చంద్రుడిలో కుందేలు

-కందేపి రాణి ప్రసాద్

అడవిలో వెన్నెల పచ్చ పువ్వులా కాస్తోంది. ఆకాశం నుండి వెన్నెల వెండి జలతారులా ప్రవహిస్తోంది. ఒక చెట్టు కింద బొరియలో కుందేళ్ళ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో కుందేలు జంట తన పిల్లలతో అమ్మా నాన్నలతో కలసి జీవిస్తోంది. కుందేలు పిల్లలు రోజూ నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు వింటూ ఉంటాయి. పగలంతా పచ్చ గడ్డిలో ఆటలాడుతుంటాయి.

కుందేళ్ళ ఆటలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఆకు పచ్చని గడ్డిలో తెల్లని తెలుపుతో కుందేళ్ళు దూది పింజల్లా కనిపిస్తాయి. ఎదురుగా ఉన్నట్లే ఉంటాయి పట్టుకోబోతే దొరకవు. అటు ఇటు అక్కడే తిరుగుతుంటాయి. కానీ చేతికి దొరకవు. వాటి ఆటలు చూసి తల్లిదండ్రులు మురిసిపోతూంటాయి.

ఆ వెన్నెల రాత్రి పడుకోబోయే ముందు కుందేలు పిల్లలన్నీ ఒక చోట గుమి గూడాయి. అప్పుడే కుందేలు నాన్నమ్మ బొరియలో నుంచి బయటకు వచ్చింది. వెంటనే పిల్లలన్ని నాన్నమ్మ చుట్టూ చేరాయి. ‘నాన్నమ్మా! మాకో కథ చెప్పవూ.” అని కుందేలు పిల్లలు ఆడిగాయి. “ఇప్పుడేం కథలే! ఇక పడుకోవచ్చుగా! అంటూ ఆకాశంలోని చందమామను చూసింది.

“అరే పిల్లలూ! కథ తర్వాత చెపుతాను గానీ  ఆకాశంలోని జాబిల్లిని చూశారా? మీలాగే తెల్లగా శ్వేత వర్ణంతో మెరిసి పోతున్నాడు. ధవళ వర్ణంతో ప్రకాశిస్తున్న ఆ చంద్రుడిలో కుందేలు పిల్ల ఉంటుందట తెలుసా! మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది” అంటూ కుందేలు నాన్నమ్మ పారవశ్యంతో చెప్పుకు పోసాగింది.

కుందేలు పిల్లలకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆకాశంలోకి చంద్రుడిలో కుందేలు పిల్ల ఉన్నదా? అక్కడ ఏం చేస్తున్నది. ఒక్కతే ఉన్నదా! అక్కడ గడ్డి ఉంటుందా? ఏమి తింటుంది? ఎలా ఆడుకుంటుంది? అని ఎన్నో ప్రశ్నలు మనసులో గిరగిరా తిరగటం మొదలు పెట్టాయి.

నాన్నమ్మ శరదృతువులోని వెన్నెల అందానికి మైమరచి పోయింది. అలాగే చంద్రుడి వంక చూస్తూ కూర్చున్చది. పిల్లలకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. నానమ్మను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు కానీ నాన్నమ్మ పలకటం లేదు. అలౌకిక ఆనందంలోకి వెళ్ళి పోయింది.

పిల్లల గోల విని కుందేలు తల్లి బయటకు వచ్చింది. తల్లి వెన్నెల్ని తదేకంగా చూస్తూ మరో లోకంలోకి వెళ్ళిపోయింది. పిల్లలు గోల గోలగా మాట్లాడుతూ ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఆమెకి పరిస్థితి అర్థమయింది. తన అత్తగారికి వెన్నెలంటే ఎంత ఇష్టమో తెలుసు ఆ ఆనందంలో మునిగి పోయిందంటే ఒక పట్టాన మమూలు మనిషి కాదు. అందుకే పిల్లలతో చెప్పింది “నాన్నమ్మను విసిగించవద్దు. కథ నేను చెపుతానులే” అన్నది తల్లి.

“కథ మాకేమీ వద్దు. చంద్రుడిలో కుందేలు ఉంటుందని నాన్నమ్మ చెప్పింది. అక్కడకు ఎలా వెళ్ళింది. కిందికి దిగి రాదా! అక్కడ రోజూ ఏం చేస్తుంది” అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నారు.

కుందేలు తల్లి వారి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరయింది. ఆగండాగండి. అన్నీ వివరిస్తాను! “ఆకాశంలోని చంద్రుడిలో కుందేలు ఉందని కొంతమంది, నూలు వడుకుతున్న ముసలవ్వ ఉన్నదని కొంతమంది చెబుతుంటారు. ఇదంతా మనం నేల మీద నుండి చూసినప్పుడు కనిపించే చిత్రాలన్న మాట. కొంతమంది చంద్రుడికి మచ్చలు ఉన్నాయని చెబుతారు. ఇవన్నీ రకరకాలుగా చెబుతారు” అని చెబుతూ కుందేలు తల్లి మధ్యలో కొంతసేపు అగింది.

పిల్లలు ఆ కాసేపు ఆలస్యాన్ని తట్టుకోలేక పోయారు. “చెప్పు అమ్మా చెప్పు కుందేలు ఆకాశంలోకి ఎలా వెళ్ళింది? అంత ఎత్తుకు వెళ్ళాలంటే ఎలా?  నిచ్చెన ఎక్కి వెళ్ళిందా! కొండ పై భాగానికి వెళ్లి అక్కడి నుంచి చంద్రుణ్ణి చేరుకున్నదా?” అని మళ్ళి ప్రశ్నల హోరు మొదలుపెట్టారు.

ఇవన్నీ ఒకప్పటి ఊహా చిత్రాలు! అప్పుడు గ్రహాల సంగతి తెలియదు కాబట్టి అలా చెప్పేవారు. చంద్రుడిలో కుందేలు ఉన్నదని, ముసలమ్మ ఉన్నదని చెప్పేవారు. అంతే కాదు మానవులు తమ పిల్లల్ని ఎత్తుకుని చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవారు.

“చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ పిల్లల నోట్లో అన్నం పెడుతుంటారు. పసిపిల్లలు ఆకాశంలో చందమామని ఆశ్చర్యంగా చూస్తూ నోరు తెరుస్తారు. అదే అదనుగా తల్లి పప్పనం నోట్లో పెట్టేస్తుంది. పిల్లలకూ చందమామకూ అదే అవినాభావ సంబంధం!” అంటూ కుందేలు పిల్లల అమ్మ చెప్తూ పోతున్నది.

పిల్లలకు చాలా అసహనంగా ఉన్నది. “కుందేలు చందమామలోనికి ఎలా ఎక్కిందా అని వాళ్ళ ఆశ్చర్యం తీరనే లేదు. అమ్మేమో మానవులు చందమామ అని ఏదేదో చెప్తోంది. వాటికేమి అర్ధం కాలేదు. అమ్మ అసలు విషయం చెప్పకుండా దాట వేస్తుందని అనిపించింది.”

“అమ్మా! ముందుగా కుందేలు చందమామ లోపలికి ఎలా వెళ్ళిందో చెప్పమ్మా. మిగతావన్నీ తర్వాత చెబ్దువు గానీ” అని విసుగ్గా మొహం పెట్టి అమ్మను అడిగాయి. సరే మీకు కుందేలు చందమామ లోపలికి ఎలా వెళ్ళిందో చెప్పాలి అంతే కదా! అన్నది అమ్మ.

‘అవునవును అదే కావాలి’ అని కుందేలు పిల్లలన్నీ ముక్త కంఠంతో అరిచాయి. సరే చెప్తానుండు. కుందేలు చందమామ లోపలికి వెళ్ళలేదు. భూమ్మీద నుంచి చూసిన మానవులకు చంద్రుడి మీదకు మచ్చలు, కుందేలులాగా కనిపించాయి. అందుకే అలా అందరూ అనుకునేవారు. నాన్నమ్మ కూడా మనలాగే చెప్పింది. అని తల్లి కుందేలు చెప్పటం మొదలు పెట్టింది.

“మరి ఇంతకీ చందమామ సంగతేమిటి? కుందేలు సంగతేమిటి అని పిల్లలు మళ్ళీ మొదటికొచ్చారు.”

“మొదట్లో భూమి బల్ల పరుపుగా ఉండేదని అపోహ పడ్డారు. అలాగే భూకేంద్రక సిద్ధాంతం అమల్లో ఉండేది. ఈ గ్రహాల గురించి పరిశోధనలు పూర్తిగా జరగలేదు. సముద్రంలో ప్రయాణం చేసిన నావికులు నీళ్ళ చివరకు వెళితే కిందకు పడిపోతుందుని భావించేవారు” అంటూ కుందేలు తల్లి చెప్తుంటే పిల్లలకు ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా మొహం పెట్టారు.

“భూమి, చంద్రుడు ఎవరమ్మా? పూర్తిగా వివరంగా చెప్పు” అన్నాయి కుందేలు పిల్లలు.

“ఆకాశంలోని సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు సంచరిస్తుంటాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం. ఆకాశంలో ఉండే చంద్రుడుతో సహా అన్ని గ్రహాలూ ఒక వర్తలాకార మార్గంలో తిరుగుతుంటాయి. అని చెప్తూ ఉండగానే పిల్లలు మధ్యలో అడ్డు తగిలి” ఇందాక ఏదో “భూకేంద్రక సిద్ధాంతం” అని చెప్పావు అదేమిటి అని అడిగారు.

అవునమ్మా అప్పట్లో భూమి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయని అనుకునేవారు కానీ సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయని పరిశోధనల వల్ల తెలుసుకున్నారు. దీనిని “సూర్య కేంద్రక సిద్ధాంతం” అంటారు. అలాగే గ్రహాలన్నీ ఒకచోటే ఉండవు ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటాయి అని తల్లి కుందేలు చెప్తోంది.

“ఎప్పుడూ తిరుగుతుంటే కాళ్ళు నొప్పి పుట్టవా అని ఒక కుందేలు పిల్ల అడిగింది. అప్పుడు తల్లి నవ్వుతూ ఆ పిల్లతో అన్నది. “అవి గ్రహాలు కదమ్మా నొప్పులుండవు,  ప్రాణులు కాదు కదా! అవి పుట్టటం, చనిపోవటం ఉండదు అని అన్నది.

“మరి చంద్రుడి దగ్గర నుంచి వెన్నెల ఎలా వస్తుంది. అతనికి లైట్లున్నాయా” అని మరో పిల్ల అడిగింది. అమ్మ నవ్వుతూ “చంద్రుడికి వెన్నెల సూర్యుడి వలన వస్తుంది. చంద్రుడు సూర్యుని వద్ద నుండి కాంతిని తెచ్చుకుని భూమికి ఇస్తూ ఉంటాయి. ఆ వెన్నెల్ని చూసి మనం సంబర పడతాం” అని అమ్మ చెప్పింది.

చంద్రుడిలో కుందేలు లేదని ఎలా తెలిసింది? మరో కుందేలు పిల్ల అనుమాన నివృత్తి కోసం అడిగింది. అందుకు అమ్మ ఇలా చెప్పింది. “మానవులు చంద్రుడి మీదకు ప్రయాణం చేశారు. అప్పుడే అక్కడ కుందేలు, ముసలమ్మ కూడా లేరని తెలిసింది. అసలు అక్కడ జీవించడానికి అనువైన వాతావరణం లేదని కనుక్కున్నారు. చంద్రుడి మీద మచ్చలున్నట్లు కనిపిస్తాయన్నారు కదా! అది కూడా అబద్ధమే. చంద్రుడి మీద ఉన్న లోయలు భూమ్మీదకు మచ్చల్లా కనిపిస్తున్నాయి. మానవులు చంద్రుడి మీదకు వెళ్ళి ఏన్నో విషయాలు తెలుసుకున్నారు. మిగతా విషయాలు మరలా చెప్తాను గానీ పొద్దుపోయింది. పడుకుందాం రండి అని తల్లి కుందేలు పిల్లల్ని లోపలకు తీసుకెళ్ళింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.