
అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8
-డొంకెన శ్రీశైలం
ఒడిలో కూచుంటే
అమ్మ ఉగ్గన్నం తినిపించింది
తన జోలపాటలతో
నేను నిదుర పోయాకే
అమ్మ నిదురపోయేది
నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి
కనపడని దేవుళ్ళకు
కానుకలిస్తానని మొక్కుకునేది
ఓనమాలు నేర్పి బడికి పంపేది అమ్మ
వేడన్నం నాకు సద్దిగట్టి
సల్దిఅన్నం సర్దుకు తింటుంది అమ్మ
ఆనవాలు లేక ఆస్తినంతా అమ్మేసి
బతుకుబాట చూపి
ఓ ఇంటివాన్ని చేసింది అమ్మ
వరిచేను ధగ్గర అమ్మ
వంట దగ్గర అమ్మ
వడ్డించే దగ్గర అమ్మ
విశ్రమించక విసుగుచెందక
నాకూ నా పిల్లలకు
అన్ని పనులు చేసిన అమ్మ
ఓ మూల మంచాన పడింది
ఏడుస్తూన్న నన్ను చూసి
‘బాబూ ఎందుకురా నీకీశ్రమ
నలుగురినీ సాయమడుగు
నన్ను మోసేందుకు’
అంటూ.. నా కళ్ళు తుడుస్తూ
అమ్మ కన్న మూసింది
****

‘అమ్మ కవి’ గా ప్రసిద్ధమైన నల్గొండ జిల్లాకు చెందిన కవి డొంకెన శ్రీశైలం తన 72 వ ఏట, 04 ఏప్రిల్ 2014న మరణించారు. వీరి తొలి కవితాసంపుటి ‘అమ్మ’ ను 2001లో కాళోజీ ఆవిష్కరించారు. చేనేత కార్మికుల గురించి ‘పోగుల పేగులు’ , రైతుల ఆత్మహత్యల గురించి ‘తప్పు దేశానిదా దేవునిదా’ వంటి రచనలు చేశారు. వీరి రెండవ కవితా సంపుటి ‘అమ్మ నడక ఆగలేదు’ 2014లో వెలువరించారు.
