దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

నాగతరి మీదకు ఎక్కిన తరువాత వ్రజేశ్వర్ రంగరాజుని అడిగాడు “నన్నెంత దూరం తీసుకువెళ్తారు? మీ రాణి ఎక్కడ వుంటుంది?”

“అదిగో, ఆ కనపడుతున్నదే నావ, అదే మా రాణీవాసం.”

“అబ్బో, అంత పెద్ద నావా? ఎవరో ఇంగ్లీషువాడు రంగాపురాన్ని లూటీ చెయ్యటా నికి అంత పెద్ద నావతో వచ్చారనుకున్నాను. సర్లే, ఇంత పెద్ద నావలో ఉంటుందేమిటి మీ రాణి!?”

“ఆవిడ రాణి, అందుకనే రాణీవాసపు వసతులతోనే వుంటుంది. అక్కడ ఏడు గదుల నివాసం” అన్నాడు రంగరాజు.

“అన్ని గదులా! ఏం చేసుకుంటుందీ!?”

“ఒకటి ఆవిడ దర్బారు. ఒకటి ఆవిడ శయన గృహం. ఒక గదిలో దాసీలు ఉంటారు. ఒకటి స్నాన గృహం. ఒకటి వంట గది. ఒకటి ఖైదు గది, అందులోనే నువ్వు వుండేది.” అన్నాడు రంగరాజు.

పడవ నావను చేరేటప్పటికి దేవీ చౌధురాణి పైకప్పు మీద లేదు. తన మనుషులు వేరే నావ మీద దోపిడీ చేస్తున్నంత సేపూ వీణ మీటుతునే వున్నది. పడవ తన నావ వైపుకు తిరిగి వస్తున్నప్పుడు మాత్రం ఎందుకో అన్యమనస్కురాలయ్యింది. వీణ శృతి తప్పసాగింది, తాళం తడబడసాగింది. పడవ తన నావ వద్దకు చేరటం చూసి వీణ వాదం ఆపి తన మందిరానికి వెళ్లింది.

రంగరాజు “దేవీ రాణికి జయము జయము” అని పలికాడు.

లోపలి నుండి “ఏమిటి సమాచారం?” అని దేవి అడిగింది.

అంతా మంగళమే జరిగింది అన్నాడు రంగరాజు.

“ఎవరికైనా దెబ్బలు తగిలాయా?”

“లేదు, ఎవరికీ తగలలేదు.”

“వారిలో ఎవరైనా చనిపోయారా?”

“లేదు, అంతా మీ ఆజ్ఞానుసారంగానే జరిగింది.”

“వాళ్ల మనుష్యులకి ఎవరికైనా దెబ్బలు తగిలాయా?”

“ఇద్దరు ప్రహరీదారులకు మామూలు దెబ్బలు తగిలాయి.”

“ఏమన్నా దొరికిందా?”

“ఉన్నవి అన్నీ తీసుకొచ్చాము. కానీ అంతగా విలువైన వస్తువులేమీ లేవు.”

“బాబుగారిని?”

“బాబుగారిని కూడా పట్టుకు వచ్చాము.”

“ప్రవేశ పెట్టండి.”

రంగరాజు పడవ దగ్గరకి వెళ్లి వ్రజేశ్వర్‌ని నావ పైకి రమ్మని సంజ్ఞ చేస్తే, వ్రజేశ్వర్ నావకున్న తాళ్ల నిచ్చెన ఎక్కి వచ్చాడు.  రంగరాజు వ్రజేశ్వర్‌ని ద్వారానికున్న తెరకి ఇవతల నిలబెట్టాడు.

“మీరు ఎవరు?” కొంత గద్గతతో లోపలి నుండి దేవి ప్రశ్నించింది.

పాఠకుడా, మీకు ఈపాటికి అర్థమయ్యే వుంటుంది వ్రజేశ్వర్ నిర్భయుడని. ఏ దేవీ చౌధురాణి పేరు వినగానే ఉత్తర బెంగాలు కంపిస్తుందో, ఆమె దగ్గర అతనికి కొంత నవ్వు వచ్చింది. ‘పురుషులు ఎప్పుడైనా స్త్రీకి భయపడతారా? స్త్రీ పురుషుడికి దాసీ కదా’ అని నవ్వుకుని బదులు చెప్పాడు. “నా పేరు తెలుసుకుని ఏం చేస్తారు? నా డబ్బుతో మీకు పని, అది దోచుకున్నారు. నా పేరుతో రూపాయలు దొరుకుతాయి ఏమిటి?”

“ఊరు పేరూ తెలిస్తే మీ విలువ ఎంతో పసిగట్టగలం, ధనం ఆ వెంటే వస్తుంది.”

“అందుకనే నన్ను పట్టుకుని తీసుకు వచ్చారా?”

“లేకపోతే మీతో మాకు పని ఏమిటి?”

దేవి ద్వారానికున్న తెర వెనుకవుంది. ఆవిడ ఎన్ని సార్లు కళ్లు తుడుచుకుందో ఎవరికి తెలుసు?

“సరే, నా పేరు దుఃఖీరామ్ చక్రవర్తి అంటే నమ్ముతారా?”

“లేదు”

“మరి అడిగి ప్రయోజనం ఏమిటి?”

“మీరు ఎంత సత్యవంతులో తెలుసుకుందామని.”

“నా పేరు కృష్ణ గోవింద్ ఘోశాల్”

“ఈ పేరు కూడా సరి అయ్యినది కాదు”

“నా పేరు వ్రజేశ్వర్.”

“ఇది సరి కావొచ్చు.”

ఆ సమయంలో ఇంకొక స్త్రీ నిశ్శబ్దంగా దేవి దగ్గరకొచ్చి “గొంతు పూడుకు పోతున్నదా?” అని లోస్వరంలో అడిగింది.

దేవి కన్నీళ్లు ఇంక ఆగలేకపోయినాయి. అప్పటి దాకా వాన చినుకులని పూరేకుల దొన్నెలో దాచుకున్న పద్మం ఒక చిరుగాలికి తొణికిన ఝరి వలె దేవి కన్నులు నుండి అశృధారలు జాలువారాయి.  “ఈ నటన ఇంక నాకు చేతకాదు, నువ్వు మాట్లాడు. అన్ని విషయాలు తెలిసినదానివే కదా” అని అంతఃమందిరానికి వెళ్లి పోయింది. ఈ స్త్రీ దేవి ఆసనం మీద కూర్చుంది. ఈవిడ ఎవరో కాదు, నిశి.

“ఇప్పుడు నువ్వు సత్యం పలికావు. నీ పేరు వ్రజేశ్వర్ రాయ్.”

వ్రజేశ్వర్‌కి పరదా వెనుక ఏమి జరుగుతున్నదో తెలీదు. కానీ, స్వర వ్యత్యాసినికి కొంత చకితుడయ్యాడు. క్రితం ఒక మధురమైన స్వరం, ఇప్పుడు అంత స్వర మాధుర్యం లేదు. “నా ఊరు పేరూ మీకు పరిచతమే కదా, నా విలువెంతో కట్టి చెప్పండి, నన్ను ఏ షరతులపై విడుదల చేస్తారు?”

“ఒక సత్తు కాని విలువ. ఇస్తే విడుదల చేస్తాము.”

“ఇప్పుడు నా దగ్గర సత్తు కానీ కూడా లేదు.”

“మీ నావ దగ్గర నుండి తెప్పించుకోండి.”

“నా నావ మీద ఉన్నదంతా మీవాళ్లు  ఊడ్చుకెళ్లారు. మిగిలిందేమీ లేదు.”

“నీ విలువ చెల్లించే దాకా బందీగా వుండిపో.”

లోపల ఎక్కడనుండో వ్రజేశ్వర్‌కి వినపడింది “రాణిగారు, ఆ వ్యక్తి విలువ సత్తుకానీనే ఐతే నేను కడతాను, నాకు అమ్మివేయండి.”

“అలాగే, తీసుకో, కానీ ఈ వ్యక్తి బ్రాహ్మడు. నీళ్లు తోడతాడా, కట్టెలు కొడతాడా? ఎందుకు పనికివస్తాడు!?”

“నాకు వంటవాడు లేడు, వండి పెట్టటానికి పనికివస్తాడేమో.”

“విన్నావా? అమ్మకం అయిపోయింది. నాకు సత్తుకాని ఇచ్చారు. నువ్వు నిన్ను కొన్నవారికి వంట పని చెయ్యాలి” అన్నది నిశి.

“ఆవిడ ఎక్కడ?” అని అడిగాడు వ్రజేశ్వర్.

“ఆవిడ స్త్రీ, బయటకు రాదు, మీరే లోపలికి రండి” అన్నది నిశి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.