నిష్కల – 18

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా అచ్చు తన నానమ్మ పోలికతో ఉండడం చూసి నిష్కల ఆశ్చర్యపోతుంది.  అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు కోసం సరోజమ్మ బెంగ పడుతుంది.

***

          హాయ్ ..సారా ఎలా ఉన్నారు?’ ఆత్మీయంగా పలకరించింది  నిష్కల. ఆ కంఠంలో ఉత్సుకత. ఆఫీస్ సమయంలో తప్ప ఎప్పుడూ సారా ఇలా ఫోన్ చేయలేదు.             ‘ఫైన్ , థాంక్యూ డియర్, మీతో మాట్లాడాలని ఉంది.  మాట్లాడొచ్చా.. ” సూటిగా విషయంలోకి వచ్చేసింది సారా.            “అదేంటి అలా అడుగుతున్నారు. నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు.  చెప్పండి” “ఇప్పుడు కాదు, ఈ రోజు సాయంత్రం మీరు కొంత సమయం ఇవ్వగలరా..” మృదువుగా  అడిగింది సారా.              “సాయంత్రం అంటే ఏ సమయం ?”            “మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు సాయంత్రం, అంటే మీ ఆఫీస్ పనులు ముగించుకున్న తర్వాత మనం కలిసి మాట్లాడుకోవాలని .. ” అంటూ ఆగింది సారా. నిజానికి  సారాని కలిసి మాట్లాడాలని నిష్కల మనసు ఉవ్విళ్లూరుతున్నది.  ఆమెతో దగ్గరి తనం ఫీలవుతున్నది.  సారా ఎంతో స్నేహంగా మాట్లాడినప్పటికీ తన క్లయింట్ స్నేహితురాలితో చొరవ చేసి మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించింది.  అందుకే ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తనకు తానుగా సారా ఫోన్ చేసింది.  ఇది మంచి అవకాశం తన గురించి మరింత తెలుసుకోవడానికి.  ఆమె వ్యక్తిగత విషయాలలోకి వెళ్లి అడగటం భావ్యం కాదు. సంస్కారం కాదు, మరి ఎలా? ఈ రోజు ఎలాగైనా సారా గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేయమని ఆమె మనసు తపన పడుతున్నది. తనలో కలుగుతున్న భావాల పరంపరను నొక్కిపెడుతూ తప్పకుండా కలుద్దాం అని మాట ఇచ్చింది.             “గీత విషయంలో కాదు మన ఈ కలయిక ప్రత్యేకమైంది ” నవ్వేసింది సారా.  అలలు అలలుగా నిషి హృదయాన్ని తాకుతున్నది ఆ నవ్వు.            “నిజమా.. ఎక్కడ కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం?” గబుక్కున అడిగేసింది నిష్కల.            “ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీ ఆఫీస్ కి దగ్గర.  దాని సమీపంలోని గ్రేస్ స్ట్రీట్ కాఫీ అండ్ డెసర్ట్ లో కలుద్దాం.  అక్కడ ఆసియన్ డోనట్స్ కూడా దొరుకుతాయి” అంటూ గలగలా నవ్వేసింది సారా .            “అవును, కదూ… సరే, సాయంత్రం ఐదు గంటలకు వచ్చేస్తా” తను కూడా నవ్వుతూ చెప్పింది నిష్కల.             తయారై ఆఫీసుకు బయలుదేరింది కానీ సారా ఎందుకు కలవాలని అన్నది?  ప్రత్యేకంగా ఏం మాట్లాడుతుందట? ఇప్పటివరకు ఎప్పుడు గీతతో పాటు గీత కోసం వచ్చేది. సరదాగా మాట్లాడేది. ముగ్గురు ఒకే ఈడు వాళ్ళు కావడంతో ముగ్గురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.  సరదాగా కబుర్లు చెప్పుకోవడం లేదంటే సామాజిక విషయాలు చర్చించుకోవడం జరిగింది.  కానీ, ఈ  సారి గీత కోసం కాదని స్పష్టంగా చెప్పింది.  అంటే మరి ఎందుకోసం తనను కలుస్తుంది?            ఒకవేళ సారా మనసులో కూడా నాకున్నట్లే ఏమైనా సందేహాలు ఉన్నాయా ..? ఆమె తల్లి చైనా దేశస్తురాలు అని, తండ్రి భారతీయుడని మాటల సందర్భంలో తెలిపింది. అయితే, భారతదేశంలో ఏ ప్రాంతం వారో చెప్పలేదు.            ఆమె తండ్రి, తన తండ్రి ఒకరేమో అనే సందేహం సారా కి కూడా వచ్చి ఉంటుందా..?  పనిలో ఉన్నప్పటికీ మధ్య మధ్య నిష్కల మనసు సారా చుట్టూనే తిరుగుతున్నది. పరిపరివిధాలా ఆలోచిస్తున్నది.            సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందో అని తరచూ సమయం చూసుకుంటున్నది.  ఈరోజు ఇంత నిదానంగా కదులుతున్న దేంటి? చేయవలసిన పనులు ఎన్నో ఉన్నప్పటికీ ధ్యాస పనులపై నిలవడం లేదు. తన  మనసుకు రెక్కలు వచ్చినట్లు గడియారం ముల్లుకి రెక్కలు వస్తాయా ..? అని తనలో తానే నవ్వుకుంది నిష్కల.            చేయవలసిన పనులు త్వరత్వరగా ముగించుకుంది. ఫైల్ చేయాల్సిన ఒక కేసు రేపటికి వాయిదా వేసింది. పనులు పెండింగ్ పెట్టడం, బద్దకించడం నిష్కల డిక్షనరీలోనే లేదు. మామూలుగా అయితే కూర్చుని పూర్తి చేసి ఇంటికి బయలుదేరేది.  కానీ ఎప్పటిలా పని మీద పూర్తిగా ధ్యాస పెట్టలేకపోయింది.            నాలుగున్నర అయ్యేప్పటికి ఆఫీసునుండి బయటికొచ్చింది నిష్కల. పదిహేను నిముషాల నడక దూరంలో ఉంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్.   కాఫీ షాప్  ఇంకొక మూడు నిముషాల ముందే వస్తుంది.             నడుస్తున్న నిష్కల మొహంపై చల్లటి గాలి ఈడ్చి కొడ్తున్నది. వేసుకున్న లాంగ్ ఉలెన్ కోట్ లోంచి, షూస్ లోంచి చొచ్చుకుని వచ్చి ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేస్తున్నది. ముఖంపై  అల్లరిచిల్లరిగా పడుతున్న జుట్టు వెనక్కి తోసి హాండ్ బాగ్ లోంచి కాప్ తీసి తలకు  తగిలించుకుంది.            వడివడిగా నడుస్తున్న ఆమె కంటే వేగంగా సాగుతున్నాయి  నిష్కల ఆలోచనలు. సారాతో పరిచయం గీత వల్ల జరిగింది. పాపం గీత. ఆమె సమస్యకు పరిష్కారం ఇంకా రాలేదు. తనకు సహాయం చేయాలని, ఆమె పరిష్కారం చూపించాలని మనసుకు ఉంటే చాలదుగా ..            చట్టానికి కావలసింది మనసు కాదు, నేర నిరూపణకు  కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు. అవి ఇటువైపు బలంగా లేవు. అతను ముందుచూపుతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు.  పాపం గీత.            మెరుగైన జీవన ప్రమాణాలు , ఆరోగ్య వసతులు , విద్య , ఉపాధి , మౌలిక వసతులు ఉండడంతో భారతీయుల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అమెరికా అంటే వ్యామోహం పెరిగిపోతోంది. సమర్ధత , మేధస్సు, అంకితభావం ఉన్న భారతీయులు అందల మెక్కుతున్నారు. అమెరికన్లు భారతీయుల మధ్య అనుబంధం దృఢపడుతున్నది . భారతీయులు కీలక స్థానాల్లో ఉంటున్నారు. ఇవన్నీ తెలిసిన యువత సొంత వాళ్లని స్వంత మనుషుల్ని, స్వంత అలవాట్లని , ఆచారాల్ని దేశం వీడి చదువు కోసమో ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో విదేశీ గడ్డపై కాలు పెడుతున్నారు.            గుండె నిండా కొత్త కలలు, కోటి ఆశలు నింపుకుని గీత కూడా  అలాగే వచ్చింది. ఎమ్మెస్ తర్వాత ఇక్కడే ఉద్యోగం చూసుకుంది.  అమెరికాలోనే స్థిరపడాలనుకుంది. తన బిడ్డ ఏ లోటు లేకుండా సుఖపడుతుందని సంబరపడ్డారు ఆమె తల్లిదండ్రులు. తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంటుందని ఏరికోరి ఎన్ ఆర్ ఐ డాక్టర్  సంబంధం ఖాయం చేసి బిడ్డకు కానుక  ఇస్తున్నామని మురిసిపోయారు ఆమె తల్లి దండ్రులు.             అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది?            పెళ్లిళ్ల మార్కెట్లో అధిక ధర పలికే ఎన్నారై లు కొందరు తల్లిదండ్రుల ముందు, పెద్దల ముందు హూందాగా , మంచితనం ముసుగు వేసుకుని తిరుగుతారు.  పెళ్లయ్యాక, పరాయి గడ్డపై కాలు మోపాక విశ్వరూపం చూపడం మొదలు పెడతారు. కొందరు కట్టుకున్న దాన్ని విడిచి మరో పెళ్ళికి సిద్ధమవుతారు.            ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పోకూడదని ఆ అమ్మాయిలు పంటి బిగువున ఆ బాధను భరిస్తూ ఉంటారు.  మెత్తగా ఉంటే మొట్ట బుద్ధవుతుంది అంటారు కదా .. అట్లాగే వీళ్ళ బలహీనత ఆసరా తీసుకుని రెచ్చిపోతున్నారు చేపట్టుకుని ఏడడుగులు నడిచి కలిసి ఉంటామని బాసలు చేసిన మొగుళ్ళు.            కొందరు ఎన్నారై అల్లుళ్ళ భాగోతాలు ఒకలా ఉంటే, పెళ్ళికొడుకు అవతారమెత్తి కాబోయే భార్య దగ్గర ఆమె సొమ్ము కొట్టేసేవాళ్ళు కొందరయితే, ఆమె శరీరాన్ని, మనసును కొల్లగొట్టే వాళ్ళు ఇంకొందరు.            ఎన్నారై భర్తల మోసాలకు గురైన ఎనిమిది మంది యువతులు పోరాటం మొదలు పెట్టారు. సుప్రీం కోర్లులో పిటిషన్ దాఖలు చేశారు.  తమను పెళ్లి చేసుకుని విడిచి పెట్టారని , వారిపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.            చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా మరో పెళ్లి చేసుకున్న భర్తను అరెస్ట్ చేయాలని కోరారు .  దేశం కాని దేశంలో ఉన్న తమ భర్త పై తాను చేసే న్యాయపోరాటానికి దౌత్యపరంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన న్యాయస్థానం  ఎన్నారై పెళ్లి మోసాలపై ప్రవాసీ లీగల్ సెల్ ఏర్పాటు చేసింది . ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ పెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది.            ఎన్నారైలు చేసుకున్న పెళ్ళిళ్ళను ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి.  లేని పక్షంలో పాస్పోర్ట్ లు వీసాలు జారీ చేయరు .  భార్యను వదిలేస్తామని బెదిరించిన వాళ్ళకి ఎన్నారై భర్తల పాస్ పోర్ట్ రద్దు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.            తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులకు భారత ప్రభుత్వ సహాయంతో, ముఖ్యంగా హైదరాబాదు పోలీసు అధికారుల తో సమన్వయం చేసుకుంటూ సహకరించ గలిగింది నిష్కల. ఆ తృప్తి ఉంది కానీ గీత విషయంలో ఇంకా ఏమీ చేయలేక పోతోందని బాధ ఉంది నిష్కలలో.             ఆకాశపు అంచుల్లో విహరించిన గీత పాతాళంలో  కూరుకుపోయినట్లు బాధపడింది.  నేరస్తుడు దర్జాగా కాలరెగరేసుకుని తిరుగుతుంటే బాధితురాలు పాతాళంలో పడడం ఏంటి?  ఎంత అన్యాయం.  నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని గీతకు సారా వెన్నుదన్నుగా నిలిచింది. దుర్మార్గుడు, ఇన్నాళ్లు తాళి కట్టిన భార్యకు దగ్గరైనట్లే దగ్గరై ఆమెను భ్రమల్లో ముంచెత్తాడు, మోసం చేశాడు, కోరిక తీరింది. మోజు తగ్గింది. పెళ్లి చేసుకోవడానికి మనసు రాలేదు. వంకలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. దగాపడిన ఆమె వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరచి  బరితెగించిన ఆడది అని ప్రచారం చేసే నీచ స్థాయికి దిగజారాడు.  ఇలాంటి వాళ్ళకి చట్టంలో సరైన  సమాధానం ఏది?            మగవాడు ఎలా ప్రవర్తించిన పట్టించుకోరు కానీ ఆడపిల్ల జీవితం పట్ల రకరకాల తీర్పులిచ్చే తీర్పరులు మాత్రం అడుగడుగునా తయారైపోతారు. దేశం దాటి వచ్చిన మన వాళ్ళ  బుద్దులు మాత్రం పోవు. విషయం తెలిసిన ఆడవాళ్లు కూడా తోటి ఆడపిల్ల పట్ల సానుభూతి చూప లేకపోవడం .. మగవాళ్లకు వత్తాసు పలకడం .. వంకర నవ్వు నవ్వడం .. ఎంత నిబ్బరంగా ఉందామని ప్రయత్నించినా ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటాయి. గీతకే కాదు ఏ ఆడపిల్లకైనా అది సంకట పరిస్థితే.            గీత ఇప్పుడిప్పుడే రాటుదేలు తున్నది. తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. అమ్మానాన్న చదువు, ర్యాంకుల వెంట పరిగెత్తడం, ఉద్యోగం తప్ప సామాజికంగా చాలా విషయాలు తెలియని గీత కళ్ళు, మైండ్ తెరిచి సమాజంలో భిన్న మనస్తత్వాలు చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టింది.  అతను తనకు మ్యాచ్ కాడు అంతే అని సరి పెట్టుకోవడానికి, నచ్చచెప్పు కోవడానికి ప్రయత్నిస్తున్నది.  కానీ సాధ్యం కావడం లేదు.           మూడుముళ్లు పడలేదు, ఏడు అడుగులు కలిసి నడవ లేదు కానీ మనసా వాచా కర్మణా అతను తన భర్త అని స్థిరపరచుకున్న సగటు భారతీయ యువతి గీత.           కాలం, పరిస్థితులు ఎవరినైనా గొప్పగా ఆలోచింప చేస్తాయేమో ! అదే ఇప్పుడు జరుగుతున్నది.            మూసుకు కూర్చోవాల్సింది మోసం చేసినవాడు కానీ మోసపోయిన వాళ్ళు కాదు. నువ్వెందుకు తెరచాటున ఉండాలి. ఇలాంటి వాళ్ళను ఉపేక్షిస్తే ఇట్లాటి మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. తెలివైన వాళ్ళుగా చెలామణీ అవుతారు.  ఇంకొందరు ఆడపిల్లలు బలి అవుతారు. మోసం చేసిన వాళ్ళతో పాటు, మోసపోయిన వాళ్ళని వేలెత్తి చూపి రకరకాల తీర్పులిచ్చే లోకమే ఈ అన్యాయాలకు మూల కారణం.            కృత్రిమ పరువు ప్రతిష్టలకు విలువ ఇచ్చే ఈ పిచ్చి ప్రపంచాన్ని పట్టించుకోకు. భారతదేశంలో  గొప్పగా చెప్పుకునే కొందరు స్త్రీల గురించి నేను విన్నాను. మౌన పోరాటం చేసిన మహిళలు, సీతలు , సావిత్రిలు, సతీ సుమతులు కాదు ఇప్పుడు కావాల్సింది. అంతా కల్సి రాద్ధాంతం చేయగల ఆత్మబలం ఆయుధంగా ధనుస్సు ఎక్కుపెట్టే సత్యభామ లాంటి  మహిళలు కావాలి గీతా అని  దైన్యాన్ని పోగొట్టి ధైర్యం నింపడం మొదలు పెట్టాక గీతలో స్పష్టమైన మార్పు  కనిపిస్తున్నది.            నీకు నిజమైన తోడు కావాలి. అతని ప్రేమ కావాలి. అతని సన్నిధిలో ని మనసు తేలిపోవాలి. బతుకుపై భరోసా అందాలి.  కానీ అలాంటి సుగుణాలకు ఎంతో దూరం అయిన మనిషని, మోసగాడని, నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసే రకం అని  ముందే తెలియడం మంచిదయింది.  ఏది జరిగినా మన మంచికే అని గీతకి స్వాంతన వచనాలు చెప్పే సారా వ్యక్తిత్వం ఎగిసి పడే అల ఎంత బలమైందో అంత బలమైంది అనుకుంది నిష్కల.            ఇటువంటి  గడ్డు పరిస్థితుల్లో విశాల హృదయం ఉన్న మిత్రులు, కుటుంబం ఇచ్చే భరోసా , సహాయ సహకారాలు ఎంతో ధైర్యాన్ని ఓదార్పును ఇస్తాయి.  డిప్రెషన్ కు లోనైన  వ్యక్తులు దాని నుండి బయటకు రావడానికి మందు మాకులు ఏమీ పనిచేయవు.  సారా లాంటి మిత్రుల గట్టి మాటలు తప్ప. ఎదుటి మనసును అర్ధం చేసుకునే మంచితనం, సువిశాల మానవతా దృక్పథం సారా లో మెండుగా ఉన్నాయి.            సారా అండదండలతో పరువు, ప్రతిష్ట వదిలి తన ముందున్న జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి అనుభవించడానికి అడుగులు కదుపుతోంది గీత.             నిన్నటి నిర్ణయాలు  రేపటి జీవితానికి అడ్డు కాకూడదు. అనుకుంటూనే అతనిపై న్యాయ పోరాటానికి చట్ట పరిధిలో మార్గాలు వెతుక్కుంటున్నది.            ఒక రాయిని అందమైన శిల్పం గా తయారు చేయాలంటే ఒక శిల్పి మాత్రమే చేయగలడు.  నిజమైన స్నేహితులు కూడా అంతేనేమో..నిజమైన మిత్రుడున్నప్పుడు జీవితంలో అసలైన వెలుగును చూడగలుగుతారు.             నిద్రలేని రాత్రులతో అతి బరువుగా కదిలే రోజులతో ముగింపు లేకుండా సాగే ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్న గీతను జీవితంలో అసలైన వెలుగు వైపు నడిపించే  సారా ఉన్నతంగా కనిపిస్తున్నది నిష్కల ఆలోచనల్లో.             కాఫీ షాప్ కేసి నడుస్తున్న నిష్కలకు ఆ క్షణం ఎప్పుడో హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు గుర్రం గూడ లోని విపశ్యన కేంద్రంలో చూసిన “టేకింగ్ ది థింగ్స్ యాస్ దే కం’  వాక్యం మదిలో మెదిలింది.  ఆ వాక్యం ఆమెను వెన్నంటే ఉంటుంది.  ఆమెను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది.  లోపలి ఉక్కపోతను బయటికి నెట్టేస్తూ సేద తీరుస్తూనే ఉంటుంది.             సారా కూడా ఇంచుమించు ఇదే విధంగా గీతకు చెబుతున్నది. పైకి నవ్వుతూ తుళ్ళుతూ  అల్లరి పిల్లలాగా కనిపించే  సారా తాత్వికత ఒక్కోసారి నిష్కలను అబ్బుర పరుస్తుంది.            కాఫీ షాప్ లో మసక కాంతుల మధ్య ఓ మూలగా ఉన్న ఖాళీ టేబుల్ దగ్గర కూర్చుంది. ఐదు కావడానికి ఇంకా పదిహేను నిముషాల సమయం ఉంది.            నిష్కలకి అరేబికా కాఫీ చాలా ఇష్టం.  అది తీసుకు వచ్చి వెచ్చని కాఫీ కొద్దిగా సిప్ చేసి ఎదుట ఉన్న టేబుల్ పై మగ్ పెట్టింది. కాఫీ మగ్ పై చెక్క మూత పెట్టి బ్యాగ్ నుంచి ఫోన్ చేతిలోకి తీసుకుంది..            నోరంతా తెరిచి సమ్మోహనంగా నవ్వుతూ అంకిత్ ముఖం స్క్రీన్ పై దర్శనమిచ్చింది. అది చూస్తూ ప్రేమను ఆస్వాదించడం తెల్సు ప్రేమను పంచడం కూడా తెల్సు ప్రేమ కోసం తపించే మనసు తనకు తెల్సు కానీ ఆ ప్రేమకు చేరువ కాలేకపోతున్నది             తలపుల్లో నిండిపోతున్న అంకిత్ ని పక్కకు జరుపుతూ  ఇంస్టాగ్రామ్ చూడటం మొదలు పెట్టింది. ఇంస్టా  లో  వైరల్ అయిన  వార్త ఆమె మనసును కకావికలం చేసింది.ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడం కోసం కాబోయే పెళ్ళికొడుకు గొంతు కోయడం ఏంటి?  ఇష్టం లేదని పెద్దలతో చెప్పెయ్యొచ్చుగా .. ఇలా చేసింది ఏంటి ఆ అమ్మాయి. బహుశా ఆ అమ్మాయికి తన అభిప్రాయం చెప్పే అవకాశం లేదేమో లేకపోతే ఆమె పెద్దలు ఒప్పుకోలేదేమో .. లేకపోతే అతని బలవంతంపైనో మరేదో కారణం చేతనో పెళ్ళికి ఒప్పుకొని ఉంటుందా  అని ఆలోచిస్తూ ఫేస్ బుక్ తెరిచింది. అక్కడ కూడా ఇదే వార్త వైరల్ అయింది.  పెద్ద వార్తయింది . చర్చనీయాంశం అయింది., ఒక ఆడపిల్ల హత్య చేయడానికి సిద్దమయిందంటే  ఆమెలో అంత తెగింపు వచ్చిందంటే బలమైన కారణమే ఉండి ఉండాలి. ఆ కారణం ఏమై ఉంటుందో నిష్కల కి అంతుపట్టడం లేదు.            అమ్మాయి ఇష్టాలని గౌరవించని సమాజంలో , ఆడపిల్ల పెళ్లి నిర్ణయాధికారం ఆమె చేతిలో లేని క్రమంలో  మూలకారణాల జోలికి వెళ్లడం లేదు సమాజం.            అమ్మాయి చేసిన పని చూసి పితృస్వామ్య పురుషాహంకార సమాజం బుసలు కొడుతోంది. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఈ సంఘటన తెలుగునాట అమ్మాయిల జీవితం పై ఎటువంటి ప్రభావం చూపనుందో.. అమ్మాయిలపై మరింత నిర్బంధం పెరుగుతుందా..  లేక పెళ్లి విషయంలో కనువిప్పు జరుగుతుందా.. రెండో దానికి అవకాశమే లేదు నేను పుట్టి పెరిగిన సామజిక పరిస్థితుల్లో. అయినా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నప్పుడు కారణాలు అన్వేషించని తల్లి దండ్రులు, సమాజం బలవంతంగా మెడలు వంచి పెళ్ళికి సిద్ధం చేస్తారు.  అబ్బాయికి ఉన్న ఛాయిస్, వాయిస్  అమ్మాయికి ఉండదు.            చేతిలో ఫోన్ లో పైకి కిందకి స్క్రోల్ చేస్తున్న క్రమంలో అధికశాతం విడాకులకు కారణం మహిళలేనని చెబుతున్న వీడియో నిష్కలను ఆకర్షించింది. అసలు ఏమంటున్నారో చూద్దామని చూడటం మొదలు పెట్టింది.             భార్య భర్తల మధ్య తప్పు ఎవరిదీ అని అడిగితే వంద శాతం ఆడవాళ్లదే తప్పు అని  మహిళల తరపు లాయర్లు అంటున్నారు. వింతగా లేదూ ..అందులో మహిళలు కూడా ఉండడం విచిత్రం ఏమీ కాదు. ఆమెను ట్యూన్ చేసే మీట ఎక్కడ ఉంది.. మన పితృ స్వామ్య వ్యవస్థ లోనే కదా.. బాధిత మహిళలతో పాటు సగటు మహిళలు  కూడా ఆ భావజాలానికి ప్రతినిధులే కదా.. !           ఒక పురుషాధిక్యత వైపు నుండి మాట్లాడే పురుష లాయర్లు .. పురుషాధిక్య భావజాలం చట్టమైన చోట మహిళలదే తప్పుగా కనిపిస్తుంది కదా..!             చిరాగ్గా అనిపించి ఆ వీడియో ఆఫ్ చేసేసి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది.            ఈ సృష్టిలో ఏ జీవిలో లేని విధంగా మనుషులు మాత్రమే బరువుగా, భారంగా, కృత్రిమంగా ఎందుకు తయారవుతున్నారు. ఎందుకు దారి తప్పుతున్నారు? గాలి తెమ్మెర లాగ ఒక సందేహం తొంగి చూసి పక్కకు జరిగిపోయింది.            సారా మదిలో చేరింది.  నిష్కల మనసు సారా రాక కోసం ఆత్రుత పడుతున్నది.  ఆమె సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నది.  ఎందుకు? ఆమె తన తోబుట్టువు అవుతుందనే ఊహ వల్లనా? లేక ఆమె వ్యక్తిత్వం నచ్చడం వల్లనా?  ఏమో.. ఏదైనా కావచ్చు!           సారా ఇంకా రాలేదు. సమయం చూసింది. ఇంకా పది నిముషాలు పడుతుంది.            ఈ కోయిల ముందే కూసిందని తనమీద తానే జోక్ వేసుకుని చిన్నగా నవ్వుకుంది.            సారా గురించి ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా కొత్త ఆలోచన ఆమెలో తళుక్కుమంది. ఒక వేళ సారా తన ఇండియన్ తండ్రితో వస్తున్నదేమో!           ఆ ఊహ రాగానే చాలా థ్రిల్ అయింది.  అలా జరగాలని కోరుకుంది. నేను అనుకుంటున్నట్లు మా ఇద్దరి జన్మకు కారకుడు ఒకరే అయితే.. ?  అప్పుడు నేనేం చెయ్యాలి?            అతన్ని చూడలేదు.  ఏనాడో చూసిన ఫోటో ప్రకారం పోల్చుకోగలను అనుకుంటున్నా..  చూద్దాం.  ఒకవేళ అదే నిజమైతే అతనితో మాట్లాడుతుందా .. తానెవరో చెబుతుందా.. ఆ ఊహే నిష్కల లో ఉత్కంఠ రేపింది. అతను నా జన్మకి కారకుడే కావచ్చు.  కానీ ఏ అనుబంధం, అనుభూతులు లేవు అతనితో.  అతన్ని నాన్న అని అనగలదా?  ఎలా అనగలదు? అతను నా తండ్రి అని ఎలా క్లెయిమ్ చేయగలదు? అసలు సారా అతనికి ఏమని చెప్పి తీసుకొస్తుంది.. నా గురించి చెప్పి ఉంటుందా  అయితే, నన్ను చూడగానే ఆయన ఏమంటాడు? అసలు ఇప్పుడు ఎలా ఉండి ఉంటాడు ? ఊహించడానికి ప్రయత్నించింది కానీ ఆయన రూపం కళ్ళ ముందుకు రాలేదు. కొన్ని క్షణాల తర్వాత మసకమసకగా .. తాను చూసిన ఫొటోల్లోని రూపం.            ఆయన రక్తం పంచుకు పుట్టిన నేను ఒకదాన్ని ఉన్నానని తెలిసి కూడా ఇన్నేళ్ళుగా ఆయన నా వైపు చూడలేదు.  నా ముద్దు ముచ్చట్లు,  బాధ్యతలు ఏవీ అవసరం లేని అతనిని తండ్రి గా ఎలా చూడగలుగుతుంది.?  చూడలేదు. తండ్రి ప్రేమ తెలియ కుండానే,పెరిగిన నాకు ఇప్పుడు ఆయన తెలియాల్సిన అవసరం ఉందా .. ఆయన ప్రేమ అవసరమా ..            మరి ఎందుకు ఆయన కూడా సారా తో రావాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆయన్ని చూడడం వరకేనా? లేకపోతే, ఆయన తోడు లేకుండానే మా అమ్మ నన్ను ఇంత దాన్ని చేసిందని తల్లి గొప్పతనాన్ని చెప్పుకోవాలని, చాటుకోవాలని ఆశిస్తున్నదా? తనకు తాను ప్రశ్నించుకున్నది నిష్కల.            ఒకవేళ, నేను అతనితో మాట్లాడితే అమ్మ ఎట్లా ఫీలవుతుంది.  మా ఇద్దరికలయికను అమ్మ ఆమోదిస్తుందా .. ఆక్షేపిస్తుందా ..? చిక్కు ముడుల వంటి  అనేక ప్రశ్నలు నిష్కల మదిలో సవారీ చేస్తున్నాయి.             తీవ్రంగా ఆలోచిస్తున్న నిష్కల దృష్టి టిష్యూ హోల్డర్ పై ఆగింది.  రివర్స్ నెవర్ గో రివర్స్ సో ట్రై టు లివ్ లైక్ ఏ రివర్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఆల్వేస్ బి పాజిటివ్             ఆ స్లోగన్ నిష్కల ను బాగా ఆలోచింప చేసింది.  మనిషి, నది ఒకటేనా ..? ఎలా ? మనిషిని నదులతో పోల్చుకోవడం సరి కాదేమో ! మనిషికి మెదడు ఉంది.  అది స్పందిస్తుంది . ఆ మదిలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి.  గతాన్ని ఎవరు మర్చిపోగలరు? అది తీపి జ్ఞాపకాలైనా, చేదు నిజాలైనా..              గతాన్ని పోసిటివ్ గా తీసుకుంటే, అది ఒక మంచి ఉపాధ్యాయుడు అని చెప్పు కోవచ్చు. మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. గతాన్ని మర్చిపోవడం కాదు కానీ గతాన్ని, భవిష్యత్ ని కూడా పగ్గాలు వేసి పట్టుకోగలగాలి. అందుకేనేమో గతం నాస్తి కాదు నేస్తం అనుభవాల ఆస్తి అని అంటారు.             గతాన్ని మర్చిపోవడం చాలా కష్టం కూడా.  అందులో ఎంతో బరువైన , బాధ పూరితమైన అనుభవాలు కూడా ఉంటాయి. మనసును భారంగా మార్చేస్తాయి.            నాకు జన్మనిచ్చిన వ్యక్తి ఒకడు ఉన్నాడని నేను ఎప్పుడో మర్చిపోయాను అనుకుంటున్నాను కానీ మర్చిపో లేదని సారా ని చూసిన తర్వాత అర్థమైంది.  అమ్మ పరిస్థితి భిన్నమైంది. ఆమె మర్చిపోగలదా..పూర్తిగా మర్చిపోవడం సాధ్యమా.. కాదు, అని ఖచ్చితంగా చెప్పగలదు.  తాళి కట్టిన వాడితో కలిసి ఉన్నది అతి కొద్ది కాలం మాత్రమే. ఆ కొద్ది కాలంలోనూ మధురమైన క్షణాలు ఉన్నాయో లేదో చెప్పడం కష్టం.  అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా అతను కట్టిన తాళి అమ్మ మెడలో భద్రంగానే ఉంది అంటేనే తనకు జరిగిన పెళ్ళికి,పెళ్లి ద్వారా ఏర్పడ్డ బంధానికి విలువఇస్తున్నదనే అనిపిస్తుంది.  సజావుగా నిలువని బంధం, ఆమె మనసుకు అయిన గాయాలకులేపనాలు పూసుకుంటూ ముందుకు సాగుతున్నది.            గతం ఎప్పుడు మన వెన్నంటి ఉంటూనే ఉంటుంది. జరిగిపోయిన దాన్ని మార్చడం మనకు ఎవరికీ సాధ్యం కానిది. అయితే గతం తాలూకు భారం మనం వర్తమానంలోనూ , భవిష్యత్ లోను మోయకుండా జాగ్రత్త పడాలి. అది సాధనపై చేయగలం. అమ్మ అది సాధ్యం చేసుకుంది. అమ్మ లోపల ఎంత అగాధం ఉందో , ఎన్నిఅగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయో అగుపడనీయదు. ఎప్పుడు నవ్వుతూ ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు చిరునామాగా కనిపిస్తుంది.            నిన్న మొన్నటి సంఘటనలు కాలంలో కలిపేయాలని ప్రయత్నం చేసినా , అవి  గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసంతా కకావికలం అయిపోతుంది.  భావోద్వేగాలకు లోనవడం  జరుగుతుంటుంది ఎవరికైనా. వాటిని విదిలించుకుంటూ ముందుకు వెళ్లడమే సరైంది. మనకి గతం కంటే వర్తమానం, భవిష్యత్తు ముఖ్యమైనవి. అందుకే, చూపు ఈ క్షణం మీద ఉండాలి.  నిన్నలను మార్చలేనట్లే, రేపు ఎలా ఉంటుందో ఊహించలేం కదా ..            నది భవిష్యత్ గురించి ఆలోచిస్తుందా .. వర్తమానంలో తన నడక మీదనే దృష్టి ఉంటుంది అనుకుంట .. అంటే, ఆ క్షణంలోనే జీవిస్తూ ఉంటుంది. నిన్నటిని మరిచి పోదేమో .. కడలి లో కలిసేవరకూ ..            మనం ఈ రోజు, ఈ క్షణంలో బతుకుతూ, నిన్నటి జ్ఞాపకాల అనుభవాలతో రేపటి గురించి ఆలోచించుకోవాలేమో, నిర్మించుకోవాలేమో.. కానీ సాధారణంగా మనిషి ఏ రోజుకారోజు నిన్నటిని తిడుతూ ఉండడం చేస్తుంటాడు . నిన్నటి యాతనలో వేదనలోనే  ఉంటూ ఈ రోజుని బెస్ట్ గా మలచుకోవడం మరచిపోతారు.   బాధాకరమైన గతం మరచి పోనివ్వదు. వెంటపడి వేటాడుతూనే ఉంటుంది. నిన్నటిని పాజిటివ్ గా మలుచుకుని  మనం శక్తి పుంజుకోవాలి. సానుకూల దృకథంలో ఉండాలి.  అది అమ్మ చేస్తున్నది.   లోక జ్ఞానం ఎరుగని అమ్మ చిన్న వయసులో ఎలా ఈ విధమైన పరిపూర్ణత సాధించ గలిగిందో.. అందుకోసం ఎంత సాధన చేసిందో.  ఎంత యాతన పడిందో .. ఏదేమైనా అమ్మ చాలా గొప్పగా కనిపిస్తున్నది.             అమ్మలాగా, గీత లాగా దగా పడిన యువతులు ఎందరో ఉంటారు.  గతం నుండి నీటిలోకి ప్రవహించడం, భవిష్యత్ కి మార్గాలు పరుచుకుంటూ ముందుకు పోయే అమ్మలు ఎందరు ఉంటారు?            తల్లి అయిన ఒంటరి మహిళకి జీవితం నేర్పిస్తుందా! జీవితాన్ని పునర్ నిర్వచించుకున్న, పునర్ నిర్మించుకున్న జీవితాలను నలుగురికి తెలియజేయాలి. ఆ జీవితాల సానుకూల సంఘటనలు భావోద్వేగాలు , ఎక్స్ప్రెషన్  వారికే కాదు ఎదుటి స్త్రీలకు యువతకు శక్తినిస్తాయి. సంతృప్తి ని, సంతోషాన్నిస్తాయి ఉత్ప్రేరకాలవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టార్చ్ లైట్ అవుతాయి.            నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ భావోద్వేగాలు బాధను కలిగిస్తాయి, భయాన్ని, అనిశ్చితిని, అసహ్యాన్ని,  ఆలోచన లేమిని కలిగిస్తాయి. మన రోజువారీ జీవితంలో ఈ భావనలపై మన సరదాలు , సంతోషాలు , అభిప్రాయాలు, ఆలోచనలు, మన సామర్ధ్యాలు , ప్రదర్శనలు, మన పనితీరు ఆధారపడి ఉంటాయి. ఏదో విధంగా మన గతం మన భావి జీవితాన్ని ప్రభావితం చేస్తూవుంటుంది. గతంలోకి తొంగి చూడటాన్ని జీవితంలో వెనక్కి పోతున్నట్టు అనుకోకూడదు.           నది ఎప్పుడు తన మార్గంలో తాను పోతూ ఉంటుంది . ఒక్కోసారి కొత్త మార్గాలు తయారు చేసుకుంటూ పోతుంటుంది . జీవితమూ అంతేగా ..!           అవును, అంతే.            అమ్మ జీవితంలో ఒకసారి పడిపోతే .. పడ్డామని ఏడుస్తూ కూర్చుందా.. లేదు, అవకాశాలను సృష్టించుకుంది.  దాన్ని అందంగా ఆనందంగా మార్చుకోగలిగింది. ఆ క్షణంలో అమ్మ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే చాలా ఎత్తులో ఉన్నట్టు తోచింది నిష్కలకి .            ఆ మరు క్షణం లో ఆమె క్లయింట్లు కళ్ళ ముందు మెదిలారు.  వాళ్ళ మొహాల్లో కనిపించే వేదన, వ్యధ చూసి వాళ్ళతో,  ఒకసారి పడిపోతే, ఒక మార్గం మూసుకుపోతే బాధపడటం కాదు మరో మార్గం కోసం అన్వేషించాలి . చుట్టూ ఉన్న అడ్డంకులు , ముళ్ళ దారులు అన్నీ తొలగించుకుంటూ నీ లక్ష్యాన్ని చేరుకోగలవు అని ధైర్యం చెబుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి యత్నిస్తుంది నిష్కల.            గతం మనని గట్టిపరుస్తుంది. వ్యక్తిగా నిలబెడుతుంది అనుకుంటూ కానీ చివరి సిప్ తీసుకుంది.  కాఫీ మగ్ పక్కన  పెట్టి టిష్యూ తీసుకుంటూ మళ్ళీ టిష్యూ హోల్డర్ పై ఉన్న అక్షరాల కేసి చూసింది.  ఒక చిన్న కోట్ తనలో కొత్త ఆలోచనలు రేపింది. నిన్న, మొన్న అని కాదు.            మంచి రోజులు సంతోషాన్నిస్తాయి. చెడ్డ రోజులు అనుభవాన్ని మిగులుస్తాయి.  అధ్వాన్నమైన రోజులు పాఠాలు నేర్పుతాయి. చాలా మంచి రోజులు జ్ఞాపకాలుగా మిగులుతాయి. ప్రతిరోజూ కొన్ని పాఠాలు  మోసుకొస్తుంది. మనం గుర్తించి ఏరుకోవాలి. అంతే అని మనసులో అనుకుంటూ గుమ్మం కేసి చూసింది నిష్కల ముఖం విచ్చుకుంది.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.