
ఈ తరం నడక – 19
మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం”
-రూపరుక్మిణి

వర్తమానమంతా యుద్ధ గీతాల్ని ఆలపిస్తూ, ఆలకిస్తూ బ్రతకాల్సి రావడం నేటి దుర్భరమైన పరిస్థితి.
ఎటు చూసినా యుద్ధ విద్వంసమే. అధికారం కోసం ఒకడు పన్నిన కుట్రలో అనేక మందిని ఈ భూమి పొరల్లో కప్పి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని గొంతెత్తి పలికేందుకు కూడా ఈ అధికారం అవకాశాన్ని లేకుండా చేస్తోన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం.
యుద్ధాన్ని కోరుకున్న వాడు, ప్రకటించిన వాడు యుద్ధభూమికి రాడు. కానీ సాధారణ పౌరుడు ఈ యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయాల్సి వస్తుంది. నష్ట పోవాల్సి వస్తుంది, జీవతాన్ని కోల్పోవలసి వస్తుంది. ఈ యుద్దానికి కారణం మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏదైనా సరే మనిషితనం లోపించినప్పుడు యుద్ధ విధ్వంసం తప్పకుండ అనుభవిస్తాం. మరి పరిష్కారం ఏది?, ఎక్కడ ఉంటుంది ఈ సమస్యకి?! అందుకే..
ఈ వర్తమాన కాలం యుద్ధ కాలం. ఒకరిపై మరొకరు చేసే విధ్వంసానికి ప్రతీక. ఆ ‘ప్రతీక’ని తీసుకొని ఇప్పుడు మెర్సీ మన ముందుకు ‘యుద్ధ కాలపు శోక గీతాన్ని’ కవిత్వ రూపంలో ఆలపిస్తున్నారు.
యుద్ధం సృష్టిస్తున్న భీకర వాతావరణం మనిషిని నిశ్శబ్దమైన నిర్లిప్తతలోకి నెట్టివేస్తోంది. ఇటువంటి కాలంలోనే కవులు కలమై, ప్రజల గళమై ప్రవహిస్తారు.
అలా మెర్సీ మార్గరేట్ కూడా యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, యుద్ధం చేసిన విధ్వంసాన్ని ప్రతిఘటిస్తున్నారు. పూడ్చలేని నష్టాన్ని గుర్తుచేస్తూనే మనిషి వలపోతను అక్షరాల్లోకి ఒంపి ఈ యుద్ధ కాలపు శోక గీతాన్ని ఆలపిస్తున్నారు.
యుద్ధం జరిగే చోట బూడిద కుప్పలను చూసి, ఖననమైన యుద్ధ సైనికులను గుట్టలుగా పేరుకున్న శవాల మధ్యలో గుర్తించలేని నేల తల్లిని, బూడిద తెప్పల కింద కూలిపోయిన దేహాల్ని, రాలిపోతున్న భవితను, గాయమై మోడు వారి పోతున్న చిన్నారు లను చూసి తల్లడిల్లి పోతున్న కవిత్వ కలం మెర్సీది.
ఎక్కడైనా దుఃఖాన్ని స్త్రీ కంటే బాగా చెప్పడం నేను చూడలేదు.
కారణం పుట్టుకతోటే ఆమెకు ఈ పితృస్వామ్య వ్యవస్థ నుంచి అందిన ఆభరణం హింస, అందులో నుండి వచ్చిన అలంకారమే దుఃఖిత. కాదనలేని సత్యం.
ఈ యుద్ధ కాలపు శోకగీతంలో కవితలు మన చుట్టూ వున్న రాజకీయ, ఆర్ధిక అసమానతలను ఎత్తి చూపిస్తూనే, హింసకు ప్రేరేపితమైన మూలాల్ని గురించి గుర్తు చేస్తూ మాట్లాడతారు మెర్సీ.
మెర్సీ కవిత్వంలో ఏ పరిస్థితులనైనా వర్ణించే క్రమంలో తనకు మాత్రమే సొంతమైన శిల్ప నడకతో ఓ మతైన వాక్యాన్ని నిర్మించి మనలోపలి ఆత్మని తాకే ప్రత్యేకమైన కవిత్వ సౌందర్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మెర్సీ ఏ విషయాన్ని మనకు చెప్పాలనుకున్నారో ఆవిషయాన్ని చెప్పడానికి వర్తమానం నుండి మూలాల్లోకి వెళ్లి అక్కడ నుండి మళ్ళీ నేటి రక్తసిక్త వాతావరణంలోకి తీసుకువచ్చి అందుకు కారణం ఈ రాజకీయ అనిశ్చితే అని చెప్తూనే శాంతికి మార్గం వెతుకుదాం అని మానవత్వం వున్న మనుషుల్ని సమీకరిస్తుంది. యుద్దాన్ని వద్దని ప్రకటించమని నినదిస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడమే మర్చిపోతే మనిషి మనుగడ కష్టమని గుర్తుచేస్తుంది. మనుషుల మధ్య ప్రేమని ఆప్యాయతని పంచమని చెప్తుంది.
ఈ కవిత్వ నడకకు కారణం తన సాహిత్య ప్రయాణంలో నిరంతర అధ్యయనం, వివిధ రకాల ప్రాంతాల, భాషల్లోని కవుల్ని, రచయితల రచనల్ని విస్తృతంగా చదవడమే అనిపిస్తుంది.
ఈ పుస్తకం లోపలికి వెళ్లి చూద్దాం రండీ…
ఇందులో మొదట ఓ దీర్ఘకవిత ఉంటుంది.
ఇందులో మన చుట్టూ పరిస్థితుల్ని వివరిస్తూ మొదలుపెడతారు.
చిధ్రమైపోతున్న పసిపిల్లల జీవితాలను చూస్తూ / చీకటి తడిపే బురద లాంటి కాలం పచ్చిగానే ఉంది / పిల్లలు తమ వేళ్ళతో శాంతిని గీయటం నేర్చుకుంటున్నారు / మట్టిని తినే పిల్లలపై వారు రాజకీయ పథకాలు రచించారు రక్తాన్ని వడపోసే బహుళ జాతి కంపెనీలతో శాంతి ఒప్పందం పై సంతకం చేశారు /
ఇలా మొదలైన కవిత్వంలో నుండి
రాజకీయం ఎంత రంగు మార్చిందో చెప్తూ…
/ మన భాషలకి ఇప్పుడు నలుపు రంగే మిగిలింది / పాటలు ఇప్పుడు లాఠీల కింద బతుకుతున్నాయి కవితలు విచారణ గదుల్లో ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి /
అంటూ ప్రజా గళాలని ప్రభుత్వం నిర్బంధించిన తీరుని ప్రశ్నిస్తుంది. /ఈ కాలపు నిశ్శబ్దాన్ని తుడిచివేయగల నినాదం నువ్వే అని గుర్తు చేస్తుంది/
శాంతి పేరుతో రక్తపు పాదం ముద్రలు వదిలిన వారిని ప్రశ్నిద్దాం రమ్మంటుంది.
మౌనాన్ని బద్దలు కొట్టే అక్షరాలుగా ఏక స్వరమై రావాలని కోరుతుంది.
చివరగా ఈ కవిత్వంలో తన గురించి తాను చెప్పుకుంటూ ఓ కవిగా ఎలా ఉండాలో తను ఎలా ఉన్నదో కూడా చెప్తుంది.
ఒక్క మాటతో
ఒక గొడవ పడిపోవచ్చు
ఒక అక్షరం వెనుక
ఒక చిన్నారి ‘బతుకు’ అన్న పదం మళ్లీ జీవం పొందొచ్చు
ఒక గొంతుగా
ఓ సంచలనంగా
ఓ కాలాన్ని తాకే తిరుగుబాటుతో రాస్తున్నా
యుద్ధం వద్దు!
పిల్లలు ఉండాలి.. పాటలు ఉండాలి.. ప్రేమ ఉండాలి.
ఇలా యుద్ధకాలపు శోకాన్ని తన కవిత్వంలోకి ఒంపి తాను చెప్పాలనుకున్న విషయంలో స్పష్టంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాల్సింది అక్షరమే అని అక్షరం ఆయుధం అవ్వాలని ఎన్ని అక్షరాలని ఈ ప్రభుత్వం బంధించిన కొత్తగా మళ్లీ అక్షరం పుట్టాలని కోరుకునే ఓ కవిగా తన కవిత్వం నడక ఉత్తేజితం చేస్తుంది.
ఇటువంటి కవిత్వాన్ని చదవవలసిన అవసరం అక్షరమై నడవవలసిన అవసరం నేటి యువతకు చాలా ఉంది.
కవిత్వ వాక్యాల వెనుక మెర్సి తిరుగుబాటు, ధైర్యవాక్యం మనకి కనిపిస్తుంది.
నేను ఈ యుద్ధాన్ని రాయలేకపోతున్నా అంటూ దుఃఖిస్తుంది. కారణాలని వెతుకుతూ తన కవిత్వంలో రాజకీయ కోణాల్ని తీసుకొని వస్తూ /అతడిప్పుడు వార్తల్లో ముఖ్యాంశం / అన్న కవితలో నేటి రాజకీయ అస్తిత్వాన్ని స్పష్టంగా చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది.
ఈ యుద్ధకాలం ముగిసిన తరువాత కాలాన్ని ఊహించి మనోవ్యధ చెందుతుంది
/ యుద్ధం ఆగిన రోజున
ఓ చిన్న పక్షి రక్తం మాయమైన నేలపై రెండు గింజలు తిందామని అడుగుపెడుతుంది. దానికి తెలియదు యుద్ధం గురించి. బ్రతికేందుకు మనిషి ప్రతిరోజు చేసే యుద్ధం లాంటిదే అది కూడా చేస్తూ ఉంటుందని./
యుద్ధం గురించి నేటితరం ఆలోచనల్లో ఉండవలసిన తీరు గురించి, యుద్ధ నిశ్శబ్దం గురించి, యుద్ద శ్లోకాన్ని వినిపిస్తోంది. ఒక్కసారైనా ఈ పుస్తకం ఖచ్చితంగా చదివి తీరాలి యుద్ధం మన చుట్టూ నిర్మిస్తున్న విధ్వంసాన్ని తరచి చూసుకోవాలి.
చాలా ధైర్యంగా, గొప్పగా రాశావు మెర్సీ అభినందనలు.. బలమైన కలం ఎలా ఉండాలో నీ ఈ కవిత్వం నేటితరం పిల్లలకు ఓ మార్గం.
#ఈ_తరం_నడక లో.. ఓ బలమైన గొంతుని భాగం చేసుకున్నందుకు నాకు చాలా తృప్తిగా వుంది.
ఎన్నెలపిట్ట నుండి వచ్చిన ఎర్రటి బావుట ఈ పుస్తకం.
పుస్తకం :
యుద్ధకాలపు శోక గీతం
-మెర్సీ మార్గరేట్
( దీర్ఘ కవిత)
ప్రచురణ: ఎన్నెలపిట్ట
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
