
ఈ తరం నడక – 17
మానుషి (శాంతి బెనర్జీ)
-రూపరుక్మిణి
ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు
మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి.
మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., ఈ పేరే నన్ను ఈ పుస్తకం వైపు ఆకర్షించింది. సాహితీ వనంలో మీ అందరికీ పరిచయం ఉన్న రచనలే గత నాలుగైదు సంవత్సరాలుగా కథలు, కవిత్వమై పారే నదిలా తన అక్షరాలకి ఓ ప్రవాహాన్ని అందించిన శాంతి బెనర్జీ గారు మనిషి ఎంత శాంత స్వభావమో, పేరుకు తగ్గట్టుగా తన కథలు కూడా అంతే శాంతంగా ఉంటాయి. ప్రతి కథ ఈనాటి కాలానికి సరిగ్గా సరిపోయే పాత్రలలో, నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చిస్తూనే.., తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏర్పడే అంతరాల వ్యత్యాసాలు గూర్చి మాట్లాడుతారు.
చాలామంది తల్లిదండ్రులు వారి వారి ఆలోచనల పట్ల యువతతో మాట్లాడే టప్పుడు ఎంత ఆచితూచి వ్యవహరించాలో పిల్లలు తీసుకునే నిర్ణయాల పట్ల సానుకూలత ప్రదర్శించేది ఎప్పుడు స్త్రీనే ఉండడం శాంతి బెనర్జీ గారి కథల్లో మనకు కనిపిస్తుంది.
ఈ కథలో ముఖ్యపాత్ర ఎప్పుడు స్త్రీ దే 14 కథలు ఉన్నాయి ప్రతి కథ ఒక కొత్త కోణం నుండి మొదలవుతుంది. ముగింపు ఎప్పుడు మానవత్వంలోని పరిమళం అంటుకుని మనిషి వెలుగు వైపు అడుగు వేస్తూ బ్యూటిఫుల్ సోల్స్ ని పరిచయం చేస్తారు.
ఆధునిక పోకడలలో ఇప్పుడు మన మధ్య జరిగే, జరుగుతున్న జీవన చిత్రాలు. నేటి మానవ సంబంధాలలో వచ్చిన, వస్తున్న మార్పులను ఎంతో సరళమైన పదాలతో మధ్యతరగతి జీవనాలలో ఆర్ధిక వెసులుబాటులో ఉన్నత వర్గ జీవచిత్రాన్ని మన కళ్ళముందుంచారు.
వీరి కథల్లో ప్రత్యేకత సరళ శైలి, చదివించే గుణం ఉంటుంది ఈ కథలన్నీ ఫస్ట్ పర్సన్ లోనే నడుస్తాయి. కథల లోతుల్లోకి వెళితే సహజీవన విధానాన్ని సమర్థిస్తారు, నేటి యువత ఆలోచనలలోని భవిష్యత్తు పట్ల వారికి ఉండే అవగాహనని వారి నిర్ణయా లలో వచ్చిన మార్పుని ఆహ్వానించే ప్రగతి పురుషుల్లో కంటే ఆడవారిలో ఉంటుందని ఈ కథలు మనకు చెప్తాయి.
అనివార్యం కథలో ఆర్థిక స్వావలంబనతో నిలబడిన కమల, కూతురు సనని చూడడానికి బెంగళూరు వెళ్తుంది. అక్కడ సనా తన స్నేహితుడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయించుకుంటాం. అని చెప్పడంతో ముందు అంగీకరించలేక, మౌనంగా తిరిగి వచ్చిన కమల ఆమె జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు పెద్దలు నిర్ణయించి చేసిన పెళ్లిలో ఆమె ఎప్పుడు ఆర్థిక స్వేచ్ఛని కానీ, మానసిక స్వేచ్ఛను కానీ అనుభవించలేదని. తన జీవితం కంటే స్వతంత్రం నిర్ణయాలు తీసుకున్న సన జీవితం కమలకి గొప్పగా కనిపిస్తుంది. ఇలా తల్లి పాత్రలు కూతురు తీసుకున్న నిర్ణయాల వెనుక ఉండే బలమైన కారణాలను, ఇష్టాలను వారి ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకునే శక్తి ఆ పరిస్థితులను దాటుకు వచ్చిన మరో స్త్రీకి మాత్రమే ఉంటుందని శాంతి బెనర్జీ గారి కథల్లో బలంగా వినిపిస్తుంది.
తరాల మధ్య అంతరాలు కథలో పెళ్లి చేసుకున్న జంట ఎంతో అవగాహనతో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. ఏ హంగు ఆర్భాటం లేకుండా జీవించే వారిలో ఉండే ఆత్మబలం ఎంత బావుంటుందో వివరించి చెప్తారు. పిల్లల్ని కనాలి అనుకోకపోవడం, అనాధ పిల్లలని దత్తత తీసుకోవాలని అనుకోవడం, నేటి తరం పిల్లల ఆలోచనల్లోని గొప్పతనాన్ని వారిని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతని కూడా కథలో చక్కగా చెప్పగలిగారు శాంతి గారు.
అసహజమనిపించే సహజంలో లెస్బియన్స్ యొక్క గొంతును వినిపిస్తారు. ఈ సమాజంలో తప్పుగా చూసే వారికి ఓ చురకవేసే ప్రయత్నం చేస్తారు. లెస్బియన్స్ వారి నమ్మకాలకి అనుగుణంగా వారిని ఆదరించాల్సిన సమాజాన్ని కోరుకుంటారు.
మీ.. టూ… అంటూ ఆడపిల్లలపై జరిగే టాక్సిక్ సిచువేషన్ ని ఎదుర్కోవడం, ధైర్యంగా నిలబడాల్సిన అవసరాన్ని చెప్తూ ఆడపిల్లలకి ధైర్యమే ఆభరణం అని బలమైన గొంతుని వినిపిస్తారు.
ఆత్మాభిమానం కథలో ప్రేమలో మోసం చేసే వ్యక్తిని ఎదిరించి ఆత్మస్థైర్యంతో నిలబడటం గురించి చర్చిస్తే, గ్రహణ విముక్తంలో మానసిక రుగ్మతతో బాధపడే స్త్రీ జీవితాన్ని ఆవిష్కరిస్తారు.
ఇలా స్త్రీ పాత్రలన్నీ స్వతంత్ర భావాలతో, కథలన్నీ స్త్రీవాదానికి ప్రతీకలుగా ఉంటాయి.
ఈ కథల్లో ఇళ్లలో పని చేసుకుని బ్రతికే సీత ఆత్మస్థైర్యం కథ , భర్త చనిపోతే వారి తెగ కట్టుబాటు ప్రకారం మరిదికి ఇచ్చి పెళ్లి చేసే పద్ధతిని ఎదిరించి తన స్వతంత్రాన్ని చాటుకొని కూరగాయలు అమ్ముతూ బ్రతికే ‘తిత్రి’ కథలు మనల్ని ఆకర్షిస్తాయి.
మానవత్వంతో ఉండాల్సిన అవసరంతోటి స్త్రీల మానసిక స్థితిని బట్టి వారి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వల్ల వచ్చే బాధల్ని ఎదుర్కొనే చక్కచక్యాన్ని రాస్తారు.
నెహ్రూ గారి భార్య కథ వాస్తవ సంఘటన ఆధారంగా రాసింది. ట్రైబల్ వ్యవస్థలో ఉండే పద్ధతులు వల్ల ఒక స్త్రీ ఆ సామాజిక కట్టుబాటుని తెలుసుకోకపోవడం వలన మరి ఏదైనా కారణం వల్లనో.., ఆ స్త్రీ ఆ కట్టుబాట్లని పాటించకపోవడం వల్ల , వారి తెగలోని ప్రజలకు వారి కుటుంబాల నుండి వెలివేయబడ్డ వారి ఆత్మ చలనం గురించి ఈ కథ తెలియజేస్తుంది.
ఈ పుస్తకంలో అన్నీ కథలు ఏదో ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని చెప్పినవే. నెహ్రూ గారి భార్య, వంచిత, ఆత్మస్థైర్యం కథలోని పాత్రలని ఎక్కడో వార్తల్లో చదివిన వాస్తవ కథనాలకి అనుగుణంగా ఇక్కడి ప్రాంతపు జీవన విధానానికి అన్వయించి కథలను రాశారు . అలా ఒక్కో సంఘటనను కథ చేయడం వివిధ ప్రాంతాలలో జరిగిన సంఘటనల్లోని విషయాలని మన ప్రాంతీయతలోకి అన్వయించ డంలో శాంతి బెనర్జీ గారు సక్సెస్ అయ్యారు.
కులం, మతం జోలికి వెళ్లకుండా.. స్త్రీని కేంద్రకంగా చేసుకొని, ఈ సమాజానికి తనదైన వాస్తవిక స్త్రీవాద గొంతుని తన కథల ద్వారా వినిపించారు శాంతి బెనర్జీ గారు. అభినందనలు మంచి పుస్తకం పంపించారు. ఈతరం నడకలో భాగమైనందుకు ధన్యవాదాలు.
అన్విక్షకి పబ్లికేషన్ లో ‘మానుషి’ పుస్తకం దొరుకుతుంది.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.