సహజ పరిమళాల స్పర్శవేది

(ఎంవీ రామిరెడ్డిగారి కథలు “స్పర్శవేది” పుస్తక సమీక్ష )

   – స్వర్ణ శైలజ

సాధారణంగా ఏదైనా పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతుంటే అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తాయి.పేజీలు పేజీలు ముందుకు సాగిపోతాయి. అది సాధారణంగా జరిగే విషయం.

అయితే కొన్ని అక్షరాలు మాత్రం అందమైన ఏదో సూత్రంతో కట్టుబడి మనసును కూడా తమతో కలుపుకుని ముందుకు నడిపిస్తాయి. కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.అలాంటి మంచి కథల సమాహారం ఎమ్వీ రామిరెడ్డి గారి “స్పర్శవేది” కథా సంపుటి. సృజనాత్మకత, వాస్తవికతల కలనేతలు ఈ కథలు. ఈ పుస్తకం చేతిలోకి తీసుకోగానే ముందుగా ఆకర్షించేది ఈ సంపుటికి పెట్టిన అందమైన పేరు…” స్పర్శవేది”.

అయితే వెంటనే నిఘంటువు కోసం వెతుకుతాము. స్పర్శ చేత ఏ లోహాన్నైనా బంగారంగా మార్చే ప్రక్రియ… అని అర్థం తెలియగానే ‘అబ్బా ఎంత చక్కని పేరు’ అనుకుంటాము. పుస్తకం అంతా చదివేసాక ‘కథలన్నిటినీ కలిపే అంతస్సూత్రంలా పేరు ఎంత బాగా కుదిరింది!’ అని ఆశ్చర్యపోతాము.

పదహారు కథల ఈ సంపుటి లో ఐదవ కథ పేరు స్పర్శవేది. అయితే అన్ని కథలకు ఈ పేరుతో అవినాభావ సంబంధం కనబడుతుంది .

కథల్లో పాత్రలన్నీ సామాన్యంగా కనబడుతూ, మన చుట్టూ తిరుగుతున్న వ్యక్తులే… కాకపోతే ఆ సామాన్యుల్ని మాన్యులుగా మార్చింది వారి సేవాభావం. మామూలు లోహాలు కూడా స్పర్శచేత బంగారం గా మారినట్టు…మానవతా మూర్తులు చీకటి కోణాలకి వెలుగు పార్శ్వాలు అలంకరించారు.

అయితే ఏదో మంచి చేసేయాలి అన్న సంకల్పంతో ఏ పాత్ర ప్రవర్తించినట్లు కనబడదు. అది తమ సహజ గుణం అన్నట్టుగానే ప్రవర్తిస్తాయి. అదే తమ జీవనశైలి అన్నట్టు… కర్త కర్మ క్రియ ఒకటై నడిపించిన సేవా దృక్పథం.

అందుకే ఈ కథల్లో ఎవరూ తామేదో అవతలి వారిని ఉద్దరిస్తున్నామని అనుకోరు; అది తమ కర్తవ్యం అనుకుంటారు అంతే. ఈ లక్షణం కథల్లోనే కాదు… రచయిత ఎమ్వీ రామిరెడ్డి గారిలోనూ నేను గమనించాను. ఆయన మనస్తత్వం తన కథల్లో ప్రతిఫలించిందేమో!

ఆయన ఉన్నత భావాలు, సమాజం పట్ల తాను చూపిస్తున్న బాధ్యత… పదిమందికి సహాయం చేయాలనే సత్‌సంకల్పం …కథాంశాలను ఎన్నుకోవడంలోనూ… కథలను నడిపించడంలో…సంభాషణలలోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది.

కొన్ని కథలు చదువుతుంటే ఎక్కడా ఆపకుండా చకచక కళ్ళు పరుగులు తీస్తాయి. ఉత్కంఠ పెంచుతాయి. ముగింపు ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పుస్తకం చదవడం పూర్తవగానే ఆ కథలు మర్చిపోతాం. అయితే ఈ కథలు అలాకాదు. అందుకు భిన్నం. ప్రతి వాక్యం మనసుని కదిలిస్తుంది. కథాంశాన్ని తనలో ఇముడ్చుకొని శ్రద్ధగా… నెమ్మదిగా చదివేలా చేస్తుంది. అంతా పూర్తయి పుస్తకం మూసేసినా ఆ కథలు మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆలోచనల్లో కలకాలం ఒక దృశ్యకావ్యంలా మిగిలిపోతాయి. ఎన్నిసార్లు చదివినా ఏవేవో కొత్త అర్థాలు స్ఫురిస్తూ…కథంటే వసంతంలోనే మనసును రంజింపజేసే కోయిల గానంలా కాక…హృదయ లయల మీద పలికించే జీవన నాదంలా వుండాలి అని బోధిస్తున్నట్టుగా అన్ని కథలూ వున్నాయి.

ఈ కథా సంపుటి పదహారు కథల సమాహారం. అందులో నాకు బాగా నచ్చిన కథ “నాగలి గాయాల వెనుక”… అసలు ఊహకి అందని ముగింపు… నిజాయితీగా ఉన్న ముగింపు. మనం రోజూ దినపత్రికల్లో టీవీలో రైతన్న కన్నీటి కథలు… ఆత్మహత్యలు… దళారీల మోసాలు… అందని ప్రభుత్వ సాయం… కరుణించని ప్రకృతి… ఇలా ఎన్నో కష్టాల మధ్య అప్పుల పాలవుతూ… ఆర్థికంగా చితికిపోయిన రైతుల గురించి ఎన్నో కథనాలు వింటూ ఉంటాం. చూస్తుంటాం. ఈ కథలో రచయిత ఆ సాధకబాధకాల వెనుక ఉన్న కారణాలను చక్కగా కథలో చూపించారు. ప్రతిజ్ఞ చేసిన యువకుడిని గెలిపించి, కథకి సామాన్యమైన ముగింపు ఇవ్వలేదు. నిజాయితీగా ఆ యువకుడిని ఓడించి కథని గెలిపించారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలతోనే ముగింపు నివ్వడం అద్భుతంగా అనిపించింది. ఆ ముగింపు కథకి ఆయువుపట్టుగా అనిపించింది.

ఆ తరువాత

“మాధవ సేవ”, “యాసిడ్ టెస్ట్”, “మరణానికి అవతలిగట్టు”, “అరుణారుణం”,”కురుక్షేత్రం”, “శ్రీమంతులు”, “షకీలా మరణం”… మనసును కట్టిపడేసాయి.

అయితే ‘మాధవ సేవ’ కథ లో భర్తతో వచ్చిన తన కూతుర్ని గుర్తు పట్టకపోవడం’ శ్రీవిద్యా! బాగా లావు అయినట్టు ఉన్నావ్ ఏమైనా విశేషమా’ అని తల్లి అడగడం కొంచెం అసమంజసంగా అనిపించినా మానవతా విలువలకు పెద్దపీట వేసి చక్కని కథాంశంతో నడిపించారు రచయిత ఈ కథని.

‘మరణానికి అవతలిగట్టు’ కథ ప్రారంభంలో కిషోర్ చేతులు కంప్యూటర్ కీబోర్డ్ కు బందీలై పుష్కరం దాటుతుంది అంటూ మొదలుపెట్టి, చివర్లో కీబోర్డ్ సంకెళ్లు తెంచుకున్న చేతులు…సేవ చేసే చేతులు అంటూ కవితాత్మకంగా ముగింపు పలికారు. ‘అవును కదా! ఇలా కూడా చేయొచ్చు కదా’! అని ఆలోచింపజేసే కథ.

అలాగే ఈ కథాసంపుటి లో నన్ను చాలా ఆకర్షించిన అంశం కథ కు పెట్టిన పేర్లు… కథాంశం అంతా ఒకే ఒక పదంలో అందంగా పొదిగినట్టు రచయిత ఎంచుకున్న పేర్లు.. అరుణారుణం… కురుక్షేత్రం… నాగలి గాయాల వెనుక… గుండె చెరువై… యాసిడ్ టెస్ట్.
అలాగే పుస్తకం మొదట్లో కథాక్రమం బదులుగా కథాస్పర్శ అనడం రచయిత సృజనాత్మకతకు అద్దం పట్టింది.

‘సంకెళ్లు తప్ప’అన్న కథలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి అన్యాయాన్ని ఎదిరించాలి అని టింకూ పాత్ర చేత చెప్పించడం బాగుంది.

నాకు బాగా నచ్చిన కథల్లో ‘కురుక్షేత్రం’ ఒకటి. హెయిర్ ఫర్ హోప్ స్వచ్ఛంద సంస్థ కీమోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లకు చేస్తున్న సహాయం గురించి ఈ కథలో రచయిత చాలా చక్కగా వివరించారు. అందరూ చదివి తెలుసుకోవడమే కాకుండా తమ వంతుగా ఇలాంటి సహాయం ఎలా చేయొచ్చో వివరంగా తెలియజేసారు.
అలాగే ప్రతీ కథ ప్రారంభంలోనూ మధ్యలోనూ చమక్కుమని మెరుపులు మెరిసినట్టు చక్కని అలంకారిక వాక్యాలు అందించారు.

‘దుర్భర గతం గాలిలో గంధకంలా తేలి వస్తోంది’
‘విటుడి వికృత చేష్టలా గుంట లోని నీరు ఆమె ఒంటి మీద చిమ్మింది.’
‘మనస్తీరం వెంట గాయాలు కవాతు చేస్తున్నాయి’.
‘వాయుగుండాల్ని మాత్రం తీరం చేర్చలేకపోయింది’.
‘వెలుతురు సెలైన్ తాగి చీకటి వ్యాధి వైతొలగుతుంది’.
‘మానవ స్పందనలిపుడు మారణాయుధాలు’.
‘వెలివేతకు గురైన వెలయాలి వేదన లాంటి చీకటి….’

ఇలా ఎన్నో అర్థవంతమైన వాక్యాలు మనసుని గెలుచుకున్నాయి… కథాగమనానికి జ్యోతులు పట్టాయి.

కేవలం కక్ష తీర్చుకోవడమే ముగింపు గా వున్న “కుఛ్ తో హై” కథ ఈ సంపుటిలో యిమడలేదని అనిపించింది.

ఈ సంపుటిలో పదకొండవ కథ అరుణారుణం. భారతీయ జనతా యువమోర్చా వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొంది ‘ఊపిరి పూలు’ సంకలనంలో చోటు చేసుకుంది. తనకు అపకారం చేసిన భ్రమరాంబ కరోనాతో ఆసుపత్రిలో చేరితే మంచి మనసుతో ఆమెను క్షమించి, బిఎస్సీ నర్సింగ్ చదువుతున్న అరుణ చూపించిన ఔదార్యాం మనసుని హత్తుకుంటుంది.

మంచి పనులు చేయడం అలవాటుగా మారితే అది చెడు వ్యసనాలను కూడా దూరంగా నెట్టేస్తుంది… సేవ చేయడంలో పొందిన ఆనందం, సంతృప్తి ముందు ఏ వ్యసనం నిలబడలేదు అని ‘శ్రీమంతులు’ అన్న చిన్న కథలో రచయిత తన పాత్రలతో చెప్పించి మెప్పించారు.

ఈ కథాసంపుటిలో చివరి కథ ‘షకీలా మరణం’. ఈ కథకి ఆయువుపట్టు దీని ముగింపే అని అనిపించింది. చాలా చక్కని సందేశంతో ముగింపు వాక్యాలు ఇచ్చారు.

ఇలా స్పర్శవేది ఈ కథా సంపుటి లో ప్రతి కథ ఒక ఆణిముత్యమే.

పడి లేచే కెరటం స్ఫూర్తి…ఒదిగి,ఎదిగే అంకురం దీప్తి…అవమానాలు, అవహేళనలు లెక్కించక గమ్యం వైపు నడిచే ఆత్మస్థైర్యం… మొక్కవోని ధైర్యం … అన్నిటికీ మించి పరోపకారమే పరమావధిగా ముందుకు నడిచే సేవాతత్పరత…’కథంటే ఎదలో తలెత్తిన నవనవోన్వేష ఆలోచనాంబుధి’అనుకున్నారేమో రచయిత. అందుకే ప్రతి కథాంశం చేత ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పాఠకుల పాత ఆలోచనా విధానాన్ని తన అక్షర స్పర్శ చేత బంగారంగా మార్చే నిజమైన స్పర్శవేది ఈ కథాసంపుటి.

ఎక్కడా ఒక్క అక్షర దోషం లేకుండా…అతి సామాన్యమైన సంభాషణలతో రోజూ చూస్తున్న వ్యక్తులే మన ముందుకు వచ్చి తమ కథల్ని చెబుతున్నారా! అనిపించే స్పర్శవేది కథాసంపుటిని సాహితీ ప్రేమికులంతా తప్పక చదివి తీరాలి.

*****

Please follow and like us:

3 thoughts on “సహజ పరిమళాల ‘స్పర్శవేది’ – ఎంవీ రామిరెడ్డి కథలు పుస్తక సమీక్ష”

  1. ఏ అంశం అయినా , రామి రెడ్డి గారి స్పర్శ తో సమాజం పట్ల బాధ్యతను, సేవను ఆవిష్కరిస్తుంది. చాల చక్కటి సమీక్ష. కొన్ని కథ లలో, అంత
    కన్విన్స్ కానివి కూడా చెప్పటం నిజాయితీ తో కూడుకున్న సమీక్షకు నిదర్శనం.
    రామిరెడ్డి గారికి & స్వర్ణ శైలజ గారికి అభినందనలు !!

  2. సమీక్ష చాలా బాగుంది అండి.
    నేనూ ఈ సంపుటిని చదివాను.
    మీ సమీక్ష చదివాక మరలా నెమరువేసుకున్నాను.
    మనసుకు హత్తుకునే కథలు.
    రచయిత శ్రీ.ఏమ్వీ రామిరెడ్డి గారికి, స్వర్ణ శైలజ గారికి అభినందనలు.

  3. రామిరెడ్డి గారి కథలంటే మానవసంబంధాలను ప్రతిబింబిస్తూ మనసును హత్తుకునేటట్టుగా ఉంటాయి. ఆయన కథలను అందుకు తగినట్టుగా చక్కని సమీక్ష చేసారు స్వర్ణశైలజ గారూ! రామిరెడ్డి గారికీ మీకూ కూడా అభినందనలు!! 💐💐💐

Leave a Reply to Dondapati Krishna Cancel reply

Your email address will not be published.