
సాహసాల రాజా మధు నాగరాజ -2
-డా. అమృతలత
అనంతరం మధు తన దృష్టిని మొరాకో నుండి సహారా ఎడారిలో 250 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేయాలన్న లక్ష్యం పై కేంద్రీకరించాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన అల్ట్రా మారథాన్ అది. 2010 ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ఆరు రోజుల్లో ..మండుటెండల్లో ఓ వైపు కాళ్ళు బొబ్బలెక్కుతున్నా … నాలుక పిడుచకట్టుకు పోతున్నా … మొక్కవోని దీక్షతో మారథాన్ పూర్తి చేయాలి. వారికి కావల్సిన నీళ్లూ ,ఆహారం, ఇతర వస్తువులను రోజూ వారు బ్యాక్ ప్యాక్ లోనే మోసుకువెళ్ళాలి. ఆ వేడికీ, ఆ చెమటకీ వారి వీపు, భుజాలు రాపిడికి గురై మంట పెడతాయి. వారు ధరించే షూలో ఇసుక దూరి సాండ్ పేపర్ తగిలినట్లు రాపిడి కలిగిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాళ్ళు బొబ్బలెక్కి , రక్తం కారుతుంటుంది. ఒక దశలో 85 కి.మి దూరంలో మధు ఎంతో అనారోగ్యానికి గురై , నిర్వాహకులకు ఫోను చేయడం , వారు తక్షణం ప్రథమ చికిత్స చేసి, గ్లూకోజ్ ఎక్కించడం కూడా జరిగింది. ఆ మర్నాడు మధు మరింత శక్తిని పుంజుకుని తిరిగి నడవడం మొదలెట్టాడు. ఏ రోజుకారోజు నడవాల్సిన దూరం అత్యంత కష్టతరమైంది. నాలుగవ రోజు 85కి.మి. నడవాలి. మరుసటి రోజు విశ్రాంతి . మొత్తం ఆ 7 రోజుల పాటు వాళ్ళు అనుభవించే కష్టం, గాయాలు, మానసిక బలహీనతల నుండి కోలుకోవడానికి వారికి ఎంతో సమయం పడుతుంది. ఏ రేసులోనైనా మొదట్లో వెయ్యిమంది పాల్గొన్నప్పటికీ , మధ్య మధ్యలో వందల సంఖ్యలో వైదొలగుతారు. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ రేస్ లో ఒకవేళ ఎవరైనా చనిపోతే , ఆ శవాన్ని ఇంటికి పంపించడానికి కూడా వాళ్ళు ముందే డబ్బు కట్టించుకుంటారు. అలా కట్టించు కున్న డబ్బులో ఎక్కవ భాగం అక్కడి పిల్లల, స్త్రీల, పర్యావరణ సంరక్షణకు , సోలార్ దీపాలకు, విద్య, వైద్య సదుపాయాలకు వెచ్చిస్తారు. *** కెనడాలో తను నివసిస్తోన్న ప్రదేశానికి దగ్గరలో వున్న ఓంటారియో సరస్సు అంటే మధుకి ఎంతో ఇష్టం. ఎప్పుడూ అక్కడి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అత్యంత ఇష్టంగా చూస్తూ అందులో ఈత కొడ్తూ వుండే మధుకి వున్నట్టుండి ఓ రోజు ఆ సరస్సును ఈదాలన్న కాంక్ష కలిగింది. అందుకు కావలిసిన శిక్షణ, టీమ్ ని ఏర్పరచుకుని , దానికి కావాల్సిన ఆర్థిక వనరు లను సైతం సమకూర్చుకున్నారు. చివరికి 28th july 2012, 9.08 రాత్రి ఆ సరస్సుని ఈదడం మధు మొదలెట్టాడు. అది 15 to 18 గంటల్లో ముగించవచ్చని అనుకున్నారు. కానీ తుఫాను కారణంగా వారి అంచనా కన్నా ఎక్కువ సమయం పట్టింది. ‘తుఫాన్ ఎదురైన సమయంలో – నాకు వాషింగ్ మెషిన్ లో ఈదుతున్నట్లు అన్పించింది ‘ అంటారు మధు. తుఫాన్ లాంటి అడ్డంకులు ఎదురైన సందర్భాల్లో – “నా ధైర్యం సడలిపోకుండా – అడుగడుగునా ‘ హే ! కీప్ గోయింగ్ !’ అంటూ నన్ను ఉత్సాహపరిచిన నా ఫ్రెండ్స్ నీ , ముఖ్యంగా అలెక్స్ నీ మరిచిపోలేను , వారి ప్రోత్సాహమే నా విజయానికి ముఖ్య కారణం” అంటారాయన. ఆ రోజు అతడు ఆ సరస్సులో స్విమ్ చేస్తున్నప్పుడు ఫేస్ బుక్ లో దాదాపు పదివేల మంది వీక్షించడం, తన సాహసం అంత మందిని సంఘటితం చేయడం …తనకో మరుపురాని అనుభూతిగా అభివర్ణిస్తారాయన. చివరకు 29th జూలై రాత్రి 24 గంటల్లో 42 కిలోమీటర్ల దూరం ఈది, గమ్యం చేరిన 50వ వ్యక్తిగా తన పేరు నమోదు చేసుకున్నారు మధు. ఆ నాడు అతడి విజయం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోన్న స్నేహితులకు మధూను చూసీ చూడడంతోనే ఉద్విగ్నతకి లోనై , కేరింతలు కొట్టారు. సాధారణంగా ఒంటారియోలో స్విమ్మింగ్ ప్రారంభించేవాళ్ళు దాన్ని టొరంటోలో ముగించడం ఆనవాయితీ .. కానీ మధూ దానికి భిన్నంగా తను నివసించే ఓక్ విల్ దగ్గర తన బంధుమిత్రుల సమక్షంలో ఆ ముగింపు సంరంభాలు జరుపుకుని , ఓ సరికొత్త ఒరవడిని సృష్టించి , తన ప్రత్యేకతని చాటుకున్నారు.
*****

డా.జి.అమృతలత
పుట్టింది పడకల్, పెరిగింది జక్రాన్ పల్లి , నిజామాబాద్ జిల్లా. ప్రస్తుత నివాసం మామిడిపల్లి, ఆర్మూర్ – నిజామాబాద్ జిల్లా. ఎమ్మే, ఎమ్మెడ్, పి హెచ్ డి. చేసి, పదిహేను సంవత్సరాలు జెడ్ పి హెచ్చెస్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి రాజీనామా అనంతరం , వివిధ విద్యాలయాల స్థాపన చేశారు.
రచయిత్రి. ఎన్నో కథలు, సీరియల్సు, నాటికలు.రచించారు. ‘ అమృత కిరణ్ ‘ పక్ష పత్రికకు రెండేళ్ళు ఎడిటర్.
సాహిత్యం,సంగీతం, కళ ఇలా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి అమృత లత అవార్డు ను 2011 నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతున్నది.
శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడి పల్లిలో నిర్మాణం, 2012 న విగ్రహం ప్రతిష్టాపన.
1970 నుండి ఇప్పటి వరకు వందకి పైగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. విద్యారంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సేవ చేయటం ముఖ్య లక్ష్యం.
అవార్డులు :
‘ఆదర్శ వనిత’ అవార్డు, ‘ద బెస్ట్ అవుట్ స్టాండింగ్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు, ‘డోయన్ అవార్డు’, ‘బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్’ అవార్డు ఇలా ఇంకా .
