
నీ అస్థిత్వం ఎక్కడిది..?
-గట్టు రాధిక మోహన్
పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు
కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు.
నా జన్మం కూడా మారలేదు.
శతాబ్దాల వేదనలో
నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను.
నా మీద రాసివ్వబడని పేటెంట్ హక్కులు నీ సొంతం అనుకుంటావు.
ఎప్పటికప్పుడు
నీకిష్టమైన కొత్త కొత్త నాగరికత విత్తనాలను విత్తుకుంటు
నా కన్నీటి చుక్కలతో తడిపేస్తుంటావు.
నువ్వు సృష్టించిన
ఈ పితృస్వామ్య రాజ్యాంగంలో
నా చూపుడు వేలును విరిచేసుకుంట
నవ్వుకుంటుంటావు.
అవ్యక్తమైన మాటలను
నా నాలుకపై పరిచి వేదాలు ఇతిహాసాలను లిఖించి శిలాశాసనంగా మార్చేసినావు.
నా తలరాతని
నీకనుకూలంగా మార్చుకుంటు
నా ఆశలను ఆశయాలను
ఆరుబయట ఆరేస్తుంటావు.
నా అస్తిత్వంపై
గెలిచావనుకుంటావు…
కానీ నీ అస్థిత్వం
నేను పడుతున్న నొప్పుల కొలిమి నుండి పుట్టిందని గ్రహించలేని
నువ్వొక బుద్ది మాంధ్యుడివి.
*****
ఆర్ట్: మన్నెం శారద

హన్మకొండ లో నివాసం. వృత్తి రీత్యా నేను మ్యాథ్స్ టీచర్ ని అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా మాత్రం కవిత్వం, కథలు, వ్యాసాలు, సమీక్షలు, పాటలు రాస్తుంటాను. 2019 లో నా మొదటి కవిత్వ సంపుటి ” ఆమె తప్పిపోయింది ” ఈ సాహిత్య ప్రపంచంలోకి వచ్చింది.
