కనక నారాయణీయం-5

-పుట్టపర్తి నాగపద్మిని

ఆమె : ఎవరు నాయనా  నువ్వు?

బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి.

అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు?

బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు.

ఆమె : నాట్యం నచ్చిందా?

బాల: బాగా..!!

ఆమె: నేర్చుకుంటావా??

బాల: నేర్పిస్తే…!!

ఆమె: మీ తండ్రిగారి అనుమతిస్తారా??

బాల: నేనే అడుగుతాను!!

ఆమె : అలాగైతే..రేపటినుంచే రా మరి!!

ఇంకేముంది?? మా అయ్య గారి జీవితంలో మరో  కొత్త అధ్యాయం మొదలౌతున్నదన్నమాట!!

అయ్య (తండ్రి)  అనుమతికోసం బాలనారాయణుడు ఇంటికి పరుగులు తీశాడు. భయపడుతూనే మనసులోని మాటను వారిముందుంచాడు. ఆ మాటలు విన్న శ్రీనివాసాచార్యులవారి మనసు సందేహించింది. ‘తమది చూస్తే సంప్రదాయమైన వైష్ణవ కుటుంబం. వంశాన్ని ఉద్ధరిస్తాడనుకుంటున్న యీ పెద్ద కొడుకు, ఇంకా దారిలో పడలేదు. పైగా రంజకం మహాలక్ష్మి దగ్గర నాట్యం నేర్చుకుంటాడట! ఆమె తంజావూరునుంచీ ఇక్కడికి వచ్చి స్థిరపడిన నాట్య కళాకారిణి.  నృత్యంలో ఆమె నిజంగా చాలా నైపుణ్యమున్నదే!! కానీ కులం రీత్యా వేశ్యాకులం. ఇప్పుడేమిటి చేయటం??’ ఉన్నట్టుండి మెరుపులాంటి అలోచన వచ్చింది వారికి!! పెనుగొండలో అప్పటికే పక్కా హనుమంతాచార్యులు అనే మధ్వ సంగీతాచార్యుల వారు చాలా ప్రసిద్ధులు. ఎంతోమంది వారి వద్ద సంగీతం ఇప్పటికే నేర్చుకుంటున్నారు. కాబట్టి, ఓ వైపు శాస్త్రీయ సంగీతమూ, మరోవైపు నాట్యములో కూడ బాలనారాయణున్ని పడేస్తే  కాస్తైనా దారిలోకి వస్తాడేమో!! రెండూ కళలే కాబట్టి, ఎవరూ నాట్యాభ్యాసం గురించి ప్రత్యేకంగా వేలుపెట్టి చూపించే అవకాశమూ ఉండదు.’ ఇదీ వారి ఆలోచన!!   పైగా తాను కూడా ( శ్రీనివాసాచార్యులవారు) చక్కటి రంగస్థల నటుడు. ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో, మరీ ముఖ్యంగా దశరథుని పాత్రలో పూర్తిగా ఇమిడిపోయే వారట!! ఆయా ఘట్టాలలోని పద్యాలు వారి గాత్రంలో వినటమొక ప్రత్యేకానుభూతి ప్రతి నాటకాభిమానికీ   అప్పట్లో!! తన గాత్ర సంపద కుమారునికి కూడా అబ్బాలనిపించిందేమో కూడా వారికి !! కుమారుడే నోరు తెరిచి అడుగుతున్నాడు కాబట్టి,ఇటు నాట్యమూ, తండ్రిగా తాను ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి సంగీతమూ!! మరో వైపు పాఠశాల చదువెలాగూ ఉంటుంది. ఇక కుమారుడికి చిల్లరమల్లర పనులు చేసేందుకు సమయమెక్కడిదీ??’

        ఈ నేపథ్యంలో   బాలనారాయణుని సంగీత, నాట్యాభ్యాసాలు మొదలయ్యాయి.  సంగీత నాట్యాభ్యాసాలలో అల్లరికి సమయమే కేటయించటం లేదు తనయుడిప్పుడు!! చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. ఒక తండ్రికి అంతకంటే ఏమి కావాలి??

       ఇంతకు ముందే చెప్పుకున్నట్టు, బాలనారాయణునికి, పెనుగొండ శిధిలాల్లో తిరగటం కూడా ఇష్టమైన పనే అని!! ఏ పూర్వజన్మ వాసనలు అతన్నలా నడిపించేవో ఏమో గానీ, పెనుగొండలోని ప్రతి శిల్పంతోనూ బాలనారాయణునికి స్నేహమేర్పడింది. దీనికి మరో కారణం, ఇంట్లో నిరంతరమూ జరిగే సాహిత్య చర్చలూ, గోష్టులూ కూడా!! అప్పట్లో పెనుగొండలో చక్కటి సాహిత్య వాతావరణముండేదట!! ఎప్పుడూ ఏదో ఒక సాహిత్య సమావేశం జరుగుతూనే ఉండేది.   నన్నయ తిక్కనాదులనుండీ, విజయనగర సాహిత్య విరాణ్మూర్తుల వరకూ స్మరించని సందర్భం ఉండేది కాదట!! అదీకాక, మా తాతగారికి అత్యంత ఆప్తమిత్రులైన శ్రీమాన్ రాళ్ళపల్లి సోదరులూ (గోపాల కృష్ణమాచార్యులు, అనంత కృష్ణ శర్మ ద్వయం) అణ్ణంగరాచార్యులు వంటివారి ఎందరో మిత్రులు ఇంటికి రావటం, వారితో జరిగే సాహిత్య చర్చల్లో విజయనగరమూ, ప్రబంధ రచనల ప్రసక్తి ఉండని రోజులు ఉండేవి కావేమో!! తాతగారిది కంచు కంఠం. గొంతెత్తి వారు పద్యాలు పాడటం మొదలెడితే, ఇక అక్కడున్న వారి పుణ్యం పండినట్టేనట!! అందుకే ప్రతి సమావేశంలోనూ, పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి పద్యపఠనం ఉండవలసిందేనట!!

పైగా తండ్రిగారి పురాణ కాలక్షేపంలో బాల నారాయణుడు పురాణ భాగం చదువుతుంటే, వ్యాఖ్యానం తండ్రిగారిది. ఈ రకంగా పద్యాల నడక కూడా బాగా జీర్ణించుకు పోయింది. ఈ ప్రభావాల ఫలితంగా ఒక రోజు  బాల నారాయణుడు, పలక పట్టుకుని, పద్యరచనకు శ్రీకారం చుట్టాడు.

  అల కవితా లోకమునకు

  కలిమికి వైరంబదేల కలిగెను చెపుమా ?

ధార అక్కడిదాకా బాగానే వచ్చింది. తరువాతేమి రాయాలబ్బా..అని ఆలోచిస్తున్న బాల నారాయణుని భుజంపై బరువుగా ఒక చేయి పడ్డది. ఉలిక్కి పడి వెనుదిరిగి చూస్తే…వారి అయ్యగారు శ్రీనివాసాచార్యులవారు!!

  ‘పద్యం ఎత్తుగడ బాగానే ఉంది..తరువాతేమిటి??”

    వారి గంభీరమైన కంఠం వినగానే..బాలనారాయణుని చేతిలో చెమటలు!! కంఠంలో తడి ఆరిపోయింది. సమాధానం తట్టలేదు.

  ‘ఎలా పూరించాలో తెలియకుండా మొదలుపెడితే ఎలా?’ ఈ ప్రశ్నకు జవాబేదీ వారిదగ్గర??

  ‘కలికాల మహిమ సద్గుణ

   కలితుల నృప సిమ్హములను గనకుండుటయే!!’

ఇప్పుడు సరి పోయిందిలే!! పద్య రచనలో పట్టు వస్తుంది..ఇంకా బాగా చదువుకుంటే..!!’ అంటూ భుజం మీద తట్టి వెళ్ళిపోయారట వారి అయ్యగారు!!

       ఇలా బహుశా పన్నెండవఏట పద్యరచనకు శ్రీకారం చుట్టారు బాలనారాయణులు!! అప్పుడప్పుడూ బంధువుల ఇంటికి వళ్ళినప్పుడు చిత్రావతి నది అందాలు గమనిస్తూ కూడా ఆ భావావేశంలో ఇసుకలో పద్యాలు గెలికేవారట!! ( ఈ గెలకటమన్నది వారి ప్రయోగమే సుమా..!! )

  అలా అలా తాను ఏదో గెలికాననుకున్న పద్యాలే, ‘పెనుగొండలక్ష్మి’  అన్న కావ్యంగా రూపుదిద్దుకుంటాయనీ, అతి పిన్న వయసులో వ్రాయబడిన ఆ కావ్యమే, తనకొక ప్రత్యేకమైన గుర్తింపునివ్వబోతుందనీ ఆ బాలనారాయణుడు ఊహించనేలేదు.

  ఏమో యీ వికటంపు రూపకములిందేయర్థముత్పన్నమై

  ప్రేమాధీశ్వరు నిండు కన్నులకు దృప్తిన్ గూర్చునో హేతువే

  మో! మా యాత్మలకందరాదు, వెడయూర్పుల్జిమ్మి , నిర్వేద ధా

  రామాంద్యమ్మున మోకరించు మతి యెల్లన్ యోచనా సంగతిన్!!

   ‘ముదల’ తో మొదలైన యీ రచనలోని మొదటి పద్యం. “ఈ ప్రపంచమంతా వికృతమైన నాటకమే!! దీనివల్ల ఆ భగవంతునికి ఒనగూడే ప్రయోజనమేమిటో మరి!! ఆ ప్రేమాధీశ్వరుని నిండు కన్నులకు యీ వికటనాటకం యెలాంటి తృప్తినిస్తుందబ్బా?? ఐనా, ఆయనతో పోలిస్తే నాది అల్పాతి అల్పమైన మనస్సు. ఆ పరమేశ్వరుని లీలా విలాసాలు నాకేమి అవగతమౌతాయి?? ఊర్పులు జిమ్ముచూ, నిర్వేదంగా మోకరించి ఊరుకోవటం తప్ప, నేనేమి చేయగలను??’ పన్నెండేళ్ళ ఆ చిన్నారి కలానికింతటి ఆలోచనలెలా వచ్చాయి?? ఆశ్చర్యమే కదా??

   అంతేనా?? ‘తెలుగు రాయని పల్కు..’ అన్న సీసంలో ఘనగిరి నివాసినీ!! అంటూ పెనుగొండను సంబోధిస్తూ రామరాయల పౌరుషాన్నీ,రామరాజ భూషణ కవి కోకిల కలకూజితాలనూ వర్ణించిన తీరు అద్భుతం. ‘కులుకుంబచ్చని..’ అంటూ రత్నకంబళాలలో ముత్యాలను కుప్పలు బోసిన విజయనగర వీధుల వైభవాన్ని ఆ చిన్నారి కన్నులు వీక్షించి వర్ణించటం పూర్వజన్మ సంస్కార వాసనలు కాక మరేమిటి??

      రణభూములలో తాండవించిన ఆంధ్ర శౌర్యము, జీవిత ప్రణాళికను విమర్శించుకుంటూ నిర్వికల్ప సమాధిలో నిలచిన రామబురుజు నిర్వేదము, ఘన విక్రమోదగ్ర విరూపాక్ష శక్తికిన్నీ అసాధ్యమైన  సంస్కృతీ సంరక్షణమూ – ఇన్ని విషయాలనూ ఎంతో అనుభవజ్ఞునివలెనే ఆ లేత లేఖిని పద్యాలలో ఆవిష్కరించగలిగింది. విజయ నగరశిల్ప నైపుణ్యాన్ని కవిత్వీకరించిన తీరు, తెలుగు రాయని ‘ఆంధ్ర కులమున్వెలిగించిన దివ్య రూపిగా దర్శిస్తూ, శాతవాహనుని సాక్షిగ నీ చరణములే  మాకిలవేల్పులౌను..’ అని భావిని ఆవిష్కరించిన సౌరు, ఆ బుడతడిని భావి సరస్వతీపుత్రుడిగా నాడే గుర్తించాయి.

      తన స్నేహ బృందంతో అప్పుడప్పుడూ యీ పద్య సౌరభాలను పంచుకుంటున్నా, తండ్రిముందు ఆ బాలనారాయణుడెప్పుడూ, తల ఎత్తి మాటాడి ఎరుగడు. కారణం, తమ అయ్యగారిలో దాగి ఉన్న ప్రతిభావ్యుత్పత్తులను నివురుగప్పిన నిప్పులవలెనే దర్శించేవాడాబాలుడు!!

      అప్పుడప్పుడూ, సెలవులు దొరికినప్పుడు, మైసూరులో నివాసముంటున్న రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి దగ్గరికి వెళ్ళేవాడు బాల నారాయణుడు. శర్మ గారిది మెత్తని గొంతుక. కానీ సాధికారమైన స్పష్టత. సాహిత్యంలో గట్టి పట్టు. కానీ  అదేమిటో, సంగీతం వారిపై చేసిన కనికట్టు. ఎప్పుడూ ఏదో ఒక రాగం గురించీ, ఆ రాగంలో తాను చేయబోయే ప్రయోగాలగురించే వారి తపన. ఇదంతా విచిత్రంగా తోచేది బాల నారాయణునికి!! కానీ ప్రాకృత భాషాసాహిత్యాలపై వారికున్న అనితర సాధ్యమైన అవగాహన, బలనారాయణున్ని కూడా అయస్కాంతం వలెనే ఆకర్షించింది. శర్మగారి శిష్యరికంలో, శౌరసేని, మాగధి, అర్ధమాగధి, పైశాచీ వంటి భాషాసాహిత్యాలతో స్నేహం చేసుకున్నాడు బాల నారాయణుడు.

         ఎవరికొరకూ ఆగని కాలం, పరుగులు పెడుతూనే ఉంది. ఈ లోగా మెట్రిక్ పరీక్షలొచ్చాయి. లెక్కలంటే ఇప్పటి తరుణ నారాయణునికి సింహ స్వప్నమే!! అందువల్ల మెట్రిక్ లో లెక్కల్లో తప్పారు. పరీక్ష తప్పినందుకు అయ్యగారి నుండీ దండన బాగానే అందింది. కారణం, ‘నాట్యమూ, సంగీతాభ్యాసం తో పాటూ, ఆకతాయి పనుల బదులు గణితాభ్యాసం చేసి ఉంటే, మెట్రిక్ గట్టెక్కి ఉండేవాడివి కదా!!’ అని వారి వాదన. కానీ..గణితమంటే, భూతం లాగే అనిపించేదెప్పుడూ తరగతి గదిలో!! (జీవితాంతమూ గణితమంటే..ఇదే భయమూ, ఏవగింపే మా అయ్యగారికి..) ఎక్కడికి వెళ్ళినా యీ లెక్కల బాధ తప్పేట్టు లేదు !!  తప్పించుకునే మార్గమేది?? తెలుగు సాహిత్యంలో శిరోమణి గురించి తాను ఆనోటా ఆనోటా విన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ చదువు తిరుపతిలోని ఓరియెంటల్ కళాశాలలో మాత్రమే ఉంది. గురుకుల వాసం వంటిదే!! పైగా అక్కడ వాల్మీకి, కాళిదాసు, భవభూతీ, భారవీలతో చక్కగా స్నేహం చేయవచ్చు. అలంకార, వ్యాకరణ శాస్త్రాలతో గాఢ పరిచయమూ కలుగ వచ్చు. ముఖ్యంగా తిరుమలనే ఇంటి పేరుగా కలిగిన తనకు ఆ తిరుమల మరో ఇల్లుగా రూపొందవచ్చు. ఇవీ ఇప్పటి తరుణ నారాయణుని ఆలోచనలు. కానీ ఊరు వదిలి వెళ్ళాలంటే తండ్రిగారి అనుమతి కావాలి కదా!! ఎలా?? మథనం మొదలైంది. 

*****

(సశేషం)   

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.