
యాత్రాగీతం
బహామాస్
-డా||కె.గీత
భాగం-1
అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్ వీసాతో చూడగలిగిన ప్రదేశం. మేమున్న కాలిఫోర్నియా నుంచి బహామా దీవుల్ని సందర్శించాలంటే ఫ్లోరిడా రాష్ట్రం వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కణ్ణించి క్రూజ్ లో గానీ, ఫ్లైట్ లో గానీ వెళ్లొచ్చు.
ముందు మేం పశ్చిమ తీరంలో ఒకట్రెండు సార్లు క్రూజ్ లకి వెళ్లినా మాకు, మా పిల్లలకి క్రూజ్ ప్రయాణమంటే మహా సరదా. ఆ పేద్ద నౌకాయానం అంత గొప్పగా ఉంటుంది మరి!
అదీగాక అప్పటికి మా ఇంట్లో ఆర్నెల్ల అతిథులుగా ఉన్న మా అత్తగారికి, మావగారికి తొలిసారి క్రూజ్ ప్రయాణాన్ని పరిచయం చెయ్యడానికి కూడా మంచి అవకాశం అని భావించాం.
ఎప్పట్లానే రెండు, మూడు నెలల ముందు నుంచే ప్రయాణపు సన్నాహాలు మొదలుపెట్టేం.
ముందుగా రాయల్ కరీబియన్ సైటులోకి వెళ్లి ఫ్లోరిడా లోని మయామి నగరం నుంచి మూడు రోజుల బహమాస్ క్రూజ్ కి టికెట్లు బుక్ చేసుకున్నాం.
వేసవి సెలవుల్లో, అందునా మాంఛి గిరాకీ ఉన్న రోజులు కావడంతో పెద్దవాళ్ళకి దాదాపు 800, చిన్నపిల్లలకి 500 డాలర్ల వరకు పడింది టిక్కెట్టు.
ఇక వెనువెంటనే మా దగ్గరి ఎయిర్పోర్టు శానోజే నుంచి మయామి వరకు రానూపోనూ టిక్కెట్లు, మయామి ఊరు సందర్శనకు ముందు మూడు రోజులు, తర్వాత రెండు రోజులు హోటలు అన్నీ కలిపి పదివేల పైచిలుకు అయ్యినా వెరపు లేకుండా చకచకా బుక్ చేసేసేం.
అంతవరకు మేం మయామి వెళ్ళలేదు కాబట్టి ఎన్నాళ్ళుగానో చూడాలనుకుని ఉబలాటపడుతున్నది అప్పటికి సాధ్యమయ్యిందని చాలా సంతోషించాం.
నిజానికి ఎలాగూ ఫ్లోరిడా వెళ్తున్నాం కాబట్టి అక్కడ మేం ఎన్నాళ్ళుగానో చూడాలనుకున్న ఇతర ప్రధాన ఆకర్షణలు ఓర్లాండో లో ఉన్న డిస్నీ వరల్డ్ , కేప్ కెనెరేవేల్ లో ఉన్న రాకెట్ లాంచింగ్ సైటు వంటివి కూడా మయామి ప్రయాణంలో చూడాల్సిన ప్రదేశాల లిస్టులో రాసేం. కానీ ఒక్కొక్క ప్రదేశంలో కనీసం రెండ్రోజులు ఉండాల్సి వస్తుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. రిలాక్సింగ్ గా కేవలం మయామి నగరంలో మాత్రమే గడపాలని నిశ్చయించుకున్నాం.
ఇక మయామి వంటి వెచ్చని సముద్రతీరాలు ఉన్న ఊరికి వెళ్లడమంటే మా పిల్లలు ఎగిరిగంతులేస్తారు. కాలిఫోర్నియాలో మేమున్న బే ఏరియాలో సముద్ర తీరం వేసవిలో కూడా చల్లగానే ఉంటుంది మరి! బీచ్ లలో ఆడుకుందుకు, నీళ్లలో తడిసేటందుకు అవసరమైన బట్టలు షాపింగు మొదలెట్టేసేరు కూడా. అమెరికాలో లోకల్ విమానాల్లో కేవలం హ్యాండ్ లగేజ్ తప్ప చెకిన్ బ్యాగేజీ వంటి పెద్ద లగేజీలకు ఛార్జి వేస్తారు కాబట్టి, కేవలం హ్యాండ్ లగేజీగా తలా ఓ చిన్న సూటుకేసులో అతి తక్కువ సామాన్లు సర్దుకున్నాం.
ఇక మేం నిర్ణయించుకున్నట్టు మయామి నగరంలో రెండు రోజులు స్థానిక విశేషాలు చూసి తర్వాత మూడురోజుల పాటు బహామాకు నౌకాయానం చేసి తిరిగొచ్చి మళ్లీ రెండు రోజులు మయామి నగరంలో స్థానిక విశేషాలు చూడడమన్నమాట. కాలిఫోర్నియా నుంచి మయామికి అయిదుగంటల విమానప్రయాణంతో, మూడుగంటల జెట్లాగ్ తో అటు ఒక రోజు, ఇటు ఒక రోజు ప్రయాణానికి పోతాయి.
ఎలాగైతేనేం బయలుదేరేరోజు వచ్చింది. మేం కాలిఫోర్నియా నుంచి మయామికి వెళ్లే మధ్యలో ఒక ఫ్లైట్ అట్లాంటాలో మారాల్సి ఉంది. రెండు ఫ్లైట్ ల మధ్య వ్యవధి గంటకంటే తక్కువ ఉంది. పిల్లలతో, పెద్దవాళ్ళతో ఎంత త్వరగా తెముల్చుకున్నా కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోగలమో, లేదో అన్న సంశయం పట్టుకుంది మాకు.
****
(సమాప్తం)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
