
‘నియంత అంతం’ నవలా సమీక్ష
-పి. యస్. ప్రకాశరావు
ఆకార్ పటేల్ ఇంగ్లిష్ లో రాసిన ‘ఆఫ్టర్ మెస్సయ్య’ నవలకు ఎన్. వేణుగోపాల్ గారి తెలుగు అనువాదమే నియంత అంతం. సర్వమూ తానే అయి చక్రం తిప్పిన పెద్దాయన (నవల చివరివరకూ ‘పెద్దాయన’ అనే ఉంటుంది. ఆయన ఎవరో ఊహించడం మనకు కష్టం కాదు). అర్ధాంతరంగా అశువులు బాసాక, అధికారం కోసం జరిగిన కుమ్ములాట, అప్పటివరకూ ఐస్ బెర్గ్ లా బయటకు కన్పించని పెద్దాయన కపట స్వభావం, చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలూ బహిర్గతం కావడంతో ‘నియంత అంతం’ అనే పేరు తగినదే అనిపిస్తుంది. శ్రీ శ్రీ అన్నట్టు ‘ఎవడైతెనో ఒక్కొక్కడూ మహా హంతకుడు’ అని పిస్తుంది పాఠకుడికి.
పెద్దాయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఆ స్థలాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. పెద్దాయన, సూర్యుడు ఎక్కడ ఉన్నాడో, ఏ దిక్కునుంచి తీస్తే తన ఫోటోలు బాగా వస్తాయో చూసుకున్నాడు. జాతీయ పతాకం ఎగిరినట్టు కనిపించేలా రంగులు వేసిన పావురాలు ఎగరేయడం మీద శ్రద్ధ చూపాడు. వేదిక మీద ఆయనపై స్తోత్ర పఠనం సాగుతోంది. ముందుగా గత ప్రభుత్వాల వైఫల్యాలపై దుమ్మెత్తి పోశాడు. తరువాత తమ ప్రభుత్వ ఘనకార్యాలను కీర్తించాడు. ప్రారంభోత్సవానికి మీట నొక్కి అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఆర్భాటమూ హంగులేతప్ప ఇంకా కనీస సౌకర్యాలు సమకూర్చని ఆ ఆసుపత్రి చికిత్సకు పనికి రాలేదు. అక్కడ మొదలవుతుంది కథ.
పెద్దాయన ప్రభుత్వంలో ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా మెలిగిన జయేష్ భాయి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వామీజీల మధ్య అధికారం కోసం కుమ్ములాట మొదలవుతుంది. వారి వారి మార్గాలలో ప్రయత్నాలు మొదలు పెడతారు. జయేష్ భాయికి గానీ స్వామీజీకి గానీ చట్టసభలో తగినంత సంఖ్యా బలం లేదు.
పార్టీ వ్యవస్థాపకుల్లోని ఒక సీనియర్ నాయకుడి కూతురు మీరా ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. ఆమె న్యాయశాస్త్రం చదివింది. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉంటుంది. ఒక బడి పెట్టి వారిని రక్షించే చట్టాల గురించి వివరించేది. ఇప్పుడు ఉన్నత పదవి చేపట్టింది. ఆదివాసీల కోసం ఏదైనా ఓ మంచిపని చేయాలనుకుంటుంది. ఆమె లక్ష్యాలు పెద్దవి కాదు. అందరికీ కూడూ గూడూ గుడ్డా కావాలని, విద్య, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదనేలాంటి పెద్ద పెద్ద ఆశయాలు కాదు. కేవలం ఆదివాసీల భూములను ఆక్రమించడానికి వీలు కల్పించే చట్టాలను ఉపసంహరించి కొత్త చట్టాన్ని తీసుకురావాలను కుంటుంది. ఆ చిన్న పనికే మీరాకి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతాయి. చివరికి నిరుత్సాహంతో పదవికి రాజీనామా చేస్తుంది.
జయేష్ భాయి మేకవన్నె పులి. ‘చట్టవ్యతిరేక గూఢచారి పాత్ర’ పోషిస్తుంటాడు. ఎవరు ఎవర్ని కలుస్తున్నారు? వారి ఫోన్ సంభాషణలు, వాట్సప్ లో ఎవరు పెట్టిన పోస్టుకి ఎవరు లైక్ కొడుతున్నారు? అనేవిషయాలు సేకరించి. వాటిని తన మార్గానికి అడ్డు తగిలేవారిపై బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు తనకు పదవి దక్కదని తెలుసుకున్నాడు. మీరా పదవిలోకి వచ్చిన వెంటనే అతని మొదటి ఆలోచన ‘ ఈమె మీద మన నిఘా వర్గాలు పోగు చేసిన సమాచారం ఏమైనా ఉందా?’ అనేది. మీరాను అప్రతిష్ట పాలు చేయడానికి అప్రస్తుతమైన ఆమె ప్రైవేట్ విషయాలు బహిర్గతం చేస్తాడు. ఆమె పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిందనీ, ఆ బిడ్డకు తండ్రి విదేశీయుడనీ‘ ఆ బిడ్డ దేశ ద్రోహులతో చేతులు కలిపి’ ( నిజానికి ఆమె ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతోంది), ఇప్పుడు జైలులో ఉందనీ (జైలులో పెట్టించింది ఈయనే) మీడియాకు వెల్లడిస్తాడు. యాంకర్ అదే విషయాన్ని తిప్పి తిప్పి వ్యాఖ్యా నిస్తుంది. దానికి సూత్రధారి అయిన జయేష్ భాయి‘ చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటాడు. చట్టసభలో ఓటింగ్ పెట్టినపుడు సభ్యులందరికీ తాయిలాలు ప్రకటిస్తాడు. వాళ్ళని తీసుకెళ్ళి రిసార్ట్ సెంటర్ లో పెడతాడు. వాళ్ళ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉంచమనీ, వేరే వాళ్ళ ఫోన్లు వాడమని ఆదేశిస్తాడు.
స్వామీజీ ప్రధాన మంత్రి కార్యాలయంలో భావజాలపరమైన మిత్రులున్నారు. ఎన్నికైన ప్రతినిధుల మద్దతు ఉంది. పావులు నడపగల నేర్పు ఉంది. అదే నగరంలో మరొక చోట, తన వ్యాపార భాగస్వామితో ఒప్పందం చేసుకుంటాడు. ఆ వ్యాపారి తాను తయారు చేసే వినియోగ వస్తువులకు బ్రాండ్ కల్పించుకో వడానికి, మార్కెట్ పెంచుకోవడానికి, స్వామీజీ పేరు ప్రఖ్యాతులనూ, మతాన్నీ ఉపయోగించుకుంటాడు. ఆయన తయారు చేసే వస్తువులలో తల నూనెల దగ్గరి నుంచి టూత్ పేస్ట్ నుంచి పిండి నుంచి బట్టల దాకా అనేకం ఉన్నాయి. ఆ వ్యాపారం ఇటీవలనే పెట్టారు గాని, త్వరలోనే అది భారీ వ్యాపారం అయిపోయింది. స్వామీజీతో సంబంధం వల్ల బోలెడన్ని రుణాలు కూడా దొరికాయి. ఈ వ్యాపారంలో స్వామీజీకి భాగం ఉందనడానికి చట్టబద్ధమైన ఆధారం ఏమీ లేదు గాని, ఆయనే ఆ వ్యాపారానికి మూలస్థంభం. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.
ఇప్పుడు మీరా తీసుకొచ్చే చట్టానికి జయేష్ భాయి మనుషులు హాజరు కాకపోతే తగినన్ని ఓట్లు రావు. కానీ అతను ప్రజా ప్రతినిధులను తీసుకెళ్ళి రిసార్ట్ సెంటర్ లో దాచేశాడు. వాళ్ళపై ఉన్న క్రిమినల్ కేసులు బయటికి తీసి, బలప్రయోగం చేసి మొత్తం మీద వాళ్ళను పార్లమెంట్ సమావేశ గదికి తీసుకొచ్చారు. స్వాములు పాములకంటే ప్రమాదమని తెలిసినా మీరాకి తప్పలేదు. స్వామీజీ మద్దతు కోరకతప్ప లేదు. అతను మంత్రి వర్గ పునర్నిర్మాణంలో తన పక్షం వారికి పదవులివ్వాలని షరతు పెడతాడు. ఇక ప్రాంతీయ పార్టీల కోర్కెలు చూస్తే వింతగా ఉంటాయి. వాళ్ళందరికీ ఈ చట్టంలో ఏముందో అనవసరం. మేక దృష్టి అంతా మేతమీదే అన్నట్టు వాళ్ళ గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే చాలు మద్దతు ఇస్తారు. బదిలీలు, ఉద్యోగాలు, నియామకాలు, విదేశీ విద్యాసంస్థలో సీట్లు వగైరా.. కొంతమంది ఓ కాగితం మీద ఫోన్ నంబర్ లాగా ఒక సంఖ్య వేసిఇస్తారు. అది వాళ్ళు మద్దతు ఇవ్వడానికి డిమాండ్ చేసే డబ్బు. ( చిత్రం ఏమిటంటే అలా సభ్యులను కొనడానికి కార్యాలయానికి డబ్బు ఉంటుంది) బిల్లు వల్ల కలిగే ప్రయోజనంతో పార్టీల కోరికలను పోల్చి చూస్తే ఈ వ్యవహారాన్ని వదిలేయడమే ఉత్తమం అనిపించింది మీరాకి. ‘తాను చేయదలచుకోని పనుల బురదలోకి కూరుకు పోతున్నానని అనిపించింది’.
ఆదివాసీ సముదాయ ప్రతినిధులు తాము ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఎలా కార్యరూపం దాలుస్తుందో చూడటానికి వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు విధించిన షరతులు, కోరిన లంచాలు చూసి ’ మేం కోరుకున్నది ఇది కాదు. మాకు ఇది వద్దు’ అన్నారు. ‘ అసలు నేనీ మార్గంలో వెళ్ళడమే తప్పు’ అనుకున్న మీరా తన పదవికి రాజీనామా చేస్తుంది. వ్యవస్థలో మార్పు రావాలంటే పైపై పూతలు పనికి రావని, వ్యవస్థకు సమూల ప్రక్షాళన అవసరమని నవల ద్వారా మనకు తెలుస్తుంది.
నవల రాజకీయ ఊహా చిత్రానికి నవలా రూపం అని ముఖచిత్రం మీదే ఉంది. కానీ చదువుతుంటే వర్తమాన రాజకీయస్థితిగతులు మన కళ్ళముందు కదలాడతాయి. కింది అంశాలు చూడండి.
కార్ఖానాలకు ఖనిజవనరులు అందించడానికి గనులు కావాలి. ఆ గనుల నుంచీ, కార్ఖానాల నుంచీ వచ్చే విషపూరిత పదార్థాలను నిలువ ఉంచడానికి భూమి కావాలి.‘సొంత ఆస్తిని నిరంకుశంగా స్వాధీనం చేసుకోవ డానికి రాజ్యానికి అధికారం ఇచ్చే చట్టాలెన్నో ఉన్నాయి. అటువంటి స్వాధీనం న్యాయసమ్మతమైనదనీ, సకల జనుల ప్రయోజనాల కోసమనీ చెప్పే మేలిముసుగు మాటలూ ఉన్నాయి. ఇలా ఖనిజాల తవ్వకాలతో బలిసినవారి సంపద శతకోటీశ్వరుల జాబితాల్లోకి ఎక్కి సాధికారత పొందుతుంది. ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చినవారు, ఈ అంకెలను చూపెట్టి, లక్షలాది టన్నుల ఖనిజాన్నీ, కోట్లాది డాలర్ల సంపదనూ చూపెట్టి అవే తమ నాయకత్వపు విజయాలకు సూచికలుగా ప్రచారం చేసుకుంటారు. మరొక పక్క స్థానికు లేమో “అభివృద్ధి”ని ఆటంకపరిచినవారిగా నేరారోపణలు ఎదుర్కొంటారు. వారికి మద్దతుగా నిలబడిన వారు దేశద్రోహులుగా ఎత్తిచూపబడతారు.
చిత్రం ఏమిటంటే చట్టసభలో ఓటింగ్ కోసం జరిగే సమావేశంలో ఖనిజాల తవ్వకాలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీ మనుషులు కూడా ఉంటారు. అక్కడ రసాభాస తప్ప పెద్దగా పరిష్కారమయ్యేదేమీ ఉండదు. అక్కడ పని చేసేది చట్టాలు కాదు. అధికారం చేతుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళను ప్రభావితం చేసేవాళ్ళు మాత్రమే.
పెద్దాయన అందరిలోకీ జనాకర్షణ గలవాడు. ప్రపంచ నాయకులతో భుజాలు రాసుకుంటూ తిరిగేవాడు. ఒకటో రెండో రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది ఆయనకు పెద్దగా లెక్కలో లేదు. రాజ్యం అనేది ఆయనకు సేవ చేయడానికి మాత్రమే ఉంది. వీలయినప్పుడు, లేదా ఆయనకు చెయ్యడానికి మరే పనీ లేనప్పుడు మంత్రివర్గ సమావేశాలు అనేవి జరుగుతుండేవి. ఆయన తనను తాను ప్రజలకు ప్రదర్శించుకుంటూ ఉంటాడు. బీరువాల నిండా పెద్దాయన బట్టలే ఉన్నాయి. సందర్భాన్ని బట్టి, రంగును బట్టీ, రుతువును బట్టీ వేరు చేసి వరుస మీద వరుసగా ఎన్నో వరుసలదుస్తులు ఉన్నాయి. అలాగే మరి కొన్ని అరల నిండా అదనపు ఆహార్యపు వస్తువులు, టోపీలు, తలపాగాలు, శాలువాలు ఉన్నాయి. ఇది జాతిపితకు సంపూర్ణంగా వ్యతిరేక ధ్రువం లాంటి వ్యవహారం. ఆయన దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఉంటే ఆసమయానికి కలిసి వచ్చేలా ఏదొక ప్రారంభోత్సవం ఏర్పాటు చేస్తారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టానికి కోరలు పెంచుతూ సవరణలు తెచ్చారు. వ్యక్తులను కూడా తిరుగుబాటుదారులుగా, దేశద్రోహులుగా చూపుతూ, దాన్ని నిరూపించనవసరం కూడా లేకుండా చట్టాన్ని సవరించింది ప్రభుత్వం. ‘ప్రభుత్వం గనుక అభ్యంతరం చెపితే నిందితులకు బెయిల్ ఇవ్వడం అసాధ్యం’ అని దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అసలు నేరమే జరగకపోయినా, జరగబోయే నేరాన్ని ఆపడానికనే పేరుతో వ్యక్తులను ఈ చట్టం కింద నిర్బంధించవచ్చు. ఈ చట్టాన్నే రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించారు. వారికి విదేశీ హస్తంతో సంబంధం ఉందని ఆరోపించారు. సామాజిక కార్యకర్తల మీదా, మేధావుల మీదా ప్రయోగించారు.
చట్టసభ అనబడేది ఉంది, కాని అది క్రమం తప్పకుండా సమావేశం కావడం మినహా అసలు చర్చలే లేకుండా సాగింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఏ ఆదేశాన్ని కిందికి పంపితే అదే చట్టంగా చలామణీ అవుతుంది. రాజకీయ ప్రతిపక్షం అనబడేది ఉండింది గాని దాన్ని ఒక అంతర్గత శత్రువులలో చిత్రించడం మొదలయింది. వాళ్ల మీద రాజ్యమూ, రాజ్య సంస్థలూ ఎంత తరచుగా విరుచుకుపడ్డాయంటే వాళ్లకు నిజమైన రాజకీయాలలో పాలు పంచుకోవడం కంటే, జైలుకు వెళ్లకుండా ఉండేలా చూసుకోవడమూ. ‘దాడుల’ నుంచి రక్షించుకోవడమూ పెద్ద పని అయిపోయింది.
స్వాతంత్య్రదినోత్సవం జరపడానికి ఏడాదికొకసారి కోట మీద గణతంత్ర పతాక ఎగరవేయడం ఆనవాయితీ. కాని ఆ ఉత్సవం కూడా ఏలిక తనను తాను ప్రదర్శించుకోవడానికీ, గొప్పలు చెప్పుకోవడానికీ మరొక సందర్భంగా మారిపోయింది. అసమ్మతి అనే మాటకూ దేశద్రోహం అనే మాటకూ మధ్య విభజన రేఖ చెరిపివేయబడింది. ఏలిక పట్ల అసమ్మతి అంటే దేశద్రోహంగానే పరిగణించబడింది. అప్పటికే పూర్తిగా తయారై, వేలు పెట్టడానికి అవకాశం లేని స్థితిలో మాత్రమే ఫైళ్లు మంత్రుల సంతకాల కోసం వాళ్ల దగ్గరికి వచ్చేవి. వాళ్లు ఒకవేళ సంతకం పెట్టకపోయినా ఆ ఫైళ్లలో ఉన్న పనులు జరిగిపోతూనే ఉండేవి. వాళ్లకు సమాచారం లేకుండానే పథకాలు మారిపోతుండేవి.
రాజ్యం అనేది హింసాత్మక సాధనం. … నిర్బంధ పూరితమైనది. హింసాత్మక మైనది. రాజ్యం అంటే హింస మీద గుత్తాధిపత్యం ఉన్న సంస్థ…. అది హింసాత్మకంగా ఉండడం మాత్రమే కాదు. హింసను తన చేతుల్లో గుత్తాధికారంగా మార్చుకుంటుంది. అంటే అర్ధం దాని గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద దాడిచేస్తుంది’
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నట్టు లోకంలో పాపాలను పరిహరించడానికి భగవంతుడు ఒక సంపూర్ణ మానవుడిగా అవతరిస్తాడని, అతనికి పైన ఏ ఉన్నత అధికారమూ ఉండనక్కర లేదనీ మన విశ్వాసం. నిజం చెప్పాలంటే మతం సృష్టించిన కట్టు కథల్లో, చిన్న పిల్లల సాహిత్యంలో మాత్రమే అధికారాన్ని వివేకంతో ఉపయోగించి ప్రపంచంలోని చెడును నిర్మూలిస్తారు. వాస్తవ ప్రపంచం మనకు భిన్నమైన పాఠాలు నేర్పుతుంది.
*****

పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.