గజల్ సౌందర్య – 3

-డా||పి.విజయలక్ష్మిపండిట్

 

గజల్‌పై సూఫీయిజం ప్రభావం:

పర్షియన్ మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవితా రూపమైన గజల్‌పై సూఫీయిజం తీవ్ర ప్రభావాన్ని చూపిందని అంటారు చరిత్ర కారులు. అనేక గజళ్లు సూఫీ మార్మికవాదం నుండి ప్రేరణ పొంది ఆ దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక కోరిక యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. సూఫీ తత్వం ప్రభావం ,రూపకాలు, ప్రతీక వాదం మరియు భావోద్వేగ లోతులను గజళ్ళలో ఉపయోగించడం స్పష్టంగా కనిపిస్తుంది. 

          సూఫీ కవుల ఆ అలౌకిక దైవిక ప్రేమ, భక్తి, ఆధ్యాత్మిక చింతన నుండి లౌకిక పేమ , ప్రణయం విరహం నిరీక్షణలు ప్రధాన ఇతివృత్తాలుగా నిర్దిష్ట నిర్మాణ శైలితో “గజల్ “ కవితా ప్రక్రియ అవతరించింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే…ఈ విశ్వంలో సృష్టికి ఆధారమైన ప్రేమకు మూలం ఆ దివ్య అనంత చైతన్యం. 

          ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి మార్గంగా దైవిక ప్రేమ భావనను సూఫీ తత్వశాస్త్రం నొక్కి చెబుతుంది. 

          ఉత్తరభారతంలో హిందూ సాంప్రదాయంలో పేరొందిన భక్తురాలు మీరాబాయి హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి, గాయకురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు. 16వ శతాబ్ధకాలం లో శ్రీకృష్ణుని పూజిస్తూ కృష్ణ భగవానుని సఖుడు, భర్తగా భావించి అనేక కవితలు భజనలు రాసి పాడుతూ తన జీవితాన్ని సాగించింది.

          గజల్ కవులు ముఖ్యంగా సూఫీయిజం ద్వారా ప్రభావితమైన వారు, వ్యక్తిగత ఆత్మ ( జీవాత్మ) మరియు దేవుని ( పరమాత్మ ) మధ్య సంబంధాన్ని సూచించడానికి తరచుగా లౌకిక మానవ ప్రేమ కవితా చిత్రాలను ఉపయోగిస్తారు.

          గజల్‌లోని “ప్రియమైన” వ్యక్తిని దైవానికి రూపకంగా భావిస్తారు. మరియు ప్రియమైన వారితో ఐక్యత , విడిపోవడం వల్ల కలిగే బాధ, దేవునితో సంబంధాన్ని / ఐక్యతకై కోరికను సూఫీ తత్వ సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి.

          ఆ అలౌకిక ఆధ్యాత్మిక సూఫీ ప్రేమతత్వమే గజల్ కవితా ప్రక్రియలోని మూల వస్తు తత్వమైన ప్రణయం, ప్రేయసి/ప్రియుడు, నిరీక్షణ, విరహ వేదనల భావోద్వేగాల సంభాషణాత్మక కవితా ప్రకియ గజల్ కు మూలం.

          రాను రాను కాలగతిలో విశ్వప్రేమ వైవిధ్య భావోద్వేగాలు; అమ్మ నాన్నలపై ప్రేమ , బిడ్డలపై ప్రేమ , కరుణ దయ , మనిషి మమత , మానవత , దేశభక్తి మొదలయిన సామాజిక అంశాలు గజల్ లో చోటుచేసుకున్నాయి. 

          గజల్ కవుల గజళ్ళలను పరిశీలిస్తే ప్రణయము , ప్రణయ సంభాషణలే కాకుండా వైవిధ్యమైన అంశాల పై గజళ్ళు అల్లడం చూస్తాము . “కాదేది కవిత కనర్హం” అని మహా కవి శ్రీశ్రీ గారు అన్న నానుడి “ కాదేది గజల్ కనర్హం “ అనికూడా అనవచ్చు. ఏ వస్తువైనా సంధర్భానికి అనువుగా హృద్యంగా మలచడమే ముఖ్యం. గజల్ లో గజలియత్ ను ( గజల్ లోని భావుకతను).. సున్నిత సుకుమార సరణ భాషలో వ్యక్తీకరించడంలో గజల్ కవి ప్రతిభ ప్రస్పుటం అవుతుంది.

          సి. నా. రె. గారు సామాజిక అంశాల పై కూడా అద్భుతమైన భావుకతతో ( గజలియత్) తో గజళ్ళు రాసి పాడి గజల్ కవులకు మార్గదర్శకులయ్యారు.

          చాలా మంది ప్రఖ్యాత గజల్ కవులు సూఫీలు. అత్యంత ప్రసిద్ధ సూఫీ గజల్ కవులలో రూమి, హఫీజ్ , సాది సిరాజి మరియు అమీర్ ఖుస్రూ ఉన్నారు. వారి రచనలు తరచుగా దైవిక ప్రేమ, దైవంతో ఐక్యత కోసం కోరిక మరియు ప్రాపంచిక ఉనికి యొక్క అశాశ్వత స్వభావాన్ని అన్వేషిస్తాయి. 

          బేగం అక్తర్, మెహదీ హసన్ మరియు అబిదా పర్వీన్ వంటి గాయకులు సూఫీ కవుల గజల్స్ ను గానం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు, ఆ గజల్సలోని ఆధ్యాత్మిక లోతు మరియు భావోద్వేగ ప్రతిధ్వనిని విస్తృతంగా ప్రేక్షకులకు అందించారు.

తెలుగు గజల్ కవులలో సూఫీతత్వం:

కొంతమంది తెలుగు గజల్ కవులు  తమ గజళ్ళలో ఈ సూఫీ తత్వాన్ని ;పరమాత్మను స్నేహితుడిగా , సఖి, సఖుడిగా భావించుకుని( జీవాత్మ) రాసుకున్న గజళ్ళు ఈ కోవకు చెందినవి.

          “విశ్వపుత్రిక గజళ్ళు “అని నేను రాసుకున్న 4 గజళ్ళ సంపుటాలలోని గజళ్ళలో మూడువంతులు ఈ సూఫీ తత్వం / మధుర ప్రేమ భావన వెల్లడవుతుందని . నా గజళ్ళకు ముందు మాటలు రాసిన ప్రముఖ గజల్ కవులు ఈ విషయాన్ని వెల్లడిం చారు. పరమాత్మను నా స్నేహితునిగా , సఖుడిగా నా భర్త రూపంలో ఉన్నది ఆ అనంత చైతన్యమే అని భావించుకుని రాసిన గజళ్ళు అవి. నా గజల్ సంపుటాలు ; యోగరేఖలు ( 2021), రాగరేఖలు (2022 )విశ్వరాగం (2022)హృదయాంజలి(2024). “విశ్వపుత్రిక” నా తఖల్లుస్ (కవిని సూచించునది).

          ఉదాహరణకు నా మొదటి “యోగరేఖలు “ గజల్ సంపుటి లోని గజల్ లో నేను జీవాత్మగా పరమాత్మను నా చెలికాడుగా భావించుకుని జరుపుకున్న నా సంభాషణాత్మక భావవ్యక్తీకరణను (గజలియత్ ) ను పరిశీలించండి.

“విశ్వాంతరాళ అనంత విన్యాసాల విభూతివి నీవు

నీ అంతరంగాన్ని ఆశ్రయించిన జీవాత్మని నేను!

మేఘమాలికలను ధరించిన నీలాకాశుడవు నీవు 

నీ ప్రేమ జల్లులో తడిసి తరించే జీవభూమిని నేను!

గంభీర నిశ్చల నిర్మల నీలి సముద్రుడవు నీవు 

నీ సంగమానికై బిరబిర పరుగులిడే జీవనదిని నేను!

జీవరాసులకు ప్రాణం పోసే అఖండ జ్యోతివి నీవు

పరంజ్యోతిని నిరతం ప్రదక్షిణచేసే ప్రాణప్రభని నేను!

యుగాలుగా చేయిపట్టి నడిపించే చెలికాడవు నీవు

ఈ కాలగమనంలో నీ చెలిమి కోరే నీ నెచ్చెలిని నేను!”

          నా రెండవ గజళ్ళ సంపుటి “ రాగరేఖలు” లోని మరో గజల్ లో..నేను ఆ విశ్వ చైతన్యంలో భాగమని విశ్వచైతన్య ప్రేమ సంతరించుకున్న ఆకారాలే ఈ నిర్జీవ జీవాల ప్రేమానుబంధాలని గాఢంగా నమ్మే నా భావనాలోకం అక్షరీకరించుకున్నదీ క్రింది మరో గజల్ ..;

“నీ చిలిపి నవ్వులనది నాలో ప్రవహిస్తూంది తెలుసా

నా మానస సరోవరం పొంగి ప్రకాశిస్తూంది తెలుసా!

ఈ ప్రేమానుబంధాలు లేని జీవితమేమి జీవితం

ప్రేమే ఇలలో జీవితక్షేత్రాన్ని పండిస్తూంది తెలుసా!

వియోగాగ్ని ఎంత మధురమైన అనుభవమో కదా

నీపైనా ప్రేమానురాగం ఇనుమడిస్తూంది తెలుసా!

జనన మరణాలు ప్రేమబంధాల అనుభవం కోసమే 

ఆ విశ్వప్రేమ జీవనిర్జీవులను ప్రేమిస్తూంది తెలుసా!

విశ్వమానవ కుటుంబాన్ని కట్టిపడేసేది ప్రేమే కదా

విశ్వపుత్రిక దివ్యప్రేమ ఒడిలో జీవిస్తూంది తెలుసా!”

          నా “రాగరేఖలు”గజల్ సంపుటికి ముందుమాటలో ప్రముఖ గజల్ కవి పెన్నా శివరామకృష్ణ గారు నా గజళ్ళ గురించి వారి మాటల్లో…”విజయలక్ష్మి గారి మొదటి గజల్ సంపుటి “యోగ రేఖలు”(2021)లో మధుర భక్తి పూర్వకమైన ఆర్తి , ఆర్ద్రత ప్రధానంగా కనిపిస్తాయి. ఈ రెండవ గజల్ సంపుటి “ రాగరేఖలు” లో పరమాత్మతో ఐక్యత కోసం జీవాత్మ ఆర్తితో చేసే విన్నపాలను, నిరీక్షణల భావాలను విజయలక్ష్మి గారు బహుసుందరంగా కవిత్వీకరించారు. తమను తాము ప్రేయసి స్థానంలో నిలుపు కుని రాసిన అలౌకిక మధుర ప్రేమ లేఖలు ఈ రచనలు. ప్రియునితో కలయిక కోసం తపించే విరహిణి పాడిన ఆర్తిగీతాలు ఇవి. ఈ గీతాలలోని ప్రతి వాక్యం మధురభక్తి మాలిక. ప్రతి పదమూ భవబంధ విముక్తికి పావన వనమూలిక.

          ‘విశ్వపుత్రిక ‘అన్న వీరి కలం పేరే వసుదైక కుటుంబ భావనకు సంకేతం. వీరి ప్రతి వాక్యంలో విశ్వప్రేమ భావన అంతస్సూత్రంగా ఇమిడి ఉన్నది.” అని నా గజళ్ళ ఆత్మను వివరించారు.

          నా నాలుగు గజల్ సంపుటాలకు ముందుమాటలు రాసి నా గజల్ వస్తు /ఆత్మ తత్వాన్ని లోతుగా పరిశీలించిన ప్రముఖ గజల్ కవి , విశ్లేషకులు కళారత్న బిక్కి కృష్ణ నా నాలుగవ గజల్ సంపుటి “హృదయాంజలి “కి ముందు మాటలు  లో ….;

          “ హృదయాంజలి “గజళ్ళ సంపుటిలోని ప్రతి గజల్ మక్తాలో తనేమిటో, తన తాత్వికత, జీవిత లక్ష్యం, యోగం, రాగం, భవబంధ విమోచనం, భగవత్ దర్శనం, సర్వమానవాళి హితం , రాగద్వేషాల ఖండనం అరవిందుని సమగ్ర మూర్తిమత్వ భావన ఈమె గజళ్ళలో అక్షరరూపుదాల్చి దివ్య మధురభక్తి విలసితమై ఆత్మోన్నతి హేతువై నిర్వాణ మార్గదర్శకమై ‘ఆత్మదీపోభవ’ అన్న బుద్ధుని సందేశమై ప్రతి గజల్ ధ్వనిస్తోంది. ఈమె గజళ్ళ నిండా మధురభక్తిగా, సూఫీతత్వంగా, అలౌకిక పారవశ్య భావనాబలంగా అతీంద్రియశక్తి అన్వేషణంగా, విశ్వప్రేమైకభావోన్మత్త ధ్యానముద్రగా  ఈమె గజళ్ళ అంతస్సారంగా నా ఆత్మదృగ్గోచరమైంది.”  అని నా గజళ్ళలోని నా అంతరాత్మను వివరించిన తీరు అద్భుతం.

          నా “యోగరేఖలు “గజళ్ళ సంపుటి నుండి 12 గజళ్ళ audio CD link ను పెట్టాను. మీరు విని  ఆ గజళ్ళలోని నా మధురభక్తి , విశ్వప్రేమ భావాన్ని నా జీవన ఆధ్యాత్మిక తత్వాన్ని గమనించగలరు.

          పై  You tube  link  నా “యోగరేఖలు “ గజల్ సంపుటిలోని 12 గజళ్ళను సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ గారు స్వరపరచగా శ్రీమతి శ్రీవాణి అర్జున్ ,జి. హర్షిక గానం చేశారు . మీ తీరిక సమయాల్లో విని ఆనందించండి.

          You tube లో “ Viswaputrika Ghazals” అని search చేస్తే నా గజల్సను వినవచ్చు .

          మరో ప్రముఖ గజల్ కవయిత్రి శ్రీమతి విజయగోలి గారి గజల్ సంపుటి “పిల్లనగ్రోవి” ని నేను చదివిన తరువాత ఈ మధురభక్తి భావనలు వారి కొన్ని గజళ్ళలో కనిపిస్తుంది . వారి మరో గజల్ సంపుటి “ చిత్ర వీణ”. ఉదాహరణకు “పిల్లనగ్రోవి”  సంపుటి నుండి ఈ రెండు గజళ్ళను గమనించండి. గోవిందుడి (కృష్ణుని)పై తన భావోద్వేగాలను వ్యక్తీకరించిన తీరు . ‘విజయ ‘ఆమె తఖల్లుస్.

“రాచలీల బృందావన జతగాడే గోవిందుడు
వేణుఊది వ్రేపల్లియ హితగాడే గోవిందుడు

గోకులమే కదిలివచ్చు గోపాలుని గానముతో
ఆలమంద లదిలించే పిలగాడే గోవిందుడు

వెన్న పాలు దొంగిలించి విన్నపాల వేడుకలో
మాయచేసి మాటుదాగు మాయగాడె గోవిందుడు

జలకమాడ గోపెమ్మలు చెట్టుమీద చీరలెట్టె
వేడపోగ మేలమాడు చోరగాడె గోవిందుడు

ప్రతిపనిలొ పరమపదపు పరిధిచూపు పరమాత్మ
“విజయ” కెపుడు తోడునీడ చెలికాడే గోవిందుడు”

కన్యయ్యా అనే  ‘రదీఫ్ ‘తో మరో గజల్ లో అవే భావనలు వెల్లడవుతాయి.

“కనులవిందు నీరూపం కలతతీరు కన్నయ్యా
వీడలేను నీధ్యానం నలతతీరు కన్నయ్యా

పాలకడలి పరవశాలు పరిమళించు నందనమే
అలరించే నీ అందం అలకతీరు  కన్నయ్యా

రాగముగా రంజిల్లగ నీమురళీ రవములలో
బృందావని పల్లవించు పాటతీరు కన్నయ్యా

అణువణువున నీవేగా అల్లరివై ఆటాడగ
అల్లుకోగ వల్లరినై సేదతీరు  కన్నయ్యా

పంచలేను పదుగురిలో మనసైనవి మధురిమలే
వివశ నౌదు నీ సన్నిధి విరులతీరు కన్నయ్యా

మేఘమాల మెరుపుతీగ సోయగాలు స్వల్పమే
గడ్డిపూవు నాదరించు ఆశతీరు కన్నయ్యా

కోరుకుంటి కైవల్యమే  కొసరుచుంటి చరణములే
విజయమివ్వు దరిజేరగ తపనతీరు కన్నయ్యా”

          విజయగోలి గారి ఒక గజల్ గానం పై ఆడియో లింక్ లో వినండి.

          జీవన తాత్వికతను ఆధ్యాత్మిక చింతన భావాలు ఎక్కువ మంది గజల్ కవుల గజళ్ళలో కనిపిస్తాయి. వారిలో గజళ్ళు రాసుకోవడమే తన జీవితంగా గడుపుతున్న ప్రముఖ గజల్ కవి.., ఆరువేల పైచిలుకు గజళ్ళను రాసిన కొరుప్రోలు మాధవరావు గారు. వారు ‘ మాధవ మంజరి’, మాధవ రంజని’ అన్న రెండు గజల్ సంపుటాలను వెలువరించారు. తాత్వికతను పొదిగిన వారి ఈ గజల్ చూడండి. 

“నేనెక్కడ నాదెక్కడ..సొంతమైన ఇల్లెక్కడ..!? 

శ్వాసగాక దారిచూపు..నిఖార్సైన గురువెక్కడ..!? 

బంగారం పండించే..పొలమున్నది కన్నులింట.. 

నిన్ను నీవు తెలుసుకునే..నిత్యమైన చదువెక్కడ..!? 

ఎవరికొరకు ఎవరిక్కడ..పుట్టలేదు ఈ పుడమిని.. 

కర్మలెల్ల రాల్చుకోగ..సరసమైన స్థలమెక్కడ..!? 

భుజమెవరో తట్టేరను..ఎదురుచూపు మంచిదేను.. 

ముందడుగే నీ బలమది..నిక్కమైన రుజువెక్కడ..!? 

ఎవరి ప్రతిభనెవరు మెచ్చి..పెట్టాలట కిరీటాలు.. 

మనసుపడే యాతనలో..మౌనమైన వారెక్కడ..!? 

వేదించే ప్రశ్నలెన్నొ..జవాబొకటి పట్టాలా.. 

తలపునిలిపి కూర్చుంటే..మచ్చుకైన బరువెక్కడ..!? 

ఓ మాధవ నీ గజలే..పరమశాంతి వేదమోయి.. 

పంచుకోగ పొందగలగు..భాగ్యమైన వలపెక్కడ..!?

మాధవరావు గారి మరో గజల్ లో జీవిత పాఠాలు 

‘ఎవరు నేర్పగలరు ?!’అనే రదీఫ్ తో ప్రశ్నించే ఈ గజల్ ను గమనించండి .’

“ఏ పల్లకి ఎక్కవలెనొ..ఎప్పుడెవరు నేర్పగలరు..!? 

అహంకార వైభవాన్ని పేల్చుటెవరు నేర్పగలరు..!? 

పాలుతేనె ఎంతబాగ..కలిసేనో తెలుసుకదా.. 

సంసారము అదేరీతి చేయుటెవరు నేర్పగలరు..!? 

తననుతాను తెలుసుకోగ పుస్తకాలు దొరుకునెచట.. 

మానవతకు అద్దంలా ఉండుటెవరు నేర్పగలరు..!? 

టైంపాసుకు వ్రాస్తే అది గజలెలాగ అవుతుందోయ్.. 

నియమాలను పాటించే విద్యనెవరు నేర్పగలరు..!?

హృదయాలను గెలవలేని గెలుపదేమి సాధించునొ.. 

అసలు ప్రేమ రహస్యాల పాఠమెవరు నేర్పగలరు..!? 

మోసగించు వేడుకలో కలతలెన్ని బహుమతులో.. 

ఈమాయా లోకంలో బ్రతుకుటెవరు నేర్పగలరు..!? 

ఓ మాధవ నీ మౌనపు జ్ఞానధునియె తోడులెమ్ము.. 

ఎఱుకలోన జీవించే..తీరునెవరు నేర్పగలరు..!?”

          పై  you tube link లో మాధవరావు గారి గజల్ “ యోగిని వో రాగిణి వో ..”అన్న గజల్ గానం వినండి.

          మరో ప్రముఖ గజల్ కవయిత్రి డా. గడ్డం శ్యామల గారు . వారు ప్రచురించిన వారి 3 గజల్ సంపుటాలు; వాసంత సమీరాలు..2017, హేమంత తుషారాలు.., శరద్వల్లరి ….2022..

          మానవ జీవన గమనంలో  “ప్రాణం” ఏమి కోరుతూందో శ్యామల గారు తన  భావోద్వేగాలను ఈ గజల్ లో హృద్యంగా అక్షరీకరించారు.

“చురకత్తుల వీణియపై సాగుతున్న ప్రాణమిది..!

చితిమంటల వేదికపై కాలుతున్న ప్రాణమిది..!

వడగాల్పుల వేడిమిలో తాళలేక పోతున్నా

చినుకు పాట సరిగమలను కోరుతున్న ప్రాణమిది..!

మల్లె పూల పరిమళాల సమీరమే తాకె నన్ను

విరహానల తీగలపై నడుస్తున్న ప్రాణమిది..!

వాలు చూపు వంతెనపై విహారమే చేస్తున్నా..

కన్నె నాగు బుసబుసలకు వెరుస్తున్న ప్రాణమిది..!

కరిగిపోవు కాలమంత తిరిగిరాదు ఓ శ్యామల!..

పెరిగిపోవు పెను ఆశకు సడలుతున్న ప్రాణమిది..!”

          “అమ్మ  చలువ కొలువలేను….విలువ ఎంతొ చూపలేను “అంటూ అమ్మ ప్రేమ పై శ్యామల గారి ఈ గజల్ లో సున్నితమైన గజలియత్ ను గమనించండి …

“నాకమెక్కడుందొగాని ..అమ్మ ప్రేమ నాకున్నది.

నందనవనమెక్కడుందొ వెన్నెలెంతొ నాకున్నది

అమ్మ చలువ కొలువలేను విలువఎంతొ చూపలేను

అమ్మ మమత ఎన్నలేను..రాగమెంతొ నాకున్నది

దేవతలే కొలువుదీర…అమ్మ రూపు కట్టెనుగా…

నిస్వార్ధపు సేవలోనె..అమృతమెంతొ నాకున్నది

నాకు సేవలందించే  నిర్మలమయి  మాతాజీ...

అలసి పొయిన హృదయానికి చలువయెంతొ నాకున్నది.

కన్న కడుపు తీపెంతో అమ్మనడుగు చెబుతుంది..

మాతృత్వపు మమకారం నీడ  యెంతొ నాకున్నది.”

          “నాన్న అని ఒక్కసారి పిలవాలని ఉన్నది “అన్న గడ్డం శ్యామల గారి గజల్ గానం పై you tube లింక్ లో వినండి 

          గజల్ కవులను తమ గజళ్ళను గానం చేసి లేదా మంచి గాయకులతో పాడించి you tube లో upload  చేయడం వల్ల , Face book మరియు WhatsApp groups లో పెట్టడం వల్ల తెలుగు గజల్ వ్యాప్తికి  తోడ్పడతాయని “విశ్వపుత్రిక గజల్ పౌన్డేషన్ “సభలలో మేము పదే పదే ప్రోత్సహించడం వల్ల చాలా మంది గజల్ కవులు తమ గజళ్ళను గాయకులచే పాడించి you tube లో ,సాంఘిక మాధ్యమాల్లో post చేయడం మాకు ఎంతో ఆనందదాయకం, ఆహ్వానించదగ్గ విషయం.

          వచ్చే నెల “ గజల్ సౌందర్యం “ -4  కాలంలో మరికొంత మంది ప్రముఖ గజల్ కవులను , వారి గజళ్ళను గురించి మీతో  పంచుకుంటాను.

*****
(సశేషం)
 
 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.