రోజు “శరత్ బాబుగారు చేసిన మొదటి భాగం కూడా నాకు పంపుతారా ?  నేను ఆ భాగం కూడా చేసాను. పోనీ నేను చేసింది మీకు పంపుతాను. రెంటినీ బేరీజు వేసి తోచిన మార్పులూ చేర్పులతో ఫైనల్ చేసుకోండి. ఏది ఏమైనా మీ పుస్తకం ది బెస్ట్ గా రావడమే నాకు కావలిసింది.” అన్నాడు.

నేను ఆలోచనలో పడ్డాను. రెంటినీ పోల్చి చూసాను. కొన్ని స్టాంజాలు రామంవే బావున్నాయి. ఆంగ్ల భాష పైన మంచి పట్టు వున్న మనిషే. పైగా కొన్ని లైన్లు ఒక రిథంతో అంత్యప్రాసలో ముగించడం బావుంది. సొంత రచనే అన్నంత ప్రేమగా చేశాడు. అయినా నా మొదటి భాగాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళ వర్క్ ని తీసేయాలనుకోలేదు. అలానే ఉంచి, అనువాదకులుగా ఇద్దరి పేర్లనూ పెట్టమనీ, రామంని రెండో పేరుగా పెట్టమనీ పబ్టిషర్ కి చెప్పాను. అనువాదం పూర్తయ్యేసరికి రామంకి నాతో చనువు పెరిగింది. 

“రాత్రి పదయ్యేసరికి మీతో మాట్లాడటానికి అలవాటు పడిపోయాను. తీరిగ్గా ఉన్నప్పుడు కాల్ చేయండి. నేనేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను” అన్నాడు.

“అయ్యో, ఎంత మాటండీ. తప్పకుండా చేస్తాను. వీలయితే రోజూనూ” అంటూ నవ్వాను. నిజానికి నేనూ అతని మాటలకు అడిక్ట్ అయిపోయాను.

మా మధ్య రోజూ మాటలతో చనువు పెరిగింది, దూరం తరిగింది.

పురాణాలు, వేదాంతం, రాజకీయం, నేటి జనరేషన్, నైతిక విలువలు, కలలు, మంత్రతంత్రాలు, జ్యోతిష్యం, వివాహాలు, పునర్వివాహాలు, పునర్జన్మలు, సినీగేయాలు… ఇలా ఒకటేమిటి అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. కూలంకుషంగా చర్చించుకునేవాళ్ళం. అతనో నడిచే గూగుల్ అని నాకు అర్ధమయ్యింది. అతని సూథింగ్ కంఠస్వరాన్ని బట్టి మంచి భావుకుడనీ, సుకుమారుడనీ అనుకున్నాను. అలాగే మాటాడే విషయాలను బట్టి స్థితప్రజ్ఞుడని అనిపించింది. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే తాత్విక చింతనా, రసికత్వమూ రెండు సగాలుగా అతనిలో కొలువున్నాయనీ అనిపించింది. అసలు ఆ మల్టీ ట్యాలెంట్ కి విస్తుపోయాను. అతను అరుదైన మనిషిలా, అపురూపమైన వ్యక్తిత్వం కలవాడిగా అనిపించింది.

ప్రెస్ నుండి పుస్తకాలొచ్చాయి. నా ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నాను. మనసులో రామం మెదిలాడు. మొదటి కాపీని రామంకే ఇవ్వాలనిపించింది. రామంని డిన్నర్ కి ఇన్వైట్ చేసాను.  అతనికి ఇష్టమైన వంటకాల గురించి ఆరా తీసాను. అతను బ్రాహ్మిన్ అని తెలుసు కానీ అంతవరకూ మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ కులమతాల ప్రసక్తి రాలేదు. అతను నాన్ వెజ్ తినడని తెలిసి విస్తుపోయాను. చాటుగా నాన్వెజ్ ని లాగించేసే దొంగ బ్రాహ్మలు చాలామంది తెలుసు నాకు. మటన్ బిరియానీ చేసి, చికన్ కర్రీ చేద్దామనుకున్న నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలే నేను నాన్ వెజ్ ప్రియురాలిని. అతను కోరిన పెసర కట్టు, ఆలూ ఫ్రై, కొత్తిమీర కారం, పరమాన్నం చేసి బయటి నుండి కాశీతో స్వీట్స్ తెప్పించి అతని రాక కోసం ఎదురు చూసాను. ఆ ఎదురు చూపుల్లో నేను ఇదివరకెన్నడూ ఎరుగని అనిర్వచనీయ ఉద్వేగం.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.