అనుసృజన

నిర్మల

(భాగం-1)

ఆర్. శాంతసుందరి 

(హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -)

వకీలు ఉదయభాను లాల్ కి ఇద్దరు కూతుళ్ళు .పెద్దమాయి నిర్మల రెండోది కృష్ణ. నిర్మలకి పదిహేనో ఏడు కృష్ణకి పది నిండాయి. నిన్న మొన్నటి వరకూ ఇద్దరూ బొమ్మలతో ఆడుకునేవాళ్ళు. ఇద్దరిదీ ఒకే రకమైన స్వభావం.వయసు తేడా పెద్దగా అడ్డొచ్చేది కాదు. చురుగ్గా ఆటలాడటం, సరదాగా బైట తిరగటమంటే ఇద్దరికీ ప్రాణం. ఎప్పుడు చూసినా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ పని చెయ్యమంటే మాత్రం తప్పించుకుంటూ ఉంటారు. తమ్ముళ్ళతో పోట్లాడుతూ, నౌకర్లని కసురుకుంటూ పెత్తనం చెలాయిస్తారు. కానీ పెళ్ళి బాజా వినిపిస్తే చాలు వీధి గుమ్మం దగ్గరకి పరిగెత్తుతారు.

ఇవాళ హఠాత్తుగా జరిగిన సంఘటనతో పెద్దమ్మాయి ఆరిందాలానూ, చిన్నది చిన్నపిల్లలానూ మారిపోయారు. ఎన్నో నెలలుగా ఉదయభాను లాల్ నిర్మలకి సంబంధాలు చూస్తున్నాడు. అవాళ్టికి ఆయన ప్రయత్నం ఫలించింది. బాలచంద్ర సిన్హా పెద్దబ్బాయి భువన్ మోహన్ తో సంబంధం నిశ్చయమైంది. ఆ సమాచారం వినగానే ఆ అమాయకపు పిల్ల మొహం కప్పుకుని ఒక మూల కూర్చుండి పోయింది. మనసులో ఏదో తెలీని సందేహం, ఏదో భయం ఒళ్ళంతా పాకింది. ఏమవబోతోందో అనుకుంటూ ముడుచుకుపోయింది!

మామూలుగా పెళ్ళి నిశ్చయమైన యువతుల్లో ఉండే సిగ్గు, పులకరింతలూ, మాటి మాటికీ పెదవుల మీద అకారణంగా కనిపించే చిరునవ్వూ ఏవీ లేవు. అక్కడ ఎలాటి కోరికలూ, కలలూ లేవు. ఉన్నదంతా అనుమానాలూ, ఆందోళనలూ భయం కలిగించే ఊహలూ. ఇంకా ఆ పిల్లలో యౌవనం పూర్తిగా వికసించనే లేదు.

***

[పెళ్ళి పనులు ఊపందుకున్నాయి.ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది.వరుడి తరఫు వాళ్ళు కట్నం వద్దనీ, పెళ్ళి ఘనంగా చెయ్యమనీ కోరారు. ఉదయభాను లాల్ మొదట అనుకున్నదానికన్నా ఖర్చు రెండింతలు అయేట్టు ఉండటం చూసి ఆయన భార్య కల్యాణి గొడవ పెట్టుకుంది.]

***

రాత్రి తొమ్మిది గంటలైంది. ఉదయభాను లాల్ పెళ్ళికయే ఖర్చుల వివరాలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఆ పని ఆయన దాదాపు రోజూ చేస్తాడు. ఏవో మార్పులూ చేర్పులూ చేస్తూ ఉంటాడు. ఆయన ఎదురుగా కల్యాణి కోపంగా నిలబడింది. చాలాసేపటికి తలెత్తి ఆమెవైపు చూస్తూ,”పదివేలకి తక్కువయేట్టు లేదు, బహుశా ఇంకా ఎక్కువే కావచ్చు” అన్నాడాయన.

“పది రోజుల్లో అయిదు వేలు పదివేలయాయి. ఇంకో నెలకి లక్ష అయిపోతాయేమో చూడండి!” అంది కల్యాణి వ్యంగ్యంగా.

“నలుగురిలో మర్యాద కాపాడుకోవాలంటే తప్పదు కదా ! అతిథులని తృప్తి పరచాలి, వాళ్ళకి జరిపే మర్యాదలలో లోటు రానివ్వకూడదు.”

“బ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించినప్పట్నుంచీ ఎవరైనా వరుడి తరఫు వారిని తృప్తి పరచగలిగారా చెప్పండి? ఏదో ఒక తప్పు ఎత్తిచూపి అవమానించేందుకు వాళ్ళు అవకాశం కోసం చూస్తూ ఉంటారు. నా మాట విని పెళ్ళివారి గొంతెమ్మ కోరికల గురించి ఆలోచించటం మానెయ్యండి.”

“అయితే నన్నేం చెయ్యమంటావు?”

“ఆరు నూరైనా ఐదు వేలకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని నిశ్చయించుకోండి.”

“అయితే నేనివాళ చచ్చిపోతేనే నయం!”

“సర్లెండి చావు బతుకుల సంగతి ఎవరికి తెలుస్తుంది? ఇందులో కోపగించుకోవటానికేముంది? అందరమూ ఏదో ఒక రోజు చనిపోయేవారమే. శాశ్వతంగా ఎవరూ ఉండిపోరు కదా?”

“అంటే నాకు చావు దగ్గర పడిందనా నువ్వనేది? వైధవ్యాన్ని కోరుకునే ఆడదాన్ని ఇంతవరకూ చూడలేదు. ఇవాళ కొత్తగా నిన్ను చూస్తున్నాను. నేను పోయాక సుఖంగా ఉంటావేమో!” అన్నాడు ఉదయభాను లాల్ మండిపడుతూ.

[ఇలా చాలాసేపు ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగాక ఉదయభాను లాల్ విసుగ్గా గంగా నదివైపు బైలుదేరాడు. ఆత్మహత్య చేసుకున్నాడని  అందర్నీ నమ్మించేందుకు ఒడ్డున తన పై బట్టలు విడిచి ఐదు రోజుల పాటు మిర్జాపుర్ కి వెళ్ళాలనుకున్నాడు. తన కార్డు జేబులో ఉంది అది చూసి తను నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తప్పకుండా నమ్మకం కలుగుతుంది. అప్పుడేం చేస్తుందో కల్యాణి ! అలా ఆలోచిస్తూ సందుల్లో నడుస్తూ పోతున్న ఆయనకి తన వెనకే ఎవరో వస్తున్న అలికిడి వినబడింది.] 

ఎవరో అయుంటారులెమ్మనుకుని ఆయన ముందుకి నడవసాగాడు. కానీ ఆయన తిరిగిన సందుల్లోకే ఆ వ్యక్తి తిరుగుతూ వెంబడించటం మొదలెట్టాడు. అప్పటికి గాని ఆయనకి అనుమానం రాలేదు. వెంటనే జేబులోంచి టార్చ్ తీసి అతని మొహం మీద వేశాడు. ఒడ్డూ పొడుగూ ఉన్న ఒకడు భుజం మీద లాఠీ తో కనిపించాడు. వాణ్ణి చూడగానే ఉదయభాను లాల్ ఉలిక్కిపడ్డాడు. ఊళ్ళో పేరుమోసిన రౌడీ వాడు. మూడేళ్ళ క్రితం వాడిమీద దోపిడీ కేసు నడిచింది. సర్కారు తరఫు వకీలుగా ఉదయభాను వాడికి మూడేళ్ళ జైలు శిక్ష విధింపజేశాడు. అప్పట్నుంచీ వాడికి ఈయన రక్తం కళ్ళజూడాలన్న కసి పెరిగిపోతూ వచ్చింది. క్రితం రోజే జైల్లోంచి బైటికొచ్చాడు. ఈరోజు అనుకోకుండా రాత్రి పూట ఈయన ఒంటరిగా కనిపించేసరికి పగ తీర్చుకునే అవకాశం దొరికిందనుకున్నాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చనే ఉద్దేశంతో ఆయన్ని వెంబడిస్తూ లాఠీ తో దెబ్బకొట్టే అదను కోసం చూస్తున్నాడు. అప్పుడే టార్చి లైటు మొహం మీద పడేసరికి ఆగిపోయి,” ఏం బాబుగారూ, గుర్తుపట్టారా? నేను, మతయీని” అన్నాడు.

“ఎందుకిలా నా వెనకాలే వస్తున్నావు?” అని గద్దించాడాయన.

“ఏం, ఈ దారిన ఇంకెవరూ నడవకూడదా? ఈ వీధి నీ బాబుదా?”అన్నాడు ఏకవచనంలోకి మారిపోతూ.

ఉదయభాను యువకుడిగా ఉన్నప్పుడు కుస్తీ పట్టేవాడు. ఇప్పటికీ శరీరం బలిష్ఠంగానే ఉంది. పిరికివాడు కూడా కాదు. చేతి కర్ర గట్టిగా పట్టుకుని,” ఇంకా నీ కోరిక తీరినట్టు లేదు, ఈసారి ఏడేళ్ళు లోపల ఉంటావు, ఏమనుకున్నావో!”అన్నాడు.

“ఆ సంగతి తరవాత చూద్దాం కానీ నిన్ను ప్రాణాలతో వదలాలంటే నా కాళ్ళమీద పడి ఇంకెప్పుడూ ఎవర్నీ శిక్షించనని మాటియ్యి! సరేనా?”

“ఈ రోజు నీకు మూడింది ఉండు!”

“నాకు కాదు మూడింది, నీకు. మాటిస్తావా లేదా?”

“దారికి అడ్డు లేస్తావా పోలీసుల్ని పిలవమంటావా?”

“మూడు లెక్కపెట్టే లోపల మాటియ్యి-ఒకటి!”

” దొంగ వెధవా, అడ్డు లే !

“రెండు!”

ఉదయభాను గర్జించాడు,”అడ్డు లేస్తావా లేదా?”

“మూడు!”

వాడి నోట ‘మూడు’ అనే మాట రాగానే ఉదయభాను తలమీద బలంగా, గురిగా లాఠీ దెబ్బ పడింది. మరుక్షణం ఆయన “అయ్యో, చంపేశాడు రా!” అంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు.

మతయీ దగ్గరకొచ్చి చూశాడు. తలపగిలి రక్తం ధారలు కట్టింది. నాడి ఆడటం లేదు. చచ్చిపోయాడని రూఢి చేసుకున్నాక ఆయన చేతికున్న బంగారం గడియారం , చొక్కాకున్న బంగారం గుండీలూ, వేలికున్న ఉంగరం అన్నీ తీసేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ కాస్త దయతలిచి శవాన్ని దారి పక్కకి ఈడ్చి మరీ కదిలాడు!

పాపం ఏమనుకుని ఇంట్లోంచి బైలుదేరాడు ఉదయభాను ! ఇలా జరుగుతుందని అనుకున్నాడా? ఈ జీవితం ఎంత క్షణభంగురం! గాలి వీచగానే ఆరిపోయే దీపం లాంటిది కాదా ! నీటి బుడగలా క్షణంలో పగిలిపోతుంది కదా! అయినా మనం అమరులమైనట్టు, మనకి మరణమే లేనట్టు ఏవేవో ప్రణాళికలు వేస్తూ ఉంటాం !

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.