
యాత్రాగీతం
బహామాస్
-డా||కె.గీత
భాగం-5
మయామీ నగర సందర్శన – ఫ్రీడమ్ టవర్
విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్ సందర్శన పూర్తయ్యేసరికి భోజనసమయం దాటి పోసాగింది. అక్కణ్ణించి మధ్యాహ్న భోజననానికి డౌన్టౌన్ లో ఉన్న ఇండియన్ రెస్టారెంటు బొంబాయి దర్బారు (Bombay Darbar) కి వెళ్ళాం. తాలీ స్టైల్ నార్త్ ఇండియన్ భోజనం ఆదరాబాదరా, సుష్టుగా పూర్తిచేసి ఫ్రీడమ్ టవర్ (Freedom Tower) సందర్శనకు వెళ్లాం. 1925 లో నిర్మించబడిన ఈ టవర్ స్పెయిన్ లోని గిరాల్డా టవర్ రూపంలోనే నిర్మించబడింది. 17 అంతస్తుల్లో 82వేల చదరపు అడుగుల భవంతి ఇది.
ప్రస్తుతానికి సమకాలీన కళాఖండాల మ్యూజియం గా ఉన్న ఈ ఫ్రీడమ్ టవర్ 1960లలో క్యూబా విప్లవం సమయంలో అక్కడి నించి మాయామీకి వచ్చే శరణార్ధులని ఉంచే తాత్కాలిక నివాస గృహమట. వారికి ఇక్కడే మెడికల్, డెంటల్ క్యాపులు కూడా నిర్వహించేవారు. 1959లో ఫిడేల్ క్యాస్ట్రో క్యూబా అప్పటి క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. క్యూబాను పశ్చిమార్థ భూగోళంలో మొట్ట మొదటి సామ్యవాద దేశంగా మార్చాడు. ఈయన అమెరికాకు బద్ధ వ్యతిరేకి. అమెరికా కాస్ట్రోను హత్య చేయటానికి ఎన్నో సార్లు విఫలయత్నం చేసింది. కానీ ప్రతీ సారీ కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లెంగా మారాడు. అధికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికాతో సహా విదేశీయులు, స్వదేశీయుల ఆస్థులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. క్యూబాలోని సహజ వనరులన్నింటినీ జాతీయం చేశాడు. వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించాడు. క్యూబాలో సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పాడు. దీనితో అనేకమంది ధనవంతులైన క్యూబన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు.అంతేకాకుండా అప్పటి సాయుధ పోరాట సమయంలో భయభ్రాంతులకు గురైన ప్రజలతో కలిపి దాదాపు లక్షా డెబ్బై వేలమంది అమెరికా శరణుజొచ్చారు. 1965-1973 మధ్య ఫ్రీడమ్ ఫ్లయట్స్ అని పిలిచే విమానాలు శరణార్థుల్ని తీసుకొచ్చేవి.
ఇక్కడి మ్యూజియం లో ముఖ్యంగా క్యూబా నించి తల్లిదండ్రులు రాకుండా ముందుగా పంపేసిన పిల్లలు, తల్లిదండ్రులు కనిపించక అనాధలైన పిల్లల్ని అమెరికాలో ఏయే చోట్లకి పంపేరో వివరించే చిత్రం వంటివి చూసి దుఃఖం ముంచు కొచ్చింది. మొత్తం 14,048 మంది పిల్లలు ఇలా అమెరికాలోకి అనాధలుగా అడుగు పెట్టారు. ఇందులో కొన్ని వేలమంది ఎప్పటికీ వారి తల్లిదండ్రుల్ని మళ్లీ ఎప్పటికీ కలుసుకోలేదట. కారణం ఏదైనా పిల్లలు తల్లిదండ్రుల్నించి విడిపోబడడం అనేది జీర్ణించుకోలేని చేదు నిజం.
ఈ ఫ్రీడమ్ టవర్ లో ఒక క్యూబన్ అమెరికన్ మ్యూజియం, లైబ్రరీ, మీటింగు హాలు ఉన్నాయి ఇప్పుడు. అక్కడక్కడ ఇప్పుడు ఏం ఉన్నా ఒకప్పటి శరణార్ధుల దీన ముఖాలే కనిపించసాగేయి నాకు. వాళ్ళు నడయాడిన గుర్తులు గుండెని బరువెక్కించాయి. ఖాళీగా ఉన్న మీటింగు హాల్ లో అమెరికా చరిత్రకి సాక్ష్యమైన అతి పెద్ద కుడ్య చిత్రం మినహా ఏమీ లేదు. అయినప్పటికీ నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించింది. ఫిడేల్ క్యాస్ట్రో పట్ల, సోషలిజం పట్ల వ్యతిరేకత బాగా కనిపిస్తుంది ఇక్కడ ఎగ్జిబిట్స్ లో.
అయితే నిజానిజాల్ని పక్కనబెడితే ఇక్కడ గుండ్రంగా ఉన్న థియేటర్ లో “లివింగ్ టుగెదర్” అన్న చారిత్రాత్మక డాక్యుమెంటరీ ప్రదర్శన ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఇక అక్కడితో మా మయామీ నగర సందర్శన పూర్తి చేసుకుని అక్కణ్ణించి తిన్నగా హోటలుకి వచ్చేసాం.
మేం మర్నాడు మయామీ నుంచి మూడురోజుల బహమాస్ యాత్ర క్రూజ్ ఎక్కాల్సి వుంది.
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
