అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

– ప్రమీల సూర్యదేవర

ముందుమాట

ముఖంలో భావాలు తెలుపటానికి కళ్ళు అద్దాలవంటివని అంటారు. కాని గాజుకళ్ళలా ఉన్న ఆ కళ్ళల్లో భావాలు ఎక్కడ దాగి ఉన్నాయో!! క్షణికోద్రేకాలకు లోనైన వారి చర్యల ఫలితమే వారిని ఇక్కడకు చేర్చింది. ఒకానొకప్పుడు వారివారి కుటుంబాలతో కష్టసుఖాలు పంచుకుంటూ, వారివారి వృత్తులు నిర్వహించుకుంటూ ఉండేవారు. కిటికీకి ఈవలవైపున ఉన్న మనందరిలాగానే సమాజంలొ కష్టసుఖాలని ఎదుర్కొంటూ, వారివారి స్నేహితుల, బంధువుల ప్రేమాభిమానాలను పంచుతూ, పొందుతూ ఉండేవారేకదా!

చట్టానికి కళ్ళుండవు. చెవులు మాత్రమే ఉంటాయి- ఇది జగమెరిగిన నగ్నసత్యం- ముందుగా పధకం వేసుకుని చట్టాన్ని ధిక్కరించి తప్పు చేసిన కొందరు-క్షణికోద్రేకంలో ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకోలేక తప్పు చేసిన మరికొందరు-తప్పు చేయక పోయినా వారి అమాయకత్వాన్ని నిరూపించుకోవటానికి సరైన సాక్ష్యాధారాలు లేక మరికొందరు నిర్భాగ్యులు- కారాగారాల్లొ మగ్గిపోతూ శిక్షను అనుభవిస్తున్నారు.

కాని వీరు అందరివలె ఆలోచించగలిగిన మనసున్న, వ్యక్తిత్వం గలిగన, మానవమాత్రులు. తమ ఆలోచనలను, భావాలను అణిచి వేసుకుని జీవిస్తున్న నిస్సహాయులు. వారు చేసిన తప్పు పరిమాణం ఎంతదైనా, జైలు నుండి విడదలైన వ్యక్తి అనగానె సంఘం చిన్న చూపు చూస్తుంది. కొన్ని పర్యాయాలు విడుదలైన వారు చిత్ర హింసలకు గురై వారి జీవితాలను ముగించుకోవటమె పరిష్కారం అనుకునె సంఘటనలు కూడ తరచు కనిపిస్తుంటాయి.

వీరిని సంఘం మానవ మాత్రులుగ గుర్తించిన రోజు, గౌరవంగా జీవించాలనుకున్న ఒక ప్రాణి నిండు జీవితాన్ని కాపాడినవారమవుతాం.

అలాంటి నిర్భాగ్యలైన ఇద్దరు స్త్రీలు, భ్రమర, అంజమ్మల కథే ఈ అనుబంధాలు–ఆవేశాలు.

మెడికల్‌ విద్యార్ధి భ్రమర, ఆమె తల్లి పార్వతినీ, పల్లెటూరి అమాయకురాలు అంజమ్మ, తన ప్రాణస్నేహితురాలు నూకాలునీ హత్య చేసి, శిక్ష అనుభవిస్తున్నారు.

నియతి, మనస్తత్వశాస్త్రం చదివిన యువతి. వీరి గురించి తెలుసుకుని, ఆ హత్యల వెనుక దాగి ఉన్న కారణం ఏమిటో తెలుసుకుని, తను చేయగలిగిన సహాయం ఏమైనా చేయగలనేమో అన్న ఆశతో, మంత్రగారి సిఫార్స్ ఉత్తరం తీసుకుని, కారాగారానికి వస్తుంది.

నియతి ప్రయత్నం ఫలిస్తుందా? నియతి చేసిన ప్రయత్నం వల్ల జైల్లో మగ్గిపోతున్న ఈ ఇద్దరు స్త్రీల జీవితాలలో ఏమైనా మార్పు కనుపిస్తుందా? వాళ్ళు ఈ నేరాలు చేయటానికి కారణాలు ఏమిటి?

సమాధానాలు తెలుసుకోవాలంటే తప్పక నవల పూర్తిగా చదవాలిమరి!

* * * * *

అనుబంధాలు-ఆవేశాలు

          వాతావరణం చాలా ఉథృతంగ ఉన్నది. మేఘాలు దట్టంగ కమ్ముకుని పట్టపగలుకూడ చిక్కని చీకట్లు కమ్ముకున్నాయి. గాలికి వృక్షాలు అల్లకల్లోలంగ వూగుతూ, చిన్నతనంలో చదువుకున్న రాక్షసుడి కథలో రాక్షసుడు తలలు చేతులు ఊపుతున్నట్టు భయం గొలుపు తున్నాయి. ఆ గాలి విసురుకు కొమ్మలు విరుచుకు పడిపోవచ్చునేమోనని అనిపిస్తుంది. ఆకాశంలో దేవతలు ఒక్కసారిగ వరుస దీపాలు వెలిగించినట్లు మిరుమిట్లు గొలిపే మెరుపు చూడలేక కళ్ళు మూసుకున్నాను. దట్టంగ కమ్ముకున్న చీకటి వలన, థారాపాతంగ కురుస్తున్న వర్షం వలన అడవిలో త్రోవ కనుపించటం లేదు. వర్షం తగ్గేవరకు కారు పక్కకుతీసి ఆపుకుందామనుకున్నా ఆ భీభత్సవాతావరణంలో ఎక్కడ ఆపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక అవస్థ పడుతున్నాడు గోవిందు. మేము చేరుకోవలసిన ప్రదేశం అడవి మధ్యలో ఎక్కడో ఉన్నదని తెలిసినా పగలు ప్రయాణమేకదా ప్రొద్దున్నే బయలుదేరితే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి రావచ్చునని, నాన్నగారికి అమ్మకి నచ్చచెప్పి, ధైర్యంగ తోడు లేకుండ బయలు దేరాను.

నేను పుట్టకముందు నుండి నాన్నగారి దగ్గర పనిచేస్తూ ఎంతో నమ్మకంగ ఉంటున్న గోవిందు ఉన్నాడు కదా అని వేరేతోడు గురించి ఆలోచించలేదు.

నాన్నగారు నన్ను ఆదుకోకపోయినట్టయితె ఏమైపోయివుండేవాడినో తల్లీ! అని గోవిందు తనకథ ఎన్నిసార్లు చెప్పినా కన్నీళు నింపుకునే చెప్తాడు.

పుట్టుకతోటే మనిషి దొంగకాడు. పరిస్తితుల ప్రభావం వల్ల మనిషి జీవనంలో మార్పు వస్తుందని ఆ రోజు న్యాయస్ధానంలో వాదించి తిరిగి వస్తున్నారు నాన్నగారు. బక్కచిక్కిన శరీరంతో, చిరిగిన బట్టల్తో దీనాతి దీనంగ చూస్తూ బోనులో నిల్చున్న వ్యక్తిగురించి ఆలోచిస్తూ, అప్రమత్తంగ నడుస్తున్నారు, ఇంతలో,దొంగ –దొంగ– పట్టుకోండి అన్న కేకల్తో వులిక్కిపడి చుట్టూ చూశారట. కేకలు వేస్తున్న పెద్దమనిషి నాన్నగారికి నాలుగడుగుల దూరంలో పరుగు పెడ్తున్న కుర్రవాడి వైపు చూపించి, పట్టుకోండి సార్ పారిపోతున్నాడని కేకలు వేసి చెప్పాడట. చదువుకునే రోజుల్లో పరుగు పందాల్లో మొదటి బహుమతులు కొట్టివేసుకోయటమే కాక ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు వ్యాయామం కోసమని పరుగెత్తే నాన్నగారు ఆ కుర్రవాడిని సునాయాసంగ పట్టుకున్నారట.

చిరిగిన లాగులో నుంచి వూసల్లా కనుపిస్తున్న కాళ్ళు వణుకుతుండగ, ఆ కుర్రవాడు భయంతో లాగు తడిపి వేసుకున్నాడు. చిక్కి శల్యమై ఎముకలగూడులా ఉన్న చొక్కాలేని అతని శరీరం, నుదుటి మీద చిందరవందరగ పడుతున్న తైల సంస్కారంలేని జుట్టుతో దీనంగా చూస్తున్న ఆకళ్ళు చూడగానె ఆరోజు న్యాయస్ధానం బోనులో నిల్చున్న వ్యక్తి ప్రతిరూపం కనుపించింది నాన్నగారికి. నలుగురు పోగై ఆ కుర్రవాడిని కొట్టబోతుంటె ఆపిల్లవాడి చేతిలో ఉన్న డబ్బు సంచి, పట్టుకోమని కేకలు పెట్టిన అతనికి ఇచ్చి వేసారు. మీడబ్బు మీకు దొరికింది కదా, ఇతన్ని వదిలేయండి నేను చూసుకుంటాను అని, చితకతన్నే అవకాశం జారిపోయిందనని బుసలు కొడ్తూ చూస్తున్న వారి చూపులను ఖాతరు చేయకుండా ఆపిల్లవాడిచేయి పట్టుకుని తనతో తీసుకు వచ్చారు.

త్రోవలో కనిపించిన బట్టల దుకాణంలో నాలుగు జతల బట్టలు, దువ్వెనలాంటివి కొనుక్కుని అతని చేయి వదలకుండ ఇంటి వరకు తీసుకు వచ్చారు. బయట కుళ్ళాయి చూపించి స్నానం చేయమని చెప్పి తను తీసుకువచ్చిన దుస్తులు ఇచ్చి భోజనం పెట్టించారు.

పళ్ళెం నిండుగ అమ్మ పెట్టిన భోజనంలో ఒక్కమెతుకు కూడ మిగల్చకుండ తినేసి, చెంబుడు నీళ్ళు త్రాగి విస్తరాకు బయట పారవేసాడు. కుళ్ళాయి దగ్గర చేతులు కడుక్కుని వరండాలో గోడ వారగ కూర్చుని కూరుపాట్లు పడుతున్న వాడికి ఒక చాప, జంపకాణ, దిండు, దుప్పటి ఇచ్చిందట అమ్మ. అంతె ఆరోజు మొదలు ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూ అమ్మ దిద్దించిన అక్షరాలు దిద్దుకుని చదవటం, వ్రాయటం నేర్చుకున్నాడట.

నాన్నగారు కాని, అమ్మ కాని తను వచ్చిన రోజు జరిగిన సంఘటన గురించి మాట్లాడ లేదట. అమ్మ గుండె సముద్రమంత విశాలమైనదని, ఆ గుండెనిండా ప్రేమ, జాలి, దయ నిండి ఉన్నాయని చెప్తుంటాడు.

ఈసంఘటన జరిగేటప్పటికి నేను పుట్టకపోయినా గోవిందు నోటి మీదుగ అనేకసార్లు వినటంవల్ల నాకళ్ళకు కట్టినట్లయింది. నేను పుట్టిన తరువాత నా బాధ్యత అంతా తనదే అయినట్టు అమ్మ నాన్నగార్లతో సమంగ తన ప్రేమను పంచి ఇచ్చాడు.

“మనం ఇంకా ఎంతదూరం వెళ్ళాలి గోవిందు?” వెలుగు ఎక్కడైనా కనుపిస్తుందేమోనని కళ్ళు చికిలించి చూస్తూ, అడిగాను.

“మరో మూడు కిలోమీటర్లు ఉంటుందమ్మ. చెట్లు ఏవీ విరిగి త్రోవలో అడ్డు పడకుండా ఉంటే ఎంత దూరమైన ఒక గంటలో వెళ్ళిపోతాం.” స్టీరింగ్ మీదనుంచి డాష్ బోర్డ్ మీదకు వంగి, తన చేతిలో ఉన్న గుడ్డతో అద్దం తుడుస్తూ, అన్నాడు.

కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుల పరంపర చూడలేక కళ్ళు మూసుకున్నాను. వెనువెంటనే దిక్కులు పిక్కటిల్లేలా ఉరిమిన ఉరుముతో అడవి వణికి పోయిందని అనిపించింది. దూరాన కొండపై చెట్టు మీద పిడుగు పడి చెట్టు మధ్యలోకి చీలిపోయి మంటలు పైకి లేనటం చూసి గోవిందు గాభరా పడ్డాడు. కాని కుండపోతగ వాన కురుస్తుండటం వల్ల ఆ మంటలు ఎక్కువ కాలం నిలవలేదు.

భగవంతుడా! ఈ భీభత్సం నుండి కాపాడు తండ్రీ! ఎంతో ప్రయాస పడగా వచ్చిన ఈ అవకాశం జారవిడుచుకోలేను. నేను వెళ్ళే ప్రదేశం చాలా ప్రమాదకరమైనదే. ఇంత సాహసం ఎలా చేయగలిగానో నాకే అర్దం కావటం లేదు! చెట్లు ఏవీ మేము వెళ్ళే త్రోవలో విరిగి పడకుండా ఉండేలా అనుగ్రహించు తండ్రీ! అని ప్రార్దించాను. ప్రస్తుత పరిస్తితుల్లో నేను చేయగలిగింది ప్రార్దన మాత్రమే.

కారు ముందుకు సాగుతూనే ఉన్నది. ఎంత వద్దనుకున్నా భయంకరమైన ఆలోచనలు నన్ను చుట్టిముట్టి వేస్తున్నాయి. మా కారు మీద పెద్ద వృక్షం విరిగి పడితే! నేను, గోవిందు ఈ దిక్కులేని అడవిలోనే ప్రాణాలు వదిలి వేస్తామేమో! ఒకవేళ ఈ వర్షం తగ్గకుండ ఇలా కురుస్తూనే ఉండి, కొండల్లో, చెరియల్లో నుండి ఉధృతంగ ప్రవహించే నీటితో ఈ అడవి మునిగిపోతే—అలా కాకపోయినా వృక్షాలు విరిగి మా కారుకి అడ్డం పడిపోతే, వాటిని తొలగించి మమ్మల్ని రక్షించే వారెవరు?

ఇలా ఆలోచిస్తూ కళ్ళు తెరిచాను. ఆశ్చర్యం!! తుఫాను ఎంత అకస్మాత్తుగ వచ్చిందో అంత త్వరగ మాయమై పోయింది!! గాలి లేదు–వాన లేదు–ఎక్కడెక్కడో దాగున్న పక్షులన్నీ ఉత్సాహంగా కిలకిలలాడుతూ రెక్కలు టపటపలాడిస్తూ వీనుల విందుచేస్తున్నవి. అప్పటి వరకు భయంకరంగ ఊగుతున్న వృక్షాలు చిరునవ్వుతో ఆహ్వానించే గృహిణుల్లా కొమ్మలు నెమ్మదిగ ఊపుతూ స్వాగతం చెపుతున్నవి. గుబురుగ ఉన్న చెట్లకొమ్మల ఆకుల్లో నుండి సూర్యకిరణాలు నేలపై ఉన్న నీటి మడుగులపైన, నీటి బిందువుల్తో ఉన్న గడ్డిపరకలపైన ప్రసారించి వజ్రాల తివాచి పరచినట్లు మిలమిల మెరుస్తున్నది. ఇంత భీభత్సం ఎలా మాయమైపోయింది?

గండం గడిచిపోవటం వల్ల తేలిక పడిన హృదయంతో పెదవులపైకి చిరునవ్వు తొంగి చూస్తుండగ చుట్టూ చూశాను. ఆ వృక్షాలకు, వాటికి అల్లుకున్న తీగలకు, రంగురంగులుగ విరగపూసిన పుష్పాలకు, చెట్లకొమ్మలపై ఉత్సాహంగా ఎగురుతున్న పక్షులకు, ఆకాశంలో వయ్యారాలుపోతూ విరిసిన హరివిల్లుకు ప్రకృతిమాత హొయలు అలవాటేనేమో! ఇంతలోనే అంత భయంతో బిగుసుకు పోయావెందుకని నన్ను హేళన చేస్తున్నట్లనిపించింది.

ప్రకృతి సౌందర్యాన్ని ఆనందిస్తూ, ఈ అడవిలో ఇంత అందమైన దృశ్యం చూసిన అదృష్టానికి మురిసి పోతూ మైమరచిపోయి ఉన్నానేమో! గమ్యం చేరుకున్నామని గ్రహించలేక పోయాను.

“నేనుకూడ లోపలకు రావచ్చామ్మా?” కారు చెట్టుక్రింద ఆపి, గోవిందు అడగటంతో ఈ లోకంలోకి వచ్చాను.

“వద్దు నువ్విక్కడే ఉండు”అని చెప్పాను. ఎదురుగ దాదాపు ఇరవై అడుగల ఎత్తునున్న ప్రహరీగోడ, మరో రెండడుగులపైగా ఉన్న ముళ్ళతీగ చుట్టుకుని ఉన్నది, ఆ గోడకు పట్టిన పచ్చని పాచి, పాచి మధ్యలో గోడ క్రింద నుండి అల్లుకున్న అడవి తీగలు, పూలు వ్రేళ్ళాడు తున్నాయి. రెండు లారీలయినా ఒకేసారి వెళ్ళటానికి వీలయ్యేంత విశాలంగ ఉన్న బరువైన ఇనుప తలుపులు (తెరవాలన్నా మూయాలన్నా ఏనుగులు అవుసరమేమో అనిపించేలా) ఉన్నవి. కారులో నుండే ఇవన్నీ నిశితంగా పరిశీలుస్తూ కారు తలుపు తీశాను. తలుపు తెరవగానే వచ్చిన చల్లగాలి వలనో, లేక నేను తలపెట్టిన కార్యం తలపుకు వచ్చినందు వలనో ఒక్కసారిగా శరీరంలో నుండి వణుకు వచ్చేసింది. అడుగు ముందుకు పడలేదు కాని, వెనుకడుగు వేయ లేదు.

ధైర్యం తెచ్చుకో నియతి, ఇంత దూరం వచ్చావుకదా! అని భుజం చరుచుకుని కారులో నుండి దిగి ముఖద్వారం వైపు నడిచాను. గేటు బయట ఎవరూ లేరు. తలుపు లోపల తాళం వేసి ఉన్నది. కాలింగ్‌ బెల్ లాంటిదేమైన ఉంటుందేమోనని గేటుకి రెండువైపులా చూశాను. అలాంటిదేమీ కనుపించ లేదు. కారు వైపు చూశాను. గోవిందు ఉత్సుకతో ఇటే చూస్తున్నాడు.

ఇంతలో “ఎవరది? ఏంకావాలి?” అన్న స్త్రీ కంఠం పెద్దగ అరిచింది. పొగ త్రాగటానికి అలవాటు పడ్డవారి స్వరంలా గరగరమంటూ మృదువుగ లేని ఆ కంఠం పురుషుడిదేమోనని వచ్చిన అనుమానం మరుక్షణంలోనే (ఇచట పురుషులనే వారు ఉండరనే విషయం గుర్తుకొచ్చి) మాయమైంది. గరగరమనే ఆ కంఠద్వనికి త్రుళ్ళి పడ్డాను. ఆక్షణంలో నాపేరు నాకు గుర్తు రానంతగ మెదడు మొద్దుబారి పోయింది. తేరుకుని, “నాపేరు నియతి, మనశ్శాస్త్ర వైద్యురాలిని. ఇచ్చటి స్త్రీలను కలుసుకుని మాట్లాడటానికి హోంశాఖమంత్రిగారి వద్దనుండి అనుమతి తీసుకుని వచ్చాను.” తడబడుతూ అన్నాను.

“అనుమతిపత్రం చూపించు,” అని ఆజ్ఞాపించిందికాని కంఠంలో కరకుతనం తగ్గి కొంత సరళంగ వినిపించింది.

వణికే చేతుల వణుకు కనిపించనీయకుండ చేతులు అదుపులోకి తెచ్చుకుని, జాగ్రత్తగ నా చేతిసంచిలో ఉన్న కవరు తీసి కాగితం మడత విప్పి పట్టుకున్నాను.

“కెమేరాకు దగ్గరగా పెట్టు.” ఆదేశించింది.

అప్పుడు చూశాను కెమేరా. ముఖద్వారానికి కుడివైపున మూలగా ఉన్నది.

“లోపలకురా” అని ఆహ్వానించింది.

ముఖద్వారానికి మధ్యలో ఒక్క వ్యక్తి మాత్రమే లోపలకు వెళ్ళగలిగేలా ఒక చిన్న ద్వారం తెరుచుకుంది. అప్పటి వరకు అక్కడ గేటు ఉన్నదని కూడా తెలియ లేదు. గుండెల నిండా గాలి పీల్చుకుని వెను తిరిగి కారు ప్రక్కనె నిల్చున్న గోవిందు వైపు చూసి, నాకేంఫర్వాలేదన్నట్లు తల ఊపి, ఎందుకైనా మంచిదని కుడికాలు లోపల పెట్టాను.

“నువ్వేమీ అత్తారింటికి రాలా.” వెటకారంగ అన్నది.

ఓరి నాయనో! ఆవులిస్తే ప్రేగులు లెక్కపెట్టేలా వున్నదిరా బాబు! ఆవిడ ఆదేశానుసారం లోపలికి వచ్చి, నా సంచి నేలమీద పెట్టి, రెండు చేతులు తలపై పెట్టుకున్నాను.

“ముందుకు నడువు,” ఆన్న ఆజ్ఞతో క్రిందనున్న నా సంచి తీసుకోబోయాను.

“అది అక్కడే ఉంటుంది.” గర్జించింది.

“నేను వ్రాసుకోవటానికి పుస్తకం అందులో ఉన్నది.” బెరుగ్గా అన్నాను.

“నేనిచ్చిన పుస్తకంలోనే మీరు వ్రాసుకోవాలి.” ఈసారి ఎందుకో మర్యాదగా అన్నది.

నా బ్యాంకు చెక్ బుక్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్ , డ్రైవర్స్ లైసెన్స్, దారి ఖర్చులకని అవసరానికి మించే తెచ్చుకున్న పైకం బాగ్‌లోనే ఉన్నాయి. ఇవి కాక ప్రయాణంలో అవుసరమౌతాయేమోనని సర్దుకున్న సరంజామా అంతా అందులోనే ఉన్నది. “ఇదెక్కడికైనా బయలు దేరిందంటే ఒక సంసారానికి సరిపడిన వస్తువులు ఈ సంచిలోకి తోసేస్తుంది.” అని మా పెద్దమ్మగారి అమ్మాయి నన్ను ఎగతాళి చేస్తుంది. –అది నీ చేతిసంచి కాదే తల్లీ–ఒక చిన్నసైజు సూట్ కేస్ అని వెక్కిరిస్తుంది. అలాంటి నాసంచి వదిలి వేయాలంటె మనసొప్పక, చేసేదిలేక ఉస్సురంటూ చేతులు తల మీద ఉంచుకునే ముందుకు సాగాను.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.