విజ్ఞానశాస్త్రంలో వనితలు-15
కుష్టు వ్యాధి బాధితుల పాలిట దేవత ఏలిస్ బాల్ (1892-1916)
– బ్రిస్బేన్ శారద
“కుష్టు వ్యాధి” కొన్ని దశాబ్దాల క్రితం ఈ మాట వింటేనే ప్రజలు వణికిపోయేవారు. “మైక్రో బేక్టీరియం లెప్రే” అనే క్రిమి వల్ల సోకే ఈ వ్యాధికి అప్పట్లో మందే లేదు. ఈ వ్యాధి సోకిన వారిని అసహ్యించుకుని ఊరవతల వారి ఖర్మకి వారిని వదిలేసేవారు. ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెంది శక్తివంతమైన ఏంటీ-బయాటిక్ మందులు అందు బాటులోకి రావడంతో కుష్టు వ్యాధి అంటే అంత భయం లేకపోయినా- సామాజికంగా ఇంకా ఇది మనుషులని హింసించే వ్యాధి అనే చెప్పుకోవాలి. మనిషి చర్మాన్ని, నరాలనీ, కళ్ళనీ పుళ్ళు పడ్డట్టుగా చేసి చిత్ర వధ చేసే జబ్బు లెప్రసీ.
అయితే, ఇప్పుడు వాడుతున్న “ఏంటీ-బయాటిక్ సమ్మేళనం” (MDT- Multi Drug Treatment) చికిత్స వల్ల కుష్టు గురించి భయపడాల్సిన పరిస్థితి ఏమాత్రం లేదు. ఇప్పుడు ఈ వ్యాధి చికిత్సకి కావాల్సిందల్లా మంచి మందులూ, చుట్టూ వున్న మనుషుల ప్రేమా, ఆసరా.
కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి వేరేగా వుండేది. రోగికి ఉపశమనం కోసం రకరకాల ఆకు పసర్లూ, మందులూ వాడేవారు. ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎక్కువగా సఫలీ కృతం కాకపోయినా, ఆయా పద్ధతులన్నీ రోగికి కొంచెం ఊరటనిచ్చాయనే చెప్పాలి.
అలాటి పద్ధతుల్లో ముఖ్యమైనది భారతాదేశంలో దొరికే “కాల్‌మోగ్రా” అనే చెట్టు విత్తనం. ఈ విత్తనాల నుంచి ఉత్పత్తి అయ్యే నూనెతో కుష్టు వ్యాధి కొంచెం నయమవు తుందని అనుకునేవారు. అయితే ఈ నూనె వాడడంలో చాలా ఇబ్బందులుండేవి.
ఈ ఇబ్బందులని అధిగమించి, ఈ నూనెని కుష్టు వ్యాధి పీడితుల కోసం వాడే పద్ధతి కనుగొన్న రసాయన వేత్త – అమెరికాకి చెందిన ఆఫ్రికన్ యువతి ఏలిస్ బాల్. విషాదమేంటంటే, చాలా యేళ్ళపాటు ఆమెకి ఈ పద్ధతి కనుగొన్న గౌరవం కూడా దక్క లేదు.
ఏలిస్ బాల్ 1892 సంవత్సరంలో జులై 24 న వాషింగ్‌టన్ లోని సియాటిల్ లో జన్మించారు. లారా బాల్, జేమ్స్ బాల్ ఆమె తల్లి తండ్రులు. జేమ్స్ “ది కలర్డ్ సిటిజెన్” అనే పత్రికా సంపాదకులుగా పని చేస్తూ వుండేవారు. లారాకీ, ఆమె తండ్రికీ ఫోటోగ్రఫీ ఎంతో ఇష్టంగా వుండేది. వారు ఆఫ్రికన్ సంతతి వారైనా, తమ బిడ్డని మాత్రం బర్త్-సర్టిఫికేట్‌లో అమెరికన్ అనే పేర్కొన్నారు.
స్కూలు చదువులో ఏలిస్ సైన్సులో చాలా ముందుండేది. 1909లో హైస్కూలు ముగించి, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్‌టన్‌లో రెండు డిగ్రీలు సంపాదించుకుంది. 1912లో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో, 1914లొ ఫార్మసీలో పట్టభద్రురాలయింది ఏలిస్. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విలియం డేన్ అనే రసాయన శాస్త్రవేత్తతొ కలిసి జర్నల్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీ అనే ప్రఖ్యాత పత్రికలో “బెంజోలేషన్” అనే రసాయన
చర్య గురించి ఒక పరిశోధనా పత్రం ప్రచురించారు. అంత చిన్న వయసులో ఒకపేరున్న జర్నల్‌లో ప్రచురించడమంటే, ఆ విజయం సాధారణమైనది కాదు.
1915లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ హవాయిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ డిగ్రీ సంపాదించు కున్నారు. అక్కడే ఇన్స్ట్రక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ రోజుల్లోనే ఏలిస్ లెప్రసి వ్యాధికి చికిత్స గురించి పరిశోధన మొదలుపెట్టారు. పైన చ్చెప్పుకున్నట్టు ఆ రోజుల్లో కుష్టు వ్యాధికి కాల్‌మొగ్రా అనే విత్తనాల నుంచి నూనే తీసి వాడేవారు. ఈ కాల్‌మొగ్రా చెట్లు భారతదేశంలో మహారాష్ట్ర, కేరళ, అస్సాం, త్రిపురా ప్రదేశాల్లో కొండల పైన పెరుగు తుంది.
అయితే ఈ నూనె వాడకంలో చాలా సమస్య లుండేవి. దీని సాంద్రత కారణంగా ఇంజెక్షన్‌లా ఇస్తే, అది రక్తంలో కలిసి ప్రవహించకుండా, చర్మం కింద స్థిరపడి పోయి, చర్మం పైనంతా బుడిపెల్లా లేచేవి. పోనీ తాగడానికి మందులా తయారు చేసి ఇద్దామంటే దాని వాసనకి రోగికి వాంతు లయ్యేవి. అలాటి పరిస్థితుల్లో ఏలిస్ బాల్ ఈ నూనెలోని రసాయన పదార్థాలు విశ్లేషించీ, వేరు చేసీ, ఇంజెక్షన్ సాధ్యమయ్యే విధంగా మందు తయారు చేసారు. |
అప్పట్లో హవాయి అంతటా “లెపర్ కాలనీలూ” వుండేవి. అంటే కుష్టువ్యాధి గ్రస్తులని వుంచే ఒక రకమైన వెలివాడ లాటిదన్నమాట. ఏలిస్ కనిపెట్టిన విధానం వల్ల చికిత్స సులువు, చవకా అయింది. కుష్టు వ్యాధిగ్రస్తుల జీవితాలలో కొత్త వెల్తురొచ్చిం దంటే అతిశయోక్తి కాదు. ఈ పరిశోధన కోసం ఆమెని డాక్టర్ హాల్‌మాన్ అనే అసిస్టంట్ సివిల్ సర్జన్ నియోగించారు. యేడాదిలోగా ఈ చికిత్సా విధానం చాలా ప్రాచుర్యం పొందింది.
కానీ, ఆ రోజుల్లోనే దురదృష్టం ఇరవై నాలుగేళ్ళ ఏలిస్‌ని మృత్యువు రూపంలో కాటేసింది. 1916 లో ఏలిస్ అనారోగ్యం పాలై సియాటిల్ వెళ్ళిపోయారు. డిసెంబర్ 31 న మరణించారు. ప్రయోగశాలలో క్లోరిన్ విషవాయువులు పీల్చడం వల్ల అని కొందరంటారు. అయితే ఆమె డెత్ సర్టిఫికేట్‌లో మాత్రం ట్యూబర్‌కొలోసిస్ అని వుంది. ఆమె మరణానం తరం ఆమెకి గురుస్థానంలో వున్న ఇంకో రసాయన శాస్త్రవేత్త, ఆర్థర్ డీన్ ఆమె కనిపెట్టిన పద్ధతినంతా తనదిగా పేర్కొంటూ పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆ తరవాత
చాలా యేళ్ళు ఆ పద్ధతిని “డీన్స్ మెథడ్” అనే పిలిచేవారు.
యే ఇంటర్వ్యూలో కానీ, యే పేపర్లో కానీ డీన్ ఏలిస్ పేరు కానీ, ఆమె పనిని గురించి కానీ ప్రస్తావించలేదు. 1922లో డాక్టర్ హాల్‌మాన్ ఈ విషయమై మనస్తాపం చెంది ఒక
పేపర్ వ్రాసారు. దాన్లో డీన్ పేర్కొన్న పద్ధతంతా ఏలిస్ బాల్ కనుగొన్నదనీ, ఆమెకి దక్కాల్సిన పేరూ, గౌరవమూ దక్కడం లేదనీ చెప్పారు. “ఏలిస్ కనిపెట్టిన విధానాన్ని నేను మెరుగు పర్చాను” అన్న డీన్ మాటల్లోని డొల్లతనాన్నీ ఎండ గట్టారు.
అయినా ఏలిస్ బాల్‌కి ఆమెకి దక్కాల్సిన పేరుకానీ, గౌరవం కానీ చాలా యేళ్ళు దక్కలేదు. 1970లో మళ్ళీ కేథ్రిన్ టకరా, స్టాన్లీ ఆలీ అనే ఇద్దరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆఫ్ హవాయి పరిశోధనా పత్రాలూ, నోట్ బుక్కులూ వెతికి ఏలిస్ సాధించిన విజయాలను నిర్ద్వందంగా నిర్ధారించారు. అప్పటినించీ కాల్‌మోగ్ర నూనె ఉపయోగించి కుష్టు వ్యాధికి
మందు తయారు చేయడాన్ని “బాల్ మెథడ్” అని పిలిచారు. 1940 ల నుంచి ఈ వ్యాధికి శక్తివంతమైన ఏంటీ-బయాటిక్స్ ఉపయోగించడంతో వ్యాధి అదుపులోకి వచ్చింది.
2000 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ హవాయిలో వున్న కాల్‌మోగ్రా చెట్టుకి ఏలిస్ బాల్ అని పేరు పెట్టారు. అదేరోజు హవాయి లెఫ్టినెంట్ గవర్నర్ ఫిబ్రవరి 29 ని ఎలిస్ బాల్ డే గా గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ హవాయి ఇప్పుడు ఆమె పేరిట ఒక వేతనాన్ని ప్రకటించింది. అక్కడి ఎర్త్ సైన్సెస్ భవనానికి ఇప్పుడున్న పేరు “డీన్ బిల్డింగ్”. ఆ పేరు “బాల్ బిల్డింగ్” గా మార్చే ప్రక్రియ 2022లో మొదలైంది.
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.
ఏలిస్ బాల్ గురించి శారద గారు వ్రాసిన వ్యాసం చాలా గొప్పగా ఉంది. ఎవరికీ పట్టని వారి గురించి, వెలివేయ బడ్డ వాళ్ళగురించి అంత ప్రేమ, కరుణ హృదయమంతా నింపుకుని ఆ పరిశోధనలకై ప్రాణాలను సహితం లెక్కచేయని ఏలిస్ బాల్ కుష్టు వారికి అడగకుండానే వరాలిచ్చిన దేవతలాగ నాకు అనిపిస్తున్నారు. నా హృదయం ఆవిడ నిబధ్ధతకి, నిస్వార్థతకి, నివాళులర్పిస్తోంది. డీన్ స్వార్థం, హాల్ మాన్ నిజాయితీ, కేథ్రన్ టకరా, స్టాన్లీల కృషి అన్నింటి గురించి బాగా వ్రాసారు. ఆవిడ చనిపోయిన శతాబ్దం తరువాత (సుమారు) ఆవిడకి గుర్తింపు రావడం బాధాకరం. అప్పుడైనా రావడం ముదావహం. ఆంత మంచి వ్యాసం అందించిన శారద గారికి ఎన్నో అభినందనలు, కృతజ్ఞతలు కూడా.