ప్రమద

విజయ నిర్మల

-నీరజ వింజామరం 

వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల

అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా మారగానే, ఆ చిన్నారి భయపడింది. ఒక్కసారిగా నిజంగానే ఏడ్చేసింది . కెమెరా ఆ క్షణాన్ని బంధించింది. ఆ క్షణం ఆ సన్నివేశానికి ప్రాణం పోసింది. షాట్ “ఓకే” అయింది. చివరికి దర్శకుడు సంతోషంగా, “బాగుంది! ఇదిగో నీ బహుమతి” అంటూ ఆమెకు ఒక ఐస్‌క్రీమ్ ఇచ్చాడు.

          ఇది ఒక చిన్న సంఘటన. కానీ ఆ సంఘటన ఒక చరిత్రకు నాంది పలికింది . అప్పట్లో కెమెరా ముందు ఏడవడానికి తడబడ్డ ఆ చిన్నారి, ఒక రోజు ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు.

          ఆ చిన్నారి ఎవరో కాదు – మనందరికీ సుపరిచితమైన విజయనిర్మల. తొలకరి వాన చినుకులా విజయనిర్మల సినీ రంగప్రవేశం జరిగింది. కానీ తర్వాతి దశల్లో ఆమె ప్రతిభ, పెల్లుబికిన వర్షంలా వెండితెరను తడిపేసింది. ఆమె నటిగా మెరిసింది. దర్శకురాలిగా మైలురాళ్లు దాటింది . నిర్మాతగా కొత్త మార్గాలు చూపింది. తెలుగు సినీరంగంలో ఆమె పేరే మహిళా సాధికారతకు ఒక ప్రతీకగా నిలిచిపోయింది.

          నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా – మూడు రంగాలలోనూ సమాన ప్రతిభను చాటుకున్న ఆమె, ఆరు దశాబ్దాలపాటు తెలుగు సినీప్రపంచంలో చిరస్మరణీయ కీర్తిని
సంపాదించింది. నరసరావుపేటలో జన్మించిన విజయనిర్మల, చిన్న వయసులోనే సినిమా వాతావరణంలోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి సినీ నిర్మాతగా పనిచేశారు. చిన్ననాటి నుంచే సినిమా వాతావరణం ఆమెను వెండితెర వైపు ఆకర్షించింది. ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంది . తొలి ప్రదర్శనకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఇచ్చిన స్టెయిన్‌లెస్ స్టీల్ కప్పు ఆమెకు ఒక అమూల్యమైన జ్ఞాపకం.

          ఏడు సంవత్సరాల వయసులోనే “మచ్చ రేఖై” (1950) అనే చిత్రంలో నటించి, తన ప్రతిభకు తెర తీసింది . తరువాత “పాండురంగ మహాత్యం” (1957) వంటి చిత్రాల్లోనూ ఆమె నటించిన బాలనటి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె లోని నిజమైన నటి ఆమెకు హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పుడు బయటపడింది.
(1964)లో ఆమె హీరోయిన్ గా చేసిన మలయాళ సినిమా “భార్గవి నిలయం” అద్భుత
విజయం సాధించింది. ఆ సినిమా వలన మలయాళంలోనూ ఆమెకు గొప్ప పేరు వచ్చింది.

          “రంగుల రాట్నం” (1966) ఆమెకు తెలుగులో హీరోయిన్‌గా తొలి అవకాశాన్ని ఇచ్చింది. ఆ సినిమా మాత్రమే కాదు, తర్వాత వరుస విజయాలు ఆమెను స్టార్‌గా నిలిపాయి. ఆసక్తికర విషయమేమిటంటే, తన అసలు పేరు నిర్మల. కానీ “విజయ వాహిని స్టూడియోస్”లో ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో విజయనిర్మలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దానితో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అందుకు కృతజ్ఞతగా ఆమె తన పేరుకు ముందు “విజయ”ను జోడించింది. అప్పటినుంచీ ఆమె పేరు విజయనిర్మలగా మారిపోయింది.

          హీరోయిన్‌గా విజయవంతంగా రాణిస్తున్న రోజుల్లోనే విజయనిర్మల జీవితం ఒక
కొత్త మలుపు తిరిగింది. 1960వ దశకంలో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న నటుడు
కృష్ణతో ఆమె “సాక్షి” (1967) చిత్రంలో నటించింది. “సాక్షి” సినిమా కేవలం 20 రోజుల్లో చిత్రీకరించబడింది. అది పెద్దగా ఆడదని చాలామంది అనుకున్నా, చక్కటి లాభాలను తెచ్చి, 1968లో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.
‘సాక్షి’ చిత్రం తరువాత వారి జంట, వరుసగా హిట్‌ సినిమాలతో ప్రేక్షకుల మనసు
గెలుచుకుంది. తెరపై కనిపించిన ఆ జంట, తర్వాత నిజజీవితంలోనూ జంటగా మారింది. 

          విజయనిర్మల కృష్ణను వివాహం చేసుకుని, వ్యక్తిగత జీవితాన్ని కొత్త దిశలో
మలచుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటజీవితం మరింత విస్తరించింది. కానీ కేవలం
నటనతోనే తృప్తి పడని ఆమె, కెమెరా వెనుక ప్రపంచాన్ని ఆసక్తిగా గమనించింది.
“సాక్షి” చిత్రంలో బాపు ఉపయోగించిన స్టోరీబోర్డులు విజయ నిర్మలలో దర్శకత్వంపై ఆసక్తి కలిగించాయి. అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేసింది. మలయాళ చిత్రం “కవిత”తో దర్శకత్వ రంగంలోకి ప్రవేశించింది. 1971లో – యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా “మీనా” అనే చిత్రంతో ఆమె దర్శకురాలిగా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.

          ఒకటి, రెండు కాదు, ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కృష్ణతో కలిసి 47 సినిమాలు చేసింది. కృష్ణ దర్శకత్వం వహించిన 17 చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు కావడం – ఆమె ప్రతిభకు నిదర్శనం. విజయనిర్మల సినిమాలు కుటుంబ కథలతో,  హృదయా నికి హత్తుకునే భావోద్వేగాలతో, ఆ కాలం సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండేవి.

          శాంతినివాసం, దేవదాసు (1974 లో కృష్ణ హీరోగా ), కృష్ణావతారం, విజయ,
ప్రేమలేఖలు, మనసు మమత మొదలైన చిత్రాలు ఆమె దర్శకత్వ పటిమకు తార్కాణాలు.

          నిర్మాతగా కూడా ఆమె తనదైన ముద్రను వేసింది.“విజయ కృష్ణ మూవీస్” స్థాపించి 15 సినిమాలు నిర్మించింది. పద్మాలయ స్టూడియోస్ మరియు పద్మాలయ టెలి ఫిలింస్ నిర్వహణలో భాగమయ్యింది. విజయనిర్మల జీవితం ఒక నటి లేదా దర్శకురాలి కథ మాత్రమే కాదు; అది సహనం , పట్టుదల, ప్రతిభల సమ్మేళనం. బాలనటి నుండి హీరోయిన్‌గా, హీరోయిన్‌ నుండి విజయవంతమైన దర్శకురాలిగా, తర్వాత నిర్మాతగా — ఆమె ప్రతి దశలోనూ సవాళ్లను జయించి కొత్త మైలురాళ్లను దాటింది .

          ఆమె దర్శకత్వం వహించిన 44 సినిమాలు ఆమె సృజనాత్మకతకు, దూరదృష్టికి ప్రతీక. 2008లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు నమోదు కావడం ఆమెకే కాదు,
తెలుగు సినీరంగానికే ఒక గౌరవం.

          నటనలోనూ, దర్శకత్వంలోనూ ఆమె చేసిన సేవలకు ప్రభుత్వం, సినీ సంస్థలు అనేక పురస్కారాలు అందించాయి. 2008లో రఘుపతి వెంకయ్య అవార్డుతో ఆమెను
సత్కరించారు. ఇది తెలుగు సినిమా రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటి. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా సినీ కుటుంబానికే అంకితం అయింది. విజయ నిర్మలకు కృష్ణతో సంతానం లేకపోయినా, ఆయన మొదటి భార్య నుండి ఉన్న పిల్లలను (రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు మొదలైనవారు) తన పిల్లలుగా చూసుకుంది. తన మొదటి వివాహం నుండి ఆమె కుమారుడు నరేష్ , ప్రసిద్ధ నటుడు. నటి జయసుధ ఆమె మేనకోడలు. గాయని ఆర్. బాలసరస్వతి దేవి ఆమె బంధువు. ఒకవైపు తల్లి, భార్యగా తన కర్తవ్యాలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక ముద్ర వేసింది. తన ప్రతిభ, సౌందర్యం, సహజ నటన – ఇవన్నీ కలిసి ఆమెను తెలుగు తెరపై ఒక గొప్ప హీరోయిన్‌గా నిలిపాయి. ఆమె ప్రసక్తి వస్తే, ఆ కాలం నాటి క్లాసిక్ సినిమాలు, మరపురాని పాత్రలు ప్రేక్షకుల కళ్ళ ముందుకు వస్తాయి. నిజానికి విజయనిర్మల జీవితం ఒక ప్రేరణ. “అసాధ్యం అనేది సాధ్యం చేయగలిగిన శక్తి స్త్రీలలో ఉందని” ఆమె నిరూపించింది. ఆడవారి కలలకు ఆకాశం హద్దు కానే కాదని ఆమె కధ నిరూపిస్తుంది .

          విజయ నిర్మల చివరిసారిగా నటించిన చిత్రం “శ్రీ శ్రీ” (2016). ఆమె 2019 జూన్ 27న గుండెపోటుతో 73 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది . ఆమె మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు. విజయ నిర్మల తన ధైర్యం, ప్రతిభ, పట్టుదలతో తెలుగు సినీ రంగానికి కొత్త దారి చూపించింది. నటనలో, దర్శకత్వంలో, నిర్మాణంలో  అగ్రగామిగా నిలిచిన ఆమె పేరు తెలుగు వెండితెర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.