
కాదనదు
-సుభాషిణి ప్రత్తిపాటి
వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…నాతోనే పయనిస్తోంది చిత్రంగా!! గడియారపు ముళ్ళతో పోటిపడిఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలనుసంధిస్తున్న వేళ సమయం నా చేతుల్లో ఒదిగిపోతోంది …పాపాయిలా నిద్రపోతోంది. అలుపెరుగని పయనంలో…అప్పుడప్పుడూ నా కోసంఓ రోజనుకుంటే మాత్రం మొండికేసిన మోటారుబండిలా కాలం కదలదెందుకో! నన్నల్లుకున్న అనుబంధాల తీవెలన్నిటికీవసంతాలవారసత్వాన్నందించి….పర్ణికనై నే రాలిపోతున్నప్పుడు కూడా…కాలం నన్ను కాదనదుకన్నతల్లిలా కౌగిలించుకునినా పంచ ప్రాణాలను తనలో కలిపేసుకుని..నా అనంతాలోచనలను వినీలాకాశపు వేదికపైచుక్కలుగా విసిరేస్తూ…విశ్వవిలాసినిగా సాగుతూఉంటుంది.*****

