యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
వీసా పాట్లు & లోకల్ టూర్లు:
శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్రాన్సు వీసా ఆఫీసు చుట్టుపక్కల గడ్డకట్టే చలిలో బయటెక్కడా గడిపే పరిస్థితి లేక, కారు పార్కింగులోకి వచ్చి కారులో కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాం. ఎప్పటికి ఇదంతా తెములుతుందో తెలీదు. అసలే ఇంటి దగ్గిర చూసిపెట్టేవాళ్ళేవరూ లేని ఈ అమెరికాలో మాతో చిన్నపిల్లని తీసుకువెళ్లామాయె. ఏదేమైనా ఆ రోజే వీసా అప్లికేషను సంగతి పూర్తి చెయ్యాల్సిన గడ్డు పరిస్థితి.
లాప్ టాపు తీసుకుని “మా రిజర్వేషను మొత్తం మారుద్దామా? లేదా ఫ్రాన్సులో నాలుగు రోజులు హోటల్ ఒక్కటీ మళ్ళీ బుక్ చేద్దామా?” అని ఆలోచనలో పడ్డాం.
అయితే ట్రిప్ మాస్టర్సు సైటులో ఒక సౌకర్యం ఏవిటంటే గంటలు గంటలు కస్టమరు సర్వీసు వాళ్ళతో కుస్తీలు పట్టకుండా మనకి మనం ఆన్లైనులో అన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
మా రిజర్వేషను మొత్తం మారుద్దామంటే “నాలుగో రోజు ఫ్రాన్సులో చేరిస్తే వరసపెట్టి అక్కణ్ణించి అన్ని తారీఖులూ మారిపోతాయి.అసలే లోకల్ టూర్లు కూడా బుక్ చేసేసాం. ఇన్ని మార్చడం అయ్యేపని కాదు.”
ఇక చేసేదేం లేక త్వరితంగా ఆలోచించి డబ్బులు పోతే పోయాయని అనుకుని ఫ్రాన్సులో నాలుగు రోజులు హోటల్ ఒక్కటీ విడిగా బుక్ చేసాం. వీసా వరకూ గండం గడిస్తే తర్వాత కాన్సిలు చేసుకోవడానికి కొంత సమయం ఉంటుంది ఎలాగూ.
ఇక ఈ బుకింగు కాగితం మా ఇద్దరికీ తలా ఒక కాపీ పట్టుకెళ్ళాలి కాబట్టి , దగ్గర్లో ఉన్న ఫెడెక్సు కొరియర్ సర్వీసు సెంటర్ లో ప్రింటవుట్ తీసుకునే సౌకర్యం ఉండడంతో సత్య పరుగున వెళ్లేడు. అయినా అక్కడ లైను ఉండడంతో తను తిరిగి రావడానికి గంట పట్టింది. ఈలోగా కారులో సిరి “ఆకలి” అని పేచీ మొదలుపెట్టింది. లక్కీగా ఇంటి నించి తెచ్చిన చిప్సు పేకెట్ చేతికిస్తే ఊరుకుంది.
ఆ ప్రింటవుట్లు పట్టుకుని ఒంటి గంట ప్రాంతంలో మొత్తానికి మళ్ళీ వీసా సెంటరుకి వెళ్ళేం. అదృష్టం కొద్దీ అక్కడ లైను లేదు. వెళ్ళగానే మమ్మల్ని పిలిచేరు.
ఈ సారి అప్లికేషనుకి అన్నీ సరిపోయాయని కౌంటరులో ఉన్నతను చెప్పేక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాం. బయోమెట్రిక్సు పూర్తి చేసి బయటికొచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది.
అక్కణ్ణించి ‘బతుకుజీవుడా’ అని బయటపడి, అప్పటికే అందరికీ కణకణా ఆకలి వేస్తూ ఉండడంతో ఎదురుగా కనబడ్డ కెఫేలో ఆదరాబాదరా ఏదో కొనుక్కుని తెచ్చుకుని కార్లోనే కూర్చుని తిన్నాం.
ఇలా మా యూరపు వీసా కథ సుఖాంతమైనా బోల్డు టెన్షను పడాల్సి రావడమే కాకుండా, అనవసరంగా టైము వేస్టు అయ్యింది మాకు.
వెరసి పాఠం ఏవిటంటే యూరపు వీసాకి అప్లికేషను పెట్టేటప్పుడు ఏ దేశంలో ఎక్కువ “రాత్రుళ్ళు” ఉంటున్నామో ఆ కాన్సులేటులోనే వీసా అప్లికేషను పెట్టుకోవాలి.
ఇన్ని కష్టాలు పడ్డా వీసా స్టాంప్ అయ్యి పాసుపోర్టులు సరిగ్గా పది రోజుల్లో వచ్చేసాయి.
***
లోకల్ టూర్లు:
అప్పటికే లోకల్ టూర్లన్నీ బుక్ చేశామని చెప్పాను కదా!
లండను, పారిస్, రోమ్ నగరాల్లో మొదటి రోజు ఖాళీ, రెండో రోజు సిటీ టూరు, మూడో రోజు చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు అంటూ వరసగా టూర్లని ప్యాకేజీలో చేర్చాం.
అందులో భాగంగా లండనులో మొదటి రోజు ఖాళీ ఉంచాం. రెండో రోజున మాకే స్వంతమైన ప్రైవేటు వాహనంలో సిటీ టూరు, మూడో రోజు లండనుకి దూరాన ఉన్న పాత యుగంనాటి స్టోన్ హెంజ్ (Stone Henge), రాచరిక యుగం నాటి బాత్ (Bath) లనబడే సహజసిద్ధ స్నానవాటికలు, షేక్స్పియర్ జన్మ స్థలం కలగలిపిన టూరు, నాలుగో రోజు బ్రిటిషు మ్యూజియం, గ్రీన్ విచ్ ప్రామాణిక కాలమానాన్ని తెలిపే గీత ఉన్న ప్లానిటోరియం టూర్లు ప్యాకేజీలో చేర్చాం.
మరో వారంలో బయలుదేరుతామనగా వెళ్ళిన మొదటి రోజుకి కూడా లోకల్ అట్రాక్షన్లు బుక్ చేసుకున్నాం. “లండన్ ఐ” (London Eye) అనబడే పేద్ద జెయింట్ వీల్, ప్రసిద్ధి చెందిన మధ్యాహ్నపు టీ (Afternoon Tea) తో కూడిన థేమ్స్ నదీ పడవ విహారాల్ని విడిగా మరో నాలుగు వందల డాలర్లు పెట్టి వేరే లండన్ సిటీ ఎక్స్పీరియె న్సెస్ అనే సైటులో డైరక్టుగా కొన్నాం.
ఇక పారిస్ విషయానికి వస్తే- లండన్ నించి పారిస్ కి ఉదయపు రైలులో వెళుతున్నాం కాబట్టి వెళ్లిన రోజు మధ్యాహ్నం “టుక్ టుక్ “ అనబడే బ్యాటరీ ఆటోతో ఊరంతా తిప్పి చూపించే లోకల్ టూరు విడిగా బుక్ చేశాం. మర్నాడు ఈఫిల్ టవరు, పారిస్ నదీ విహారపు కాంబో టూరు, మూడో రోజు పొద్దున్న మోనాలిసా పెయింటింగ్ ఉన్న ప్రసిద్ధ లూవ్ర్ (Louvre) మ్యూజియం బుక్ చేశాం. ఆ సాయంత్రం ఊళ్ళో సొంతంగా తిరుగుదామని ఖాళీ పెట్టుకున్నాం.
ఇటలీలో మొదట రోజు పొద్దున్నే పారిస్ నించి రోముకి ఫ్లైటు ప్రయాణం. ఆ రోజు మధ్యాహ్నం ఖాళీ ఉండడంతో రోములో పాత రోమను మ్యూజియం టూరు విడిగా బుక్ చేశాం. మర్నాడు ప్రసిద్ధ కొలోసియం (Colossuem), పాత రోము టూరు, ఆ మర్నాడు వాటికన్ సిటీ టూరు, చివరి రోజున ఫ్లోరెన్సు, పీసా టవర్ల టూరు ప్యాకేజీలో చేర్చాం.
ఈ విధంగా నేననుకున్నట్లు ఆయా దేశాల్లో మహా నగరాలు మాత్రమే కాకుండా చుట్టు పక్కల నగరాలు, ప్రాంతాలు చూసే అవకాశం కూడా కలిగిందన్నమాట! ఇక “విడిగా” బుక్ చేసుకున్నవన్నీ ట్రిప్ మాస్ట్రర్స్ లో కాకుండా అదనంగా డబ్బు చెల్లించి బయటి సైట్లలో కొన్నవి. అలా మరో పదిహేనువందలు డాలర్లు చేరిస్తే అప్పటికి మా ట్రిప్పు బుకింగుకి ముగ్గురికీ కలిపి పదమూడు వేల డాలర్లయ్యింది.
ఇక ఈ ట్రిప్పులో అత్యంత సంతోషకరమైన ఓ విషయం ఏవిటంటే అప్పటికే నాకోసం యూకే, ఫ్రాన్సులలోని తెలుగు సాహితీ మిత్రులు లండను, పారిస్ లలో నాతో మీట్ & గ్రీట్లు ఏర్పాటు చేసారు. అయితే టైట్ షెడ్యూలు ఉండడం వల్ల ఆ ఊళ్ళకి వెళ్లిన మొదటి రోజు డిన్నరు సమయంలో రాత్రి ఏడు నించి పది వరకు కలిశాం వారిని. మా సమయానుకూలంగా వారు ఏర్పాట్లు చెయ్యడం గొప్ప విషయం.
*****
(సశేషం)