నిష్కల – 16

– శాంతి ప్రబోధ

కరిపై ఒకరు పెత్తనం లేని ప్రేమ సంబంధంగా తమ సంబంధం  మిగలాలని కోరుకున్న నిష్కల మనసులోకి అంకిత్ చేరి ఇబ్బంది పెడుతున్నాడు.

ఆమె ఆలోచనలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి.

రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి నవలలోని శాంతా -సూర్యం లాగా పెళ్లి తంతు లేకుండా బతకాలని అనుకున్నది. శాంతా సూర్యంలనే స్ఫూర్తిగా తీసుకున్నది.

వివాహ సంస్కృతిలో ప్రేమ కంటే శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది కానీ సహజీవనంలో అలా ఉండదని నమ్మింది.  ఒకే ఇంట్లో లేకుండా విడివిడిగా ఉంటూనే అవసరం వచ్చినప్పుడో, వీలయినప్పుడో కలుసుకోవచ్చని అనుకుంది.

కనాలని మనసులో బలమైన కోరిక పుట్టినప్పుడు పిల్లల సంగతి ఆలోచించ వచ్చని తలచింది. ఇప్పుడా ఆలోచనలన్నీ వాడిపోయాయి ఇవాళ కాకపోతే రేపు , రేపు కాకపోతే ఎల్లుండి రాలిపోతాయేమో..!

నువ్వు చెప్పింది వినడానికి చాలా అబ్బురంగా కనిపిస్తుంది. ఫ్యాన్సీ గా ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా సాధ్యమా .., చాలా సమస్యలు ఉంటాయి ఆలోచించు అని అమ్మ మరీ మరీ చెప్పింది.

నువ్వెన్నయినా చెప్పు చివరికి బలయ్యేది ఆడవాళ్లే అని గాయత్రీ వాదించింది.  అమ్మతో పాటు మిత్రులు కూడా హెచ్చరించారు.  అయినా వినలేదు.  తనకు నచ్చిన పద్దతిలోనే నడిచింది. అందరు నడిచే దోవ కాదు తన దారి తనదే అనుకుంది నిష్కల.

తమకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. స్నేహం, ప్రేమ ఉంది. సహజీవనంలో అన్యోన్యత పెరుగుతుంది అనుకుంది. సహజీవనం నా హక్కు అనుకుంది. ఎవరేం చెప్పినా వినాల్సిన అవసరం తనకు లేదు అని వాళ్ళ మాటల్ని ఆ చెవిన విని ఈ చెవిన వదిలేశాను అనుకుంది.

కానీ ఇప్పుడేంటి .. వాళ్ళ మాటలు మదిలోకి వస్తున్నాయి.  అంటే తన మది మడతల్లో ఎక్కడో అవి నిలిచే ఉన్నాయన్నమాట.  అంటే తన అడుగులు తప్పుగా పడ్డాయని,  తప్పుచేశానని అనుకుంటున్నదా .. ఏ మూల నుంచో సందేహం తొంగి చూసింది ఆమెలో ..

లేదు లేదు. అలా అనుకోవట్లేదు.  నేను నడిచిన దారి, నడవాల్సిన దారి నాకు స్పష్టమే.

ఇంక అటువంటప్పుడు ఈ సందేహాలేంటి.  తనలో తానే గొణుక్కుంటూ కర్టెన్ పక్కకు జరిపి ఆకాశంలోకి చూసింది.

నిన్నటికీ ఇవ్వాల్టికి ఎంత తేడా..  జీవితాలు కూడా అంతేగా ..

ఎదురుగా కనిపించే ఏటవాలు ఇళ్ళపై కప్పు నుండి  తళతళలాడుతూ మెరుస్తున్న మంచు ఎప్పటిలా కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడం లేదు.

హాల్ లో అస్థిమితంగా అటూ ఇటూ అడుగులేస్తున్న నిష్కల అడుగులు కిచెన్ లోకి దారితీసాయి.

వేడినీళ్లలో హెర్బల్  టీ బాగ్ వేసి అర చెంచా తేనె కొద్దిగా నిమ్మరసం పిండి తెచ్చుకుంది.

బయట ఎంత మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇంట్లో రూమ్ టెంపరేచర్ లో హీటర్ ఉంది.  అయినా వెచ్చటి టీ గొంతులోకి జారుతుంటే కొత్త శక్తి వచ్చినట్లుగా ఫీలయింది నిష్కల.

కొద్దిసేపు అటు ఇటు గంతులేసిన ఆలోచనలు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాయి.

కుటుంబంలో ఉండే పీడన లాగే సహజీవనం లో ఉంటుందా ..?

తెరలు తెరలుగా ముంచెత్తుతున్న ఆలోచనలతో సతమతమవుతున్న నిష్కల ఖాళీ అయిన కప్పు టేబుల్ పై పెట్టి తల వెనక్కి వాల్చి కుర్చీలో కూర్చుంది.

మహిళల స్వేచ్చాయుత జీవన హక్కుల కోసం నూతన విలువలు ఏర్పడాలనే ఆలోచనలు ఆమెలో కొనసాగుతున్నాయి. అవును, తన లాగే ఆలోచించే వాళ్ళు సహజీవన సంస్కృతి ప్రయోగాలు చేశారు. జెండర్ వివక్ష నిరసించడం కోసం దానికి ప్రధాన వేదికైన కుటుంబ నిర్మాణాన్ని ప్రశ్నించారు. దానికి మూలమైన పెళ్లి తంతు తోసిపుచ్చారు.

కొత్త విధానంలోకి అడుగుపెట్టిన తను వాటిని కొనసాగించాలి. ముందుకు తీసుకు పోవాలి. కుటుంబ సంస్కృతి ఏర్పరచిన పాత విలువలకు చోటు లేకుండా చేయడంలో తన వంతుగా తన కృషి చేయాలి.

మంగళ వాయిద్యాలు, మూడుముళ్లు, ఏడడుగులు లేకుండా ఒక ఆడ ఒక మగ కలిసి  కొత్త జీవితం ప్రారంభించవచ్చు. కొత్త సంప్రదాయాలు ఏర్పరచవచ్చు అని జనంలోకి వెళ్ళాలి అంటే, ఇతరులకు ఆదర్శంగా నిలవాలంటే సహజీవనంలో  జంటలకు చాలా ఓపిక కావాలి. పరస్పరం అర్ధం చేసుకోవడంలో, అవగాహన పెంపొందించుకోవడంలో ఎంతో సంయమనం పాటించాల్సి ఉంటుందని తలపోతున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తననెవరో వేలెత్తి చూపుతున్నట్లు, గొంతెత్తి గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు, తనను చూస్తూ పగలబడి నవ్వుతున్నట్లు అనిపించింది.

ఆదర్శాలు వల్లించడం కాదు నువ్వు ఎక్కడ ఉన్నావో , ఏమి చేస్తున్నావో నిన్ను నీవు గుర్తిస్తున్నావా .. అంకిత్ తన ఎదుట నిలబడి ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది.

“యూ.. ఇడియట్, నువ్వు నువ్వేగా నేను వద్దని వెళ్లిపోయిన వ్యక్తివి. కనీసం మాట మాత్రం చెప్పకుండా వెళ్లిపోయిన వ్యక్తివి” గట్టిగా అరిచింది

ఆ గొంతులోని ఆవేశం విని లోపలి గదిలో నిద్రిస్తున్న హౌస్ మెట్ రీటా కళ్ళు నులుముకుంటూ వచ్చి చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఫోన్ లో అరిచిందేమో అనుకోవడానికి నిష్కల చేతిలో ఫోన్ కూడా లేదు. ఛార్జింగ్ పెట్టి ఉంది .  చెవులకు ఎయిర్ పోడ్స్ కూడా పెట్టుకుని లేదు. మరి ఎవరిని అరిచి ఉంటుంది ఆలోచిస్తూ చుట్టూ పరికించింది.

నిష్కల మొహంలో కదలాడుతున్న భావాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ” నిషీ ..” పిలిచింది.

ఒక చూపు ఆమె కేసి విసిరి ఆ వెంటనే ఏదో పని ఉన్నట్లు మూసిఉన్న కిటికీ దగ్గరకు నడిచింది. అక్కడ ఉన్న పసుపు, ఊదారంగుల్లో పూసే ఆర్చిడ్ ఆకులను చేతిలోకి తీసుకుని కొన్ని క్షణాలు చూసింది.

పూవులతో ఎంత అందంగా ఉండేది.. మళ్ళీ ఎన్నాళ్ళకో .. అనుకున్న ఆమెకు ఆ మొక్కలో తన జీవితమే అగుపించింది.  పైకి పచ్చగా కనిపిస్తున్న ఆ మొక్కలాగే తాను చూసేవాళ్ళకి పచ్చగానే కనిపిస్తాను. కానీ తను పచ్చగానే ఉందా..?

ఎదుట లేని వ్యక్తిని గురించి తాను ఎందుకు ఆలోచిస్తున్నది? సునామీలా అతని గురించిన తలపులు..

అభద్రతకు లోనవుతున్నదా..?  అతను లేకపోతే తను పచ్చగా ఉండదా .. మోడువారిపోతుందా .. లోపలి నుంచి  ప్రశ్నలు  దూసుకొచ్చాయి.

ఛ.. ఛా … నేను అభద్రతకు లోనవడం ఏంటీ .. ఇలా వంకరగా ఆలోచిస్తున్నానేంటి? అని తనలో తానే నవ్వుకుంటూ లేచి నుంచుంది.  కిటికీలకు వేలాడుతున్న కర్టెన్స్ పక్కకు జరిపింది . ఇక్కడ చాలా ఇళ్లలో కర్టెన్స్ వాడరు. బ్లయిండ్స్ వాడతారు. అవి ఉన్నప్పటికీ ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తాయని పట్టు , జనపనారతో చేసిన కర్టెన్ సెట్ వాడుతుంది నిష్కల. అవి అంకిత్ కి కూడా చాలా ఇష్టం.  సీ ఫోమ్ గ్రీన్ రంగువి అతనే కొన్నాడు.

కిటికీ అద్దాల్లోంచి  ఎదురింట్లో వాళ్ళు కనిపిస్తున్నారు.నిన్న కురిసిన హిమపాతం బయటపెట్టిన వాళ్ళ కారుని కప్పేసింది.  పై నుంచి కింద వరకు మోకులాంటి కోటు , తలకి కుచ్చు టోపీ, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి  షూలతో దిట్టంగా శరీరాన్ని కప్పేసుకున్నారు. నిన్నటి లాగా హిమ వర్షం లేదు కానీ చలిగాలులు ఈడ్చి కొడుతున్నాయి.

శరీరానికి ఆ మాత్రం రక్షణ లేకపోతే కష్టం. అసలే కరోనాతో సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అనుకుంటే మ్యుటేషన్ లో  కొత్తరకం వైరస్ విస్తరిస్తున్నది అంటున్నారు.  ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఫ్లూ నో కరోనా నో తెలియక అయోమయంలో ఉంటారు.

నిన్నటి మంచు అప్పుడే గడ్డకట్టి పోయింది..  ఆ మంచును చాలా కష్టంగా తొలగిస్తున్నట్టుగా తోచింది నిష్కలకి.

సాధారణంగాతన కారు బయట పెట్టే నిష్కల ఫోర్ కాస్ట్ మదిలో ఉండడం వల్ల, వీకెండ్ కాబట్టి బయటికి వెళ్లే అవసరం అంతగా ఉండదని  గరాజ్ లో పెట్టింది.  లేకపోతే వాళ్ళ లాగే తనూ తిప్పలు పడాల్సి వచ్చేదనుకుంది.

కాలిఫోర్నియా లో ఉన్నప్పుడు మంచును  చూడాలని తహతహ లాడింది. మోజు పడింది.  కానీ ఇప్పుడు ఒక్కోసారి చాలా విసుగు కలిగిస్తుంది. ముఖ్యంగా స్నో ఫాల్ వల్ల వెహికల్స్ స్కిడ్ అవడం , టైర్లు మార్చాల్సి రావడం చిరాకు వస్తుంది. వాటికి తోడు ఇంటి ముందు స్నో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కౌన్సిల్ వాళ్లు పెనాల్టీ వేస్తారు.

ఇండియా లో అమ్మ ఏ పనులు చెప్పేది కాదు. ఆడపిల్లవు కాదూ ఆంటూ నాన్నమ్మ వంటింటి పనులు చేయమని పోరేది.  బయట పనులు ఏనాడు చేసింది లేదు. ఇప్పుడు లాన్ కటింగ్ , మొక్కలు ట్రిమ్ చేయడం అన్ని చేస్తున్నది . ఇష్టంగా చేస్తున్నది.  చలికాలంలో ఆ పని తగ్గుతుంది కానీ మంచు గీకే పని వస్తుంది . అది చేయక తప్పదు .  సన్నగా ఎండ వస్తున్నది. ఎంత సేపు ఉంటుందో తెలియదు అని వెదర్ అప్డేట్ చూసింది.  ఈ రోజు మళ్ళీ హిమపాతం ఉంది. ఒకటి రెండు ఇంచులు పడొచ్చు .  నిన్నటి  నాలుగించుల మంచు కరగకుండానే మళ్ళీ నా .. బాబోయ్ గట్టిపడిపోతుందేమో .. అనుకుంది.

తనతో ఇల్లు పంచుకుంటున్న మిత్రురాలు రీటా మళ్ళీ వెళ్లి పడుకున్నట్లుంది హల్  లో కనిపించలేదు.  బహుశా బాయ్ ఫ్రెండ్ తో బాతాఖానీ వేస్తున్నదేమో..  ఈ మధ్య ఎప్పుడు చూసినా అతనితోనే .. అతని ధ్యాసలోనే .

జీవితం చాలా చిన్నది. నచ్చినట్లు బతకకుండా ఈ కోపాలు, తాపాలు అవసరమా..? హద్దులు గీసుకుని ముళ్ళ కంచెలు వేసుకుని సిద్ధాంతాల రాద్ధాంతాలతో మనసులో  కొండంత ప్రేమ పీకనులిమేయ్యడం అవసరమా ..? చెప్పు , ఒంటరితనంతో ఏకాకి జీవితం ఎందుకు? మోడువారిన కొమ్మలు మళ్ళీ చిగురిస్తాయి. అది ప్రకృతి ధర్మం.  ఏదైనా సమస్య వచ్చినా ప్రకృతి తనకు తాను బాగు చేసుకోగలదు.  అన్నీ తెలుసని విర్రవీగే మనిషి ఎందుకు తనను తాను నాశనం చేసుకుంటున్నాడు?  అంటూ లోపలి మనిషి ప్రశ్న.

నిజమే, ఎందుకిలా జరుగుతున్నది?  జీవితం ఎప్పుడు అనిశ్చితమే అని తెలుసు.  ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఉండదని తెలుసు. నిజ జీవితం సవాళ్ళని విసురుతూనే ఉంటుందని తెలుసు. పిలక పట్టి జీవితాన్ని నడిపించగలం అని భ్రమ పడతాం. కానీ, వాస్తవంలో జీవన పోరాటం క్షణక్షణం ఉంటుందేమో ..

మాలో ఎవరు గెలిచారు అని గెలుపు ఓటముల ప్రసక్తి లేదు కానీ .. ఇంకా ముందుకు ఆలోచించడం ఇష్టం లేక ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచింది.

రీటా ఇంకా బిజీగానే ఉన్నట్లుంది అనుకుంటూ ఎదురింటి వాళ్ళని చూస్తున్నది.  మంచుతో బంతులు చేసి ఆడుకున్న పిల్లలు ఇప్పుడు అమ్మానాన్నలకి సాయం చేస్తున్నారు.

ఆ ఇంట్లో ఉన్నది ఇండియన్స్ అని వాళ్ళని చూస్తే అర్ధమవుతున్నది.  ఈ మధ్యే ఆ ఇంట్లోకి వచ్చారు.  ఆవిడ కారు శుభ్రం చేస్తున్నది.  బహుశా అది ఆవిడ కారు కావచ్చు. అతను మరో కారు శుభ్రం చేస్తున్నాడు.

కారు శుభ్రం చేసిన తర్వాత డ్రైవ్ వే లో పేరుకుపోయిన మంచుని గీకేస్తున్నారు.  కారు బయటికి తీయడానికి అనువుగా మార్గాన్ని చేస్తున్నారు.  మూడేళ్ళ పిల్లాడు తాను కూడా పార లాంటిది పట్టుకుని తండ్రిని అనుకరిస్తున్నాడు. వాడిని చూస్తుంటే ముచ్చటేసింది నిష్కల కు.

సమీపంలోని అడవిలో ఉండే కుందేళ్లు , లేళ్ళు మొక్కలని బతకనిచ్చేవి కావు. మనిషి అలికిడి అయితే చాలు. చెంగు చెంగున దూకుతూ పోతుండేవి,

అంజూర చెట్ట్టుపైన ఉండే ఉడుతలు ఎంతో హుషారుగా తిరుగుతుండేవి.  అవన్నీ ఏమై పోయాయో ..  అనుకుంటూ చూస్తున్నదల్లా  ఆశ్చర్యంతో అలా కొద్దిసేపు చూసింది.

మంచు కదులుతున్నదేమిటా అని అటువేపే తదేకంగా చూసింది .  ముందు పోల్చుకోలేక పోయింది.  గుర్తుపట్టగానే ఉద్వేగంతో  ‘హే .. నువ్వా .. మంచులో కలిసిపోయావ్ గా .. ” పైకి అనేసింది.

“ఎంత అందంగా ఉన్నావ్ .. అచ్చం చిక్కటి ఫర్ కోటు తొడుక్కుని ఆ మంచులో గెంతుతూ ..  భలే ఉన్నావ్. నిన్ను ఎత్తుకుని నా పక్కన కూర్చో పెట్టుకోవాలని అనిపిస్తున్నది. కానీ నా అడుగుల చప్పుడు వింటే పారిపోతావ్ ..”  బుంగమూతి పెడుతూ అన్నది నిష్కల.

చేతిలో ఫోన్ తో ఉన్న రీటా నిష్కల ఎవరితో మాట్లాడుతున్నదో అర్ధం కాక ఆమెనే ప్రశ్నార్ధకంగా చూస్తున్నదల్లా అర్ధమయ్యి పకపకా నవ్వేసింది.

వీళ్ళ మాటలు వినిపించని కుందేలు నెమ్మదిగా ఓక్ చెట్టు బెరళ్ళను తీసుకునే ప్రయత్నం చేస్తున్నది.  ఉడుత అంజూరచెట్టు తొర్రలోంచి బయటికి తొంగి చూస్తున్నది.

“చెంగు చెంగున దూకే కుందేళ్లన్నీ ఎక్కడికి పోయాయో ..అంజురా చెట్టుపై గెంతు లేసే ఉడుతలు, కిలకిలా చప్పుళ్లతో హాయినిచ్చే పిట్టలు ఏ గూట్లో ఒదిగిపోయాయో .. ” అన్నది రీటా  బయటకు చూస్తూ .

“నిజమే, జీవితం ఎంతకాలమో తెలియదు. ఈ జీవితం జీవులందరికీ ఒకేలా ఉండదు. మనుషులందరికీ ఒకేలా ఉండదు. మనుషులందరూ ఒకేలా ఉండరు.  ఒక్కొక్కళ్ళ ఆలోచనలు , ఆచరణలు ఒక్కోలా ఉంటాయి. .. ” ఫోన్ లో మాట్లాడుతున్నది రీటా.

ఈ చిన్న జీవితంలో ఒకరికొకరం అనుబంధం ఏర్పరచుకోవడంలో, ప్రేమించడంలో ఎందుకింత దూరం జరిగిపోతున్నాం. ఇష్టమైన వాళ్లతో వీలైనంత ఎక్కువకాలం ఎందుకు గడపలేక పోతున్నాం. కొంత దిగులు ఆమెలో ..  ఈ జీవిత నిర్దేశిత కాలం అందరికి ఒకేలా ఉండదు. ఎప్పుడు ఎవరి సమయం అయిపోతుందో తెలియదు. ఏ విధంగా ముగుస్తుందో తెలియదు.

జీవితంలో కొందరు మరచిపోలేని మనుషులు వుంటారు. వారితో బంధం ఎలా మొదలవుతుందో తెలియదు. కొన్ని బంధాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి.  పుబ్బలో వచ్చి మఖలో మాడిపోతుంటాయి. వదిలేయలేని బంధాల గురించే ఆమె ఆలోచనంతా .. వారి దగ్గర తన సంతోషం రెట్టింపు అవుతుంది .. ఎవరి దగ్గర తన బాధలు సగం అవుతాయి .. ఎవరు ఎప్పుడు కలిసినా ప్రశాంతంగా ఉంటుంది ..  వాళ్ళు తన ఆత్మీయులు ..

అమ్మ, అంకిత్ తన ఆత్మీయులు అని మనసు చెప్పింది.  ఆ తర్వాత సారా ఆమె మదిలోకి వచ్చింది.  ఆశ్చర్యపోయింది నిష్కల.

అదేంటి..?  సారాతో తన పరిచయం వయసెంత ?  ఆమె తనకు ఆత్మీయురాలు ఎలా అవుతుంది?

ఏళ్ల తరబడి పరిచయం ఉంటేనే ఆత్మీయులా.. అట్లా అయితే ఇప్పటికి ఇన్నేళ్ల జీవితంలో ఎందరో ఆత్మీయులుండాలి. కానీ తనకు ఆత్మీయులు అనేవాళ్ళు వేళ్ళ పైన లెక్క బెట్ట గలిగినంత మందే . మిగతావాళ్లంతా బంధువులు,స్నేహితులు, పరిచయస్తులు.. అంతే!

చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అనుకున్నవన్నీ పూర్తి చేయడానికి ఈ జీవితం చిన్నదేమో ..  ఈ జీవితపు గడువు ముగియకముందే నా జీవితానికి ఒక అర్ధం కల్పించుకోవాలి.  మమతల, బంధాల లోతుల్లోకి వెళ్లి చూడాలి.

వాడకం లేకపోతే నీరు పాచి పట్టి కంపు కొట్టినట్టు, ఇనుము తుప్పట్టి పనికిరాకుండా పోయినట్టు  మనుషులు కూడా అవుతారేమో.. మాటలు లేకపోతే, ఆత్మీయ అనురాగాలు పంచుకోకపోతే మమతలు మాయమవుతాయేమో .. బంధాలు బలహీనమవుతాయేమో ..  అన్న భావన రాగానే నిష్కల మనసు బాధగా మూలిగింది.

అంకిత్ అంటే ఈ క్షణంలో కూడా ప్రేమ ఉందని తనకు తెలుస్తున్నది. అతనితో బంధం మనసు కోరుకుంటున్నది.  అతనితో మాట్లాడితే అదో ఆనందం, అదో ధైర్యం.

మరి అతనెంత ప్రాధేయపడినా ఎందుకు స్పందించడం లేదు? బెట్టు   చేస్తున్నదా ..?

ఊహూ .. అది తన స్వభావం కాదు. మరి ఎందుకు బిగుసుకు పోతున్నది?   అహం అడ్డుకుంటున్నదా ..?

తనకు తాను ప్రశ్నించుకుంటూ తనను తాను తరచి చూసుకుంటున్నది నిష్కల .

అంతలో ఫోన్ మోగింది.  అది సారా నుండి.

ఆమె కళ్ళలో మెరుపు .

ఆమె ఇప్పుడు తన క్లయింట్ కి స్నేహితురాలు అనిపించడంలేదు. అంతకు మించిన బంధం తమ మధ్య ఉందని తోస్తున్నది. ఆమె ప్రాణప్రదమైన వ్యక్తిగా తన ఆత్మీయురాలు అనిపిస్తున్నది. ఆమె హృదయం అలాగే గుర్తిస్తున్నది.

ఆనందంతో గంతేసిన హృదయంతో  ఆ కాల్ తీసుకుంది నిష్కల.

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.