
యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
భాగం-15
సీవార్డ్ డౌన్ టౌన్
సీవార్డ్ డౌన్ టౌన్ సందర్శనం పూర్తి చేసుకుని వెనక్కి రిసార్టుకి చేరుకుని, పిల్లల్ని తీసుకుని రిసార్ట్ ఆఫీసు దగ్గర ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గిర ఉన్న సిటింగ్ ఏరియాలో కూర్చుని ఉండగా అదే సమయానికి మాకు ఆ అలాస్కా ప్రయాణంలో కనిపిస్తూ వచ్చిన మరో జంట కూడా వచ్చేరు. వాళ్లు తెలుగు వాళ్ళని తెలిసి సంతోషించడమే కాకుండా పరిచయాలు చేసుకుని చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. వాళ్లు ప్యాకేజీ టూరులో కాకుండా వాళ్ళంతట వాళ్ళు బుక్ చేసుకుని వచ్చారట. మేం చూసిన ఊళ్లన్నీ వాళ్ళు కూడా తిరిగేరు. కానీ తీరా ఏ ఊరు వెళ్లినా ఎక్కడా యాక్టివిటీస్ కి వాళ్ళకి రిజర్వేషన్లు దొరకడం లేదని వాపోయారు. మొదటిరోజు గ్లేసియర్ క్రూజ్ టూరు బుక్ చేసుకున్నా షిప్పు ఎక్కడ బయలుదేరుతుందన్నది చివరి నిమిషం వరకు తెలుసుకోక అది కూడా మిస్ అయిపోయారట. నిజానికి ఆ టూరులో షిప్పు ఎంకరేజ్ నుంచి రెండున్నర గంటల రైలు ప్రయాణపు దూరంలో బయలుదేరుతుంది. ఆ కనెక్షను రైలు పట్టుకోలేకోపోతే షిప్పు అందదు.
ప్యాకేజీ టూరుగా అలాస్కా ప్రయాణం చెయ్యడం ఎంత సౌఖ్యవంతమైందో అర్థమైంది మాకు. ఎక్కడికక్కడ కనెక్టింగ్ రైళ్లు, బస్సులు ఐటినరరీ లోనే ముందే బుక్ చేసి ఉంచడమే హోటళ్ల నించి రైలు, బస్సు స్టేషన్లకు ట్రాన్స్ పోర్ట్ కి కూడా వెతుక్కోనవసరం లేదు. ఇక హోటళ్లు చెప్పనవసరం లేదు. బుక్ చేసుకున్న ప్యాకేజీ ప్రకారం సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు, పీక్ సీజన్ లో ప్రయాణం చేసేటప్పుడు ప్యాకేజీ టూరు ఉత్తమం.
ఇక మా ప్రయాణంలో చివరి రోజు ఎట్రాక్షన్ గా మేం ఆ మర్నాడు సీవార్డ్ తీరం లో గ్లేసియర్ క్రూజ్ ఎక్కబోతున్నాం.
ఈ అలాస్కా ప్రయాణంలో దాదాపుగా అన్నీ చూడాలన్న ఉత్సుకతతో రెండు గ్లేసియర్ క్రూజ్ లు, రెండు గ్లాస్ డూమ్ రైలు ప్రయాణాలు ప్యాకేజీలో భాగం చేసేం. కానీ ఒకొక్కటి చాలని చివరి రోజు మళ్లీ గ్లేసియర్ క్రూజ్ ఎక్కినపుడు అనిపించింది. పిల్లలు అప్పటికే అలిసిపోయి క్రూజ్ లో చాలా భాగం నిద్రపోతూనే ఉన్నారు. ఇక సిరి పరిస్థితి చెప్పనవసరం లేదు. అస్సలు తినడం మానేసి డీలా పడిపోయింది.
ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్టు తయారయ్యింది మా పరిస్థితి.
ఇక సీవార్డ్ తీరం లో గ్లేసియర్ క్రూజ్ ఉదయానే బయలుదేరింది. రిసార్ట్ నించి షటిల్ బస్సు క్రూజ్ బయలుదేరే షిప్ యార్డ్ కి సరైన సమయానికి చేర్చింది. మేమున్న రిసార్ట్ ఖాళీ చేసేసి సామాన్లు మాతో తెచ్చేసుకున్నాం. ప్యాకేజీ లో భాగంగా మా సామాన్లని క్రూజ్ నిర్వాహకులు సాయంత్రం మేం తిరిగొచ్చే వరకు వాళ్ళ దగ్గిర భద్రపరుస్తారు. సాయంత్రం వెనక్కి వచ్చి మేం తిరిగి ఎంకరేజ్ వెళ్లే బస్సులో ప్రయాణించి, ఆ మర్నాడు ఎంకరేజ్ నుంచి ఫ్లైట్ లో వెనక్కి మా ఇంటికి వచ్చేస్తామన్న మాట.
సీవార్డ్ తీరం లో గ్లేసియర్ క్రూజ్ రెండస్థుల పెద్ద సైజు పడవ వంటిది. క్రూజ్ బయలుదేరడానికి గంట ముందుగానే మేమక్కడికి చేరుకోవడంతో షిప్పుయార్డ్ లో అటూ ఇటూ కట్టిన చిన్న పడవుల్ని చూస్తూ తిరిగేం.
సిరి ఎక్కడికీ రానని పేచీ పెడితే అలాస్కా లో ఆ తీరంలో ప్రత్యేకించి కనబడే “పఫిన్” పక్షి బొమ్మ డబ్బాలో పెట్టి తమాషాగా ఉంటే కొనిచ్చాము. అప్పటికి అది చూసి ఊరుకుంది. కానీ నీరసానికి ఒక చోట కూర్చుండిపోయింది పాపం.
ఇక నేను కూడా సిరితో నీడ చూసుకుని కూర్చున్నాను.
ఇక అనౌన్సు మెంటు వస్తూ ఉండగా వెళ్లి లైనులో నుంచున్నాం. అదే సమయానికి దాదాపు ఆరు షిప్పులు బయలుదేరుతున్నాయి. ఇక అయిదు నిమిషాల్లో క్రూజ్ బయలుదేరుతుండగా ఒకతను లిస్టు పట్టుకుని అన్ని లైన్ల దగ్గరకు వచ్చి మా బుకింగ్ నంబరు, పేరు గట్టిగా చదవసాగేడు. అప్పుడు మేం గమనించిందేవిటంటే మేం మా పడవ దగ్గిర కాక మరోచోట లైనులో నిలబడ్డాం. అసలక్కడ సరైన గైడ్ లైన్స్ లేవు. మొత్తానికి లాస్ట్ మినిట్ లో పరుగున వెళ్లి మా అసలు క్రూజ్ లో కూలబడ్డాం.
****
(ఇంకా ఉంది)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
