యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

సుఖవంతమైన సుజాత కథ

నలుగురు అక్కచెల్లెళ్ళలో నాలుగవది సుజాత. అందరూ పల్లెటూర్లో పుట్టి పెరిగారు. నలుగురూ తెల్లగా చూడడానికి చక్కగా వుంటారు. వాళ్ళ నాన్న రామారావు పక్క ఊరిలో ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేేసేవాడు. అమ్మ సీత చక్కటి గృహిణి. ఊళ్ళో అన్నదమ్ములు, మేనమామలు అందరి మధ్యా వుండడంతో ఆవిడకి రోజులు సాఫీగా గడిచిపోతుండేవి. 

అసలు కథలోకి వస్తే నలుగురు ఆడపిల్లల చక్కదనం చూసి బంధువుల్లోనే తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సుజాత భర్త సుధీర్ ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు. కానీ వచ్చిన డబ్బులన్నీ పేకాటలో పెట్టి పోగొట్టుకునేవాడు. సంసారం నడవడం కష్టంగా వుండేది. సుజాత తల్లి దగ్గిరకి వచ్చి కష్టాలు చెప్పుకుని ఏడ్చేది. సీత కూతురు బాధ చూడలేక తనకున్న బంగారు ఆభరణాలలో చిన్న చిన్నవి ఇచ్చి పంపించేది.  సుజాత వాటిని తాకట్టు పెట్టి సంసారం నడిపించేేది. సుధీర్   ఇల్లు ఎలా నడుస్తోందన్న సంగతి అసలు పట్టించుకునేవాడే కాదు. 

సుజాత మాత్రం పైకి చాలా సంతోషంగా వున్నట్లు కనిపించేది. ఎవరికీ ఏమీ తెలిసేది కాదు. అక్కచెల్లెళ్ళతో కలిసినప్పుడు చాలా ఆనందంగా వుండేది. చదువు టెన్త్ క్లాస్ తో ఆపెయ్యడం, పల్లెటూరు కావడంతో ఆడపిల్ల బయటికి వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో ఆదాయం వచ్చే మార్గం కనిపించేది కాదు. తల్లి తను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులన్నీ ఇస్తూ వుండేది.  ఎంత వరకు చెయ్యగలదు! ఇలా వుండగా సుజాత ఒక ఆడపిల్ల, మొగపిల్లాడు పుట్టారు. పిల్లలకి ఆరోనెల వచ్చేవరకు సుజాత సంరక్షణలోనే వుండేది. 

పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. చదువులకి అక్క చెల్లెళ్ళ సాయం తీసుకుంది.  సంసారం గడవడం మరీ కష్టంగా వుండేది. రామారావుకి పేకాట, తాగుడులతో ఆరోగ్యం పాడయింది. ఇంటి పట్టునే వుంటున్నాడు. 

ఈ కష్టాల నుంచి గట్టెక్కడం ఎలాగో అర్థం కాలేదు. అమెరికాలో వున్న రెండో అక్క స్రవంతితో చెప్పుకుంది. స్రవంతీ వాళ్ళకి అమెరికాలో మూడు రెస్టారెంట్లు వున్నాయి. స్రవంతి చెల్లెలిని ఎలాగో అమెరికా రప్పించుకుంది. సుజాతని తన ఇంట్లో వుంచుకుని తను చెయ్యగలిగిన పనులు చేయించుకునేది. సుజాత చేత ఇంట్లో పచ్చళ్ళు, పొడులు ఇంకా ఎన్నో రకాలు చేయించి తెలిసిన వాళ్ళకి చెప్పి తీసుకునేలా చేసింది. ఆ వచ్చిన డబ్బులు చెల్లెలికి ఇచ్చేది. ఇలా కొంత సంపాయించిన తర్వాత, తను కూడా కొంత డబ్బులు ఇచ్చి ఇండియా పంపించింది. అంతేకాకుండా ఇండియా నుంచి పచ్చళ్ళు, పొడులు అమెరికాకి సప్లయ్ చేసేలా చూసి, ఇండియాలో కూడా తనకు తెలిసిన కొంతమందికి చెప్పి చెల్లెలికి ఆదాయం వచ్చే మార్గం చూపించింది. 

సుజాతకి పిల్లల ఫీజులు కట్టేపని తేలిక అయింది. ఇంటి పట్టున వున్న భర్త ప్రతి దానికీ చిరాకు పడిపోయేవాడు. అతనితో సహజీవనం చాలా కష్టమయిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి అయ్యింది. కానీ ఏమాత్రం మానసికంగా కుంగిపోకుండా… పిల్లలని సెటిల్ చెయ్యాలనే విషయం మనసులో స్థిరపరుచుకుంది. ఆ మానసిక ధైర్యంతోనే తను చేసే వ్యాపారంలో ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా చూసుకుంది. ఎంతోమంది ఫోన్లలో ఆర్డర్లు చేస్తున్నారు. డబ్బులు కూడా ఎప్పటికప్పుడు ఎకౌంట్ లో వేసేస్తున్నారు. 

పిల్లలిద్దరూ పెద్ద చదువులు పూర్తి చేశారు. అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది. అబ్బాయి ఛార్టెడ్ అకౌంటెంట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతో బాగా చూసుకుంటున్నాడు. తల్లిని వ్యాపారం చెయ్యద్దన్నాడు. కానీ సుజాత తన జీవితానికి దారి చూపించిన వ్యాపారం మాత్రం మానలేదు. తనే ఎంతో మందికి జీవనోపాధి కల్పించింది. సుజాతకి కష్టాల కడలి దాటినట్లయ్యింది. తను ఈ స్థితికి రావడానికి సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుకుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.