రాగసౌరభాలు-15

(నాటరాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

          ప్రియా మిత్రులారా! శుభాకాంక్షలు. క్రితం నెల మనము ఘనరాగ పంచగుచ్ఛము లోని ఆరభి రాగ వైభవాన్ని తెలుసుకున్నాము కదా? ఈ నెల ఆ గుచ్ఛములోని మొదటి రాగమైన నాటరాగ సౌరభాన్ని ఆస్వాదిద్దాము.

          “ఆది నాట, అంత్య సురటి” అని నానుడి. కచేరిని నాట రాగంతో మొదలుపెట్టి సురటి రాగంతో సంపూర్ణం చేస్తే మంగళప్రదంగా ఉంటుందని పెద్దల ఉవాచ. పెళ్లిళ్లు పేరంటాలలో కూడా నాదస్వర విద్వాంసులు నాటరాగంలోని “మహా గణపతిమ్” కీర్తనతో ప్రారంభించటం కద్దు.

          నాట రాగం చాలా పురాతనమైనది. సంగీత రత్నాకరం,సంగీత మకరందం, చతుర్దండి ప్రకాశిక వంటి పురాతన గ్రంధాలలో ప్రస్తావించబడింది.

          ఈ రాగం వివరాలలోకి వస్తే, ఇది 36వ మేళకర్త చలనాట రాగ జన్యము. ఆరోహణ, అవరోహణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

 స రీ గ మ ప దా ని స

స ని ప మ రీ స

          ఇందులోని స్వరాలు షడ్జమ్, షట్శృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్శృతి దైవతం, కాకలి నిషాదము. అవరోహణలో దైవతం, గాంధారం వర్జములు కనుక వర్జ రాగము. జన్య రాగము కనుక ఉపాంగ రాగము. సంపూర్ణ ఔడవ రాగము. మరొక విశేషము ఇది వివాది రాగము. కొందరు సంగీతకారులు 12 శుద్ధ స్వరాలకు మరి నాలుగు స్వరాలను కలిపి 16 స్వరాలను కల్పించారు. అవి. షట్శృతి రిషభము, శుద్ధ గాంధారము, షట్శృతి దైవతము, శుద్ధ నిషాదములు. ఈ స్వరములు కలిగిన రాగాలను వివాది రాగములుగా పిలుస్తారు.

          పూర్వము ఈ రాగాన్ని సంపూర్ణ రాగంగా పేర్కొని, 72 మేళకర్తల పథకం కోసం “చల” అన్న అక్షరాలు కలిపినట్టు భావించేవారట. కొందరు ఆరోహణ లో “పదనిస” అంగీకరిం చక “పనిస” గానే పాడేవారట. త్యాగయ్య గారి పంచరత్న కీర్తన అలానే నడిచింది. నేడు సార్వజనీనంగా మూర్చన “స రీ గ మ ప దా ని స ” “స ని ప మ రీ స ” వాడబడుతోంది. రిషభం దీర్ఘ కంపిత స్వరంగా పాడ బడుతుంది.  వెంకటముఖి ఈ రాగాన్ని రాగాంగ రాగంగా పేర్కొన్నారు.

          ఏ సమయంలోనైనా పాడ తగినదే కానీ సాయం సమయం శ్రేష్ఠము. త్రిస్థాయి రాగము. రి గ మ స్వరాలు స్వల్ప విరామంతో కలిసి ఉండటం, వివాది స్వరం కలిగి ఉండటం వలన మత్తు వంటి హాయిని కలిగిస్తుంది. రిషభ గమకంలోని ఊయల వంటి ఊపు ఈ రాగానికి అందాన్ని, రాజసాన్ని కలుగజేస్తుంది. వీర, భక్తి, వాత్సల్య రసాలను ప్రదర్శించగలదు.

          హిందూస్తాని సంగీతంలో నాట రాగం ఉన్నా కర్ణాటక సంగీతం లోని నాటతో పోలిక లేదు. హిందూస్తాని జోగ్ రాగం మన నాట రాగానికి దగ్గర రాగము. నాట రాగంలో గణపతి కీర్తనలు ఎక్కువగా రచింపబడ్డాయి. వీణ పై నాట తానం అద్భుతంగా రాణిస్తుంది.

          త్యాగరాజస్వామి తన మొదటి పంచరత్న కీర్తన ఈ రాగం లోనే రచించారు. మిగిలిన నాలుగు పంచరత్న కీర్తనలు తెలుగులోనే రచించినా నాట పంచరత్న కీర్తన మాత్రం సంస్కృతంలో రచించారు. రాజసం కలిగిన   ఈ  రాగమే ఆయనచే గంభీరమైన సంస్కృత పంచరత్న కీర్తనకు శ్రీకారం  చుట్టించిందేమో.  ఈ రాగం పాడాలంటే బలమైన ఊపిరి శక్తి కావాలి.

ఇక ఈ రాగంలో కొన్ని రచనలు పరిశీలిద్దామా?

శాస్త్రీయ సంగీతం

  1. గీతం         హరిహర వినుత           ఆదితాళం
  2. కీర్తన         జగదానందకారక          ఆదితాళం                       త్యాగయ్య
  3. కీర్తన         నిన్నే భజన                  ఆదితాళం                       త్యాగయ్య
  4. కీర్తన         మహా గణపతిమ్           ఏక తాళం                       దీక్షితులు
  5. కీర్తన         స్వామినాధ                   ఏక తాళం                       దీక్షితులు
  6. కీర్తన         పవనాత్మజ                  ఝంపే తాళం                దీక్షితులు
  7. కీర్తన         సరసిరుహాసనప్రియే  ఆది తాళం                     దీక్షితులు

సరసిరుహాసనప్రియే: https://youtu.be/WcBFCY_2fuM?si=uFxNVHcwfReBlVtr

 అన్నమాచార్య కీర్తనలు

  1. చక్రమా హరి చక్రమా                     బాలకృష్ణ ప్రసాద్
  2. మర్ద మర్ద మమ బంధాని              బాలకృష్ణ ప్రసాద్
  3. ఇటు గరుడుని నీవెక్కినను          బాలకృష్ణ ప్రసాద్

మర్ద మర్ద మమ బంధాని: https://youtu.be/JL14e90l5xg?si=EXUNsASJs2GsDsMM

 

సినిమా సంగీతం

  1. ప్రణతి ప్రణతి           స్వాతి కిరణం                                  బాలు, వాణిజయరాం
  2. పంచమ స్వరగతి     ప్రేమ పల్లకి                                     బాలు, ఉన్ని కృష్ణన్
  3. చెన్నైచంద్రమ         అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి    చక్రి ,శ్రేయ

 

ప్రణతి ప్రణతి: https://youtu.be/gbWelWFol3w?si=RffuXTZKOzz1crRw

          ఇవండీ రాజసమైన, అందమైన, మత్తుగొలిపే నాటరాగ విశేషాలు.  వచ్చేనెల మరొక అద్భుతమైన రాగం గురించి తెలుసుకుందాము.

అంతవరకు సెలవా మరి?

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.