కాదనదు

-సుభాషిణి ప్రత్తిపాటి

వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..
కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…
చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…
ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…
నాతోనే పయనిస్తోంది చిత్రంగా!!
 
గడియారపు ముళ్ళతో పోటిపడి
ఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…
ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలను
సంధిస్తున్న వేళ సమయం నా చేతుల్లో ఒదిగిపోతోంది …
పాపాయిలా నిద్రపోతోంది.
 
అలుపెరుగని పయనంలో…
అప్పుడప్పుడూ నా కోసం
ఓ రోజనుకుంటే మాత్రం   మొండికేసిన 
మోటారుబండిలా కాలం కదలదెందుకో!
 
నన్నల్లుకున్న  అనుబంధాల తీవెలన్నిటికీ
వసంతాలవారసత్వాన్నందించి….
పర్ణికనై నే రాలిపోతున్నప్పుడు కూడా…కాలం నన్ను కాదనదు
కన్నతల్లిలా కౌగిలించుకుని
నా పంచ ప్రాణాలను తనలో కలిపేసుకుని..
నా అనంతాలోచనలను వినీలాకాశపు వేదికపై
చుక్కలుగా విసిరేస్తూ…
విశ్వవిలాసినిగా సాగుతూఉంటుంది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.