వెనుతిరగని వెన్నెల(భాగం-70)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది.

***

          తన చేతుల మీద ఇల్లు నడవడం ప్రారంభించేక డబ్బు ఎంత వృథా అవుతుందో అర్థం కాసాగింది తన్మయికి. ఇంట్లో ప్రతి ఒక్కరినీ సరిదిద్దాల్సిన అవసరం కూడా అర్థమైంది.  

          ప్రభు చేసినట్టు జీతమంతా వాళ్ల చేతుల్లో పోసి, నచ్చినట్టు చేసుకోమనడం వంటివి తన్మయి చెయ్యకపోవడం వాళ్లకి కినుకగా ఉన్నా, డబ్బు సంపాదించే వ్యక్తిగా తను ఎలా ఇంటిని పొదుపుగా నడపాలనుకుంటుందో అలా నడపడం మొదలుపెట్టింది. 

          నిత్యావసర వస్తువులు, కరెంటు, ఇంటర్నెట్టు వంటి తప్పనిసరి బిల్లులు కాకుండా ప్రతి ఒక్కరి ఇతర ఖర్చుల లిస్టు రాసి పట్టుకు రమ్మని రాణిని పురమాయించింది. 

          ఆ సాయంత్రం రాణి తెచ్చిన చీటీలో “మందులు” అని ఉన్న ఒకే ఒక్క పదం, పక్కన ఉన్న నంబరు చూసి నవ్వొచ్చింది తన్మయికి. 

          మొత్తం ఇంటి ఖర్చు కంటే అధికమైన నంబరు అది.

          నెలకు “ఇన్ని వేల మందులు ఎవరికి అవసరమవుతున్నాయి? ఎందుకు అవసరమవుతున్నాయి? 

          బ్యూటీ పార్లర్లు, సినిమాలు, చుట్టాలుపక్కాల ఇళ్లకి, ఊళ్లకి ఊరికే వెళ్లి రావడానికి ఛార్జీలు, అవసరం ఉన్నా లేకపోయినా కనబడ్డ వస్తువులు, బట్టలు కొనుక్కోవడం… ఇలా అన్ని ఖర్చులూ కలిపి మందులు అని వేస్తే ప్రభులా మాట్లాడకుండా వాళ్ల చేతుల్లో పెట్టెయ్యాలన్న వాళ్ల ఆలోచనని మొగ్గలోనే తుడిచెయ్యాలి. కానీ ఇలా అడ్డుకట్ట వెయ్యడం వల్ల వాళ్లకి తనపై ద్వేషం పెరగడం తప్ప డబ్బు ఎలా ఖర్చు చేయాలన్న ది అర్థం కాదు.” ఆలోచనలో పడింది తన్మయి. 

          “you will never come know the value of money unless you earn it” 

          “డబ్బు సంపాదించినప్పుడే దాని విలువ తెలుస్తుందని ఎవరో మహానుభావుడ న్నట్టు ముందు ఇంట్లో అందరినీ తలా ఒక పనిలో కుదర్చి ఎవరికి వాళ్లు కనీసం వాళ్ల పాకెట్ మనీ అయినా సంపాదించుకునేలా చెయ్యాలి”. అనుకుంటూ 

          “ఎవరికి ఏం మందులు కావాలన్నా మందుల చీటీలు ఇస్తే తనే ఇక మీదట అన్నీ కొనుక్కొస్తాను”  అని రాణితో చెప్పింది తన్మయి. 

          అదెంత దుమారం లేపుతుందో తెలుసు తనకి. చేతిలో ఉన్న పరిమితమైన వనరులతో ఇంత పెద్ద సంసారాన్ని నడుపుకు వస్తానని ప్రభుకి మాట ఇచ్చింది తను. ఇక మిగతా వాళ్లు సహకరించడం, సహకరించకపోవడం అన్నది వాళ్ల విజ్ఞతకే వదిలేసింది. 

          కుట్టుపని నేర్చుకున్న రాణిని కాలనీ చివర ఉన్న జీన్స్ కంపెనీలో జాయిను చేసింది. 

          ప్రైవేటుగా చదువుతున్న రాణి తమ్ముడు దాసుని మెడికల్ షాపులో సహాయకుడిగా ఉద్యోగంలో చేర్చింది. 

          పిల్లల్ని, తల్లితండ్రుల్ని కనిపెట్టుకుంటూ ఇంట్లోనే ఉన్న రాణి తల్లి మంగకి వంట, కేరేజీల పని అప్పగించింది. 

          పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లడం, తీసుకురావడం, కాయగూరలు, సామాన్లు వంటివి కొని తెచ్చే పనులన్నీ ప్రభు తల్లితండ్రుల వంతయ్యింది. 

          రోజల్లా కాలేజీకెళ్లొచ్చేసరికే అలిసిపోతున్నా, సాయంత్రం ఇంట్లో పిల్లలతో బాటూ, చుట్టుపక్కల ఉన్న వేరే వాళ్ల పిల్లలకీ ట్యూషన్లు  చెప్పడం ప్రారంభించింది తన్మయి.

          ప్రభు రోజల్లా ఇంట్లో ఉండి బిజీగా ఉద్యోగ ప్రయత్నాలకి  చదువుకుంటూ ఉండడం వల్ల,  సాయంత్రం ట్యూషన్లు కింది హాల్లో చెప్పడం ప్రారంభించడం వల్ల ఇరవై నాలుగ్గం టలూ మోగే టీవీకి మొదటగా చెక్ పడింది. ఇందువల్ల కరెంటు బిల్లు కొంతలో కొంత ఆదా అయ్యింది.

          ఇక ఎప్పుడూ మంచానికి జేరబడి నిద్రపోవడానికి ప్రయత్నించే ప్రభు తల్లికి తప్ప మిగతా వారికి కాస్త పనికొచ్చే పనుల మీద దృష్టి మళ్లింది.   

          రెండు నెలల్లో ఇల్లు ఒక కొలిక్కి వచ్చింది. 

          సేవింగ్సు లేకపోయినా కనీసం ఇల్లు సక్రమంగా గడుస్తుందన్న ధైర్యం వచ్చింది తన్మయికి. 

***

          ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రభు సాయంత్రం వస్తూనే తన్మయిని బండెక్కమని రోడ్డు మీద ఐస్ క్రీం పార్లర్ కి తీసుకెళ్లేడు. 

          “ఎలా జరిగింది ఇంటర్వ్యూ” అంది. 

          “అదే నీతో మాట్లాడాలి” అన్నాడు నడుమ్మీది తన్మయి చేతిని తన చేత్తో ప్రేమగా పట్టుకుంటూ. 

          “ఇంట్లో చెప్పకూడదా” అంది నవ్వుతూ. 

          “ఐస్ క్రీం పార్లర్ కొత్తగా పెట్టేరు. మనిద్దరమే కొంచెం సేపు కబుర్లు చెప్పుకోవడానికి అదే మంచి స్థలం. అయినా మనిద్దరం కలిసి బయటికి వెళ్లి ఎన్నో రోజులయిపోయింది” అన్నాడు.

          తన్మయికి ఎంతో సంతోషం వేసింది. తన మనస్సులో ఎన్నాళ్లుగానో ఉన్న కోరిక అది. 

          తన్మయికి ఇష్టమైన ట్రూటీప్రూటీ ఆర్డర్ చేసేడు. 

          “మరి నీకు?” అంది. 

          “నాకొద్దులే” అన్నాడు.

          బిల్లు గురించి ఆలోచిస్తున్నాడని అర్థమై 

          “సరే,ఇద్దరం ఇదే షేర్ షేసుకుందాం” అంది.

          గ్లాస్ డోర్స్ లోపల కూర్చునే సరికి బయటి రణగొణ ధ్వని తగ్గింది.  

          మెల్లగా చెప్పేడు ప్రభు.

          “ఉద్యోగం ఇస్తామన్నారు” 

          తన్మయి “ఇంత మెల్లగానా చెప్పడం. కంగ్రాట్స్. నాకు తెలుసు, నీకు వస్తుందని. హమ్మయ్య, ఇప్పుడు స్థిమితంగా ఉంది. ఇప్పటి వరకు చెప్పకపోతే ఏవైందో ఏవిటో అని ఖంగారు పడ్డాను ” అంది నవ్వుతూ.

          “కానీ…” అని ఆగి “నేనే ఆలోచిస్తున్నాను” అన్నాడు సంశయంగా.

          ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. 

          నీతో మాట్లాడేక నిర్ణయం తీసుకుందామని నా నిర్ణయం రేపు చెపుతానని చెప్పేను వాళ్లకి. 

          తన్మయి “అలాగే, నీకు నచ్చితేనే చేద్దువు, ఏవిటో చెప్పు” అంది.

          “ఇదొక కన్సెల్టెన్సీ కంపెనీ. యూ. ఎస్ లోని చిన్న కంపెనీకి పనిచెయ్యాలి. జీతం ఇంతకు ముందులా ఎక్కువ ఉండదు. కానీ వచ్చే ఏడాది హెచ్ వన్ అప్లై చేస్తే అమెరికా లోనే ఉద్యోగం చేసే అవకాశం ఉండొచ్చు.” అన్నాడు.

          “జీతం తక్కువైనా అన్నీ బానే ఉన్నట్టున్నాయి కదా, మరి ఆలోచనెందుకు?” అంది. 

          “ఇందులో కొన్ని చిక్కులున్నాయి. మొదటిది ఏవిటంటే వాళ్ల బెంగుళూరు ఆఫీసు నుంచి పనిచెయ్యాలి. వచ్చే జీతంలో అక్కడ లివింగ్ ఎక్స్ పెన్సెస్ కి ఎక్కువ భాగం పోతుంది. ఇక రెండోది జీతం తక్కువైనా దొరికింది కదా అని జాయినయ్యినా, వచ్చే ఏడాది ప్రాసెసింగు ప్రారంభించినా హెచ్ వన్ లాటరీ సిస్టం కాబట్టి తగలొచ్చు, తగలక పోవచ్చు. అలా ప్రతీ ఏడాదీ ప్రయత్నిస్తూ పోవల్సిందే. పైగా ఆ ఖర్చులన్నీ మనం పెట్టుకోవాలి. ఇక మూడోదీ, అతి ముఖ్యమైందీ నిన్నూ, పాపని వదిలేసి మరో ఊళ్లో ఉద్యోగం అంటేనే బెంగగా ఉంది.” అన్నాడు దిగులు నిండిన చూపులతో. 

          తన్మయి కూడా దిగులుతో ఆలోచనలో పడింది.

          నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభు ఏదో ఒక ఉద్యోగంలో సత్వరంగా కుదురుకో వడం అవసరం. కానీ పైవన్నీ అననుకూల పరిస్థితులే.

          పైకి మాత్రం “నీకేమనిపిస్తూ ఉంది?” అంది. 

          “ఇప్పటికే రెండు నెలలవుతూంది జాబ్ పోయి. ఇంటర్వ్యూలు చేసి చేసి విసుగ్గా ఉంది” అన్నాడు నిరాశగా. 

          “అలా నిరాశ పడకు. పోనీ జాయినవ్వు. అయితే జాయినయ్యే ముందు కొన్ని కండిషన్లు పెట్టి చూడు. ఒప్పుకుంటే కాస్తో కూస్తో మంచిది. మొదటిది వాళ్ల హైదరా బాదు బ్రాంచి నించి పని చెయ్యడానికి కుదురుతుందేమో కనుక్కో. ఒకవేళ టీంతో కలిసి తప్పనిసరిగా పనిచెయ్యాల్సి వస్తే, నెలకి ఒక వారం బెంగుళూరు వస్తానని చెప్పు. ఆ వారానికి, ఉండడానికి వాళ్లనే రెసిడెన్సు ఏర్పాట్లు చెయ్యమను. ఇక రెండోది హెచ్ వన్ ప్రాసెసింగు వెంటనే ప్రారంభించమని అడిగిచూడు. ఎలాగూ లాటరీ అంటున్నావు కాబట్టి ఈ సంవత్సరంలో వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మళ్లీ వచ్చే ఏడాది ప్రయత్నిం చొచ్చు. ఇక ప్రాసెసింగు ఫీజులవీ వాళ్లనే భరించమని చెప్పు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా జీతం ఇంతకు ముందు నీకు ఎంతొచ్చేదో అంతకన్నా కాస్త ఎక్కువే అడిగి చూడు” అంది.

          “ఒకవేళ వాళ్లు వొప్పుకోకపోతే” అన్నాడు గట్టిగా నిట్టూర్పువిడుస్తూ.

          “లేకపోయినా జాయినవ్వు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచి ఆప్షన్  అనిపిస్తూ ఉంది నాకు. కానీ ఆ విషయం వాళ్లకి ముందే తెలియనివ్వకు” అంది మెల్లని గొంతుకతో. 

          “అంతేనంటావా?” అన్నాడు సాలోచనగా. 

          “భయపడకు. అన్నీ మన మంచికే జరుగుతాయి. ఈ ఉద్యోగం వల్ల మనకి మంచి జరిగేది ఉంటే తప్పకుండా అన్నీ అనుకున్నట్టు సక్రమంగా నెరవేరుతాయి. మొదట రెండు, మూడు నెలల్లో నీకు నచ్చకపోతే మరొక ఉద్యోగం కోసం వెతుక్కుంటావు. అంతే కదా.” అంది అనునయంగా. 

          “హమ్మయ్య. నీతో మాట్లాడేక ఒక క్లారిటీ వచ్చింది తనూ. సాయంత్రం నుంచి ఏం చెయ్యాలా అని ఒకటే తల పగిలిపోతూందనుకో” అన్నాడు మనసు తేలికపడ్డవాడిలా మందహాసం చేస్తూ. 

***

          మర్నాడు సాయంత్రం తన్మయి ఇంటికి రాగానే సుడిగాలిలా చుట్టుకున్నాడు ప్రభు.

          “ఏవిటిది?” అంది సంతోషంగా. 

          “అబ్బ, నీతో స్వయంగా చెప్పాలని గంట నించీ ఉవ్విళ్లూరుతున్నా. మనం అడిగినవన్నీ ఒప్పుకున్నారు. అయితే జీతం ఇంతకు ముందు ఎంత వస్తుందో ఇప్పుడూ అంతే. తక్కువా లేదు, ఎక్కువా లేదు. అయినా ఫర్వాలేదని ఒప్పేసుకున్నా” అన్నాడు హుషారుగా. 

          “వెరీగుడ్ , ఇక నువ్వు హాయిగా ఏ దిగులూ లేకుండా ఉద్యోగం చేసుకో” అంది తన్మయి హాయిగా నవ్వుతూ. 

          “ఇక మీదట కూడా ఇంటిని నువ్వే నడుపు తనూ” అన్నాడు ఏదో గుర్తుకొచ్చిన వాడిలా. 

          “సేవింగ్సు లేక ఇబ్బందులు పడడం వల్ల జ్ఞానోదయం అయ్యిందో, తన సమర్థత గమనించి అంటున్నాడో తెలీదు కానీ, ఇప్పటికైనా తెలిసి వచ్చినందుకు సంతోషంగా అనిపించింది తన్మయికి. 

          అయితే ఒక షరతు “నాపై కంప్లైంట్లు ఏవున్నా నాకే చెప్పమని చెప్పు మీ వాళ్లకి”  అంది. 

          “చిత్తం మహారాణీ” అన్నాడు భటుడిలా అభినయిస్తూ.

          ప్రభు ఏం చెప్పేడో తెలీదు కానీ ఎప్పటిలా జీతం తనకే ఇమ్మని బేబమ్మ గొడవ పెట్టినట్టు వినిపించలేదు. ఒక్కొక్కటిగా సమస్యలు చక్కబడుతుండడంతో తన్మయి కి కాస్త ఊరటగా ఉంది. 

          నెలకొకసారి ఇంటిల్లపాదినీ ఐస్క్రీము షాపుకనీ, సినిమాకనీ అందరినీ తీసుకు వెళ్లినా ఇల్లు తన్మయి నడుపుతూ ఉండడంతో మరసటి నెల నుంచి సేవింగ్సు కూడా మిగలసాగేయి. 

          తన్మయి పిల్లలందరి పేరునా కిడ్డీ బేంకు ఎకౌంట్లు ఓపెన్ చేసింది.

          రాణి కూతురు బుజ్జితో సహా అందరికీ సమానంగా వెయ్యసాగింది. 

          అవసరమైనపుడల్లా అందరికీ కొత్త బట్టలు కొనడం దగ్గర్నించి ఎవరికి ఏం కావాలన్నా ముందే తెలుసుకుని అమర్చి పెట్టసాగింది.

          అయినా వాళ్ల మొహాల్లో కళాకాంతీ లేకపోవడం గమనిస్తూనే ఉంది. 

          ఇదంతా ఎప్పుడో ఓ సారి తుఫానులా విరుచుకుపడుతుందని ఊహించింది.

          అనుకున్నట్టుగానే ఓ రోజు ప్రభుని అర్థరాత్రి వరకూ మేడమీదికి రానివ్వకుండా పెద్ద గొంతులేసుకుని అతని తల్లితండ్రీ అరవడం వింది. 

          వాళ్లకంటూ ఖర్చు పెట్టుకోవడానికి నెలకు పదివేలు ఇచ్చెయ్యాలనీ, అవి వాళ్లేం చేసుకున్నా లెక్కా పత్రం అడగక్కూడదనీ సారాంశం.  

          “ఇక ఎప్పటికీ వీళ్లు మారరు” అనుకుంది. 

          ఎప్పటిలానే అన్నిటినీ మౌనంగా వింటూ కూచున్న ప్రభుని చూసి కోప్పడాలో, జాలి పడాలో అర్థం కాలేదు తన్మయికి.

          ఇలా గొడవలు పెట్టీ, రాద్ధాంతం చేస్తే ఏదైనా చేస్తాడనే అలుసు బాగా ఇచ్చాడు ప్రభు. 

          మేడ మీదికి రాగానే ఆ విషయం మాట్లాడబోతున్న ప్రభుని మధ్యలోనే ఆపి…

          “ఇప్పుడిప్పుడే కష్టాల నించి గట్టెక్కుతున్నాం మనం. వాళ్లు అడిగినట్టు నెలకు పదివేలు ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వే ఆలోచించు. మనం అంత స్థితిలో ఉన్నామా? పైగా ఇవేళ పదివేలు..రేపు పదిహేను వేలంటూ.. ఇలా లిమిట్ లేకుండా పోతే సంసారం నడపడం ఆ భగవంతుడి తరం కూడా కాదు.” అంది. 

          “మన పరిస్థితి నాక్కూడా తెలుసు. కానీ వాళ్లు స్వతంత్రంగా ఉండాలని  కోరుకోవ డంలో తప్పు ఏవుంది?” అన్నాడు.  

          “వాళ్లు స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో వాళ్ల చేతికి అడిగినంతా ఇచ్చి, మిగతా సొమ్ముతో ఇల్లు నడపడం అసాధ్యం. మనం ఇంకా కొంత తేరుకునే వరకూ కొన్నాళ్లు అందరూ అడ్జస్టు కాక తప్పదు” అంది స్థిరంగా.

          ఇక ప్రభు మళ్లీ ఎప్పుడూ ఆ టాపిక్ తీసుకురాలేదు.

          తర్వాతి నెలలో ప్రభు ఇంటికి వస్తూనే “పదివేలు బోనసు ఇచ్చేరు తనూ ఇవేళ” అన్నాడు.

          తన్మయి వెంటనే “ఆ పదివేలు మీ వాళ్లకే ఇచ్చెయ్యి” అంది. 

          సంతోషంగా తన్మయిని కౌగిలించుకున్నాడు ప్రభు. 

***

          ఆ మరుసటి వారంలోనే తన్మయికి పీ.హెచ్.డీ గోల్డు మెడలుకి సెలక్టు అయినట్టుగా ఉత్తరం వచ్చింది యూనివర్శిటీ నించి. మరో నెల రోజుల్లో పట్టా అందుకుందుకు కాన్వొకేషను వివరాలు కూడా పొందుపరచబడ్డాయి. 

          ఉత్తరం అందుకోగానే తన్మయికి గొంతుపూడుకుపోయినట్టు ఉద్వేగంతో దు:ఖం ప్రవాహమయ్యింది.

          ఎన్నినాళ్ల కల ఇది!

          అత్యుత్తమమైన ఈ చదువు కోసం అహర్నిశలూ కలలు కని, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. ఎన్నో కష్టాలకోర్చింది. సంయమనంతో అన్నిటినీ ఓర్చుకుంటూ వచ్చింది. ఎక్కడా ఓడిపోకూడదని పట్టుదలతో అడుగులు వేసింది.

          అప్పటివరకూ పడ్డ కష్టాలన్నీ గిర్రున కళ్ల ముందు తిరిగేయి. 

          పీ.హెచ్.డీ పట్టా పుచ్చుకోవాలన్న తన లక్ష్యానికి ఎన్నెన్ని అవరోధాలు! కాలం అనుక్షణం తన లక్ష్య సాధనకు ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉంది.  

          ఒకటా రెండా ఎన్నో ఊహలతో అల్లుకున్న జీవితంలో అడుగడుగునా మోచేతులు, మోకాళ్ళు కొట్టుకుపోయి లోయల్లోకి జారిపడ్డ ఎన్నో సందర్భాలు. అదేవిటో గానీ  పడిన  ప్రతిసారీ మళ్లీ లేవాలన్న కొత్త పట్టుదల కలిగేది. 

          ఆనందభాష్పాలు చెంపల్ని తడిపెయ్యసాగేయి. 

          “అరికాళ్లలో ముళ్ళతో శిఖరారోహణ చెయ్యాల్సి వచ్చిన నీ జీవితం నిరంతరం కన్నీళ్లమయమైనా నీ విజయం నీలాంటి ఎందరో దురదృష్టవంతులైన యువతులకు జీవితం పట్ల గొప్ప ఆశను, స్ఫూర్తిని ఇస్తుందమ్మా” అన్న మాస్టారి మాటలు జ్ఞాపకం వచ్చేయి. 

          ఎవరికైనా ఎంత స్ఫూర్తి కలుగుతుందో తెలియదు కానీ తన్మయికి మాత్రం ఆకాశాన్ని జయించిన అనుభూతి కలగసాగింది. 

          “మిత్రమా! నేను గెలిచాను”  అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని అనిపించింది. 

          పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకుని ముద్దులు కురిపించింది. 

          గదిలోనే గింగిరాలు కొట్టింది. 

          సమయానికి ప్రభు బెంగుళూరులో ఉండిపోయేడు. 

          ప్రభుకి, తల్లికి ఫోను చేసి చెప్పింది. 

          ఇంకా సంతోషం పట్టలేక రాణికి చెప్పింది ఇంట్లో అందరికీ చెప్పమని.

          ఆ సాయంత్రం భోజనానికి కిందికి వెళ్ళినపుడు ఎవరైనా ఏవైనా మాట్లాడతారేమో అని చూసింది. 

          ఎవరికి ఎంత అర్థమయ్యిందో తెలియదు కానీ ఎవ్వరూ కనీసం చిన్నపాటి ఆనందం కూడా వ్యక్తపరచలేదు. 

          ఎప్పటిలా భోజనం పళ్లెం టేబుల్ మీద పెట్టి వాళ్ల  టీ.వీ లో వాళ్లు మునిగిపోయి ఉన్నారు.

          ఉండబట్టలేక ప్రభుకి మళ్లీ ఫోను చేసింది. 

          “నీకు ఎప్పుడూ చెప్పేదే, అయినా విను. వాళ్ల నించి నువ్వు ఎప్పుడూ ఏవీ ఎక్స్ పెక్టు  చెయ్యకు” అన్నాడు.

          ఆ రాత్రి డైరీలో “మనదనే ఇల్లు మనసులో మాత్రమే ఉంటుంది” అని రాసుకుంది తన్మయి. 

          తనదనే ఇల్లు, తన వాళ్లనే మనుషులు లేకపోవడం జీవితంలో ఎంత దురదృష్టమో బాగా అర్థం అయ్యింది. 

          వీళ్లని తనెలాగూ మార్చలేదు. కనీసం తనైనా “తన” అనే ప్రశాంతమైన ఇంట్లో జీవించడం ఎలా? 

          తీవ్రమైన ఆలోచనల్తో పొద్దుట్నించి ఉన్న సంతోషం స్థానంలో అంతులేని బాధ, దుఃఖం కలగసాగేయి. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.