ప్రయాణం

-అనూరాధ బండి

కిటికీ అంచులు పట్టుకొని ఒక్కో పదం అట్లా
పక్షుల పలుకుల్లోంచీ గదిలోపలికి జారుతూ
అవ్యక్త సమయాలను గోడలపైనో మూలలనో
పైకప్పుకేసో నమోదుచేసుకుంటూ..

మంచంపై అనారోగ్యపు చిహ్నంలా ముడుచుకున్న దేహంపై పేరుకున్న పలుచని దుమ్ము
గాలి వెంటబెట్టుకొని వచ్చే చల్లదనం.
ఋతువుని అంటిబెట్టుకుని పరిసరాలు.

వెక్కిరింతల్లో అలసిపోయినవాళ్ళు దాహమై పైకి చూస్తున్నారు.
మబ్బుపట్టిందనీ పట్టలేదనీ స్వార్ధపులెక్కలేసుకుంటున్నారు.

తూనీగల అలుపులేని పరిభ్రమణం.
ఎవరి ఆలోచనల్ని ఎవరు అతిక్రమిస్తారూ?..
మొదలయిన చినుకులకి దోసిలిపట్టే వీళ్ళంతా ఎవరో!

మిసమిసల చర్మం ముడతలై వదులుగా
నవ్వుతుంది కదా..
తలనెరసి కొంచం వయసుకి
జరుగుతావ్ కదా..

మనిషన్న జ్ఞానీ-

నువ్వు నీకు ఎందాకా తెలుసూ?
నీతో నువ్వు ఎక్కడివరకూ ప్రయాణమవ్వగలవ్?..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.