
ఆన్ లైన్ – తెలుగు విస్తరణ
-డా||కె.గీత
తెలుగుభాష కంప్యూటర్ల మీద వాడుకలోకి వచ్చిన 90’వ దశకం పూర్వార్థం నుండి ఇప్పుడు 2020వ దశకం ప్రారంభం వరకూ తెలుగు ప్రస్థానంలో విప్లవాత్మకమైన మార్పు యూనికోడ్ వచ్చిన తర్వాతే జరిగింది. తెలుగుకి సంబంధించి తొలిదశలో ప్రారంభమైన ఎన్నో సైట్లు యూనికోడ్ లేకనే విఫలమయ్యాయని చెప్పవచ్చు.
“ఆన్ లైన్” అంటే కంప్యూటరు తో కంప్యూటరు, నెట్ వర్కు తో నెట్ వర్కు “అనుసంధానం” అయి ఉండడం. ఇలా అనుసంధానంలో విజయవంతంగా తెలుగులో సమాచార ప్రసరణకు, భాషా విస్తరణకు తొలిమెట్టు యూనికోడ్ ద్వారానే సాధ్యమయ్యింది. అంటే ముందు ప్రకరణాలలో చెప్పుకున్నట్టు అన్ని చోట్లా పనిచేసే యూనీకోడ్ అనే స్థిరీకరణ కోడ్ ద్వారానే సాధ్యమయ్యింది.
తెలుగు యూనీకోడ్ తెలుగులో ఈ-మెయిళ్లకి, వెబ్‌సైట్ల నిర్మాణానికి, చర్చావేదికలకు, ఆన్ లైన్ డిక్షనరీల నిర్మాణానికి సరికొత్త ద్వారాలను తెరిచింది. దానితో పాటు తెలుగు బ్లాగులు, పత్రికలు, తెలుగు వికీపీడియా వంటి వాటికి మార్గం సుగమమయ్యింది.
ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో తెలుగు టైపు చేయడానికి, యూనికోడ్ లో రాయడానికే కాక, నాన్-యూనికోడ్ ఫాంట్లనుండి ఎన్నో భారతీయ భాషల వెబ్ సైట్లను, ఎన్నో ఫాంట్లను యూనికోడ్ లోకి తర్జుమా చేసే సాధనంగా పద్మ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడింది.
ఇక “లేఖిని” వంటి సాధనాలతో ఆన్ లైన్ లో తెలుగు రాయడం సులభతరమయ్యింది.
తర్వాత వచ్చిన “గూగుల్ ఇన్ పుట్ టూల్స్” తెలుగు వంటి అనేక భాషల్లో యూనికోడ్ టైపు సమస్యల్ని దాదాపుగా పరిష్కరించింది.
మొబైల్ లో తెలుగు టైపుకు ఇండిక్ కీ-బోర్డు వంటివి సులభమార్గం పరిచేయి.
ఇక ప్రారంభ దశలో వెబ్ ప్రపంచంలో తెలుగు గురించిన వివరాల్లోకి వెళ్తే –
“1994లో మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ హోం పేజ్ సైటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వెబ్ సైట్లలో మొట్టమొదటిదని చెప్పవచ్చు. దీనిని పద్మ ఇంగ్రగంటి గారి సహాయంతో జార్జ్ మేసన్ యూనివర్సిటీలో చదివే శ్రీనివాస్ సవరం, ఒక్లొహోమా లో చదివే సుజాత నీలం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రాథమిక వివరాలు (భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక వగైరా) ఇందులో పొందు పరచారు. క్లిక్ చేయగలిగే ఆంధ్రప్రదేశ్ పటం అప్పట్లో ఈ సైటు ప్రత్యేకత. సుజాత, శ్రీనివాస్ లిద్దరూ చదువు ముగించుకుని వెళ్ళిపోవడంతో ఈ సైటు ఒక సంవత్సరం మించి నడవలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు తరవాత మరొక దశాబ్దానికి కానీ మొదలవలేదు.” (ఈ మాట, సురేశ్ కొలిచాల)
సురేశ్ కొలిచాల, పద్మ ఇంద్రగంటి గార్ల ఆధ్వర్యంలో 1994-95 సంవత్సరాలలో మొట్టమొదటి తెలుగు వెబ్ సైట్ తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహితీకారుల జీవిత చరిత్రలు, సాహితీ గ్రంథాలు, ఆంగ్ల అనువాదాలతో దీనిని ఒక సాహితీ విజ్ఞాన సర్వస్వంగా రూపుదిద్దాలనే సంకల్పంతో రూపుదిద్దుకుంది. 1995 లో ఈ సైట్ ప్రతిరూపాన్ని ఇక్కడ చూడవచ్చు.
“వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తెలుగు సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసి, ఆ పద్ధతిని భారతీయ భాషలన్నింటికి వర్తింపజేయాలన్న సంకల్పంతో రమణ జువ్వాడి 1996 లో lekha.org స్థాపించారు. DOS, Macintosh మెషీన్లపై పనిచేసేటట్టుగా RIT సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసారు. వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తిక్కన ఫాంట్లు తయారయ్యాక నేరుగా వెబ్పేజీలు తయారుచెయ్యడానికి లేఖ సాఫ్ట్‌వేర్లో మార్పులు చేసారు. ఆ రోజుల్లో ఈ లేఖ ద్వారా ఈమెయిళ్ళు నేరుగా తెలుగులో చదవడానికి, రాయడానికి వీలుండేది.
తరువాత ‘రంగవల్లి’ అన్న పేరుతో తెలుగు సాఫ్ట్‌వేర్ నిర్మించిన ఘనత చోడవరపు ప్రసాద్ కు దక్కుతుంది. తరువాత, ఇదే సాఫ్ట్‌వేర్ కు కొన్ని మార్పులు చేసి ‘మేఘసందేశం’ అన్న పేరుతో ఈమెయిల్ కంపోజర్ గానూ నిర్మించారు ప్రసాద్. ఏ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వెబ్ ద్వారా తెలుగు లోకి తర్జుమా చేసే ‘రంగవల్లిక‘ ఆ రోజుల్లో అమిత ప్రాచుర్యం పొందింది.
లేఖ, రంగవల్లి మాత్రమే కాక ఆ రోజుల్లో తెలుగు లిపిలో రాయడానికి పబ్లిక్ డొమైన్లో జరిగిన మరో మంచి కృషి శ్రీనివాస్ సిరిగిన తయారు చేసిన తెలుగు లిపి.
కుమార్ అంపని, మధుసూదన్ ఓరుగంటి నిర్వహణలో 1996లో ప్రారంభమైన ‘తెలుగు వాణి‘ మొట్టమొదటి తెలుగు వెబ్ చర్చావేదిక.” (ఈ మాట, సురేశ్ కొలిచాల)
అయితే పైన పేర్కొన్న వెబ్ సైట్లలో ఏవీ ఇప్పుడు ఆన్ లైన్ లో లభ్యం కాకపోవడం దురదృష్టం. అందుకు కారణాలు ఏవైనా ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించి, సైట్లు రూపొందించి, సమాచారాన్ని కూర్చి, తెలుగు కంప్యూటరు చరిత్రకు ప్రాణం పోసిన వెబ్ సైట్ల రూపురేఖలు కనీస జ్ఞాపికలుగా నైనా మిగలకుండా కాలగర్భంలో కలిసిపోవడం అత్యంత విచారకరం.
ఆన్లైన్ లో తెలుగు చర్చావేదికలతో ప్రారంభమయ్యి, బ్లాగులుగా విస్తరించి, సైట్లుగా రూపొంది, మీడియా, సోషల్ మీడియాగా విస్తృతి చెంది, మొబైల్ ఫోన్లలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.
ఇప్పుడు తెలుగులో రాయడమే కాదు. తెలుగులో సమాచార ప్రసారానికీ అనేక ఆడియో, వీడియో సాధనాలు, యాప్ లు ఉన్నాయి.
అమిత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో ఇవేళ తెలుగు సులభంగా ఇమడడం వెనుక ఎంతో మంది కృషి దాగి ఉంది. తెలుగులో భాషా శాస్త్ర పరంగాను, వ్యాకరణ పరంగాను యూనివర్సిటీ స్థాయిలోకృషి చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి “A Grammar of Modern Telugu” , ఆచార్య చేకూరి రామారావు “తెలుగు వాక్యం”, ఆచార్య బూదరాజు రాధాకృష్ణ గారి “వ్యావహారిక భాషా వికాసం”, ఆచార్య పి. ఎస్. సుబ్రమణ్యం గారి ద్రావిడ భాషలు, వీరందరితో బాటూ ఆచార్య తూమాటి దొణప్ప, తిరుమల రామచంద్ర వంటి వారి భాషాశాస్త్ర వ్యాస సంకలనం “తెలుగుభాషా చరిత్ర” వంటివి ఎన్నదగినవి. ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు తెలుగులో మార్ఫలాజికల్ ఎనలైజర్ వంటివి రూపొందించి భాషా శాస్త్ర పరంగానే కాక, టెక్నాలజీ పరంగా కూడా కంప్యూటరు రంగం లో తెలుగు భాషా వికాసానికి బాటలు వేశారు.
అనేక ముద్రిత నిఘంటువుల సమాహారంగా ఆన్లైన్ లో పరిపూర్తి నిఘంటువుగా వాడపల్లి శేషతల్పసాయి సారధ్యంలో ఆంధ్రభారతి రూపుదిద్దుకుంటూ ఉంది. ఆచార్య వేమూరి వేంకటేశ్వర్రావు రూపొందించిన వేమూరి నిఘంటువు ఆధునిక అవసరాలకు సరైనది.
తెలుగు భాషలో చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్ నిర్మాణం జరుగుతూ ఉన్న ఇప్పటి కాలంలో భాషని కంప్యూటీకరించడం కోసం కాలంతో బాటూ మారుతూన్న భాషకి, భాషా స్వరూపానికి అనుగుణంగా ఆధునిక అవసరాలకి సరిపోయే తెలుగు నిఘంటువు, పర్యాయపద కోశం, శైలి లక్షణ గ్రంథం, ఆధునిక వ్యాకరణం తప్పనిసరిగా ఉండాలి.
ఇలా తెలుగు భాష కంప్యూటీకరణ క్రమంలో ఉన్న అన్ని విభాగాల్ని వరుసగా తరువాతి ప్రకరణాల్లో వివరిస్తాను.
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
