
“నెచ్చెలి”మాట
దారి
-డా|| కె.గీత
జీవితమున
ఎన్నియో దారులెదురౌను
ఐన
ఎటు పోవలె?
ఎటు పోయిన ఏమొచ్చును?
ఎటూ పోకున్న ఏమోను?
అదియే నరుడా!
జీవితము-
చిత్రవిచిత్రమగు
జీవితము!
దారులెన్నున్నా
సరైన దారిని
ఎన్నుకొనుటయే
క్లిష్టాతిక్లిష్టము
ఏ దారైనా
ఇంటో
బయటో
ఎదురుదెబ్బలు
తప్పవు!
ఏ దారైనా
మనోవ్యధో
మనోవ్యాధో
చుట్టుముట్టక
తప్పదు!
సుగమం
దుర్గమం
దారి
ఏదైనా
బతుకీడ్చక
తప్పదు
ఇంతేనా
బతుకు?!
దుర్గమమును
సుగమముగా
మార్చుట
ఎట్లు?
ఎల్లప్పుడు
కష్టములేనా?
సుఖముగ
జీవించు
మార్గము లేదా?
ఎందుకు లేదు?
ముళ్ళ దారినైనా
రహదారిగా
మార్చుకోవడంలోనే
ఉంది
మరి జీవితం!
నిజానికి
అదే జీవితం!
జీవితం
ఎవరికీ
రహదారి
కాదు!
కష్టాలు
పదివేలు
ఒకటి
ఒకరికైతే
మరొకరికి
మరొకటి
ఏటికి ఎదురీదడం
సుడిగాలికి నిలదొక్కుకోవడం
లోనే
ఉంది
జీవితం!
గర్వాతిశయాలు
మితిమీరిన కోరికలు
అబద్ధపుటాలోచనలు
విలువల్లేని పనులు
మానుకోవడం లోనే
ఉంది
సుగమం
జీవితమున
ఏ దారిన పోయినను
క్షోభ
తప్పునా?
వేదన
అణగునా?
నరుడా!
ఏవీ
తప్పవు
అదియే
జీవితము!
దానిని ఈదుట
ఒక్కటే
దారి!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
ఆగస్టు, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: నీరజ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: అపోహలూ – నిజాలూ (కథ) రచయిత్రి – యశోదా కైలాస్
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

అవును… జీవితాన్ని ఈదుతూనే, వీలైనంత ఆనందాన్ని అందుకోవాలి. కాదని ఆగిపోతే మునక తప్పదు.