
రాగసౌరభాలు-19
(చారుకేశి రాగం)
-వాణి నల్లాన్ చక్రవర్తి
ప్రియ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై అపారంగా కురవాలని కోరుకుంటున్నాను. అందమైన కేశ సంపద కలిగిన అమ్మవారి ప్రతిరూపంగా ఈ నెల మనము చారుకేశి రాగం గురించిన విశేషాలు తెలుసుకుందాము.
నేడు ఉపయోగించే గోవిందాచార్యుల వారి 72 మేళకర్తల పథకంలో ఈ చారుకేశి రాగం 26వ మేళకర్త. వెంకటమఖీ సాంప్రదాయ పథకంలో ఈ రాగం పేరు తరంగిణి. ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా ఈ పేరుతోనే రచన చేశారు. చారుకేశి మేళకర్త రాగం కనుక సప్త స్వరాలతో కూడిన సంపూర్ణ రాగం. ఆరోహణ అవరోహణలు కింది విధంగా ఉన్నాయి
“స రి గ మ ప ద ని స”
“స ని ద ప మ గ రి స”
ఈ రాగంలోని స్వరాలు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదములు. ఈ రాగం పూర్వభాగం అంటే పంచమం వరకు శంకరాభరణం, మధ్యమం నుంచి ఉత్తర భాగం హనుమతోడి కలయిక తో వినేవారి మనసులకు సాంత్వన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు ప్రేరేపించగలదు. అంతేకాక ప్రేమ, విరహం, శోకం, దైవత్వం వంటి రసాలను అద్భుతంగా ప్రేరేపించ గలదు. అందువలననే శాస్త్రీయ సంగీతం , భక్తి సంగీతం, భజనలు, కథా కాలక్షేపాల లోనే కాక లలిత సంగీతం, సినిమా సంగీతాలలో కూడా విస్తృతంగా ఉపయోగించ బడింది. చక్కని మృదుత్వం కలిగిన రాగం.
ఈ రాగం మూర్చనాకారక మేళం..గ్రహ భేదంతో వాచస్పతి, నాటకప్రియ, గౌరీ మనోహరి రాగాలు వస్తాయి. చారుకేశి రాగానికి ప్రాణమైన ప్రయోగం “మ గ రి స దా” వినగానే రాగం కళ్ళముందు కనపడుతుంది.
ఈ రాగం హిందూస్తాని సంగీతంలోకి కూడా వలస వెళ్లి ప్రాచుర్యం పొందింది. పాశ్చాత్య సంగీతంలో కూడా MIXOLYDIAN B-6 scale కి ఈ రాగం పోలికలు ఉంటాయట. . యే సమయంలోనైనా పాడదగినదే అయినా సాయం సమయం ఎక్కువ శోభిస్తుంది. ధ్యానానికి ఎంతో ఉపయుక్తం.
ఈ రాగం హృదయ సంబంధ వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుందట. అలానే. మానసిక, భావోద్వేగ సమస్యలకు చికిత్సలో ఉపయోగిస్తుందట.
ఈ రాగంలో వాగ్గేయకారులందరు చక్కని రచనలు చేశారు. వర్ణాలు, కీర్తనలు, తరంగాలు, పదాలు, తిల్లానాల వంటివి ఎన్నో. త్యాగయ్యగారి ఆడమోడి కలదా రామయ్య, స్వాతి తిరునాళ్ గారి కృపయా పాలయ శౌరే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ తరం వాగ్గేయకారులు శ్రీ నల్లాన్ చక్రవర్తి మూర్తి గారు ఈ రాగంలో వర్ణం “అందరిలో అందగాడవని” రచించారు. ఆ వర్ణంలో సత్యభామ పేరు లేకపోయినా సత్యభామే పాడినట్టు అనిపిస్తుంది. అంతేకాక చరణ స్వరాలు సత్యభామ భావోద్వేగాలకు ప్రతీక లుగా రచించారు. ఈ రాగం భావోద్వాగాలను ప్రేరేపించగలదు అనటానికి ఉదాహరణగా చెప్పాను. లింక్ లో విని ఆనందించగలరు.
ఇపుడు కొన్ని ప్రసిద్ధ రచనలు పరికిద్దాము.
| శాస్త్రీయ సంగీతం | ||||
| 1 | వర్ణం | అందరిలో అందగాడవని | ఆది | శ్రీN.C. మూర్తిగారు |
| 2 | కీర్తన | ఆడ మోడి కలదా రామయ్య | ఆది | శ్రీత్యాగయ్యగారు |
| 3 | కీర్తన | కృపాయ పాలయ శౌరే | మి.చాపు | శ్రీస్వాతి తిరునాళ్గారు |
| 4 | కీర్తన | పాలయమామ్ పరమేశ్వరి | రూపక | శ్రీదీక్షితర్ గారు |
| 5 | కీర్తన | తుణయ్ నీయే కుమరా | ఆది | శ్రీబాలమురళి కృష్ణ గారు |
| లలిత సంగీతం | |||
| 1 | రామ చరితం | శ్రీకోపల్లె శివరాం గారు | శ్రీP V సాయిబాబా గారు |
| 2 | రాచనగరి | శ్రీK దుర్గ నాగరాజుగారు | శ్రీP V సాయిబాబా గారు |
| 3 | యేలానో యేలనో | శ్రీG బాలకృష్ణ ప్రసాద్ గారు | శ్రీP V సాయిబాబా గారు |
| 4 | కలల అలల | శ్రీవడ్డేపల్లి కృష్ణగారు | ఇందిరామణి గారు |
| 5 | తెరవండి తలుపులు | శ్రీదేవులపల్లి గారు | శ్రీపాలగుమ్మి విశ్వనాధం గారు |
| సినిమా సంగీతం | |||
| 1 | వంశీ కృష్ణ యదువంశీ | వంశవృక్షం | బాలుగారు, శైలజ |
| 2 | ఈ పగలు రేయిగా | సిరిసంపదలు | ఘంటసాలగారు, సుశీల |
| 3 | రాగం తానం పల్లని | శంకరాభరణం | బాలుగారు |
| 4 | ఇది నా ప్రియ నర్తన | మయూరి | బాలుగారు |
| 5 | రేపల్లె వేచెను | శారద | సుశీలగారు |
| 6 | ఏటి ఒడ్డున కూర్చుంటే | ఇదా లోకం | రామకృష్ణగారు, సుశీలగారు |
ఇవండీ సాంత్వననిచ్చే చారుకేశి రాగ విశేషాలు. వచ్చేనెల మరొక విశేషమైన రాగ వివరాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి?
*****

నా పేరు వాణీ నల్లాన్ చక్రవర్తి. నేను 2015 లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేశాను. నా వృత్తి బ్యాంకు ఉద్యోగమైనా, నా ప్రవృత్తి సంగీతం, సాహిత్యం. ఆ రెండు నా రెండు కళ్లలా భావిస్తాను. సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచి వలన నేను నేర్చిన సంగీతాన్ని అభిరుచి కలిగిన దేశ విదేశాలలో ఉన్న విద్యార్ధినీవిద్యార్థులకు నేర్పిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నాను. రేడియో, టీవీ లలో కళాకారిణిగా అనేక సంగీత సాహిత్య కార్యక్రమాలలో పాలు పంచుకున్నాను. వ్యాఖ్యాత్రిగా కూడా అనేక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం నాకిష్టమైన హాబీ. సంగీత సాహిత్యాలపై ఉన్న అనురక్తితో 2021 లో “Vani nallan chakravarthi” పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలెట్టి 10 వీడియోలు 16 ఆడియో కథలు పంచుకున్నాను.

మంచి వివరణ ఇచ్చారండి. కొత్త సంగతులు అనేకం తెలియజేసారు. అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏
‘ఆడమోడి…’ కోసం చారుకేశి రాగం ఎంపిక
త్యాగరాజస్వామి, హనుమంతుడు రాముడిని మొట్టమొదటిగా కలిసిన సందర్భాన్ని ఉటంకిస్తూ ‘ఆడమోడి గలడే…’ అన్న కృతిని రచించడం జరిగింది. ఈ కృతికి గల అర్థం తో పాటు, ఎంచుకున్న రాగం కూడా విశేషమైనది.
రాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడనీ, హనుమంతుడిని దక్షిణాదివాడనీ అంటారు.
సంగీతంలో శంకరాభరణం రాగం ఉత్తర భారతానికి చెందినదని వినికిడి. తోడి రాగం పూర్తిపేరు హనుమత్ తోడి.
ఈ రాగ నిర్మాణం (ధీర)శంకరాభరణం మరియు (హనుమత్)తోడి రాగాల మేళవింపుగా ఉంటుంది.
చారుకేశి రాగంలోని ఆరోహణం మొదటి సగం శంకరాభరణం నుంచీ, రెండవ సగం తోడినుంచీ తీసుకున్నది. అవరోహణం దీనికి సరిగ్గా వ్యతిరేక క్రమంలో ఉంటుంది.
రామాయణంలోని కిష్కింధకాండలో, రామ-హనుమల ప్రథమ పరిచయ విశేషం ఈ రాగంలో అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ‘ఆడమోడి గలడే’ చరణంలో త్యాగరాజస్వామి హనుమంతుణ్ణి శంకరాంశుడుగా వర్ణిస్తారు — అంటే హనుమంతుడిలో శంకరుడి అంశ ఉందని. ఆ వైనాన్ని వర్ణిస్తూ చారుకేశి రాగంలో శంకరాభరణ రాగపు స్వరాలు వాడటం త్యాగరాజస్వామి ప్రత్యేకత!
ఎంతో చక్కని రాగానికి ఎంతో చక్కని వివరణని ఇచ్చిన వాణిగారికి ధన్యవాదాలు!