నేను నీకు శత్రువునెట్లయిత?

(ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష)

-డా. టి. హిమ బిందు

          అనుబంధానికి ఆప్యాయతకు అన్న మా ఇబ్రహీం అన్నగారు. హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్న మంచి టీచర్ అని వాళ్ళ స్కూల్ సహోపాధ్యాయులు చబు తుంటే చాలా సంతోషంగా గర్వంగాఅనిపించింది. Full energy తో energy అంతా ఉపయోగించి పాఠం ఘంటా పదంగా చెబుతారని తెలిసింది. అంతే energy తన కవిత్వంలో  కూడా ఉపయోగించారని కవిత్వం చదువుతుంటే అర్ధంఅయ్యింది.  ఒక్కో కవిత ఒక్కో పెను బాంబ్ విస్పోఠనాన్ని తలపించాయి. ఇప్పుడేదీ రహస్యం కాదు‘ కవితా సంపుటికి గాను విమలా శాంతి పురస్కారం మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్  పురస్కారం లభించాయి.  

  1. బహిరంగ ప్రకటన


“కదం కదం పే” అనే కవితలో

“నా అక్షర తూటాలు

ఆకాశాన్ని నేలపై కూల్చ గలవు

నా మాటలు రహదారి కదం తొక్కించ గలవు

నా కవిత్వం

వెన్నెల పూలు పూయించ గలవు

నా జ్ఞాపకం

కవిత్వపు మంటలు రగిలించగలదు”

          అంటూ, ఉన్నది ఉన్నట్టుగా రాసారు. “బహిరంగ ప్రకటన”, “ఇప్పుడేది కాదు రహస్యం” కవితాసంపుటాలు రెండింటిలో ఉన్న కవితలు ఈ కవితలో చెప్పినట్టే అక్షర తూటాలే కాదు పెనుబాంబు విస్ఫోఠనాలు అంటాను నేను. ఈ కవితలు ఆకాశాన్ని నేలకు కూల్చుతాయి, రహదారి కదం తొక్కించగలవు, వెన్నెలపూలు పూయిస్తాయి. అంతే కాదు కవిత్వ మంటలు రగిలిస్తాయి.

“కొత్త అద్దం కొనుక్కోవాలి” కవితలో

“అయితే ఇప్పుడు ఏంటట?

ఏం లేదు రేపు ఓ కొత్త అద్దం కొనాలి

ఈ నగరంలో నేను ఎవరినీ?

నా ఐడెంటిటిని నాకు నేనే వెతుక్కోడానికి “ అనే కవితలో నగరాలలో నివసిస్తున్న చాలామంది చాలా ఏళ్ళు ఇలా తమను తాము ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడాన్ని కొత్త అద్దం రూపంలో వర్ణించారు.

“నా గేయమెంత” కవితలో

“తన పేరులో హిందూస్థానేమే నికార్సైన ఆయుధమనుకున్నా

ఇది కూడా వెక్కిరింపులకు గురవుతున్నప్పుడు

దేహంలోని దేశాన్ని తెగనరుక్కోవాలో

దేశంలో తననే తుంపుకోవాలో తెలీక ..”

          అని చదువుతున్నప్పుడు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పేరును బట్టి మనిషిని మతంతో గుర్తించడం ఒక సమస్య, ఆ మతాన్ని బట్టి మనిషికి గుర్తింపు ఇవ్వడం ఇంకో సమస్య.. తిరిగి దాన్నివెక్కిరింపుకు గురి చేయడం ఇంకో సమస్య.. ఇన్ని సమస్యల మధ్య బాల్యం నుండే వివక్షలతో మానసిక వేదన పడడం మనసును కలిచివేసింది.

          యుద్ధం అంటే రెక్కలు ముక్కలు చేస్తూ హరి గోస పడే వాళ్ళ ఇళ్ళపై బాంబు లేసుడు కాదు

‘యుద్ధం అంటే?

గా శీకట్ని పీల్చి దీపమై మనల్ని ఎలిగిస్తది జూడు

గది గది గది రా బై యుద్దమంటే

*

రా జేద్దాం”

అంటూ యుద్దానికి చక్కటి అసలైన అర్ధాన్ని రాసేసారు.

“నేను నీకు శత్రువునెట్లయిత? మరియు “నాకెందుకు చెప్పలేదు నాన్న?” అనే కవితల్లో

“నాకెందుకు చెప్పలేదు నాన్న?

నేను పుట్టక ముందే ఈ మట్టికి శత్రువునయ్యానని

ఎందుకు చెప్పలేదు నాన్న?

నా చిన్న నాటి దోస్తులకు సుపారి ఇచ్చి

పగను ఎగదోస్తున్నారు?

ఏదైతే అదయిందని

వైషమ్యాల కొలిమిలోంచి

ఈ మతాన్ని తెగనరికే

ఓ ఆయుధంగా నన్నెందుకు మలచలేదు నాన్న?”

 

“బొట్టుకు టోపీకి మధ్య నువ్వు విలవిల లాడిపోతావని

కొంచం ముందెందుకు చెప్పలేదు నాన్న?”

అని తనలోని ఆవేదనకు జవాబులను వాళ్ళ నాన్న గారిని అడుగుతున్నారు.

 

“పెట్టుడు మచ్చ” కవితలో

“మార్పు రావాలి

ఈ వేరుతనాల పాతదనంలోంచి కొత్త దనంలోకి

ఆశాస్త్రీయంలోంచి శాస్త్రీయ ద్రుక్పధంలోకి”

          అంటూ వేరుగా ఉన్న కొన్ని ఆశాస్త్రీయ ఆచారాలలో మార్పు ఈ వేరుతనాలను తుడిపేయడానికి దోహదపడుతుంది అన్న ఆశాభావాన్ని కవిత రూపంలో చక్కగా వివరించారు.

“ఏ అర్ధ రాత్రో” కవితలో

“ఏ అర్ధ రాత్రో స్వతంత్రం వచ్చినట్టు కాకుండా

సమ సమాజ స్థాపన జరిగిందని

పట్ట పగలే బహిరంగ ప్రకటన రావచ్చు”

          అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే స్వాతంత్య్ర ఉద్యమంలా వేరే దేశంపై ఉద్యమమో, యుద్ధమో, సహాయ నిరాకరనో, సత్యాగ్రహమో కాదు కదా చేయ వలసింది ఇలాంటి ప్రకటన రావాలంటే? ఎవరికీ వాళ్ళు వాళ్ళ ఆలోచనపై యుద్ధం చేయాలి. అంతే, చాలా సునాయాసంగా సమసమాజం వస్తుంది. కానీ అదే అతి పెద్ద ఆయాసం అవుతుంది ఎందుకో? ఈ ప్రకటన త్వరగా రావాలని మీతో పాటు నేనూ కోరుకుంటున్నాను సర్.

“జీత్ సలాకోన్ కె పీఛే భీ” కవితలో

“మన్ మే ధ్రుడ్ సంకల్ప్ హయ్ తో

సలాఖో కె పీచే భీ జీత్ హమారీ హీ హోగీ”

          సంకల్పం మనసులో ఉంటె కటకటాల వెనుకనున్నా గెలుపు మనదే అవుతుందన్న ధీమాతోకూడిన ఆశా భావాన్ని ఈ కవితలో ధృఢ పరిచారు. “జీత్ జరూర్ హోనా, అవుర్ జీత్ జరూరీ భీహయ్”.

“ఇంత కంటే హేయం” కవిత చూడండి.

“ఎంత తేలికగా

మాటల్ని ఈటెల్లా ఎక్కుపెడుతున్నార్రా

బాణం వదలాల్సిన పనిలేకుండానే

ఎగిరే పిట్ట స్వేచ్ఛను మాటలతో నేల కూలుస్తున్నారు

డి.ఎన్.ఏ పరీక్షకు నిల్చోబెట్టకుండా

ఒకే గర్భసంచి తెంచుకు పుట్టినోల్లె

రూపాయల ఆటలో పావులై

గర్భగుడినే అనుమానిస్తున్న బిడ్డలకు

ఒకడి నెత్తురు మీద మరొకడి అనుమానం

 

ఒక్కసారి తడి ఆరని ఆ పచ్చి సమాధి దగ్గరకెళ్ళి

బయటకు రమ్మని అరవండి

ఇప్పుడిప్పుడే ప్రశ్నించే వయసొచ్చింది ఆనాటి బాల్యం చచ్చిన వాళ్ళం

ఇప్పుడు లోపలున్నది మాలో ఎదిగిన స్వార్ధమని చెప్పండి

మా తోడ పుట్టినోళ్ళు నిజమే కదమ్మా

ఒక్కసారి చెప్పిపొమ్మని అడగండి.

కేవలం

వరిగడ్డి ఎంటులా రూపాయల్ని

వంటికి చుట్టుకునే ఆశలో ఉన్నాం”

          అంటూ కవిత్వ ఈటెలను సంధించారు. తోడబుట్టిన వాళ్ళు డబ్బుల ఆశ ముందు బంధాలను లెక్కచేయడం లేదని, వాళ్ళ రక్త బంధాన్ని వాళ్ళే అనుమా నాలు, అవమానాలకు గురి చేసి రూపాయలను వంటికి చుట్టుకోవాలని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛగా ఉండాల్సిన తమ వాళ్ళని తామే మాటల ఈటెలతో నేల కూల్చడానికి కూడా వెనకాడటంలేదని గర్భగుడినే అనుమానిస్తున్నారని వాపోతున్నారు.

ఇప్పుడేదీ రహస్యం కాదు

ఆ మొక్కకు రేపు పూలు పూయించాలి కవితలో

“నేను తోటమాలిని తోట పని చేస్తునే ఉన్నా

ఆ మొక్కకు రేపు పూలు పూయించడానికి”

అంటారు కవి తన విద్యార్ధులను ఉద్దేశించి.

 

మూడు చెరువుల ముచ్చట కవితలో

నీటి ప్రాముక్యతను వివరిస్తూ

“నీళ్ళు నీళ్ళే

ఊరికైనా నగరానికైనా

నీళ్ళు మనిషికి నాగరికత నేర్పే గురువు

 

చెరువులు మా ఊరి ఊపిరి

ఎండిన నేలతల్లి గొంతులో ఊరే ఊట

చెరువులు మా ఊరి కంచాల్లో నాలుగు మెతుకులు

చెరువులు నా కలం కవిత్వమైన

మూడు చెరువుల ముచ్చట”

 

అంటారు కవి.

“అరుణ్ సాగర్” కవితలో అరుణ్ సాగర్ గారి గురించి రాస్తూ

తన ఆశయాల దారుల్లో రాలుతున్న మోదుగుపూల మీద అడుగులేస్తూ

మునివేళ్ళతో గోదారి తల్లి కన్నీళ్లను తుడుస్తూ

వేగుచుక్కై వెళ్ళిపోతున్న మహా పథికుడు.

అతడు లేడు

అతని అక్షరం ఉంది.

          అరుణ్ గారు నాన్న గారితో మాట్లాడుతుంటే చూసా. పరిచయం లేదు. పేరుకు తగ్గట్టు అరుణకిరణమని అతని గురించి రచనలు ఎన్నో చదివాక తెలిసింది. (We all miss you Arun sir).

‘తుపాకులు మొలిచే తోట‘ కవితలో

కవితలు రాయటం గురించి చెబుతూ

“అతను నాటిన అడవిలోనే

ఉద్యమాన్ని నెత్తిన మోస్తూ నడుస్తున్నప్పుడు

తుపాకీలు మొలిచే తోటలో

ఈసారి ఆదివాసీ రొమ్మువిరుచుకు నిలబడ్డాడు..”

          అంటూ కవిత్వంతో ఎన్నో సాధించవచ్చు అంటారు. కవిత్వం తుపాకీలు మొలిపించగలవు, వెన్నెలపూలు కూడా పూయించ గలవు అంటారు.

కొన్ని విస్ఫోఠనాలు :

“రాత్రికి ఏ లంగరు వేసి

రేపటి ఆకలి కనుగులోకి జారకుండా ఆపనూ “

 

“రోడ్లకే కాదు ప్రశ్నలకు కూడా మేకులు దింపే దేశంలో

ఆకలని ఏ ఒక్కడు వాకిట్లోకి రాకండి.”

 

“చీకటి చిత్రమొకటి” కవితలో

“యుద్ధం పాడుకుంటున్న మరణ మృదంగం

రేపటి వీళ్ళను

రేపటికి వీళ్ళను కాకుండా చేయడం”

 

“వాళ్ళు వేసుకున్న తాళం వాళ్ళే తెరిచారు

శత్రువుని మాత్రం నన్నే చేసారు”

 

“అప్పుడప్పుడు ఇంటిని దులుపు కొన్నట్టే

కొంచెం ఒంటిని కూడా దులుపు కోవాలనుకుంటా”

 

“మరణం లేని అక్షరానికి

దోపిడీదారుల్ని హతమార్చడమే కాదు

దోపిడీ రాజ్యాన్ని కూల్చడం కూడా తెలుసు”

 

“రేపటిని నమ్ముకున్న అమాయకపు కళ్ళలో

వెలుగు మీద హక్కున్న విషయం బోధించాలి”

 

          ఇలాంటి మరెన్నో విస్ఫోఠనాలను ఈ కవిత్వ పుస్తకాల్లో చదవగలరు.

          ఈ వ్యాసం ముగింపుగా కవి, కవిత్వాన్ని రాయమని ఆదరికీ చెబుతూ ఎందుకు రాయాలో తెలిపిన ఒక కవితలోని కొన్ని లైన్లు

“స్టే ట్యూన్ కీప్ రైటింగ్” అనే కవితలో

“ రాయ్ ..

“పసిపిల్లల నవ్వులలోని నిష్కల్మశమంతా స్పష్టంగా రాయ్”

“ఆయుధం లాంటి కవిత్వాన్ని ప్రశ్నలా రాయ్”.

          ప్రశ్నలతో కూడిన కవితల ఆయుధాలను ఎక్కుపెట్టమని నిష్కల్మషమైన తత్వాన్ని పరిరక్షించమని సందేశాత్మకంగా తెలపడం చాలా బాగుంది.

          ఇలా విస్ఫొఠనాలతో పాటు వెన్నెల పూలూ కురిపించారు రెండు కవితా సంపుటాలలో. సమాజపు అశాస్త్రీయమైన వివక్షలన్నీ కవిత్వపు తూటాలతో పటా పంచలై సూర్య పుష్పాలు, వెన్నెల పూలువిరియాలని ఆశిస్తూ..

          కవి ఇబ్రహీం అన్న గారికి మరియు చదివిన మీ అందరికీ ధన్యవాదాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.