గజల్ సౌందర్య – 4

-డా||పి.విజయలక్ష్మిపండిట్

          గజళ్ళలో భావ శిల్ప నిర్మాణ సౌందర్యాన్ని, అభివ్యక్తి తీవ్రతలను విశ్లేషించి బేరీజు వేయడం ఓ బృహత్  సాహితీ ప్రక్రియ. గజల్ కవుల కవి సమయాలు; ప్రేమ ప్రణయ వియోగాల అంతర్ మథనాల వ్యక్తీకరణ, భావ రూప శబ్దాలంకారాలు, నడక .., గాన లయలను ఆస్వాదిస్తూ గజల్ సౌందర్య విశ్లేషణ చేయడం ఓ వైవిధ్య భరిత అందమయిన అధ్యయన అనుభవం.

          “గజల్ సౌందర్యం “ వ్యాసాల ముఖ్య ఉద్దేశం గజల్ కవుల పరిచయం , వారి గజళ్ళను చదివి గజళ్ళ గానం విని గజల్ ప్రేమికులు గజల్ సౌందర్యాన్ని ఆస్వాదిం చడం . ఈ నాలుగవ వ్యాసంలో మరికొంత మంది గజల్ కవులను వారి గజళ్ళను ఆస్వాదిస్తూ పరిచయం చేస్తున్నాను.

          వారు సర్వశ్రీ చల్లా రాంబాబు, ఇరువింటి వెంకటేశ్వర శర్మ, డా.రామ శర్మ, RVSS శ్రీనివాస్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, వర్షు కొండూరు , జ్యోతిర్మయి మల్ల, , వాణి కొరమద్ది. 

చల్లా రాంబాబు గారి గజల్ ..

చిరుజల్లలు నేలగుండె తాకినపుడె వసంతం 

రైతు నుదుట చెమటచుక్క చిందినపుడె వసంతం 

శలవు లేని కొలువులోన నలిగెను దేహం 

కష్టించే భార్య నుదురు నిమిరినపుడె వసంతం 

పేదవాని బ్రతుకెపుడూ ఉన్నవారి కలుసుకద 

బడుగువారి న్యాయానికి పోరినపుడె వసంతం 

ఎంత భాగ్యమెంత ధనము ఉన్నను ఏం లాభమూ 

పసిపాపడు గుండెలపై తన్నినపుడె వసంతం 

మలిదశలో శక్తి లేని కన్నవార్ని దరిజేర్చితె 

ముదిమి వయసు తలిదండ్రులు నవ్వినపుడె వసంతం

మనిషి జీవిత విలువలను 

తాకినపుడె, చిందినపుడె, నిమిరినపుడె,

పోరినపుడె, నవ్వినపుడె – అనే కాఫియాలతో 

వసంతం – అనే రదీఫ్ తో సుందర భావోద్వేగాలను (గజలియత్) ను పలికించారు 

చల్లా రాంబాబు గారు.

***

 చల్లా రాంబాబు గారి మరో గజల్ ను ఆస్వాదించండి ..,

తలనిమిరితె మా ఆవిడ పరవశించి పోతుంది 

ఏమోయ్ అని పిలిచాన హృదయంతొ పలుకుతుంది 

విడినకొప్పు సవరించీ ముడివేయాలనుండదు 

తనసుఖమును మానుకొనీ  పరిచర్యలు చేస్తుంది 

జొరమొచ్చిన జలుబొచ్చిన మంచానపడదు కదా

అమ్మకంటె పదిలంగా బాగోగులు చూస్తుంది 

ఉన్నదాంతొ సరిపెట్టే ఇల్లాలె  వెలుగింటికి 

తనకున్నా లేకున్నా భర్తకడుపు నింపుతుంది 

ఏమివరము కావాలని దేవుడొచ్చి అడిగితే 

భర్తకంటె తనుముందు పోవాలని కోరుతుంది

ఈ గజల్లో తన సతీమణి త్యాగనిరతిని,

          ఇల్లాలుగా ఆమె సేవలను గుర్తించి అందమైన గజల్ అల్లారు చల్లా రాంబాబు . ఈ గజల్ లో భారతదేశంలో సగటు  ఇల్లాలు ప్రతిబింబిస్తుంది.

          చల్లా రాంబాబు గజళ్లను 1998 నుండి రాస్తున్నానన్నారు. 2000 సంవత్సరంలో వారి గజల్ సంకలనం “చల్లా గజళ్లు” పేరుతో డా. సి.నారాయణ రెడ్డి గారు ఆవిష్కరిం చారు. సినారె గారి గజళ్ల పుస్తకం తరువాత వీరి గజల్ పుస్తకం ఆవిష్కరించబడింది . ఇంతవరకూ ఇంచుమించు 1500 గజళ్లు వ్రాసినా తరువాత పుస్తకం అచ్చు వేయ లేదని .., రెండవ గజల్ పుస్తకం అచ్చు వేయించే ఆలోచనలో వున్నానని అన్నారు .

          కేశిరాజు కృష్ణ పాడిన  వీరి గజల్ “ ఎన్ని బాధలు పంచుకుంటే “audio / video link లో వినండి 

***

ఇరువింటి వెంకటేశ్వర శర్మ గారు మరో ప్రముఖ గజల్ కవి.

వీరు వెలువరించిన గజల్ సంపుటాలు

1.మధువర్షిణి 2.మధురోహలు

సంకలనాలు 1.గజల్ సరాగాలు 2. గుల్ బహర్ ( బహర్లలో తొలి తెలుగు గజల్ సంకలనం)

          వీరు నెలకొల్పిన “గజల్ సాహిత్య వేదిక “ అనే గజల్ సంస్థ తెలుగు గజళ్ళ వ్యాప్తికి తోడ్పడుతూంది.

          ఏడు షేర్లతో అంత్యప్రాసలు “కాఫియాల“తో  వీరి గజల్ లో ప్రేయసి చుట్టూ తిరిగే మనసు గతిని కవి కలము చిలిపి ఊహలంటూ చమత్కారాలతో అల్లిన గజల్ ను ఆస్వాదించండి . 

అదే కొంటె చూపు నన్ను పదేపదే తడుముతోంది వసివాడని గాయాలను అదే పనిగ రేపుతోంది

తన చుట్టే తిరిగి తిరిగి శలభాన్నై పడిచచ్చా

రెప్పచాటు తెరలపైన  స్వర్గమేదొ కదులుతోంది

కురులు ఉరులు వేస్తాయని చెబుతుంటే నమ్మలేదు

మల్లె పూల కొప్పు ఘాటు, ఊపిరులను ఆపుతోంది.

నిప్పుకన్న చెలి శ్వాసే నిలువున దహియించునంట

పునీతమై నిలిచేందుకు ఈ దేహం తరలుతోంది.

ఆ నవ్వుల వలలో పడి చిక్కుకుంది నా మనస్సు

బంధనమే బాగుందని గ ‘మ్మత్తుగ ‘ సోలుతోంది 

సరి సగమై పగలు, రాత్రి నీ కాపల కాస్తున్నవ

దరిచేరే దారిలేక నా గమనం ఆగుతోంది

కవి కలముకు చిలిపి ఊహ లందమోయి ఇరువింటీ!

మధుర భావ పల్లకిలో నా గానం సాగుతోంది

          ఇరువింటి శర్మ గారి రెండవ గజల్ ఓ ఆశావహ దృక్పథం వస్తువుగా  , ( లేకున్నా) అన్న రదీఫ్ తో ,అందమైన ప్రతీకలతో మలిచిన ఓ సందేశాత్మక గజల్ . చదివి ఆస్వాదించండి.

నమ్మకమే నీకు తోడు ఎవరున్నా లేకున్నా!

ఆటనైతె ఆడాలోయ్ గెలుపున్నా లేకున్నా!!

రేపన్నది ఒకటున్నది నేడు జారి పోతె నేమి!

అమిత ప్రేమ పంచు, తనకు మనసున్నా లేకున్నా!!

అలల కొసలు చూడు ఏదొ చెప్పాలని చూస్తున్నవి!

ఎత్తిన తల దించ బోకు బలమున్నా లేకున్నా!!

కనులు మూసి చూశావా లోకమంత ఒకేతీరు!

విశ్వాసం వీడనీకు వెలుగున్నా లేకున్నా!!

శిఖరాలను తాకాలా…తెగబడి దూకుతు ఎగబడు!

గమ్యమెపుడు మార్చవద్దు దారున్నా లేకున్నా!!

ఆశయాల దారుల్లో మొదటి యడుగు ఒంటరిదే.!.

సమూహమై కదంతొక్కు తోడున్నా లేకున్నా!!

నీ కథలే చరితలౌను రాబోయే కాలానికి!

అక్షరమై జీవించుము రేపున్నా లేకున్నా!!

ఇరువింటి శర్మ గారి గజల్ గానం వీడియో లింక్ లో విని ఆస్వాదించండి.

***

          డా. రామశర్మ గారు ఓ ప్రముఖ గజల్ కవి . వీరు దాదాపు 150 మంది కవులకు గజల్ నిర్మాణ శైలిని నేర్పి తెలుగు కవులును ప్రోత్సహించి గజల్ కవుల సంఖ్యను పెంచిన ఘనత వీరి సొంతం. వీరు “రవళి “అనే అంతర్జాల మాస పత్రికకు సంపాద కులు. 

వీరి గజల్ ను చదివి ఆస్వాదించండి.

తోడు నీడగా నిలిచి తన జీవితానికి హాయినిచ్చే

హృదయేశ్వరి పై రాసుకున్న అద్భుత మైన గజల్ .

నీవు తోడు నీడ గాను పక్కనుంటె యెంతహాయి 

స్నేహరాగ పరిమళాలు చల్లుతుంటె యెంతహాయి

పలకరింపు లోన చాల మధురిమలే కనబడెనే 

కదిలించే భావమేదొ పలుకుతుంటె యెంతహాయి

కర స్పర్శ తగలగానె బాధలెన్నొ దూరమాయె 

బంధమంత గట్టిగాను నిలబడుంటె యెంతహాయి

ఒంటరితనమంతపోయె సుఖమంతా చేరిపోయె 

సంతసంతొనావయిపుడు సాగుతుంటె యెంతహాయి

రామ శరము వేగమల్లె మంచితనము చేరెనిపుడు 

జీవితమే అందముగా మారుతుంటె యెంతహాయి

రామశర్మ గారి మరో గజల్ ను పరిశీలించండి … 

కలలనెలవు మిత్రులకై ధ్యానమిదే నాకెపుడూ

కలవాలని తపనపడే బంధమిదే నాకెపుడూ

స్నేహితమే జీవితమని‌ మనుగడకే విలువలివీ

దారితప్పి‌ వెనుదిరగని పయనమిదే నాకెపుడూ

నీడకూడ వదిలేసిన ఏమాత్రం‌ జవదాటను

నిస్వార్ధపు‌ దిశలోనీ గమ్యమిదే నాకెపుడూ

పిలవగానె వచ్చిచేరు గాలితెరను నేనేలే

విడనాడక వినిపించే గానమిదే నాకెపుడూ 

రామబాట వీడకుండ మాటలన్ని దాటనెపుడు

నలుగురితో కలిసిపోవు విజయమిదే నాకెపుడూ

ధ్యానమిదే,, బంధమిదే, పయనమిదే, గమ్యమిదే, గానమిదే, విజయమిదే అనే కాఫియాలతో , “నా కెపుడూ “”- అనే రదీఫ్ తో రామబాట వీడనని తన జీవిత ఆదర్శ గమ్యాన్ని తెలిపే గజల్ .

          “నీవు తోడు నీడ గాను పక్కనుంటె యెంతహాయి “అనే రామశర్మ గారి గజల్ గానం వీడియో link open చేసి విని ఆస్వాదదించండి.

***

          RVSS శ్రీనివాస్ గారు ప్రముఖ గజల్ కవి. వీరు పున్నమిపూలు , కలలకౌముది,  శ్రీరాగచంద్రిక, వెన్నెల సుమాలు, శీతలతరంగిణి అని 5 గజల్ సంపుటాలను వెలువరించారు.” 

వీరి గజల్ (త్రిశ్రగతి )

( హుస్న్ ఏ మత్లా – కాఫియా పదాలతో అంత్యప్రాస గజల్ ) ను ఆస్వాదించండి.

సుగంధాన్ని కోరుకోని పుష్పాలను చూడలేరు  

మరందాన్ని ఆశించని భ్రమరాలను కానలేరు  

వాహినులను ప్రేమించని సంద్రాలను కాంచలేరు  

కెరటాలను  కవ్వించని తీరాలను చూపలేరు 

కన్నులు చూపించినపుడు అందరికీ తెలుస్తాయి   

ప్రేమగంగలో మునిగిన భావాలను దాచలేరు 

అరచేతికి అందినపుడు కోరికలను తీర్చుతాయి 

నింగినుండి రాలని నక్షత్రాలను మెచ్చలేరు 

మహనీయుల పథములలో గమ్యాలను చేరుకోరు  

అవివేకులు చూపించిన మార్గాలను వదలలేరు  

ఈ నేతలు ప్రజలాగే జీవించుట నేర్వాలోయ్   

అధికారం చలాయించి రాజ్యాలను ఏలలేరు  

అందరిలో ప్రణయగరాగమధువున్నది  “నెలరాజా”  

విషాదాన్ని మేలుకొలుపు గీతాలను పాడలేరు 

.. చూడలేరు, కాంచలేరు, చూపలేరు, దాచలేరు , మెచ్చలేరు, వదలలేరు..అన్న కాఫియాలతో అందమయిన ప్రతీకలతో అల్లిన గజల్ .

RVVS  srinivas గారి మరో గజల్ సౌందర్యాన్ని ఆస్వాదించండి.

గజల్ ..(త్రిశ్రగతి – హుస్న్ ఏ మత్లా )

రెప్పలపై కలలమేడ కూలుతోంది  ఎందుకనో 

కన్నులలో విషాదాన్ని పెంచుతోంది ఎందుకనో

విధి కూడా చురకత్తులు విసురుతోంది ఎందుకనో 

ఎగురుతున్న ప్రతీ ఊహ రాలుతోంది ఎందుకనో 

కాలానికి  అపకారము చేసినట్లు గురుతు లేదు 

పదునెక్కిన నిమిషాలను రువ్వుతోంది ఎందుకనో

వెన్నెలవానలు కురిసే రాత్రులు ఎటు వెళ్ళాయో        

కనుపాపలలో చీకటి వాలుతోంది ఎందుకనో 

మధుమాసం చూసి ఎన్ని వత్సరాలు గడిచాయో

జీవితాన్ని చివరి ఋతువు కుదుపుతోంది ఎందుకనో 

పయనించే పాదాలను ఎలా ఆపుతున్నాయో 

అవరోధాలకు పంతం పెరుగుతోంది ఎందుకనో  

కొనిపొమ్మని ఎన్నిసార్లు అడిగానో  “నెలరాజా” 

అపుడే కాదని మృత్యువు తెలుపుతోంది ఎందుకనో

కూలుతున్న కలల మేడలు.. , జీవిత గమనంలో ఎదురయ్యే నిరాశ నిస్పృహలను ..”ఎందుకనో ?! అనే రదీఫ్ తో మలిచిన అద్భుత మైన గజల్ .

***

          రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మరో ప్రముఖ గజల్ కవయిత్రి. ఆమె దాదాపు 7 గజల్ సంపుటాలను వెలువరించారు. వీరు “నుడి గుడి”అనే  తెలుగు భాషా సాహిత్య పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు . వారి నుండి నేనడిగిన 2 గజళ్ళు రాలేదు. కానీ నా వద్దనున్న వారి “ నిరాతప” అనే గజల్ సంపుటి నుండి నేనే  ఒక గజల్ ను ఇచ్చట  పరిచయం చేస్తున్నాను.

          “నిరాతప”3 వ గజల్ సంపుటి నుండి 7 షేర్ల గజల్ ..,నిరాతప అనే రదీఫ్ తో .., నిరాతప అంటే రాత్రి.. నిరాతప అందాలను పోగు చేసి అల్లిన గజల్ ను ఆస్వాదిం చండి. మల్లీశ్వరి గారి గజళ్ళు కొత్త పదబంధాలతో అలరిస్తాయి.

నిరాతప గజల్ ..;

మిణుగురుల ముసి నవ్వుల వన్నె లెన్ని మోసిందో ఈ నిరాతప 

వెల్లువౌ వెలుగు విరి విలాసమెంత పూసిందో ఈ నిరాతప 

కలికి కళ్ళనున్నది అరుపు ఎరుపో మైమరుపో తెలియ నీదు

బతుకు నెంత అష్టా చెమ్మాటగా చేసిందో ఈ నిరాతప 

ఎదురుచూపుల నీడల ఊడల నిట్టూర్పు లెంతగ అలిసాయో

ఖేదమోద వాదనలే ఖాంతాల తోసిందో ఈ నిరాతప

కలవని ఎదలు కలిసి చేసే అహం కృత వికృత చేతలెన్నో 

కరకు ఎడమల బడి ఎంత వింతగ మాసిందో ఈ నిరాతప 

అన్నేదో కన్నేదో చెన్నేదో తెన్నేదో వెన్నుదన్ను తెలుపక

కాలం కళ మార్చుతూ తలపులెన్ని పోసిందో ఈ నిరాతప 

ఏ ప్రభోధ ప్రయోగంలో ఏ యోగ కాంతి కౌగిలి కవ్వింతలో

ఏ వలపు పసదనపు నిప్పుకలలో తడిసిందో ఈ నిరాతప

చుక్కలు చిలికే చక్కదనాన మక్కుమీర పక్క పరుచుకుని

మల్లీ ! అంథమైన ఆశ లెన్నగ దోసిందో ఈ నిరాతప.

          మల్లీశ్వరి గారు స్వయంగా గానం చేసిన తన “ మోహన” సంపుటి గజళ్ళ ను “GK టాకీస్ “  You tube లో విని ఆస్వాదించండి.

***

మరో ప్రముఖ గజల్ రచయిత్రి వర్షు కొండూరు అలతి అలతి అందమైన పదబంధా లతో అల్లె వీరి గజళ్ళు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందానిస్తాయి.

అగరుపొగలో కురులసొగసును తాకవలెనని

ఉన్నది 

మరులగొలిపే విరులవాసన పీల్చవలెనని

ఉన్నది

ప్రాణప్రదముగ మదిని దోచిన ప్రణయసీమను గాంచగ

వెలుగునై నీ కనులలోనే నిలువవలెనని ఉన్నది

సందెపొద్దున చల్లగాలికి చెలియతోనువు ఆడగ

తుమ్మెదై నీ తనువుపైనే వ్రాలవలెనని ఉన్నది

కోటి ఆశలు తీరువేళన నీవునడిచే దారిలో 

పూలుజల్లుతు స్వాగతమునే పలకవలెనని ఉన్నది

ఇంటిముందర లేగదూడను  నీవుప్రేమగ నిమరగ  

చక్కనైనా ఆ రూపమును గీయవలెనని ఉన్నది

చైత్రమాసపు ఉషోదయమున నిన్నుఎదురగ చూడగ 

చిగురువేసిన ప్రేమభావన చెప్పవలెనని ఉన్నది

          వర్షు కొండూరు మరో గజల్.. ఆడదాని ఎదలోతులు చూశావా అనే మత్లాతో నడిచావా, నిలిచావా, వెలిగావా, తెలిపావా, పలికావా అనే కాఫియాలతో ..”ఎపుడైనా !“  అనే రదీఫ్ తో మగవారిని నిలదీసిన గజల్ ఆస్వాదించంచండి .

ఆడదాని ఎదలోతును చూశావా ఎపుడైనా

నీడలాగ తనవెంటే నడిచావా ఎపుడైనా

ఆశలతో ముడిపడుతూ ఎదురీదే బ్రతుకులోన

ఊహలకే ఊపిరివై నిలిచావా ఎపుడైనా

ఎదగూటిన  కన్నకలలు చీకట్లను నింపిపోగ 

దరహాసపు వెలుతురివై  వెలిగావా ఎపుడైనా

వెన్నెలమ్మ చందమామ వీడి ఉండ రాదంటూ

నీ ప్రేమను ప్రియమారగ  తెలిపావా ఎపుడైనా

కలతపడిన మనసుతోటి కన్నీటిని వర్షించగ

నేనున్న నీతోడని పలికావా ఎపుడైనా

          వర్షూ గారి “ఆడదాని ఎదలోతును చూశావా ఎపుడైనా” అనే గజల్ ను ప్రముఖ గజల్ గాయని శ్రీవాణి అర్జున్ గాత్రంలో వీరి గజల్ లింక్ లో వినండి .

***

          జ్యోతిర్మయి మల్లా గారు  ప్రముఖ గజల్ గాయని. గజల్ కవయిత్రి కూడా. వీరు పాడిన గజళ్ళ మాధుర్యాన్ని గజల్ ప్రేమికులు ఆస్వాదించే ఉంటారు. వీరు తాను స్థాపించిన “జ్యోతిర్మయి గజల్ అకాడమి” ద్వారా తెలుగు గజళ్ళ వ్యాప్తికి ఇతోధిక సేవ చేస్తున్నారు.

          ఇటీవల వీరు వెలువరించిన వారి మొదటి గజల్ సంకలనం “ చూపు ఎంత అలిసిందో”నుండి వారు పంపిన ఈ రెండు గజళ్ళను పరిశీలించి ఆస్వాదించండి.

ప్రియునికోసం వేచి అలసిన విరహిణి ప్రేయసి 

తన విరహ వేదనకు సాక్షాలు చుక్కలల, చంద్రుడు

..ప్రకృతి శక్తులను “ అడుగు “అనే  రదీఫ్ తో హృద్యంగా అల్లిన గజల్.

చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు

ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రున్ని అడుగు 

వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటే

అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు 

ఎన్ని కోర్కెలెన్నికలలు గంగపాలు అవుతుంటే

వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు 

ప్రతి నిముషం నరకంగా రాతిరంత గండంగా

గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు

మనిషె కాదు ఉత్త మాట జాడ కూడ లేకుంటే

మనసు నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు 

          జ్యోతిర్మయి మల్ల గారి మరో గజల్ లో జన్మంతా తన భర్త , పిల్లల బాగు కోసం గడిపే ఆడవారిని నీవు గమనించలేదా …అనే ప్రశ్నలతో మగవారిని నిలదీస్తూ మలిచిన సందరమైన మానవీయ గజల్ ను గమనించండి.

నీ కోసమె జన్మ అంత గడపలేద ఆడదీ

నీ తోడిదె లోకమంటు నడవలేద ఆడదీ

నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు

బాధలున్న బయట పడక వెలగలేద ఆడదీ 

ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి

తనువు మనసు అణువణువూ ఇవ్వలేద ఆడదీ

ముల్లు గుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే

కడుపు చీల్చు యాతనంత ఓర్చలేద ఆడదీ

సుఖము దుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా

ఆశ నింపు జ్యోతిగా వెలగలేద ఆడదీ

అమ్మగా అక్కగా ఆలిగా కూతురిగా

బ్రతుకంతా ఉగాదిగా మలచలేద ఆడదీ

          జ్యోతిర్మయి మల్ల గజల్ “ చూపు ఎంత అలిసిందో” గానాన్ని లింకులో విని ఆనందించండి.

***

          వాణి కొరటమద్ది ప్రముఖ గజల్ కవయిత్రి .ఈమె గజళ్ళు ఆర్ద్రత , తాత్వికతతో నిండి మనసును తడిపే అద్భుతమైన గజళ్ళు .

ఊ కొడుతు ముచ్చటలు ఆడుతూ ఉంటావు ||

నన్ను కదలనీకుండ అల్లుతూ ఉంటావు ||

ముడివేసి చేతిలో బంధించి బంధమై

ఓ కాంక్ష గుండెల్లొ నింపుతూ ఉంటావు ||

కలలన్ని నీపైనె కలతల్ని చెరిపేస్తు

ఆనంద అమృతం ఒంపుతూ ఉంటావు ||

నా పమిట నీ ఆట వస్తువై పోయింది

దోబూచి ఆటలో దాగుతూ ఉంటావు ||

కన్నుల్లొ నీరొలికి మనసంత సంబరం

నాలోన నువ్వంత చేరుతూ ఉంటావు ||

అమ్మంత నీదనీ అణువణువు అల్లుకుని

తనువంతా ప్రేమగా తాకుతూ ఉంటావు ||

గాలిలో నీ చేతి రాతల్ని చదివిస్తు

నీ మౌన ఊసులతొ నవ్వుతూ ఉంటావు ||

సుకుమార మైనట్టి నీ స్పర్శ సంగతులు

కమ్మగా జన్మంత నిండుతూ ఉంటావు ||

          ……..వాణి కొరటమద్ది గారి మరో గజల్..,“విధిరాతను మార్చగలగు త్రోవలేదు ఎక్కడా” తాత్వికతను నింపుకున్న గజల్ .

విధిరాతను మార్చగలగు త్రోవలేదు ఎక్కడా ౹౹

గుండెలయకు మించినట్టి పాటలేదు ఎక్కడా ౹౹

మంచితనం మౌనమైతె నింద మిగిలి పోవునే

మానవతను తూచగలుగు కొలతలేదు ఎక్కడా ౹౹

చీకటి నీ చుట్టమనీ వడలి పోకు నేస్తమా

ఉదయానికి ప్రణమిల్లని ఆత్మలేదు ఎక్కడా ౹౹

ఏ స్పర్శను చూడగలవు అమ్మ కంటె తియ్యగా

మాతృప్రేమ కన్న గొప్ప మమతలేదు ఎక్కడా ౹౹

గడిచిన ఏ ఘడియైనా గతమైనది నిజమేగ

కాలానికి సంకెళ్ళను వేయలేదు ఎక్కడా ౹౹

మరణం ఒక శరణమౌను చివరాఖరి అంకమున

బ్రతుకంతా యవ్వనమని వ్రాయలేదు ఎక్కడా ౹౹

వాణి కొరటమద్ది గారి గజల్ గానం వీడియో లింకులో విని  ఆస్వాదించండి . 

*****
(సశేషం)
 
 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.