
పౌరాణిక గాథలు -24
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
అల్పత్వము – నహుషుడు కథ
నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు.
నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం.
త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు.
తండ్రి కోరిక ప్రకారం విశ్వరూపుడు ఇంద్ర పదవికోసం తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. తన పదవికి భంగం వస్తుందన్న భయంతో ఇంద్రుడు విశ్వరూపుడి తపస్సుని భగ్నం చెయ్యాలనుకున్నాడు.
అందుకోసం విశ్వరూపుడి దగ్గరికి అప్సరసల్ని పంపించాడు. కాని వాళ్లు అతడి తపస్సుకి భంగం కలిగించ లేకపోయారు. విశ్వరూపుడు దేనికీ లొంగట్లేదు.
ఇంద్రుడికి భయం పెరిగిపోతోంది. తన పదవికి విశ్వరూపుడు అడ్డు పడతాడేమో అనే అనుమానంతో ముందు వెనుకలు ఆలోచించకుండా అతడి తల నరికేశాడు.
త్వష్టప్రజాపతికి ఇంద్రుడు విశ్వరూపుణ్ని చంపేశాడన్న విషయం తెలిసింది. ఇంద్రుడి మీద కోపంతో హోమగుండం నుంచి వృత్రాసురుణ్ని పుట్టించాడు.
అప్పటికే బ్రాహ్మణ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో అనే భయంతో ఇంద్రుడు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు.
దేవతలు ఇంద్రుడికోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఇంద్రుడి సింహాసనం ఖాళీగా ఉంది. అతడు లేకపోతే యజ్ఞ కార్యక్రమాలు ఆగిపోతాయి.
ఏం చెయ్యలా…అని దేవతలు ఆలోచిస్తున్నారు. తమతో కలిసి స్వర్గ లోకంలో నివసించక పోయినా… దైవత్వాన్ని పొందినవాళ్లు ఎవరయినా ఉంటే…అతణ్ని ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోపెట్టవచ్చు.
అటువంటి వాళ్లు ఎవరయినా ఉన్నారేమో అని దేవతలు భూలోకంలో వెతుకు తున్నారు.
నహుషుడు దైవత్వాన్ని పొంది ఉన్నాడు. దేవతలు నహుషుడికి కబురుపెట్టారు. నహుషుడు వచ్చి దేవసభకి నమస్కారం చేశాడు.
దేవతలు అతణ్ని సాదరంగా ఆహ్వానించారు. ““మహారాజా! ప్రస్తుతం ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంద్రుడి సింహాసనం ఖాళీగా ఉండకూడదు. ఆ సింహాసనా నికి అన్ని విధాలా అర్హులైన మిమ్మల్ని నియమించాలని మా అందరి అభిప్రాయం”” అన్నారు దేవతలు.
నహుషుడు సంతోషంగా అంగీకరించాడు. దేవతలు నహుషుణ్ని ఇంద్ర పదవికి అర్హుడిగా ప్రకటించి ఆ పదవి అతడికి అప్పగించారు.
కొంతకాలం గడిచాక ఇంద్ర పదవిలో ఉన్న నహుషుడిలో చాలా మార్పు వచ్చింది. ఇంద్రుణ్ని అనే అహంకారం పెరిగింది. పూర్వం అతడిలో ఉండే మంచితనం, దైవభక్తి, నీతి, నియమాలు అన్నింటినీ వదిలేశాడు.
దేవతల్ని, మహర్షుల్ని బాధపెట్టడం మొదలెట్టాడు. అతడి ఆగడాలు పెరిగి పోయాయి. ఇంద్ర పదవికి అవసరమైన లక్షణాలు ఇప్పుడు అతడిలో మచ్చుకైనా లేవు.
ఇంద్రుడు అవడానికి తన గొప్పతనమే కారణమన్న అహంకారంతో ఉన్నాడు. మహర్షులు హెచ్చరిస్తున్నా కూడా లెక్కచేయనంతగా అహంకారం అతడి కళ్లు కప్పేసింది.
ఒకరోజు నహుషుడు దేవతల్ని రమ్మని సభ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తను ఇంద్రుడు కాబట్టి శచీదేవి కూడా తనదేనని ప్రకటించాడు. వెంటనే ఆమెని తన దగ్గరికి పంపించమని కబురుచేశాడు.
దేవతలు శచీదేవి దగ్గరికి వెళ్లి నహుషుడు చెప్పిన విషయాన్ని తెలియచేశారు. శచీదేవి దేవతల గురువు బృహస్పతిని సలహా అడిగింది.
ఆయన సలహా ప్రకారం మహర్షుల్ని బోయీలుగా చేసుకుని వాళ్లతో పల్లకీ మోయించుకుంటూ తన దగ్గరికి రమ్మని నహుషుడికి కబురు చేసింది.
శచిదేవి కబురు విని నహుషుడు మహర్షుల్ని పిలిపించాడు. వాళ్లని బోయీలుగా చేసుకుని శచీదేవి దగ్గరికి పల్లకీలో బయలుదేరాడు.
అతి పవిత్రులైన మహర్షులు పల్లకీని మోస్తుంటే పల్లకీలో కూర్చున్న నహుషుడు గర్వంతో వేదాల్ని, మంత్రాల్ని, మహర్షుల్ని హేళనగా మాట్లాడుతూ బ్రాహ్మణుల్ని అవమానపరిచాడు.
పల్లకి మోస్తున్న మహర్షులు అతడి మాటలు విన్నారు కాని, అతడికి ఏ సమాధాన మూ చెప్పలేదు. అందువల్ల నహుషుడు ఇంకా రెచ్చిపోయాడు.
ప్రయాణం చేస్తున్నంత సేపు మహర్షుల్ని అవమాన పరుస్తూనే ఉన్నాడు. ఇంద్ర పదవిలో ఉండి మహర్షుల్ని అవమాన పరచడం మంచిది కాదని అగస్త్య మహర్షి నహుషుడికి చెప్తూనే ఉన్నాడు.
వృద్ధుడు, మహా తపస్సంపన్నుడు అయిన ఆయన మాటల్ని గౌరవించలేదు. మితిమీరిన అహంకారంతో గొప్ప తపస్సంపన్నుడైన అగస్త్య మహర్షిని కాలితో తన్నాడు.
కోపమే తెలియని మహర్షికి చాలా కోపం వచ్చింది. ““నహుషా! నువ్వు మంచివాడివి, భగవంతుని యందు భక్తి కలవాడివి, యజ్ఞయాగాదులు చేసినవాడివి అని నీకు ఇంద్ర పదవి ఇచ్చి గౌరవించాము.
కాని, పదవి రాగనే నీకు గర్వంతో కళ్లు మూసుకుని పోయాయి. ఇప్పుడు నువ్వు ఇంద్ర పదవికి అర్హుడివి కాదు. పామువై జీవించు!“” అని శపించాడు. వెంటనే నహుషుడు పాముగా మారి పల్లకీలోంచి జారి కింద పడ్డాడు.
నహుషుడికి అప్పటికిగాని తన అహంకారం ఎక్కడికి చేరిందో తెలియలేదు. అపర బ్రహ్మలవంటి బ్రహ్మర్షుల్ని ఏ విధంగా అవమనించాడో అప్పటికి అర్థమయింది.
మనిషిగా యజ్ఞయాగాదులు చేసి మహర్షుల్ని మెప్పించి, బ్రాహ్మణుల ఆశీర్వాదం పొంది, దేవతలతో సమానంగా గౌరవింపబడి అంత అల్పుడిగా మారిపోయినందుకు బాధపడ్డాడు.
తన తప్పు తెలుసుకుని కుమిలిపోతూ మహర్షుల్ని క్షమించమని వేడుకున్నాడు. పాము రూపంలో ఉన్నా కూడా అతడికి పూర్వజ్ఞానం ఉంటుందనీ… అతడు వేసిన ప్రశ్నలకి ఎవరయితే సమాధానం ఇస్తారో వారి వలన శాపవిమోచనం అవుతుందని చెప్పాడు మహర్షి.
ఉన్నతస్థితికి చేరుకోగానే…పూర్వపు స్థితిని మర్చిపోయి అల్పులుగా మారకూడదు!
*****

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి పేరుతో బాల సాహితీవేత్తగా అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరించిన ముంగిటిముత్యాలు బాలల గేయ కావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిధ్ధ రచన. ఇప్పటి వరకూ 116 మహర్షుల చరిత్రలు, అవతారాల కథలు, అనే పరిశోధనాత్మక రచనలు, యోగి వేమన జీవిత చరిత్ర, బంగారుకలలు, కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారా అనేక జాతీయ సదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను. తానా, అమెరికా వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలుగువారి పండుగలపైన నా పరిశోధనాపత్రం ప్రశంసలు పొందింది. 2010లో వంగూరు ఫౌండేషన్ వారి అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,. శ్రీ శ్రీ బాలసాహిత్యం వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. బందరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసంగం చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామంగా వస్తున్నాయి. కనకదుర్గ ప్రభ, భక్తిసుధ, చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఉయ్యూరు సరసభారతి వారు, కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అందించి గౌరవించారు. విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరించారు. వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
