స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు

పుస్తకాలమ్’ – 4

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)

  -ఎన్.వేణుగోపాల్

“శ్రీశ్రీ కవిత్వమూ పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్” అని మహాప్రస్థానానికి 1940 జూలై 17న రాసిన యోగ్యతాపత్రంలో చలం తెలుగు సమాజానికి పాల్ రాబ్సన్ (1898-1976) ను పరిచయం చేశాడు. చలం పాల్ రాబ్సన్ అని రాయలేదని, అప్పటికి సుప్రసిద్ధుడైన హిందీ సినిమా గాయకుడు కె ఎల్ సైగల్ పేరు రాశాడని, కాని చలం అనుమతితోనే శ్రీశ్రీ ఆ పేరును పాల్ రాబ్సన్ గా మార్చాడని ఆ తర్వాత తెలిసింది. అయినా అది రాసిన 1940లలోనూ, అచ్చయిన 1950 నాటికి కూడా మహాప్రస్థాన గీతాల స్ఫూర్తిని బట్టి పాల్ రాబ్సన్ పేరు ఉండడమే సరైనది.

ఆ వివాదం ఎలా ఉన్నా, పాల్ రోబ్సన్ పేరు 1940 నాటికే తెలుగు సమాజంలో కొందరికైనా తెలుసు. అమెరికాలో నల్లజాతి ఉద్యమం గురించి, ఆఫ్రో అమెరికన్ సంగీత, గాన కళా నైపుణ్యాల గురించి ఆసక్తి ఉన్నవారికి తెలిసి ఉంటుంది. 1950 తర్వాత మహాప్రస్థానం వల్ల మరి కొన్ని వేల మందికి తెలిసి ఉంటుంది. అమెరికాలో కమ్యూనిస్టుల మీద, ప్రగతిశీల భావాలున్నవారి మీద మెకార్థీ కాలంలో, అమెరికా వ్యతిరేక కార్యకలాపాల పేరిట వేధింపులు జరిగినప్పుడు ఆ వేధింపులకు గురైనవారిలో ఒకరుగా 1950ల మధ్య పాల్ రోబ్సన్ పేరు తెలుగు సీమలో కూడా ప్రగతిశీల బృందాల్లో వినబడే ఉంటుంది. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలు జరిపారనే ఆరోపణలతో అమెరికాలో మేధావుల మీద, ప్రగతిశీలవాదుల మీద జరిగిన విచారణల్లో 1956 జూన్ లో ఆయన విచారణ కూడ జరిగింది. ప్రధానంగా ఆ వేధింపుల అనుభవపు నేపథ్యంలో ఆయన రాసుకున్న స్వీయకథ ‘హియర్ ఐ స్టాండ్’ ఇంగ్లిష్ లో 1958లోనే వెలువడింది.

కాని ఆశ్చర్యంగా సమకాలీనంగా గాని, ఆ తర్వాత గాని తెలుగులో పాల్ రోబ్సన్ పరిచయ వ్యాసాలు పెద్దగా వచ్చినట్టు లేవు. ఇతర అమెరికన్ నల్లజాతి యోధుల, సృజనకర్తల గురించి వ్యాసాలో పుస్తకాలో జీవితచరిత్రలో వెలువడ్డాయి గాని ఎందువల్లనో పాల్ రాబ్సన్ ఆ చలం ప్రస్తావన మినహా తెలుగువాళ్ళకు పెద్దగా తెలియకుండానే ఉండిపోయాడు. ఆయన ఆత్మకథ తెలుగులోకి అనువాదం కావడానికి యాభై సంవత్సరాలు, పుస్తకంగా రావడానికి మరొక పదిహేను సంవత్సరాలు పట్టింది.

ఆ పుస్తకం నా చేతికి అందిన కథ కూడా చెప్పాలి: వనజా నేనూ కోవిడ్ పాలై ఆస్పత్రి నుంచి వచ్చాక ఎటూ బైటికి వెళ్ళకుండా ఉంటున్నప్పుడు చదవవలసినవీ, చూడవలసినవీ అని మిత్రులు సూచించిన లింకులలో ఒకటి ‘పాల్ రోబ్సన్ కన్ఫ్రాంట్స్ మెకార్థీస్ సెనేట్ కమిటీ అనే వీడియో.

హౌజ్ కమిటీ ఆన్ అనమెరికన్ ఆక్టివిటీస్ ముందుకు పాల్ రోబ్సన్ ను పిలిచి విచారించినప్పుడు వారి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన అద్భుతమైన జవాబుల పన్నెండు నిమిషాల వీడియో అది. అది చూస్తుంటే, 2008 మే లో ప్రిన్స్ టన్ లో మిత్రుడు నారాయణస్వామితో కలిసి పాల్ రోబ్సన్ సెంటర్ చూడడానికి వెళ్లడమూ, సమయం అయిపోవడం వల్ల అది చూడలేకపోయాననే విచారమూ గుర్తుకొచ్చాయి.

ఆ వీడియో చూసి ఉబ్బి తబ్బిబ్బై ఇది కదా పొగరుబట్టిన, రాజ్య అహంకారం, శ్వేతజాతి అహంకారం తలకెక్కిన ప్రత్యర్థులను ఢీకొట్టవలసిన పద్ధతి అని అబ్బురపడ్డాను. ఆ విచారణ పూర్తి ట్రాన్ స్క్రిప్ట్ కూడా వెతికి చదివి, వెంటనే దాన్ని తెలుగు పాఠకులకు అందజేయాలనుకున్నాను. 

తెలుగులో ఆయన జీవితచరిత్ర గాని, స్వీయ చరిత్ర గాని వచ్చిందా అని ఫేస్ బుక్ మీద మిత్రులను అడిగాను. తమకు తెలిసినంతవరకు రాలేదనే మిత్రులన్నారు. అప్పుడు కొత్తపల్లి రవిబాబు గారు అనువదించారనీ, జనసాహితి ప్రచురణగా పుస్తకం అప్పుడప్పుడే బైటికి వచ్చిందని ఎవరో మిత్రులు సమాచారం చెప్పారు. అలా మొత్తానికి ‘నా జాతి ప్రజల కోసం నిలబడతా’ అనే పేరుతో తెలుగులోకి వచ్చిన ఆయన స్వీయకథ నా చేతికి అందింది.

ఆయన మరణించి నాలుగు దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ, ఈ పుస్తకం ఇంగ్లిష్ లో వెలువడి ఆరు దశాబ్దాలు దాటినప్పటికీ, అమెరికన్ సమాజానికి ఇవాళ్టికీ ఈ పుస్తకం ప్రాసంగికత తగ్గలేదు. అమెరికన్ సమాజంలో వర్ణ భేదపు పీడన, వివక్ష, హింసల గురించీ, అణచివేయబడిన గొంతుల అద్భుత వికాసం గురించి సొంత జీవితకథగా వర్ణించిన ఈ పుస్తకం జార్జి ఫ్లాయిడ్ నేపథ్యంలో ఇవాళ్టి కథే అన్నట్టుంటుంది. ఆ సమాజంలో వర్ణ పీడనతో పోల్చదగిన కుల పీడన, వివక్ష, హింస ఇంకా దారుణంగా ఇవాళ్టికీ అమలవుతున్న మన సమాజంలో, ఆ అణచివేయబడిన స్వరాల వికాసం పాల్ రాబ్సన్ తో సమానమైనంత అద్భుతంగా వెల్లువెత్తుతున్న దళిత సృజన నేపథ్యంలో ఈ పుస్తకం తెలుగు సమాజానికీ అత్యవసరం.

పాల్ రోబ్సన్ స్వీయచరిత్ర నిండా వంద పేజీలు కూడా కాదు. లాయడ్ ఎల్ బ్రౌన్ రాసిన నలబై పేజీల సుదీర్ఘ పరిచయ వ్యాసం, ప్రచురణకర్తలు చేర్చిన యాబై, అరవై పేజీల అనుబంధాలు, వివరణలు, ముందుమాట కలిసి పాల్ రోబ్సన్ ఐదు ఐద్యాయాల క్లుప్త జీవితచరిత్రను సమగ్రం చేశాయి, మరింత ప్రాసంగికం చేశాయి.

“నా గురించీ, నా భావాల గురించీ, ఈ దేశపు ప్రభువులు, ‘గొప్పవారైన శ్వేతజాతి’ ప్రజలు ఏమనుకుంటున్నారో నేను ఏ మాత్రం లక్ష్యపెట్టను. వారు దశాబ్దానికి పైగా, అపనిందలతో, మూక హింసతో, వారికి సాధ్యమైన అన్ని పద్ధతులలోనూ నన్ను చిత్రహింస చేశారు. కళాకారునిగా నా వృత్తిని కొనసాగించే హక్కును వారు హరించారు. విదేశీయాత్రలు చేసే నా హక్కును తిరస్కరించారు. వీళ్లు – నిజంగా అమెరికనేతరులు. వీరితో అంటాను కదా – “సరే! మీరంటే మరి నాకూ ఇష్టం లేదు!”

“కాని ఈ గడ్డపై నేను కలిసిన సాధారణ ప్రజానీకమంటే, ఆ సాధారణ ప్రజానీకపు అమెరికా అంటే నేను పడి చస్తాను. అదంటే నాకెంతో ప్రేమ… పికెటింగ్ చేస్తున్న శ్రామిక జనావళితో కలిసి నేను జీవించాను. ఆటో పనివాళ్లు, నౌకాశ్రయంలో కార్మికులు, వంటవాళ్లు, సేవకులు, ఫర్ నేతగాళ్లు, గనికార్మికులు, ఉక్కు కర్మాగార కార్మికులు, విదేశీయులు, వివిధ దేశీయ తెగల ప్రజలు, నేను అత్యంత సన్నిహితంగా ఉన్న యూదు జాతి ప్రజలు, మధ్యతరగతికి చెందిన అభ్యుదయవాదులు, కళలకు, విజ్ఞానశాస్త్రానికి చెందినవాళ్ళు, విద్యార్థులు, మొదలైన వారు – అమెరికన్ల కోసం కథాగేయం అనే పాటలో నేను ప్రస్తావించిన అమెరికన్లందరూ, శ్రమ చేసేవారు, వారందరి గురించి నేను తీవ్రంగా పట్టించుకుంటాను” అని తన ముందుమాటలో పాల్ రోబ్సన్ స్పష్టంగా చెప్పుకుంటాడు.

పదిహేనో ఏట బానిసత్వం నుంచి పారిపోయి మతాధికారిగా మారిన విలియం డ్రూ రోబ్సన్ కూ, డబ్బు చెల్లించి బానిసత్వం నుంచి బైటపడి ఫ్రీ ఆఫ్రికన్ సొసైటీ స్థాపించిన కుటుంబానికి చెందిన మరియా లూయిసా బుస్టిల్ కూ 1898 ఏప్రిల్ లో పుట్టిన పాల్ రోబ్సన్ పద్దెనిమిదేళ్ళ వయసుకే వ్యాయామవిద్యలో, గానంలో, వక్తృత్వంలో, ఫుట్ బాల్ లో, ప్రాచీన భాషాధ్యయనంలో నైపుణ్యం సంపాదించాడు. ఇరవైల్లో కొలంబియా విశ్వవిద్యాలయంలో లా చదువుతూ నటుడిగా మారాడు. ఆ నట జీవిత వికాసంలో భాగంగానే లండన్ లో 1930లో ఒథెల్లోగా ఇచ్చిన ప్రదర్శన పాల్ రోబ్సన్ కీర్తిని ఇనుమడింపజేసింది.

“ఒకవైపు గొప్ప గాయకునిగా, నటుడిగా ప్రశంసలు! మరోవైపు చర్మపు రంగువల్ల నల్లజాతివానిగా అవమానాలు!” అనే స్థితిలో ఉంటూనే, అప్పటికింకా “నాకు రాజకీయాలు అర్థం కావు… నా రంగం కళారంగం” అనుకునే అమాయక స్థితిలోనే ఉన్నాడు. గాయకుడిగా, నటుడిగా విదేశీ పర్యటనలు చేస్తూ, లండన్ లో కొత్త భాషలనూ, ఆఫ్రికా భాషలనూ అధ్యయనం చేస్తూ, తనను తాను కనిపెట్టడం మొదలైంది. “నీగ్రోజాతివారి విశిష్టతలనుమరింత పరిణత దశలోకి తీసుకువెళ్ళాలన్నది నా ఆకాంక్ష. నీగ్రో జాతికి స్వతహాగా గల గుణసంపద, వారు సాధించిన విజయాలు, వారి భాషలు, పాశ్చాత్య ప్రపంచంలో జనసామాన్యానికి ఏమీ తెలియవు. అంతేకాదు, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇవి సాధారణ నీగ్రో జనసామాన్యానికే తెలియవు. ఆఫ్రికాలో నీగ్రోలు సైగలద్వారా భావవ్యక్తీకరణ చేస్తారని, వారికి భాషలేదనీ నమ్మే నీగ్రోలు అమెరికాలో ఉన్నారు” అనే అవగాహనలోకి ఎదిగాడు.

1934లో ఒక సినిమాలో ఒక తెగనాయకునిగా నటించిన అనుభవంలో ఆ పాత్రకు నిర్మాతలు ఆయన ఎంతమాత్రమూ అంగీకరించని మాటలు, శ్వేతజాతి యజమానులకు కృతజ్ఞతలు చెప్పే మాటలు పెట్టినప్పటికీ, ఆ సినిమా ప్రదర్శన తర్వాత మాట్లాడమని కోరితే ఆయన వేదిక ఎక్కి ఛీత్కారం చేసి, ఒక్క మాట మాట్లాడకుండా దిగిపోయినప్పటికీ, ఆ సినిమానే పాల్ రోబ్సన్ జీవితగమనాన్ని మార్చివేసింది.

ఆ సినిమాను చూసిన సుప్రసిద్ధ సోవియట్ దర్శకుడు సెర్గీ ఐజెన్ స్టీన్ తన సినిమాలో పాల్ రోబ్సన్ కు ఒక పాత్ర ఇచ్చాడు. ఆ సినిమా చిత్రీకరణకు కోసం 1934లో సోవియట్ యూనియన్ వెళ్లిన పాల్ రోబ్సన్ జీవిత దృక్పథమే మారిపోయింది.

“నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత, ఇప్పుడు ఒక మానవుడిగా గుర్తింపబడుతున్నాను, ఇక్కడ నేను నీగ్రోను కాను. ఒక మానవుణ్ని. అంతే” అని పాల్ రోబ్సన్ ఐజెన్ స్టీన్ తో అన్నాడు. తన కొడుకు పెరిగి పెద్దవాడవడానికి సోవియట్ యూనియన్ తగిన దేశం అనుకున్నాడు. శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాల పట్ల విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఆ విశ్వాసాల కొద్దీ పాటలు రాశాడు, పాడాడు. కొద్ది సంవత్సరాల్లోనే స్పానిష్ అంతర్యుద్ధంలో తన గళంద్వారా అనితరసాధ్యంగా పాల్గొన్నాడు. నా వైఖరి నిర్ధారించుకున్నా అనే మొదటి అధ్యాయంలో తనలో ఈ పరివర్తన ఎలా వచ్చిందో ఆయనే అద్భుతంగా వివరించాడు.

ఇటువంటి ఉద్వేగభరితమైన జీవితం రెండు దశాబ్దాలు కూడ గడిచిందో లేదో, అమెరికన్ పాలకవర్గాలు ప్రచ్ఛన్నయుద్ధ రాజకీయాలలో భాగంగా సోవియట్ యూనియన్ ను సుదూరంగానైనా సమర్థిస్తారనుకునే వారందరిపైనా, ప్రగతిశీల ఆలోచనలు చేసేవారందరిపైనా, రచయితలు, కళాకారులపైనా దుర్మార్గమైన దాడి ప్రారంభించాయి. ఆ దాడిలో ప్రధాన లక్ష్యంగా పాల్ రోబ్సన్ అనేక వేధింపులకు గురయ్యాడు. విదేశాలకు వెళ్ళడం మీద ఆంక్షలు విధించారు. పాటల మీద ఆంక్షలు విధించారు. అబద్ధ ప్రచారాలు చేశారు. చివరికి హౌజ్ కమిటీ ఆన్ అనమెరికన్ ఆక్టివిటీస్ విచారణకు పిలిచారు. ఈ పుస్తకంలో వివరంగా నమోదైన ఆ వేధింపుల చరిత్రంతా ఇక్కడ చెప్పాలనే ఉంది గాని, మీరే స్వయంగా ఆ పుస్తకం చదవడం కోసం ఇక్కడ ఆపుతాను.

ఒక అద్భుతమైన కళాకారుడిని అమెరికన్ పాలకవర్గాలు ఎలా వేధించాయో, అయినా వాటిని అధిగమించి ఆయన ఎంత సమున్నతంగా నిలబడ్డాడో, అదీ ప్రజలకోసం నిలబడతా అని ప్రకటించాడో తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఉద్వేగభరిత, ప్రేరణాత్మక, నిజజీవితగాథ ఇది.

అక్కడక్కడ అనువాదం ఇంకా బాగుండే అవకాశం ఉంది గాని, ఆ రోమాంచకారి వస్తువు ముందు చిన్న చిన్న లోపాలు లెక్కలోకి రావు.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.