రాగో

భాగం-29

– సాధన 

పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. –

దార్లో ఇక ఆ ఊసులొద్దని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ కూడ మళ్ళీ – మళ్ళీ గాండోయే నిన్నటి దాడి విషయం ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. క్లోమోర్ మైన్ పేలినపుడు చెవులు ఎలా చిల్లులు పడ్డాయో జైని యాక్షన్ తో సహా చెప్పుతుంటే, జమేదారుగాడు నాలుక వెళ్ళబెట్టి గుజ్జల్లులా ఎలా పడిపోయాడో టుగె చేతులు, కాళ్ళు తిప్పుతూ భయంకరంగా వర్ణిస్తున్నాడు.

చకచక సాగిపోతున్న నలుగురు తటాలున జైని ‘ఉఫ్!’ అంటూ చప్పుడు చేయొద్దన్న సైగతో సడెన్ బ్రేక్ పడ్డట్టు ఆగిపోయారు. జైని అటు వేలు చూపడమే తరువాయి కొత్త తుపాకి ‘థాం’ అని పేల్చాడు ఊళ్లే..

“ఆఁ! పడిపోయింది” అని ఎగిరాడు టుగె.

పడ్డట్టు పడి లేచి ఉరుకుతుంది కొండగొర్రె. ఒక్క ఉదుటున అక్కడికి పరుగెత్తిన నలుగురికి దారకట్టిన రక్తం కంటపడింది.

“తాకింది తాకింది దూరం పోలే” అంటూ వెనక్కి చూడకుండా పరుగందుకున్నాడు టుగై.

“మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాం” అంటూ ఊల్లే కూడ ఆగకుండా పరిగెత్తాడు.

ఐదు నిముషాలు గడిచేసరికి గాండోలో విసుగు ప్రారంభమైంది. ‘ఎక్కడ తాకిందో ఏమిటో. అది అడవిలో పడితే దొరుకుడు కష్టమే’ అనుకుంటూ వాచి చూసుకొని ‘కూ’ అంటూ పెద్ద కేక వేశాడు. పక్కకు తిరిగి చూసేసరికి జైని కూడ మాయమైంది.

20 నిముషాల తర్వాత ముగ్గురు కామ్రేడ్స్ కొండగొర్రె కావడి మోసుకుంటూ వచ్చారు.

“తిరిగి వచ్చేటప్పుడు తీసుకపోదాం. తొందరగా దీన్ని ఇక్కడే పెట్టండి. అపాయింట్మెంట్ కి టైం సరిపోదు. ఉరకాలి” అని గాండో చెప్పడంతో కొద్దిగా లోపలికి పోయి పంచొక్కపు పొదల్లో బండల నడుమ పెట్టి ఈగలు వీపు పెట్టకుండా కళ్ళింగ ఆకులు నాలుగు కప్పారు ఉల్లె, టుగె, జైనిలు.

టైం సరిపోదని గాండో హెచ్చరిస్తుంటే ఆ నలుగురు ఉరుకులు పరుగులుగా ముందుకు కదిలారు.

***

          గిరిజ ఫకీర్లతో సహా సీదో, మిన్కోలు గొర్రెచుట్టు చేరి “ఇది ఆడా! మగా” అని ఒకరు “చూడు, చూడు ఇక్కడ పొట్టలోనే తగిలిందని” ఒకరు కిలకిల మంటూ హడావిడి చేస్తున్నారు.

పలకరింపులైపోయాయి. దాడిలో దొరికిన ఎస్.ఎల్.ఆర్.ను కాక్ చేసి చూస్తూ ముచ్చట్లు పెడుతున్న డివిజనల్ కమిటీ సెక్రటరీ “తొందరగా కోయండి పేగులు తీయకుంటే చెడిపోతుంది” అన్నాడు.

“రెండ్రోజుల వరకు ఏం డోఖాలేదు” అంటూ డుంగ కోత కార్యక్రమం కానిస్తున్నాడు.

వంట బ్యాచిని రుషి హడావిడి చేస్తున్నాడు.

“ఎప్పుడు అసలు టైంకే వస్తాడు వినోదన్న” అంటూ డివిసిఎస్ ను బనాయిస్తుంది సీదో.

“స్పెషల్ రెండు వాటాలు ఇస్తాం కానీ కొత్త తుపాకులు మాత్రం మా దళానికే ఉండాలన్నా” అంది మిన్కో.

“కానియ్యండి, కానియ్యండి పొద్దుపోవచ్చు” అంటూ దళాన్ని హుషారు చేసి, రుషి వినోదును తీసుకొనిపోయి దూరంగా కూచ్చున్నాడు.

“భోజనాలు అయిన తర్వాత మీకు బయటి వార్తలు చెప్పాలంటే ఇపుడే కూచోవాలి. నేను చెప్పినంత సేపు ఎవరు కునకడానికి వీల్లేదు. అలా అయితేనే చెప్పుతా. రేపు పొద్దున మీటింగ్ మాత్రం ఈ విషయాలు అడగొద్దు” అంటూ వినోదు కాసేపు అందరిని ఆట పట్టించాడు.

“నేను సెంట్రీ నుంచి వచ్చే వరకు మాత్రం చెప్పడానికి వీల్లేదు” అంటూ డుంగ “లేకపోతే నా సెంట్రీ అయినా మార్చండి” అన్నాడు.

“చూశారా! మరి వార్తలు చెప్పడం కుదరదు. ఆ తర్వాత మీ కమాండరే చెప్పుతాడు” అన్న వినోదు “మన మీటింగ్ రేపు పెట్టుకుందాం” అంటూ సెల్ మీటింగ్ని జరుపు కుందామని గాండో, గిరిజ, జైని, రుషిలతో నడిచాడు.

***

          ఉదయాన్నే దళ సమావేశం ప్రారంభమైంది.

“కామ్రేడ్స్,

ఈ రోజు మావో వర్థంతి. మహోపాధ్యాయుడు మావోకు నివాళులు అర్పిస్తూ మన అమరవీరులందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నిమిషం మౌనం పాటిద్దాం” అని వినోదు ప్రకటించగానే అందరు లేచి నిలుచున్నారు.

రుషి అటెన్షన్ చెప్పాడు. –

‘అమరవీరులకు జోహార్లు!

‘అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం!!

‘మార్క్సిజం – లెనినిజం – మావో ఆలోచనా విధానం ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి!

“నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి!’

‘ఉత్తర తెలంగాణా దండకారణ్య రైతాంగ ఉద్యమాలు వర్ధిల్లాలి!’

‘పోరాడేవానిదే ఎర్రజెండా!!

నినాదాలలో ఆ ప్రదేశమంతా కాసేపు దద్దరిల్లింది. అందరూ తిరిగి సర్దు క్కూచున్నాక రుషి ప్రారంభించాడు.

“కామ్రేడ్స్,

మన ఉద్యమంలో త్వర త్వరగా వస్తున్న మార్పుల గురించి, అందుకనుగుణంగా మన డివిసి తీసుకుంటున్న నిర్ణయాల గురించి మన దళానికి స్వయంగా చెప్పడానికే వినోదన్న వచ్చాడు. కనుక మన సమావేశంలో అదొక్కటే ఎజెండా. మన మిగతా ఎజెండా అంతా తర్వాత సమావేశంలో మాట్లాడుకుందాం” అంటూ ప్రారంభించమన్నట్టు వినోద్ వైపు చూశాడు

“కామ్రేడ్స్,

ముందుగా పోలీసుల మీద అంబుష్ ను విజయవంతంగా నిర్వహించినందుకు మన డి.సి. తరుపున మీ అందరికి రెడ్ శాల్యుట్స్. చాలా క్లిష్టమైన సమయంలో మన ఫారెస్ట్ ఉద్యమానికి ఆయుధాలు సంపాదించడమేగాక ఉద్యమం ఒక మలుపు తిరగబోతున్న కాలంలో శత్రువు చొరవను దెబ్బ కొట్టడంలో మీరు చేసిన అంబుష్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరందరు చూపిన ధైర్య సాహసాలకి, ఉత్సాహానికీ మిమ్ముల్నందరిని మరోసారి అభినందిస్తున్నాను.

పెచ్చు పెరిగిపోతున్న పోలీసు నిర్బంధం గూర్చి మీకు తెలుసు. శత్రువు చాలా కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నాడు. విపరీతమైన బలాల్ని దించుతున్నాడు. ఆవిషయాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలుపుతూనే ఉన్నాము.

మారే పరిస్థితులకు తగినట్టు కొత్త కర్తవ్యాలు చేపట్టడానికి మనం ఎప్పుడూ తయారుగా ఉండడం, కొత్త బాధ్యతలు నిర్వర్తించడానికి ఎప్పటికప్పుడు తగిన తర్ఫీదు పొందడం అన్నింటి కంటే చాలా ముఖ్యం. ఆ దృష్టితోనే మన ఫారెస్ట్ కమిటీ మిలట్రీ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆయుధాలు, తర్పీదు కూడ మెరుగుపర్చడానికి సైనిక విషయాలు బోధించే పత్రికలు – పుస్తకాలు అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మన జ్ఞానం, పరికరాలు, ఆయుధాలు పెరుగుతున్న కొద్దీ మన కర్తవ్యాలు ఇంకా ఎక్కువగా కావాలనే డిమాండు కూడా పెరగడం సహజమే. ఉద్యమం రోజు రోజుకు పెరుగుతున్న దాని ఫలితమే ఇవన్నీ.

ఫారెస్టు ఏరియాలో కూడా ఆదివాసీ సంఘాలు, పార్టీ సెల్స్, గ్రామ రక్షక దళాలు ఊరూర పెరుగుతుండడం మీకు తెలుసు. వీటిని ఇంకా అన్ని గ్రామాలకు వ్యాపింప జేయాలి. ఉన్నవాటిని ఇంకా బలంగా పని చేయించాలి. యువకులందరికీ మిలట్రీ తర్ఫీదు అందించాలి.

మన ఉద్యమ ప్రభావం చాలా దూర ప్రాంతాలకు విస్తరించింది. ప్రజానీకంలో చాలా ఉత్సాహం వస్తుంది. మొత్తంగానే పీడిత ప్రజానీకంలో మిలిటెంట్ తత్వం పెరుగుతూ ఉంది. పెరుగుతున్న ఈ విప్లవ పరిస్థితికి అనుగుణంగా మన నిర్మాణం విస్తరించి బలపడాల్సిన అవసరం ఈ రోజు మనముందుంది.

దళం దగ్గరి నుండి ఎఫ్.సి. వరకు అన్నీ ఈ కర్తవ్యాల కనుగుణంగా ఇంకా పటిష్టం గావాలి. మనలో ప్రతి ఒక్కరం కొత్త బాధ్యతలని చొరవతో స్వీకరిస్తూ కష్టపడి పని చేస్తేనే ఈ కర్తవ్యాలు పూర్తి చేయగలుగుతాం. ఆ స్పిరిట్లోనే మీ దళానికి అప్పగించిన అంబుష్ ను విజయవంతంగా పూర్తి చేసి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం.

మన డివిసిలోకి మరో సభ్యుణ్ణి కొత్తగా కో-ఆఫ్ట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. మీ కమాండర్ కా॥ రుషిని డివిసి కోఆప్ట్ చేసుకుంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్న మొదటి విషయం” అంటూ వినోద్ ఆపే సరికి అందరి చూపులు రుషి మీద నిల్చాయి.

“రుషన్న డివిసికి వెళ్ళినా మా దళంలోనే ఉంటాడు కదా” అన్నారు ఒకేసారి సీదో, ఫకీరలు.

“ఆం! ఆఁ! ఆ విషయానికి వస్తున్నాను. మీ దళంతోనే ఉండాలా, మీ కమాండర్‌గా కూడ అతనే ఉండాలా”! అంటూ రెండో విషయానికి ఉపోద్ఘాతం ప్రారంభించాడు వినోద్.

“ఆయన ఏ దళంలో ఉంటాడన్నది తర్వాత ప్రశ్న. రుషిని డి.వి.సి.లోకి తీసు కున్నాక కమాండర్ ఎవరన్నది ముందు తేలాలి” – వినోద్.

“డివిసి అది కూడ అనుకునే ఉంటుంది కదా. చెప్పండి” అన్నాడు ఫకీర.

“అదెలాగు చెప్పుతాం కానీ మీ అభిప్రాయాలు చెప్పండి ముందు” అన్నాడు వినోద్.

ఎవరూ మాట్లాడలేదు.

“ఊం! ఊఁ! చెప్పండి. మీరే మాట్లాడాలి” అని మళ్ళీ గుర్తు చేశాడు వినోద్.

అందరూ గాండో వైపు చూస్తున్నారు.

“మాలోంచే అయితే కా॥ గాండోయే మా నెక్స్ట్ కమాండర్” అని గిరిజ సైలెన్స్ బ్రేక్ చేసింది.

“ఏమంటారు! మీ అందరికి ఇష్టమే కదా” అని వినోద్ అనేసరికి రెండో ఎజెండా ముగిసిపోయింది.

“మరి డిప్యూటీ సంగతి కూడ చెప్పండి” అన్నాడు రుషి.

అడిగిందే తడవుగా “గిరిజక్కా” అంటూ కోర లాగా వచ్చింది సమాధానం.

“వెరీగుడ్ కామ్రేడ్స్! మీ దళం అందరు కూడా సరిగ్గా డివిసి నిర్ణయాలనే ప్రతిపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. గాండో, గిరిజలు ఈ దళాన్ని రుషి ఉన్నప్పటిలాగే బాగా నడపగలరని మాకు నమ్మకం ఉంది. ఎప్పటిలాగే మీరంతా గట్టిగా పని చేయాలి.”

“ఇక ఆయుధాల సంగతి. ఉత్సాహం కొద్దీ మీరు అన్నారు గానీ ఎవరికి దొరికిన ఆయుధాలు వాళ్ళవే అనేది పార్టీ పద్దతి గాదని మీకు కూడా తెలుసు. ఎఫ్.సి.తో సంప్రదించి ఎక్కడ అవసరమైతే అక్కడికి పంపుదాం. మీ దళానికి మంచివి ఉంచాకే తక్కినవి తీసుకుంటాం.”

“ఆయుధాల్లాగే అవసరాల రీత్యా కామ్రేలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అవసరం. మీ దళం నుండి ఒక డిప్యూటీ కమాండర్ బయటకు రావాలి” అని నవ్వుతూ ఊరుకున్నాడు వినోద్.

“అందరిని ఒకేసారి మారిస్తే ఎట్లా? గిరిజక్క ఇక్కడే ఉండాలి” అన్నాడు డుంగ.

“నేనూ అదే అనుకుంటున్నాను” అన్నాడు గాండో.

రుషి ఏదో అనబోయి ఆగిపోయాడు. ఆతృతగా రుషి ముఖంలోకి చూస్తున్న సభ్యులందరు ‘కమాండర్ కు కూడ తెలియదా! అయోమయంలో ఉన్నాడ’నుకున్నారు.

“జైనక్కకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కొద్ది రోజులే అయింది కానీ విస్తరణలో భాగంగా పోతున్న కొత్త ఏరియాకి జైనిని డిప్యూటీగా పంపాలని డివిసి అనుకుంటున్నది. మీ అభిప్రాయం ఏమిటి?” అంటూ వినోద్ అసలు విషయం బయటపెట్టాడు.

“నేను అంతటి బాధ్యతలు చేయలేనేమో” అంటున్న జైని మాటలు “మా అందరికి ఇష్టమే” అన్న సభ్యుల కోరస్ లో మునిగిపోయాయి.

“జైనక్క డిప్యూటీగా చేయగలదు. కానీ కొత్త దళానికి పంపడమే మరోసారి ఆలోచించాలి. తెల్సిన వాళ్ళు ఉండి గైడ్ చేస్తే జైని బాగానే చేయగలదు” అంది గిరిజ.

“ఆ సంగతి డివిసి దృష్టిలో ఉంది. మీరు జైనిని మాకు వదలి పెట్టండి” అంటూ నవ్వుతూ ముగించాడు వినోద్.

కనుబొమ్మలు చిట్లించి ఆలోచిస్తున్నట్టున్న రుషి ముఖం చిరునవ్వుతో వెలిగింది.

“లేద్దామా” అంటూ వినోద్ లేవగానే తెలుగు – మాడియాలో అంతర్జాతీయ గీతం పాడారు.

రుషి, గాండో భుజం పై చేయివేస్తూ “సాయంకాలమే విడిపోవడం. మనం అపాయింటుమెంట్లు పెట్టుకోవాలి. అందరిని సర్దుకోమని చెప్పు” అంటూ అందరు భోజనాలకు నడిచారు.

వీడ్కోలు చెప్పడానికి దళం అంతా లైన్లో నిలబడింది. కొత్త కమాండర్ గాండో వరసలో ముందు నిలబడి “సావధాన్” అన్నాడు.

వినోద్, రుషి, జైని, కర్ప, డుంగ దళం దగ్గర సెలవు తీసుకోవడానికి ఎదురు లైన్లో నిలబడ్డారు.

వినోద్ వరుసగా షేక్ హాండ్ యిస్తూ కదులుతుంటే గిరిజ మాత్రం రుషి, జైనిలను కన్నార్పకుండా చూస్తూ రాగోను గుర్తు చేసుకుంటుంది.

“సబ్బెటోరుకు లాల్ సలాం” (అందరికి లాల్ సలాం) హోరు మధ్య ఆ అయిదుగురు కదలిపోతుంటే బోరు చివర నిలబడి దళం వాళ్ళు బాట మలుపు తిరిగే వరకు చేతులూపుతూనే ఉన్నారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.