దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          వ్రజేశ్వర్ తెర తీసి అంతఃమందిరానికి వెళ్లాడు. అక్కడి వైభోగానికి విభ్రాంతితో కూడిన విస్మయ్యం పొందాడు. మందిరానికి అన్ని వైపులా దశావతారాలు, కైలాసం, వృందావనం మొదలగు అందమైన చిత్రపటాలు వున్నవి. కాలి క్రింది తివాచీ నాలుగంగుళాల మందంతో మెత్తగా వున్నది. ఎదుట చక్కని నగిషీలుతో కూడి, మెత్తని ముఖమలుతో పరిచి, అంతే విలువైన ముఖమలుతో చేసిన రంగు బాలీసులతో ఒక ఆసనం వున్నది. గది నాలుగు మూలలా వెండితో చేసిన అప్సరసల దోసిళ్లలోని దీపాలు కాంతులను వెదజల్లుతున్నాయి. ఆ దీపాలుకు వాడుతున్న నూనెలో సువాసనా ద్రవ్యాలు కలసి వున్నవేమో, మందిరాన్ని కాంతులతోపాటు సువాసనలను నింపుతున్నాయి. ఆసనానికి ఒక ప్రక్క ఒక బంగారు కలశములో పూల గుత్తులు వున్నాయి. రెండవ వైపున బంగారంతో చేసి, రత్నాలు పొదిగిన హుక్కా వుంది, ప్రక్క కొంత పుగాకు కూడా సిద్దంగా వుంది.

          ఆ ఆసనం మీద అంతకు మించిన వైభోగంతో ఒక స్త్రీ కూర్చుని వున్నది. బంగారపు జరీ వున్న ఢాకా చీర కట్టుకుని వున్నది. తలపై కప్పుకున్న ఘూంఘట్  ముఖానికి అడ్డు వుండటంతో ముఖం కనబడటం లేదు. కానీ, చెవి దుద్దులూ, ముక్కెర ఆ పల్చటి కప్పడములో నుండి తళ తళ లాడుతున్నవి. ఆవిడ బంగారపు ఛాయలో వుందని, ఉంగరాల జుట్టు అని మాత్రం అర్థమవ్వుతున్నది.

          “రాణీగారిని ఏమని సంబోధించి ఆశీర్వాదములు పలకాలి” అడిగాడు వ్రజేశ్వర్.

          “నేను రాణిని కాదు” అన్నది ఆ స్త్రీ గరకు స్వరంతో.

          వ్రజేశ్వర్‌కి ఇది అంతకు ముందు తను విన్న స్త్రీ స్వరంలాగా అనిపించలేదు. అయినా అయ్యి వుండవచ్చు, ఆడవాళ్లు గొంతు మార్చగలరు కదా. చౌధురాణి ఇంత మాయావతి కాకపోతే బందిపోటులకు రాణి ఎలా అవుతుంది? “నేను ఇంతకు క్రితం మాట్లాడినావిడ ఎక్కడ?” అని అడిగాడు.

          “నిన్ను లోపలికి రమ్మని ఆజ్ఞ వేసి నిద్రపోవటానికి లోపలికి వెళ్లింది. అయినా నువ్వు ఏమి చెయ్యాలో నేను చెపుతాను” అన్నది ఆ సుందరి.

          “మరి నువ్వెవరవు?”

          “నేను నీ దొరసానిని.”

          “నాకు దొరసానా!?”

          “ఇంతకు క్రితం సత్తు కానీ ఇచ్చి నిన్ను కొన్నాను కదా.”

          “సరే, నిన్ను ఏమని సంబోధించి ఆశీర్వచనములు పలకాలి?”

          “రకరకాల ఆశీర్వాదములు ఉంటాయా?”

          “సధవా, విధవా, పుత్రవతీ …”

          “నేను వెంటనే చచ్చేటట్టు ఆశీర్వాదం ఇవ్వండి.”

          “ఆ ఆశీర్వాదం నేను పలకలేను. నువ్వు ఒక వంద పైన మూడు సంవత్సరము లు జీవించు గాక.”

          “ఇప్పుడు నా వయసు 25 సంవత్సారాలు. మరి నువ్వు ఇంకా 78 సంవత్సరాలు నాకు వంట చేసి పెడతావా?”

          “ముందు ఒక రోజు చేసి పెడతాను. నచ్చితే మిగిలిన డెబ్భై ఎనిమిది సంవత్సరాలూ వండి పెడతాను.”

          “కూర్చో. ఏమేమి వంటలు చెయ్యగలవు?”

          వ్రజేశ్వర్ తివాచీ మీద కూర్చున్నాడు. సుందరి మళ్లీ ప్రశ్నించింది “నీ పేరేమిటి?”

          “నీకు గొంతు బాగానే వుందా? గర గరలాడుతున్నది. ఇంతకుముందు మనకు పరిచయం వుందా?” అని అడిగాడు వ్రజేశ్వర్.

          “నేను నీకు దొరసానిని. ‘మీరూ’ అని సంబోధించాలి, తెలిసిందా?”

          “అలాగేనండీ, ఇక అలాగే సంబోధిస్తాను. మీ పేరేమిటి?”

          “నా పేరు ఐదు కానీలు. కానీ, ఇప్పుడు నువ్వు నా నౌకరువు. కావున, నన్ను పేరు పెట్టి పిలవటానికి లేదు.”

          “మరి మిమ్మలని ఏమని పిలవాలి?”

          “నేను నిన్ను రామధనం అని పిలుస్తాను. నువ్వు నన్ను దొరసాని అని పిలవాలి. ఇప్పుడు చెప్పు, మీ ఇల్లు ఎక్కడ?”

          “ఒక సత్తుకానితో కొన్నవాడి పరిచయానికి, ఇల్లూ వాకిలీ ఎక్కడుందో తెలుసుకో వటం అంత అవసరమా?”

          “సరే చెప్పమాకు, రంగరాజుని అడిగి తెలుసుకుంటాలే. నీది బ్రాహ్మలలో ఏ శాఖ? రాఢీలా, బరేంద్రులా, వైదికులా?”

          “ఎవరైతేనేం, నా చేతి వంట తింటారుగా”

          “నువ్వు నా శ్రేణికి చెందని వాడివైతే నీ చేతి వంట ఎందుకు తింటాను? నీకు వేరే పనులు చెపుతాను”

          “వేరే పనులు ఏముంటాయి?”

          “నీళ్లు తోడటం, కట్టెలు కొట్టటం, ఇంకా చాలా పనులు వుంటాయి.”

          “నేను రాఢీ బ్రాహ్మణుడిని.”

          “అయితే నువ్వు నీళ్లు తోడాలి, కట్టెలు కొట్టాలి. మేము బరేంద్ర బ్రాహ్మలం. మీరు కులీన రాఢీలా, లేక వంశజులా?”

          “ఈ విషయాలన్నీ పెళ్లి  సంబంధాల విషయాలలో అడుగుతారు. ఏం, నాకు పెళ్లి చేద్దామనుకుంటున్నారా? నాకు ఇప్పటికే వివాహమయ్యింది.”

          “ఓ, వివాహితులా, ఎంత మందితో వివాహమయ్యింది?”

          “నీళ్లు తోడమంటే తోడతాను, కానీ ఇంత  పరిచయ విశేషాలు అనవసరం.”

          ఐదు కానీలు లోపలకి వినబడేలాగా “రాణిగారు, ఈ బ్రాహ్మడు మొండివాడు, అడిగినదానికి బదులు చెప్పటంలేదు” అన్నది.

          “బెత్తంతో తగిలిస్తే సరి” అని లోపలినుండి పలికింది నిశి.

          లోపలి గదిలో నుండి ఇంకొక దాసి ఒక బెత్తం తీసుకుని వచ్చి ప్రక్కన పెట్టింది. ఐదు కానీలు ఆ బెత్తాన్ని తీసుకుని ప్రక్కన వున్న దిండును గట్టిగా చరిచి, వ్రజేశ్వర్తో, “చూస్తున్నావా? ఎంత వాడిగా వుందో?” అన్నది.

          వ్రజేశ్వర్ చిన్నగా నవ్వి, “మీరు ఏదైనా చెయ్యగలరు. అడగండి, అడిగేదేదో” అన్నాడు.

          “ఇప్పుడు నీ పరిచయ విశేషాలు తెలుసుకుని ఉపయోగం ఏమిటి? నువ్వు నాకు వంట చెయ్యటానికి పనికిరావు. వేరే పనులు ఏమి చెయ్యగలవో చెప్పు.”

          “ఆజ్ఞాపించండి, మీరు ఏం పనులు చెయ్యమంటారో.”

          “నీళ్లు తోడగలవా?”

          “లేదు, ఆ పని నేనెప్పుడు చెయ్యలేదు.”

          “కట్టెలు కొట్టగలవా?”

          “లేదు, ఈ పని నా వల్ల కాదు.”

          “బజారు పోయి సరుకులు తీసుకురాగలవా?”

          “ఈ పని కొంత చెయ్యగలను.”

          “కొంత చేస్తే కుదరదు. విసనకర్రతో విసరగలవా?”

          “ఆ, చేస్తాను.”

          “అయితే ఈ విసనకర్ర తీసుకుని విసురు.”

          వ్రజేశ్వర్ విసనకర్రతో విసరసాగాడు. ఇంతలో ఐదు కానీలు, “నువ్వు కాళ్లకు మర్ధనా చెయ్యగలవా?” అని అడిగింది.

          వ్రజేశ్వర్ ఆలోచనలో పడ్డాడు. దొంగల ముఠా నాయకురాలను ప్రసన్నం చేసుకుంటే, ఏదో ఒక రకంగా ఏమర్చి విడుదల కావచ్చు. సరే అనుకున్నాడు. “మీ వంటి సౌందర్యవతి కాళ్లు పట్టటమే నా సౌభాగ్యం ..”

          “అలాగైతే కాళ్లు పట్టు” అని అంటూ తన కాళ్లను వ్రజేశ్వర్ వళ్లోకి చాచి పెట్టింది ఐదు కానీలు.

          వ్రజుడుకి కాళ్లు పట్టటం తప్పలేదు. సరే క్రిందకు వంగి కాళ్లు పట్టటం మొదలు పెట్టాడు. కానీ, ఆలోచనలోపడ్డాడు. ‘ఇది సరైన పని కాదు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ, ముందు ఎలాగైనా తప్పించుకోవాలి.”

          ఐదు కానీలు లోపలికి తిరిగి అన్నది, “రాణి గారు, వెంటనే ఇక్కడికి రండి.”

          రాణి వచ్చే అలికిడి వినగానే వ్రజేశ్వర్ తను పట్టుకున్న ఐదు కానీల కాలుని వదిలి, లేచి నిలబడి వెనుకకు అడుగు వేశాడు. ఐదుకానీలు గట్టిగా నవ్వుతూ, “ఏం వదిలేశావ్? పారిపోతావెందుకు?” అన్నది.

          ఐదు కానీలు అప్పటిదాకా తెచ్చిపెట్టుకున్న గరకు స్వరంతో మాట్లాడింది. ఈ మాట మాత్రం తన స్వాభావికమైన స్వరంతో అన్నది. వ్రజేశ్వర్ విస్మయం పొందాడు, ఇది బాగా పరిచయం వున్న స్వరమే. సాహసం చేసాడు. గభాలున ఐదు కానీల ముఖానికున్న ముసుగు తొలగించాడు. వ్రజేశ్వర్ నిర్ఘాంత పోతూ, “ఇదేమిటి? నువ్వా, సాగర్!” అన్నాడు.

          “అవును, నేను సాగర్ని. గంగ కాదు, యమున కాదు, చెరువూ చేమా కానే కాదు. సాక్షాత్తు సాగరాన్ని. నువ్వే ఆభాగ్యుడవు. పర స్త్రీ అనుకుని కాళ్లు పట్టుకోటానికి కూడా సిద్దమయ్యావు. అదే ఇంటి ఇల్లాలు కాళ్లు పట్టుకుని ప్రాధేయ పడితే క్రుద్ధుడివై వెళ్లిపోయావు. జాగ్రత్త, నా మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీరు నా కాళ్లు పట్టుకున్నారు, నా ముఖం చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీ కాళ్ల దగ్గర నాకు స్థానమిస్తారో, వదిలేస్తారో నిర్ణయించుకోండి. నేను కూడా బ్రాహ్మణ స్త్రీనని ఇప్పటికైనా అర్థమయ్యిందా?”

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.