ఓస్ ఇంతేనా !!
-నీరజ వింజామరం
ఆఁ !
నీదంతా నటనేనా?
నిజాయితి ముసుగులో అబద్దపు ఆటేనా?
పరాయి ఇంతుల దేహాల పై మోహమేనా ?
నాతో ఉన్న ప్రతీక్షణం చేసింది నమ్మకద్రోహమేనా?
అభిమానం పేరుతో నాపైనున్నది అనుమానమేనా ?
అమాయక ప్రేమకు శిక్ష అవమానమేనా ?
ఔను !
ఎంతో అనుకున్నాను
నీవు నన్ను వీడిన మరుక్షణమే వాడిపోతానని
ఎడబాటు నోపలేకపండుటాకునై రాలిపోతానని
నీవు లేని తలపుకే తల్లడిల్లుతానని
నీవు పిలిచే పిలుపుకై అల్లాడిపోతానని
ఎంతో ఊహించుకున్నాను
కన్నీరు సంద్రమవుతుందని
గుండె ఎడారవుతుందని
కల్లోలాలే కానీ కలలుండవని
ఆవేదనే గానీ ఆకలుండదని
ఏమేమో తలచాను
భూమి బద్దలవుతుందని
సూర్యచంద్రులు ఆగిపోతారని
గ్రహాలు గతి తప్పుతాయని
ఆకాశం ఆనవాలు లేకుండా పోతుందని
కానీ !
చీకటిని చీలుస్తూ ఉదయం దూసుకొస్తూనే ఉంది
నల్లమబ్బు వర్షాన్ని మోసుకొస్తూనే ఉంది
నేలనంటే ప్రతీ చినుకు ఆశను తీసుకొస్తూనే ఉంది
భూమిని చీలుస్తూ చిన్ని విత్తనం మొలకేస్తూనేఉంది
గాలి వీస్తోంది , పూవు పూస్తోంది
ఆకలేస్తోంది , దాహమేస్తోంది
నిద్దరొస్తోంది , పొద్దు గడుస్తోంది
మనసు విరగడమంటే
ఓస్ ఇంతేనా !
*****