పోరుపాట గద్దర్ కు నివాళి!

-ఎడిటర్

పోరుపాట చిరునామా

-డా||కె.గీత (నెచ్చెలి సంస్థాపకులు & సంపాదకులు) 

ఇండియాలో లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో అత్యధిక కాలం నేను పనిచేసిన ఊరు తూప్రాన్. కాలేజీలో చేరిన మొదటి వారంలోనే గద్దర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిన దారి ఈ రోజుకీ నాకు బాగా గుర్తే. ఆ రోజు నాతో వచ్చిన మా కాలేజీ పిల్లలు నా మొదటి కవితా సంపుటి “ద్రవభాష” ఆవిష్కరణకి ఓ వ్యాను నిండా ఎక్కి ప్రెస్ క్లబ్ కి కూడా వచ్చేటంత దగ్గరయ్యేరు.

ఇప్పటికీ నన్ను ప్రేమించే ఆత్మబంధువులైన సహోపాధ్యాయులు, మెరికల్లాంటి విద్యార్థులతో బాటూ తూప్రాన్ లో పనిచేసానని చెప్పుకోవడానికి గర్వకారణమైన మొదటి విషయం గద్దర్ స్వగ్రామమనే.

గద్దర్ వారసత్వం అక్కడి పిల్లల్లో పాట రూపంలో కనిపిస్తూ ఉండేది. గొంత్తెత్తి శ్రావ్యంగా చైతన్యవంతమైన పాటలెన్నో పాడేవారు. అందులో చాలా వరకు గద్దర్ పాటలే. పదహారు పదిహేడేళ్ళ పిల్లల గొంతులో శ్రమశక్తియై, చైతన్యమై, ధిక్కారమై పలికిన పాట వారికి జీవితాంతం తోడు ఉంటుంది. ఇప్పటికీ నా చెవుల్లో పోటెత్తే పోరుపాటల గద్దర్ ఎప్పటికీ తరతరాల పిల్లల స్వరంలో సజీవంగానే ఉంటారు.

గద్దర్ నిష్క్రమణకి ఎంతో దుఃఖంగా ఉన్నా, స్వీయ దుఃఖాలకి పరిమితం కాకుండా జనఘోషని ఆలకించేలా చేసిన పాటల పరిమళాలతో నా గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్నో అనుభూతుల, అనుభవాల తూప్రానే ఇప్పటికీ నా చిరునామా.

***

వ్యాసవాల్మీకి పరంపరకు చెందినవాడు

-కల్లూరి భాస్కరం

గద్దర్ గురించి చాలా మంది చాలా కోణాల నుంచి మాట్లాడారు, విశ్లేషించారు. వాటిలో కొన్నిటితో ఏకీభవిస్తూ, కొన్నిటితో విభేదిస్తూనే నాదైన ఒక కోణం నుంచి ఇలా చెప్పాలని పించింది.

గద్దర్ ఆశుసంప్రదాయానికి చెందిన కవే తప్ప, లిఖిత సంప్రదాయానికి చెందిన కవి కాదని మనకు తెలుసు. ఇలాంటి వారిని వాగ్గేయకారులని కూడా అంటున్నారు. దీనినే మరింత విస్తరించి నేను ఏమంటానంటే, గద్దర్ వ్యాసవాల్మీకి పరంపరకు చెందినవాడు. చరిత్రకాలానికి చెందిన కాళిదాసాది కవుల పరంపరకు, మన తెలుగు ప్రాచీనకవుల పరం పరకు చెందినవాడు కాడు. అంటే, అతి పురాతనకాలపు వ్యాసవాల్మీకి వారసత్వాన్ని- ఆ తర్వాతి కవులను దాటుకుంటూ మన కాలానికి తీసుకొచ్చినవాడన్నమాట. ఆ విధంగా అతి పురాతనకాలాన్ని ఆధునిక కాలంతో ముడివేశాడన్నమాట. అయితే ఇది రూపపరం గానే తప్ప వస్తు పరంగా కాదు.

వ్యాసవాల్మీకి పరంపరలోకే ప్రాచీన గ్రీకు కవి హోమర్ కూడా వస్తాడు; అలాంటి పరంపరకే చెందిన ఐరిష్ కవులు కూడా వస్తారు. ఐరిష్ ప్రజలు మాట్లాడే మామూలు మాట కూడా కవితాత్మకంగా ఉంటుందని ప్రముఖ ఏంత్రొపాలజిస్టు, ఐరిష్ భాషావేత్త, ప్రాచీనవాఙ్మయ నిపుణుడు జార్జి థామ్సన్ ఉదాహరణలతో కూడా చెప్పుకుంటూ వస్తాడు. సాధారణ వాక్కు కన్నా కవితాత్మక వాక్కే ముందు పుట్టిందని అంటాడు. వెనకటి ఆఫ్రికన్ కవులు కూడా ఇదే పరంపరకు చెందుతారు. ఆ మాటకొస్తే ఒకప్పుడు ప్రపంచమంతటా ఇదే పరంపర ఉండేదని చెప్పవచ్చు.

గద్దరే కాడు; వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, అందెశ్రీ తదితరులు కూడా ఈ వ్యాసవాల్మీకి పరంపరకు చెందినవారే. ఈ మధ్య అందెశ్రీతో తరచు మాట్లాడినప్పు డల్లా ఆయన నోట పూనకం పట్టినట్టుగా ప్రవాహంలా దూకే కవితాత్మక భాషలోనూ, వ్యక్తీకరణల్లోనూ, ఒక రకపు కాకువుతో కూడిన ప్రాచీనతను అద్దుకునే పదజాలంలోనూ, ఆయన హావభావాల్లోనూ ఒకప్పటి ఈ ప్రపంచవ్యాప్త కవి పరంపర ఛాయలే కనిపిస్తూ కాలపు హద్దులను దాటించి సుదూర ప్రాచీన గతంలోకి తీసుకు వెళ్ళేవి. గద్దర్ సహా ఈ కవులందరి మీదుగా ఆశు, లిఖిత సంప్రదాయాల మధ్య అంతరాలను జార్జి థామ్సన్ వెలుగులో చర్చిస్తూ విస్తృతవ్యాసం రాయాలనే ఉత్సాహం కలుగుతూ ఉండేది. ఈ ఆశు సంప్రదాయం మీద అమితమైన ఆసక్తి, అనురక్తి ఉప్పొంగుతూ ఉండేది.

మన దగ్గరే కాదు, ఇతర చోట్ల కూడా ఈ పరంపరకు చెందిన కవులు శిష్టవర్గానికి చెందినవారు కాకపోవడం మరో ఆశ్చర్యకరమైన సామ్యం. వాల్మీకి రామాయణాన్ని గానం చేసిన కుశీలవులు ఈ పరంపరకు చెందిన గాయకులే. ఈ గానం తంత్రీలయ సమన్వి తంగా ఉంటుంది. వారిని కుశలవులు పేరుతో సీతారాముల పుత్రులను చేసింది సంప్రదాయం. హోమర్ కవిత్వం కూడా తంత్రీలయ సమన్వితంగానే ఉంటుంది. అలాగే వెనకటి ఆఫ్రికన్ కవుల కవిత్వం కూడా. మహాభారతం గానం చేసిన సౌతి కూడా శిష్టవర్గానికి చెందినవాడు కాదు. శిష్టవర్గం కవిత్వాన్ని మొదట్లో ఉన్నతంగా చూడలేదు సరికదా, నటులతో పాటు గాయకులను కూడా దొంగల జాబితాలో చేర్చింది. అర్థశాస్త్రం లో ఇందుకు సంబంధించిన చిత్రణలు కనిపిస్తాయి.

కవిత్వాన్ని శిష్టవర్గాలు ఎప్పుడు తమ చేతుల్లోకి తీసుకున్నాయన్నది మరో ఆసక్తికరమైన పరిశీలన. బహుశా లిఖితసంప్రదాయం మొదలయ్యాక కావచ్చు. శిష్టవర్గే తరుల చేతుల్లో ఉన్న పురాణశ్రవణాన్ని కూడా శిష్టవర్గాలు తమ చేతుల్లోకి తీసుకు న్నాయి.

వ్యాసవాల్మీకి పరంపరకు చెంది, నిన్నటి వరకు మన మధ్య జీవించిన గద్దర్ కు నివాళి.

***

గద్దర్ జ్ఞాపకాల కన్నీటి తడి…

-ఎన్.వేణుగోపాల్

గద్దర్ గురించి రాయవలసింది ఎంతో ఉంది. నిన్న సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలో, అంబ్యులెన్స్ లో దీర్ఘనిద్రలో ఉన్న ఆయన శీతల ముఖాన్ని, చెంపలను, చేతులను చివరిసారి నిమురుతున్నప్పుడు యాబై ఏళ్ళ స్నేహమూ ప్రేమాభిమానాలూ ఏకాభిప్రాయాలూ భిన్నాభిప్రాయాలూ అన్నీ కన్నీళ్ళలో సుళ్ళు తిరిగాయి.

యాబై ఏళ్ళ కింద, 1973 అక్టోబర్ లో వరంగల్ లో విరసం సాహిత్య పాఠశాల సమయంలో గద్దర్ ను మొదటిసారి విన్నాను. ఆయన పాటలు 1973 జూన్ సంచిక నుంచి సెప్టెంబర్ సంచిక దాకా సృజనలో అచ్చయి, 1973 అక్టోబర్ లో సృజన ప్రచురణ గానే మొదటిసారి వెలువడ్డాయి. ఆయన పాటలోని విస్ఫోటక శక్తికి, గొంతులోని అద్భుత ఐంద్రజాలికత్వానికి, అభినయంలోని ఆశ్చర్యకరమైన వైవిధ్యానికి పన్నెండేళ్ళ కుర్ర వాడు ఎంతగా సమ్మోహితుడు కాగలడో అంతగా సమ్మోహితుడినై ఆయన అభిమాను లలో, అనుచరులలో, సహచరులలో ఒకడినయ్యాను. నా కంటే పన్నెండేళ్ళు పెద్దవాడ యిన ఆయన ఆ మొదటి పరిచయం నుంచీ కూడ నా పట్ల వాత్సల్యాన్నీ ప్రేమనూ చూపాడు, ఎప్పుడూ నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేవాడు. నేను ఆయనను ఒక ఐంద్రజాలికుణ్ని చూసినట్టు గౌరవంతో, ప్రేమతో చూశాను. కొన్నిసార్లు ఒకరి మీద ఒకరం విసుర్లు విసురుకున్నా, కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తినా ఆయన మీద నా ప్రేమ చెక్కు చెదరలేదు. ఆయనకు కూడ నా మీద ప్రేమ ఉందనే ఎన్నోసార్లు ఆయన మాటల ద్వారానూ, ఎంత విభేదం ఉన్న సమయంలో కూడ ఆత్మీయంగా దగ్గరికి తీసు కోవడం ద్వారానూ చూపాడు. ఎన్నో సభల్లో కలిశాం, కలిసి వేదికలు పంచుకున్నాం. ఆయన అజ్ఞాతవాసం నుంచి బైటికి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సభల్లో విజయవాడ లో 1990 నవంబర్ లో జరిగిన సభకు నేను అధ్యక్షత వహించాను.

ఎనిమిది నెలల కింద అమరుడు ఎల్ ఎస్ ఎన్ మూర్తి అంత్యక్రియల సందర్భం గానూ, ఆ తర్వాత మూడు నాలుగు నెలల కింద సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు ఏదో సభ దగ్గర కలుసుకున్నప్పుడూ దగ్గరికి తీసుకున్నాడు. ఆయన జీవితకాలంలో సంపాదించుకున్న లక్షలాది మంది అభిమానులలో దాదాపు ప్రతి ఒక్కరిదీ ఆయన నుంచి గొప్ప ప్రేమనూ ఆప్యాయతనూ పొందడంలో అదే అనుభవం.

తెలుగు జాతి, సమాజం, విప్లవోద్యమం, అన్ని ప్రజా ఉద్యమాలు, తెలుగుసాహిత్యం, విప్లవ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలు గర్వించదగిన సాహిత్య, సాంస్కృతిక, ప్రజాను కూల ఆచరణ ఆయనది. దాని నుంచి నేర్చుకోవలసినవి సానుకూలమైనవీ, విమర్శ నీయమైనవీ ఎన్నో ఉన్నాయి.

ఎప్పుడో అవన్నీ రాయాలి గాని, ఇప్పటికి అచ్చయిన ఆయన పుస్తకాలు పదకొండిటిలో ఐదు రూపుదిద్దుకోవడంలో నా పాత్ర ఉందని చెప్పి ఆపుతాను. వాటిలో మూడు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నా చేతికి అందాయి. మూడూ ఎడిట్ చేసి, వాటిలో ఒకటి అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకులు తోటకూర రఘు గారితో మాట్లాడి, ఒక కర్టెన్ రేజర్, ఒక చివరిమాట రాసి ముప్పై వారాల పాటు సీరియల్ గా వేయించాను. ఆయన అజ్ఞాతవాసం నుంచి వచ్చాక ఆ పుస్తకం జననాట్యమండలి ప్రచురణగా వెలువడింది. మిగిలిన రెండు పుస్తకాల్లో ఒకటి సృజన ప్రచురణగా, మరొకటి జన నాట్య మండలి ప్రచురణగా అచ్చయ్యాయి. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు చరిత్రకూ గద్దర్ కూ వినమ్రంగా….

***

గద్దరన్నకు-

– సునీత గంగవరపు

నాకు చిన్నప్పటి నుండి పాటలంటే ఇష్టం అదీ ఎర్ర పాటలంటే మరీను. నాకు ఐదారేండ్ల వయసులో అనుకుంటాను..పది మంది దాకా కుర్రాళ్ళు వచ్చి మా గ్రామంలో సభ ఒకటి పెట్టారు. ఏం మాట్లాడారో గుర్తు లేదు కానీ డప్పు కొడుతూ వాళ్ళు పాడిన లాల్ సలాం పాటలు మాత్రం ఇంకా చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. అలా.. పాట మీద ఇష్టం మొదలైంది.

ఆ తర్వాత మా చిన్నన్న మంచి మంచి పాటల కాసెట్లు తెచ్చి టేప్ రికార్డర్ లో పెట్టి వినిపించేవాడు. ఆ పాటలన్నీ విప్లవ, అభ్యుదయ గేయాలే. అందులో నన్ను మరింత ఆకట్టుకున్న పాటలు గద్దరన్నవి. ఉదయం నిద్ర లేవడంతోనే అన్న పాట చెవినపడే దేమో. ఇక ఆ రోజు ఏ పనికి వొంగినా రోజంతా అవే పాటలు నోట్లో నానుతుండేవి.

ఒకరోజు మా పెద్దన్న బిడ్డను ఉయ్యాల్లో ఊపుతూ గద్దరన్న పాట పాడుతున్నాను. బయటి నుంచి అప్పుడే వచ్చిన మా అన్న నా పాట విని ‘ఉయ్యాల నుంచే పిల్లలకు గద్దర్ పాటను పరిచయం చేస్తంన్నావా..’ అంటూ నవ్వాడు.

నాకూ అంతో ఇంతో పాడే అలవాటు వుంది కాబట్టి మా కాలేజ్ లో ఏ చిన్న మీటింగ్ జరిగినా నేను నా స్నేహితులు ఇద్దరు ముగ్గురిని కోరస్ పెట్టుకొని ఏదో ఒక ఉద్యమ గీతాన్ని ఆలపించేదాన్ని. నా పాటలు మాటలు విన్న మా కాలేజ్ ప్రిన్సిపాల్ నన్ను ‘లేడీగద్దర్ ,,’ అని పిలిచేవారు. ఆ పిలుపును నేను ఎంతో గర్వంగా స్వీకరించేదాన్ని.

ఇలా.. గద్దరన్నతో నాకు పరోక్షానుబంధం ఏర్పడింది. అన్న పాట వింటుంటే ఒక ఉద్వేగం..ఉద్రేకం. పైకి కనపడకపోయినా లోలోపలి మనసు గజ్జ కట్టుకుని చిందేసేది. ఉద్యమం లా ఉరకలేసేది.

అన్నా ! ఆడపిల్ల నై పుట్టబట్టి..ఆంక్షల్లో చుట్టబట్టి నిన్ను ఒక్కసారైనా చూడలేక పోతిని. అదే అబ్బాయి నై వుంటే ..నీ చేయి పట్టుకొని నీతో నాలుగడుగులన్నా వేద్దును. నీ పాటతో గొంతు కలిపి ఆ సంతోషాన్ని గొంతునిండా నింపుకొందును. ఇది నేను ఇప్పుడం టున్న మాట కాదన్నా. నీ పాట విన్న ప్రతీసారి అనుకునే మాట. నీ పాట వున్నంత వరకూ అనుకుంటూనే ఉంటానీ మాట. ఇంకో జన్మ వుంటుందో లేదో తెలియదు. నాకైతే వుంటుందన్న నమ్మకమూ లేదు కానీ..పుట్టుమచ్చనై నీ చెల్లెలితో ఉంటానన్నావ్ కదన్నా! అట్లయితే , నా పాదం మీదున్న పుట్టుమచ్చలో రోజూ నిన్ను చూస్తానే ఉంటా లేన్నా..!!

గద్దరన్నా..నీకు ఎర్రెర్ర దండాలు

అలసిపోని నీ పాటకు..మాటకు పరిపరి   దండాలు

***

శతకోటి జోహారులు!

-జూపాక సుభద్ర 

సర్వ మానవ సమానత్వ

సమాజం కోసం

బతుకు బలి పీఠం ఎక్కించి,

పాటను

పదునెక్కించిన పట్టపు ఏనుగు .

అనేక రంగుల్లో సాన బెట్టుకున్న బాణం,

వాలి పోని పాట పొద్దు,

తూటాకే తూట్లు పొడిసిన కాయం.

గుండెకు గాయమైన

గండ దీపం కొండెక్కిన కోట్ల కాంతి

నా పాదమ్మీద నాటిన

పుట్టు మచ్చల కలల వాగ్ధానం

కడ తేరక ముందే

కట్టెక్కక ముందే

తోడబుట్టిన రుణం తీరే

తీరం చేరకనే

చుక్కల్లో కలిసిన సక్కనన్నకు

పాటన్నకు

శతకోటి జోహారులు!

***

(ఫేస్ బుక్  & వాట్సాప్ ల నించి-)

*****

Please follow and like us:

One thought on “పోరుపాట గద్దర్ కు నివాళి!”

  1. LAL SALAM -GADDER GARU
    -last few years he crossed the lines —
    MEETING WITH BABU
    KISSING RAHUL GANDHI
    BELIEVE IN GOD —going to yadadri temple
    Not mingling with people

Leave a Reply to Buchireddy gangula Cancel reply

Your email address will not be published.