“నెచ్చెలి”మాట 

కరోనా కామెడీ కాదిక-

-డా|| కె.గీత 

అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే

ఎన్నికలోయ్, ఓట్లోయ్  అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు-

అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు!

పోనీ అక్కడైనా 

కుటుంబ దూషణలు

వ్యక్తి”గతాలు” 

కాకుండా

నిల్వ నీడలేని సగటు అమెరికన్లని 

మూతబడ్డ చిన్న దుకాణాల్ని  

ఉద్ధరించడం 

గురించి  మాట్లాడితే బావుణ్ణు –

“పదినెల్ల నించి కరోనా” – కామెడీ  కాదని ఎవరైనా 

కాస్త  ప్రస్తుత/ కాబోయే  అధ్యక్షులవార్లకి  చెప్తే బావుణ్ణు –

ఇక 

ప్రపంచ వ్యాప్తంగా

వెబినార్లోయ్,  ఉపన్యాసాలోయ్ అని సందడొకవైపు 

అయినా 

అదేవిటో 

మాస్కు మెడకు తగిలించుకుని మరీ 

రాజకీయ ప్రత్యక్ష  సభలు, సమావేశాలూ 

పూలదండలు, కౌగిలింతలు !!

అసలే 

కరోనా  పుణ్యమా అని 

ఉపాధులు కోల్పోయి జేబులో రూపాయి లేక గిలగిల్లాడుతున్న  జనాన్ని 

రెగ్యులరైజేషన్లని   

ప్లాట్లు  , ఫ్లాట్ల మీద  పాట్లు  పెడుతూ 

రెవెన్యూ ఆఫీసుల చుట్టూ హడలెత్తి పరుగెత్తించడం 

నీళ్లు నీకా, నాకా అని 

రాష్త్ర ప్రభుత్వాలు వాడీవేడిగా  కొట్టుకోవడం 

కంటే

కేబుల్ టీవీలు, ఫ్లిక్స్ లు,  ప్రైమ్ లు, ట్యూబ్ లు సరిపోక 

50% సీటింగ్ తో  

మాస్కులేసుకుని మరీ 

సినిమా హాళ్లలో  సినిమాలు  చూపించడం  కంటే 

కరోనా కట్టడో

వైద్యమో  

సౌకర్యాలో 

కనీసం- 

తగిన పోషకాహారం లేక కోలుకోలేనివారికి    

తిండీతిప్పలో 

పట్టించుకుంటే బావుణ్ణు- 

అసలే  కరోనా వల్ల పోతున్న ప్రాణాలు చాలక 

కులాంతర వివాహం  చేసుకున్నా  

చివరికి  బహిర్భూమికి వెళ్లినా 

భద్రత లేని  బతుకులొక  వైపు- 

మానవ  తప్పిదాలతో బాటూ 

ప్రకృతి  వైపరీత్యాలూ  తోడయ్యి 

అయితే 

కొండలు, ఊళ్లు తగలబడడం- 

లేదా 

తుఫానులు, వరదలు ముంచెత్తడం- 

ఇన్ని  అల్లకల్లోలాల్లో 

కరోనా గురించి మర్చిపోదామనుకున్నా 

మరవనివ్వని  బాలూ హఠాన్మరణ విషాద జ్ఞాపకమొకటి-

అయినా  

పాజిటివ్ వచ్చిన అధ్యక్షుడు  

మూడోరోజుకే మిలిటరీ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చేసినట్టు 

కరోనా ఆలోచన కూడా చెరిగిపోతే  బావుణ్ణు!   

కాదు కాదు 

జీవితం 2019 వరకు ఉన్నట్టే ఉంటే బావుణ్ణు!!  

*****

Please follow and like us:

One thought on “సంపాదకీయం- అక్టోబర్, 2020”

  1. వాస్తవాలను ఎంతందంగా…అంతే సూటిగా… చాలా చక్కగా వ్రాశారు గీతగారు

Leave a Reply to Subhashini Prattipati Cancel reply

Your email address will not be published.