
అనుసృజన
అందరూ కవులు కాలేరు. మా పెదనాన్న కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, మా అమ్మ పెదనాన్న చలం చెప్పుకోదగ్గ కవులే! అయినా నేను కవిని కాలేకపోయాను. కాని నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవిత్వం ! ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ ని 1966 లో కలిసినప్పుడు నేను హిందీ విద్యార్థిని అని తెలిసి, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు, నన్ను అనువాదాలు చేయమని ప్రోత్సహించారు. నా అనువాదాలు ప్రచురణకు నోచుకున్నాయి. నాకు నచ్చిన కవితను వెంటనే అనువాదం చెయ్యడం నా అలవాటై పోయింది. అలా చేసిన అనువాదాలే ఇవి:
-ఆర్. శాంతసుందరి
నాన్న పచ్చదనం గురించి ఆలోచించేవాడు
మూలం: మిథిలేష్ కుమార్ గుప్త్
నాన్న ఆలోచనలు ఎప్పుడూపొలం గురించేపంట గురించేరుతువుల గురించేవర్షం గురించేఎండ గురించే నిజానికి పచ్చదనం గురించే ఆలోచించేవాడు నాన్నఎలాంటి పచ్చదనమనుకున్నారు?దాన్ని చూడగానే మొహాలు పువ్వులై పోవాలిపిట్టల పాటల్ని వింటూమనసు పరవశించి పోవాలి కానీ నాన్న ఆ తర్వాతఆలోచించసాగాడుఅప్పుల గురించిఒంట్లో శక్తి నశించటం గురించిఅనారోగ్యం గురించి మర్నాటి నుంచీ ఆలోచించటం మొదలెట్టాడుదగ్గు గురించిచివరికి మృత్యువు గురించి కూడానేనాయన దగ్గరకి విరిసిన పువ్వొకటితీసుకువెళితే ఆయన ఆలోచించటం మొదలెట్టేవాడుఅది వాడిపోవడం గురించిఎక్కడైనా వాన కోయిల పాట వినబడితేఆయన ఆలోచించేవాడు ఏడుపు గురించి .
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
