మనలో చాలామంది జీవనోపాధిని వెతుక్కుంటూనో, ఉద్యోగంలో బదిలీ వల్లనో ఉంటున్న ఊరిని విడిచి వెళ్లి వేరే చోట స్థిరపడతారు. 50, 60 ఏళ్లు గడిచాక చిన్న నాటి ఊరికి వెళ్లి తాము ఆడి పాడిన స్థలాలు, తిరిగిన ప్రదేశాలను సందర్శించి ఆనాటి జ్ఞాపకా లను నెమరు వేసుకుంటారు. రాఘవ శర్మ గారు అదే పని చేశారు. ఈయన కమ్యూనిస్టు. జర్నలిస్టు కాబట్టి తన మధుర స్మృతులను ఆహ్లాదకరమైన శైలిలో వ్యక్తం చేశారు. 1950 కి 70 కి మధ్య పుట్టిన వారు చదివితే ఇవి తమ బాల్య జ్ఞాపకాలే అనిపిస్తాయి.
రాఘవశర్మగారు తన నాలుగో ఏటనుంచీ 18 వ ఏట వరకూ వనపర్తిలో నివసిం చారు. స్వాతంత్రం వచ్చాక 63 సంస్థానాల్లోనూ మొట్టమొదట భారత యూనియన్ లో లీనమైన తొలి సంస్థానం వనపర్తి. తండ్రి ఉద్యోగబదిలీ కారణంగా 1973 లో ఆ ఊరుని విడిచి తిరుపతిలో స్థిరపడ్డారు. 50 ఏళ్ల తరువాత (అంటే 2023లో) బాల్యంలో తను గడిపిన వనపర్తిని సందర్శించారు. ఆ ప్రాంతాలను చూసి, ఉన్న మిత్రులను కలుసు కున్నారు. కోల్పోయిన సన్నిహితులను గుర్తు చేసుకుని నిట్టూర్పు విడిచారు. ఆ అనుభూతుల సమాహారమే ఈ వనపర్తి ఒడిలో పుస్తకం. ఈ పుస్తకంలో ఆనాటి ఛాయా చిత్రాలను కొన్నింటిని సేకరించడం, సందర్భానుసారంగా వాటిని ఇమడ్చడం ప్రశంసనీయం. ఇది కొందరికే సాధ్యం.
తీయని జ్ఞాపకాలను కవితాశైలిలో వ్యక్తం చేస్తూనే అక్కడక్కడా ఆయన వర్గ దృక్పథాన్ని చూపే వ్యాఖ్యలు చేశారు. పాకీదొడ్ల స్థానంలో సెప్టిక్ ట్యాంకులు వచ్చినా వాటిని శుభ్రం చేసుకోలేనంత దుస్థితిలో ఉన్నామంటారు. ‘బ్రాహ్మణ కుటుంబాల్లో వితంతువులు గుండు కొట్టించుకుంటే తప్ప పండగల్లోనూ తద్దినాల్లోనూ మడివంటకు అనుమతించేవారు కాదు’ అంటారు. రాఘవశర్మ గారి తండ్రి బ్రిటిష్ ఇండియా ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. యుద్ధంలో గాయపడి జపాన్ సైనికులకు పట్టుబడ్డారు. మూడు నెలల పాటు వారికి ఖైదీగా ఉన్నారు. శిక్ష ముగిశాక ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిఫలం రెండు సత్తు మెడళ్లు. స్వాతంత్రం వచ్చాక కూడా ఆయన భారత సైన్యంలో పనిచేశారు. ‘రెండో ప్రపంచ యుద్ధం లో బ్రిటిష్ సైన్యం తరపున పనిచేసిన వారికి సర్వీస్ కాలంతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఇమ్మని బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఏమైందో తెలియదు’ అంటారు. ‘సైనికుల శవపేటికల్లో కూడా కమిషన్లకు కక్కుర్తి పడిన మన స్వతంత్ర ప్రభువుల సంస్కారానికి నమస్కారాలు’ అన్నారు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ఎందరి ప్రాణత్యాగంతో సాధించుకున్నదో ఒక వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు అర్థ శతాబ్దం తర్వాత ఏమైంది ఇప్పుడు? అని విచారం వ్యక్తం చేశారు. అనేక కళల సమాహారమైన హరికథలు కనుమరుగవ్వడం గురించి, హరిదాసుల దీనస్థితి గురించి చెప్పారు. భగవద్గీత వంటి తాత్విక గ్రంథాలు మనిషిలో హేతుబద్ధ ఆలోచనను పెరగ నివ్వవు. ప్రశ్నించనివ్వవు… సైన్సు ప్రశ్నించమంటుంది. మతం నమ్మమంటుంది ‘ అన్నారు.
నేటి తరానికి తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి. నాలుగు తగిలిస్తే గాని నాలుగు అక్షరం ముక్కలు రావు అని తల్లిదండ్రులు భావించే రోజులవి. అందుకే వీధి బడుల్లో, చదువులో వెనకబడిన పిల్లలకు గంజి కావడి (బడికి పోమని మొరాయించే పిల్లలను బలవంతంగా మోసుకు పోవడం) కోదండం వంటి శిక్షలు విధించేవారు. గంజి కావడి గురించి చెప్పలేదు కానీ కోదండం గురించి శర్మ గారు వివరించారు. ఎంత చలి కాలం అయినా చొక్కా వేసుకోని గురువులుండేవారట. నాకు ఇది చదివినప్పుడు ‘అనుభవాలూ జ్ఞాపకాలూ’ లో శ్రీపాద చెప్పిన విషయం గుర్తొచ్చింది. శ్రీపాద చొక్కా తొడుక్కుని సంప్రదాయాన్ని మంటగలిపారని తెలిసిన తండ్రి ‘ చొక్కాలు కూడా తొడుగుతున్నాడూ! అప్రాచ్యుడు’ అని పళ్ళు కొరుకుతాడు. ‘ నీ కిదేం పని!’ అని మందలిస్తుంది ఆయన అక్కగారు. ఆమె కొడుకు ఇంగ్లీష్ చదువుతున్నాడు కాబట్టి అతను చొక్కా వేసుకోవడంలో తప్పు లేదనేది ఆమె అభిప్రాయం. ఆనాడు గ్రామాల్లో బ్రాహ్మల ఇళ్లను గుర్తుపట్టడానికి వాటిపై ప్రత్యేకించి ఎర్రని తెల్లని పట్టీలు ఉండేవట.
ప్యాలస్ శీర్షిక కింద చేసిన వర్ణన కవితాత్మకంగా సాగింది. ఆ ప్రాంతంతో సంబంధం ఉన్నవారికి మాత్రమే అది హృదయాన్ని తాకుతుంది. గ్రామ ఫోనుల మీద విన్న హిందీ పాటలను ఆస్వాదించడం గురించి మైమరచిపోయి చెప్పారు, కానీ హిందీ రాని వాళ్ళకు వాటి గొప్పతనం తెలియదు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు వాళ్ల బాబాయి వేసిన ‘మోడరన్ యముడు’ గురించి చదివితే ఇప్పటికీ మనకు నవ్వొస్తుంది. డాక్టర్ బాలకృష్ణయ్య జీవితం స్ఫూర్తిదాయకంగా ఉంది.
1990 లో ఒక ప్రొఫెసర్ నాతో చెప్పిన సంగతి. ఆంధ్రా యూనివర్సిటీలో పరీక్షలు రాసే విద్యార్థులు చీటీలు రాస్తూ పట్టు పడ్డారు. ఇన్విజిలేటరు ఆ విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు వాళ్లంతా తిరగబడి ‘మీరే రీడర్లూ ప్రొఫెసర్లూ అవ్వాలా ? మేం కాకూడదా? అని ఎదురు తిరిగారట. రాఘవశర్మ గారు రాసిన “టెన్త్ లో కాపీ కొట్టునీయలేదని మా సీనియర్లు ఇన్విజిలేటర్లను కొట్టారు” అనే వాక్యం చదివాక పై విషయం నాకు వింతగా అనిపించలేదు.
సంస్థానాల విలీనంతో ఫ్యూడల్ కుటుంబాలు ఆధునిక వ్యవస్థలో ఇమడలేక మానసిక సంఘర్షణకు లోనవడం గురించి చెప్పడం బాగుంది. తెలంగాణేతర పాఠకులకు తెలియని ‘తైదంబలి’ ‘గేరి’ ‘మడిగె’ అనే పదాలకు అర్ధాలు ఇచ్చి ‘చింతబలకాయలు’ అనే మాటను ఎందుకనో వదిలేశారు. ఎంత అనుభవజ్ఞుల పుస్తకానికైనా అచ్చుతప్పులు తప్పవేమో అనిపించింది. ఆ దృష్టితో చూడకపోయినా సుమారు 40 వరకూ ముద్రా రాక్షసాలు కనిపించాయి.
ఒకసారి ప్రారంభిస్తే చివరివరకూ ఆపకుండా చదివించడం రాఘవశర్మగారి శైలికున్న ప్రత్యేకత. ఆత్మకథలు ఇష్టపడే వారందరికీ నచ్చే పుస్తకం ‘ వనపర్తి ఒడిలో’
వనపర్తి ఒడిలో, రాఘవ శర్మ, ప్రథమ ముద్రణ ;2024 ధర :150, పాలమూరు ప్రచురణలు, మెహబూబ్ నగర్
*****