రాగసౌరభాలు-3

(మాయామాళవగౌళ రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

చెలులూ! సంగీతార్థులు మొదట నేర్చుకునే రాగం ఏమిటో తెలుసా?  కర్ణాటక సంగీతం మాయామాళవగౌళ రాగంతో మొదలవుతుంది. ఈ రాగమే ఎందుకు ముందు నేర్పిస్తారు? ఈ పద్ధతిని ఏర్పరచిన వారు ఎవరు? ఈ రాగ లక్షణాలు, ఉపయోగాలు
మొదలైన అంశాలను తెలుసుకుంటూ, ఈ రాగసౌరభాన్ని ఆఘ్రాణిద్దామా?

ముందుగా ఈ రాగ లక్షణాలు తెలుసుకుందాం. మాయామాళవగౌళ 72 మేళకర్తలలో 15వ రాగం. మేళకర్త అవటం వలన సంపూర్ణ రాగం. ఈ రాగంలో షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలినిషాదం స్వర స్థానాలు. ఏ సమయంలో అయినా పాడదగిన రాగమే కానీ, ప్రభాతసమయం శ్రేష్టమైనది. శాంతరస, కరుణరస ప్రధానమైన రాగం. ఉషాకిరణాల మధ్య ప్రకృతితో మమేకమై పాడితే చక్కని ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మానందాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుంది.

1484 – 1564 మధ్య జీవించిన అద్భుతమైన వాగ్గేయకారులు శ్రీ పురందరదాసుల వారు. వీరే సంగీతానికి ఒక నిర్దిష్టమైన పాఠ్యప్రణాళికను రూపొందించారు. సరళీస్వరాలు, జంటస్వరాలు, హెచ్చుస్థాయి తగ్గుస్థాయి స్వరాలు, అలంకారాలు – ఈ విధంగా ఒక వరుస క్రమంలో ప్రణాళికాబద్ధ రచన చేశారు. వీటన్నిటికీ మాయామాళవగౌళ రాగమే సరి అయినదని నిర్దేశించారు. 10 -15 సరళీస్వరాలు పూర్తి అయ్యేసరికి సప్తస్వరాల మీదపట్టు
సాధించాలి . స్వరస్థానాలను ఔపోసన పట్టగలగాలి. జంటస్వరం కేవలం రెండు స్వరాల ను కలిపి పాడటం కాదు, జంటలో రెండవ స్వరాన్ని నొక్కిపాడాలి. గమకానికి ఇదే తొలి మెట్టు. ప్రతి విద్యార్థికి వారి గాత్రధర్మాన్ని అనుసరించి ఒక శృతి ఉంటుంది. అంటే “స” నుంచి పై “స” వరకు పాడగలిగే స్థాయి. హెచ్చుస్థాయి, తగ్గుస్థాయి స్వరాలు పై స్థాయిలో “ప” వరకు, కింది స్థాయిలో “ప” వరకు పాడగలిగే అభ్యాసాన్ని ఇస్తాయి. ఇక అలంకారాలు ఏడుతాళాలు, వివిధ జాతులతో పాడేందుకు ఉపకరిస్తాయి. ఇంత వరకు యామాళవగౌళ రాగంలోనే శిక్షణ సాగుతుంది. గీతాల నుంచి వివిధ రాగాలకు, సాహిత్యానికి అవగాహన మొదలవుతుంది. ఈ విధంగా అనేక కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యాసాలను ఏర్పరచి శ్రీ పురందరదాసుల వారు, సంగీత పితామహులయ్యారు. సంగీతశాస్త్రానికి ఎనలేని సేవనందించారు.

ఇక మాయామాళవగౌళ రాగాన్నే ఎందుకు నేర్చుకోవాలి అనటానికి కొన్ని ముఖ్య కారణాలు ఏమిటో చూద్దాం. ఈ రాగంలో “స రి గ మ” పూర్వార్ధం, “ప ద ని స” ఉత్తరార్ధంగా తీసుకుంటే రెండింటిలోనూ స్వరాల మధ్య దూరం ఒకే రకంగా ఉంటుంది. అంటే పూర్వార్ధం, ఉత్తరార్ధం ఒకే రకమైన పోలిక కలిగి ఉంటాయి. అందువలన శిక్షణ పొందే వారికి తేలికగా ఉంటాయి. ఈ అభ్యాసాలను విద్యార్థులు తెల్లవారుఝామున సాధన చేయటం వలన స్వరకండరాలు ఉత్తేజితమై, చక్కని గాత్ర సౌలభ్యం కలుగుతుంది. ఈ రాగాన్ని భక్తి ప్రపత్తులతో పాడితే మనలోని కుండలినీ శక్తి ని జాగృతం చేయగలదట.

హిందుస్తానీ సంగీతంలో ఈ రాగాన్ని పోలిన రాగం “భైరవ్”. కానీ హిందుస్తానీ సంగీతంలో ఈ రాగాన్ని ప్రధమంగా నేర్పించరు. ఈ రాగం శరీరంలోని టాక్సిన్స్ ని తగ్గిస్తుందని, నిద్రలేమి, నరాల బలహీనత, సైనస్ వంటి బాధలను తగ్గిస్తుందని
నమ్ముతారు.

ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఆ రోజుల్లో త్యాగరాజుల వారి ఇల్లు నిత్యం సంగీత సభలాగా ఉండేదట. త్యాగయ్య గారు గానం చేయడం, శిష్యగణం శ్రద్ధగా  వినినేర్చు కోవడం జరుగుతూ ఉండేవట. రోజూ ఒక భక్తుడు శ్రద్ధగా విని వెళ్ళేవాడట. కొంతకాలం తర్వాత ఆ భక్తుడు త్యాగరాజస్వామితో తానెంత ప్రయత్నించిన సరిగా పాడలేక పోతున్నానని, తన పై కృపతో తాను తేలికగా పాడుకొని తరించగలిగేలాగా ఒక కీర్తనని ప్రసాదించమని అర్థించాడట. త్యాగరాజస్వామి ఆయన పై దయతో  మాయామాళవ గౌళరాగంలోనే “గురి తప్పక” అనే కీర్తనను రచించి ఇచ్చారట. ఇది సులువైన రాగం అని చెప్పటానికి ఇది ఒక తార్కాణముగా నిలుస్తుంది.

ఇక ఈ రాగంలోని కొన్ని రచనలు చూద్దామా

శాస్త్రీయ  సంగీతం
1 తులసి దళములచే

https://youtu.be/6aFFa6fHoiY?si=tYXdZOCMwORvy50K

త్యాగరాజు
2 మేరుసమాన ధీర త్యాగరాజు
3 విదులకు మ్రొక్కెద త్యాగరాజు
4 మాయాతీత  స్వరూపిణి పొన్నయ్య పిళ్ళై
5 దేవదేవ  కలయామితే స్వాతి తిరునాళ్
6 శ్రీనతాది గురుగుహో  జయతి ముత్తుస్వామి  దీక్షితులు
లలిత సంగీతం
1 ఎందుకయ్యా సాంబశివ

https://youtu.be/DULX4WYJQL8?si=uAX8tc38qkRPE2KA

దేవులపల్లి పాలగుమ్మి  విశ్వనాథం
2 జయరామలింగేశ్వర సి.నారాయణరెడ్డి పాలగుమ్మి  విశ్వనాథం
3 శాంతికోసం  సమతకోసం జె. బాపురెడ్డి పాలగుమ్మి  విశ్వనాథం
4 ఈరేయి నన్నొల్లనేరవా  రాజా నండూరి సుబ్బారావు ఎమ్మెస్  రామారావు
సినీ  సంగీతం
1 ఏ నిమిషానికి  ఏమి జరుగునో

https://youtu.be/fwL5AiH_jMw?si=o_c3S2xhBH5wKKC_

లవకుశ
2 మా పాపాలు  తొలగించు షిరిడి  సాయిబాబా
3 యమహో  నీ యమా యమా  అందం జగదేకవీరుడు  అతిలోక సుందరి

ఇవండి మాయామాళవగౌళ రాగవిశేషాలు మరొక చక్కని రాగసౌరభంతో వచ్చే నెల  కలుద్దామా..సెలవు మరి.

*****

Please follow and like us:

6 thoughts on “రాగసౌరభాలు- 3 (మాయామాళవగౌళ రాగం)”

  1. రాగాల గురించి మీరు రాస్తున్న అంశాలు చాలా బాగున్నాయి. సంగీతం నేర్చుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. మా టీచరు స్వర స్థానాల పేర్లు చెప్పకుండా ఒకటో రి, రెండో రి… ఇలా చెప్పేవారు. దానికి తోడు నా దురదృష్టం కొద్దీ కొన్నాళ్లకే సైనస్‌ సమస్య పెరిగి గాత్రం మానేయాల్సి వచ్చింది. అయినా వదలకుండా వీణ నేర్చుకున్నాను. కానీ స్వరస్థానాల గందరగోళం మాత్రం నన్ను చాలాకాలం వదలలేదు. మొత్తానికి సాధన అటక ఎక్కించి థియరీ మాత్రం బాగా చదువుకుని సంతృప్తి చెందా.

  2. వ్యాసం చాలా బాగుంది. ఈ పరంపర చాలా బాగుందందీ. ధన్యవాదాలు.
    శారద (బ్రిస్బేన్)

  3. సంగీత విద్యాభ్యాసంలో తొలిగా అందరం నేర్చుకున్న రాగం – మాయామాళవ గౌళ రాగం. ఈ రాగం గురించి ఎంతో వివరంగా వివరించారు వాణీ అక్కా… ఈ రాగంలో ఆయా సంగీత సంప్రదాయాలలో ఉన్న మంచి మంచి కీర్తనలను, లలితగీతాలను, సినీగీతాలను ప్రస్తావించారు. చాలా బాగుంది, మీ శీర్షిక.

Leave a Reply to Vani n c Cancel reply

Your email address will not be published.