బతుకు చిత్రం-24

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

          పండుగ సంతోషంగా జరుపుకుని అత్తగారి ఊరు చేరిన జాజులమ్మ సమయం చూసి
ఈర్లచ్చిమికి కమల విషయం చెప్పింది.

          ఈర్లచ్చిమి కూడా చాలా బాధ పడింది. ధనబలంతో చెలరేగి పోతున్న ఆ కామందు పైన ఎందుకు తిరుగాబడకూడదు? మరోకరికి కూడా ఇలాంటి అవమానం జరుగకుండా ఎందుకు అడ్డుకోకూడదు? అని ధైర్యాన్ని నూరిపోసింది.

          జాజులమ్మకు మాత్రం తెలియని భయం. వాడు పగబట్టి మరేదైనా చేస్తే తనూ తన
పిల్లలు అన్యాయం అవుతామని ఏమీ మాట్లాడలేక పోయింది.

          జాజులూ!ఏమిటే ? ఏదో సోచాయిన్చుతున్నావెందే? నేను చెప్పింది చెవుల
వట్టిందా? లేదా? అన్నది.

          అదిగాదత్త! నువ్వు సేప్పిన్నట్టు నేను నా దోస్తు కోసం వానితోటి కొట్లాటకుపోతే నా జీవితం సుత అన్యాయం అవుతదేమోనని భయమైతాంది.

          పగబట్టిన పాము కరువక మానదన్నట్టు వాడు తేలిసినక గాదె పని జేత్తడు.

          మరి తెలిసి నన్నెట్ట పురమాయిన్చుతున్నావ్ అత్తా !

          పిచ్చితల్లీ ! నీ లాంటి అమాయకుల కోసమే సర్కారోల్లు ఆడవాళ్ళను ఏడిపించే
ఇట్లాంటి కామాందుల పని పట్టడానికే మన చేతికి మట్టి అంటకుండా పని జరిగే ఉపాయం చేసింది. గదేందంటే ‘’శీ టీమ్స్ ‘’ అని వల్ల ఫోన్ నెంబర్ ఇచ్చింది. మనం వాల్లాకు ఫోన్ చేసి ముచ్చట చెప్పితే చాలు మన పేరు బయట పడకుండా మిగతాది వాళ్ళే చూసుకుంటరు. పనిచేసే చోట బజార్లల్ ఆడోళ్ళను ఏమ్బదిచ్చేటోల్ల కోసం గిట్ల
చేసింది. కాబట్టి ఇప్పుడు మనం భయపడకుండా వాళ్ళకు ఫోన్ కొట్టి వాని పని పెడదాం
అని చెప్పడమే కాక చేసి చూపెట్టింది.

          జాజులమ్మకు కమల బాధ తీరినందుకు సంతోషమైనా తనకు మళ్ళీ పెళ్ళీ చేస్తే
బాగుండుననే ఆలోచన వచ్చింది. అదే విషయం అత్తతో చెప్పింది కూడా.

          నీది గింత మంచి మనసు కాబట్టే దేవుడు నీకు మేలు చేత్తాండు బిడ్డా! అట్నే జేద్దాం
లే! అన్నది. తెలిసిన వారికి విషయం చెప్పి సంబంధాలు ఉంటే చెప్పమని కూడా చెప్పింది.

          జాజులమ్మ మనసు కుదుట పడ్డది.

***

          కమలను తమ ఇంటికి రమ్మని పిలిచింది జాజులమ్మ. ఉన్న ఊర్లో బతకడం కంటే తమ ఊర్లో తమతో పాటు పని చేసుకుంటూ కొంచెం కుదుట పడ్డాక మళ్ళీ వెల్ల వచ్చునని
సలహా ఇచ్చింది.

          ఈర్లచ్చిమి కూడా అడ్డు చెప్పలేదు.

          కమలకు జాజులమ్మ చెప్పిన మాటలు కొంత ఊరటనిచ్చి కొన్నాళ్ళు ఉండడానికి
ఒప్పుకుంది. వాళ్ళతో పాటే పనికి వెళ్ళి రావడం, పిల్లలకు కూడా బాగా అలవాటు చేసుకొని గతాన్ని మరిచి మునుపటిలా మారసాగింది .

          ఆరు నెలలు గడిచి కమల తమ కుటుంబంతో బాగా కలిసిపోయింది. అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళి వస్తున్నా ఆమెకు మనసంతా ఇక్కడే ఉంటున్నది అంతలా మాలిమి అయ్యింది. మధ్య మధ్య లో రెండు సంబంధాలు వచ్చినా నచ్చక ఒప్పుకోలేదు. రాజయ్య కమలను చాలా అభిమానంగా చూడడం గమనించింది ఈర్లచ్చిమి. ఆమె మనసు ఏదో కీడు శంకించింది. తనలో తనే మధనపడడం కంటే తెల్సుకోవడం మంచిదని అనిపించి పొలం దగ్గర ఎవరూ లేనిదీ చూసి అడిగింది.
ఎందుకయ్యా? ఆ పిల్ల పట్ల తగని పావురం సూపెడుతానవ్? మెదట్ల ఏమన్న పురుగు
జేరిందా? ఇంత ఈడు వచ్చినా నీ ఆడి బుద్ది పోనిచ్చుకోకపోతివి గదే నే? నన్ను సుతం
అనుమానవడితివి. కని నువ్వనుకున్నట్టు నా మెదట్ల పురుగు జేరింది గని అది మంచి
పురుగేనే. నేనే నీకు చెప్పుదామనుకుంటే నువ్వే అడిగినవ్? సంకల బిద్దనేత్తుకొని
సంతంత తిరిగినట్టు ఆ పొల్లకు సంబంధమని ఏరే ఎతుకవడితివి. మన సైదులు గానికి ఇచ్చి చేత్తే ఈమె తోనన్న ఓ వారసుడు పుట్టాక పోతడాని ఆశ పడ్తాన. ముండరాలైన
ఆడదాన్ని ఎవరు మాత్రం చేసుకుంటరు. గందుకని మనం చేసుకుంటే వారసుడు పుట్టి వంశం నిలవడుతది, ఆస్తి కలిసత్తది. ఏమంటవ్? అని చెప్పడం ఆపి ఆమె వైపే చూడసాగాడు.

          ఈర్లచ్చిమికి కోపం నషాళానికి ఎక్కింది.రాజయ్య పాడు బుద్ధిని భర్త అని కూడా
చూడకుండా ఎండగట్టింది. ముత్యాల్లాంటి ముగ్గురు మనుమరాండ్రు ఉండంగా
నిర్వంశమ్ ఎట్లైతదని వాదనకు దిగింది.

          లచ్చిమీ!కొన్ని అనుకోవడానికే బాగుంటాయ్. ఎట్లైనా మగోడున్టేనే ఇంటి పేరు
ఇనవడ్తది. ఆడివిల్లలు ఇంటిపేరు మార్చేవాళ్ళే తప్పితే మోస్టోల్లయితే కాదు. సోచాయించు. ఆ పిల్ల కూడా మనతానైతే సుఖ పడుతది. నువ్వు ఇఇమేను గాదన్నా నేను మాత్రం సైదులుకు మారు లగ్గం జేసుడే ఖాయం! అనుకుంటూ నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళి పోతున్న భర్తను చూసి మొదటిసారి కలవరపడింది ఈర్లచ్చిమి.

          బిడ్డా ! కమలా! నువ్వు ఈడికచ్చి చానా దినాలయితాంది గదా! ఇగ ఊరికివోతేనే
బాగుంటది. సూసేవాళ్ళు ఇగ గుస గుసలు సురువు జెయ్యక ముందే నీ జాగలకు నువ్వు పోతే మంచిది బిడ్డా! ఎప్పటో ల్గే అచ్చి పో ! అన్నది మరునాడే.

          కమల ఆశార్య పోయింది. మొన్నటి వరకు నచ్చినన్ని నాళ్ళు ఉండుమని ధైర్యం
చెప్పిన మనిషి ఈ రోజు వేల్లమనడం వెనుక బలమైన కారణమే ఉంటుందనుకొని మారు
మాట్లాడకుండా అలాగేనని తలూపింది. తన బట్టలు అన్నీ మూట గట్టుకొని బయలు దేరిన కమలను, జాజులమ్మ వారించింది. నువ్వు వెళ్ళడానికి వీలు లేదని అడ్డుకున్నది.

          ఈర్లచ్చిమి ,జాజులు! కమలను వె ళ్ళనియ్యవే! అదే అందరికి మంచిది అన్నది.
అందరికి అంటే ఎవరికత్త? కమల ఉండడం వల్ల వచ్చిన నష్టమేంది? సాటి ఆడదానికి సాటి ఆడదానిగా ఆ మాత్రం చెయ్యకూడదా? ఆవేదనగా అడిగింది.

          తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని చెయ్యకుండా ఉండడమే మంచిది. అయినా ఇప్పుడు తను మునుపటంత బేలగలేదు. నయమైంది గదా !అని అంటున్న అత్తను అనుమానంగా చూసింది జాజులమ్మ. ఆమె ఇలా మాట్లాడుతున్నది అంటే ఏదో ఉందని మాత్రం ఊహించింది. ముందుగా అది తెలుసుకోవాలనుకున్నది. అంతవరకు కమలను ఊరు పంపించడమే సరైనదిగా అనుకోని తను మళ్ళీ రావడానికి తన పెద్ద కూతురును తోడు పంపించాలనుకొని ఆ మాటే కమలకు, ఈర్లచ్చిమికి చెప్పింది.

          కమల సంతోషించింది. తనకు ఉబుసు పోవడానికి, గతం గుర్తుకురాకుండా ఉండడానికి తప్పక తీసుకువెళ్తానని అన్నది. ఈర్లచ్చిమి అడ్డు చెప్పలేదు. తనకు కమల వెళ్ళిపోవడం కావాలి. రెండు రోజులు పోయిన తరువాత తానె వెళ్ళి మనుమరాలిని తీసుకచ్చుకుంటే సరిపోతుందని నిమ్మల పడింది. సాయంత్రానికల్లా కమల వెళ్లిపోయింది.

***

          సాయంత్రం పని నుండి ఇంటిక వచ్చిన సైదులు పెద్దబిడ్డ కనిపించక పోయేసరికి
అడిగాడు. జాజులమ్మ చెప్పిన సంగతి విని నా బిడ్డను నన్ను అడుగకుండానే పరాయింటికి ఎందుకు పంపావని చిందులు వేశాడు. అయినా కమలను వెళ్ళమని పంపించిందెవరు? కష్టంలో ఉన్న ఆడదానికి ఆ మాత్రం సాయం చెయ్యలేరా? అని అదంతా నాకు అక్కరలేదు రేపే నా బిడ్డను తీసుకరా! అని ఖచ్చితంగా చెప్పాడు.

          బిడ్డ పట్ల భర్తకున్న ప్రేమకు జాజులమ్మ సంతోషించినా కమల ఏమనుకుంటుందో అనే సందేహంతో అప్పటికి మౌనంగా ఉండి పోయింది. తెల్లవారి కూడా సైదులు బిడ్డను సాయంత్రానికల్లా తీసుకురమ్మని చెప్పి పనికి వెళ్ళడంతో జాజులమ్మ తప్పనిసరై బయలుదేరుతుండగా రాజయ్య, జాజులూ! నేను కూడా వస్తానుండు ఊరి బయటిదాకా అనడంతో ఆగి ఆయనతో బయలుదేరింది. అప్పుడు ఈర్లచ్చిమి ఇద్దరు పిల్లలను తీసుకొని అంగన్వాడీ సెంటర్కు పోయింది. జాజులుకు కొంచెం బెరుగ్గానే ఉంది. రాజయ్యతో వెళ్ళడం, ఆయన అంటే ఆమెకు మొదటి నుండీ భయమే. అందుకే ఏమీ మాట్లాడకుండా నడువసాగింది.

          రాజయ్య ఇల్లు దాటినా తరువాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు.
కమలను మీ అత్త నా మూలంగానే ఇంటికి పంపించింది. నేను కమలను సైదులుకు ఇచ్చి లగ్గం జేత్తే ఆమెతోనన్న మగపిలగాడు పుట్టి వంశం నిలుస్తదని అన్న. మొగుడు చనిపోయిండు మల్ల లగ్గమంటే అలీ కో బలిమికో ఒప్పుకున్నా, సుఖపెడ్తరని గ్యారెంటీ ఏంది? అదే మనమైతే, ఆమె సంగతి అర్థం చేసుకున్నోళ్ళం గాబట్టి ఏ బాధా ఉండది. ఆమె ఆస్తి గూడ కలిసత్తది అని ఉపాయం జేసిన. మీ అత్తకు ఈ మాటే చెప్పితే అగ్గిమీద గుగ్గిలమై నన్ను నానా తీర్ల తిట్టి తెల్లారే కమలను ఊరికి పంపింది.

          బిడ్డా!నేను అనుకున్నదాంట్ల తప్పేమన్న ఉంటె చెప్పుదీసుకొని కొట్టు. లేదంటే
నువ్వే అందరిని ఒప్పించి లగ్గం జేసి మన వంశం నిలవెట్టు. నీతోని కాని పని కమల
తోనైనా చేయించి న్యాయం చెయ్యి. నీ బిడ్డలకు నీకు ఏమి తక్కువ గాకుండా నేను
సౌలతు జేస్తా! ఓ ఆడపిల్లకు సాయమైనట్టు ఉంటది ఇటు మన అవసరం తీరుతది అని
చెప్పుకు పోతున్న రాజయ్యను ఆశ్చర్యంగా చూసింది.

          కమలకు మగ పిలగాడే పుడుతాడని, అసలు ఆమె తను ఉండగా పెళ్ళికి ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది.
ఒకవేళ ఆయన కోరిక తీరితే మాత్రం అందరమూ సంతోషంగా ఉంటాము కదా! అని కాసేపూ, ఇటు భర్త, అటు కమల ఈ పెళ్ళికి ఒప్పుకున్టారా ని కాసేపూ , ఒప్పుకుంటే తనూ, తన పిల్లల గతి ఏమిటని రకరకాల ప్రశ్నలతో ఆగిపోయింది.

          అమ్మా! ఇది చాలా కష్టమైన పనే, కాని నువ్వు తలుచుకుంటే బ్రహ్మ కట్టమేదీ
కాదు. లగ్గం చేసి నీ సోపతికి ఓ దారి సూపెట్టు. బాగ సోచాయించు. నేను అనుకున్న ఆశ ల తప్పైతే నాకు కనవడుతలేదు. అంతా నీదే భారం అని చెప్పి బస్ ఆగే దగ్గర దిగబెట్టి
ఇంటిదారి పట్టాడు.

          జాజులమ్మ ఒక్కతే అశోకవనముల సీతమ్మలా బస్ స్టాండ్ కు కొద్ది దూరం లో ఉన్న
మర్రీ చెట్టుకిందికి చేరుకొని చాలా సేపు తనలో తనే కుమిలి కుమిలి ఏడ్వసాగింది.
రామచిలకా …నీకు ఈ దేహ పంజరమునా …..
నీకెందుకే ఇంత తాపత్రయాలూ ……
వాలిన చెట్టు వాడకుండగ నీవు …..
చెట్టు కోరిన కోర్కె తీర్చలేవా ….
నీ ఎంగిలి పళ్ళ చెట్టుకిందనే వేసి …
మరునాటికి చెట్టుగ బతికించలేవా ……
సార్తమన్న నీ నుండి సాగినంపు ……..
ఇత్తులను ఇసిరేసి సక్కంగ పోవే ……

***

          నోటికచ్చిన తత్వాన్ని తంబురా మీటుతూ నామయ్య పాడుతున్న పాట వింటూ చిలక పేరు పెట్టి తానూ తన గురించే పాడుతున్నాట్టుగా లీనమైపోయి ఆలోచనలో పడింది. నామయ్య తన వైపే వస్తుండడం తో కళ్ళు తుడుచుకుని కూర్చుంది.
నామయ్య దగ్గరికి రానే వచ్చాడు.

          ఎవరూ …?అని పరికించి చూసి ..,

          వార్నీ నువ్వా జాజులమ్మ. ఈడ గూసున్నవెంది? ఊరు పోతానవా ? అడిగాడు.
నామయ్య తమ ఊరి వాడే. కానీ తత్వాలు పాడుతూ ఊరూరూ తిరుగుతాడు. ఇంతకు ముందైతే చాలా దూరం పోయేవాడు. కానీ ఇప్పుడు వయసు మీద పడడంతో చుట్టు పక్కల ఊర్లకు మాత్రమె వెళ్తున్నాడు.

          ఏంది బిడ్డా! మాట్లాడవు? అని అడిగేసరికి

          అవునే బాపూ! నాయన కాడికి బయిలెల్లిన. బస్ కోసం కూసున్న. అవునే బాపూ !ఇవారుదాకా నువ్వు పాడిన దానికి అర్థమేందే?అన్నది.

          ఊ ..ఊ ..అని నవ్వి ఏముంది బిడ్డా చిలక అంటే మనుషులు. వాలిన చెట్టు అంటే నీడను ఇచ్చిన వారిలాంటి వాళ్ళు. వారు ఏదైనా సాయం అడిగితే చెయ్యకుండా తన కడుపు తాను నింపుకొని ఎగిరిపోతుంటారని, రేపటి వారి కోసం ఇసుమంతైనా సోచాయించరని పాట. అన్నాడు తాను అడుక్కొని వచ్చిన అన్నం ముల్లె విప్పుకుంటూ.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.