రాగసౌరభాలు-21

(ఖమాస్ రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

ప్రియ మిత్రులందరికీ అభివందనం. ప్రతి రాగము ఏదో ఒక రసాన్ని పోషిస్తుంది. నవరసాలలో ఒక రసం శృంగార రసము. ఈ రసాన్ని అద్భుతంగా పోషించగల రాగం ఖమాస్. అందుకే మన వాగ్గేయకారులు జావళీలకు ఈ రాగాన్ని ఎక్కువగా ఎంచుకున్నారు. ఈ ఖమాస్ రాగ విశేషాలు ఈ మాసం ప్రత్యేకం.

ఖమాస్, ఖమాజ్, కమాచి ఇత్యాది పేర్లతో పిలువబడే ఈ 72 మేళకర్త పథకం కన్నా పురాతనమైనది. పూర్వం కమాచి అనే పేరుతో పిలువబడినది ఈ రాగం. నేటి కాలంలో ఆ పేరు వాడుకలో లేదు. ఈ రాగం 200 సంవత్సరములకు పూర్వమే హిందూస్తాని సంగీతం నుండి కర్ణాటక సంగీతములోనికి ప్రవేశించింది. హిందూస్తాని సంగీతంలో ఈ రాగం ఖమాజ్ థాట్ (మేళకర్త)గా ఉంది. ఒకప్పుడు ఈ రాగము కర్ణాటక సంగీతంలో హరికాంభోజీ రాగానికి ప్రతినిధిగా ఉండేది. 72 మేళకర్తలను ఏర్పరచినపుడు ఇది ఉపాంగవక్ర రాగంగా హరి కాంభోజీ రాగ జన్యంగా మారింది.  దీక్షతుల వారి సాంప్రదాయంలో ఇది సంపూర్ణ రాగంగానే ఉంది. ఈ రాగంలో అత్యంత పురాతన రచన 17వ శతాబ్దంలోని తమిళ పదంగా ఉంది. తమిళ పన్ సిస్టంలో ఈ రాగాన్ని పంచచామరంగా పిలిచేవారు.

ఈ రాగం ఆరోహణ అవరోహణలు కింది విధంగా ఉన్నాయి.

స మ గ మ ప ద ని స

స ని ద ప మ గ రి స

 ఇందులోని స్వరస్థానాలు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదం.  ఇది షాడవ వక్ర సంపూర్ణ రాగం. ఆరోహణలో రిషభము వర్జము. అవరోహణ సంపూర్ణము. ఈ మధ్య కాలంలో కాకలి నిషాదాన్ని కలుపుకొని భాషాంగ రాగంగా రూపాంతరం చెందింది. త్యాగరాజస్వామి రచనలలో కాకలి నిషాదం కనిపించదు.  ఇప్పటి కాలంలో “స ని ప” ప్రయోగంలో కాకలి నిషాదం మధ్య తార స్థాయిలలో వస్తుంది. మంద్ర నిషాదము కింద సంచారము ఉండదు.

కర్ణాటక, హిందూస్తాని సంగీతాలు రెండింటిలోనూ  ప్రసిద్ధ రాగము కనుక దేశ వ్యాప్తంగా ప్రాచుర్యము పొందింది.  పాశ్చాత్య సంగీతంలో mixolydian modeగా పిలువబడుతోంది.  అన్ని వేళల యందు పాడదగిన రాగము.  శృంగార రసముతో పాటు భక్తి రసమును కూడా పండించగలదు.

ఈ రాగములోని “సాంబశివా యనవే” అనే స్వరజతి ఎక్కువ ప్రాచుర్యము పొందింది. వీణ కుప్పయ్యరు  రచించిన మానసిక పూజ కీర్తన “పరమాత్ముని” 8 చరణమలతో ఒకే దాతువు (స్వరము) కలిగి సంగీత శిక్షణ ప్రారంభంలో నేర్చుకొనుటకు ఉపయుక్తముగా ఉన్నది. కొమ్మరో, మరులుకొన్నాదిరా వంటి అనేక జావళీలు ప్రాచుర్యంలో ఉన్నాయి.  మైసూర్ వాసుదేవాచార్ రచించిన  “బ్రోచేవారెవరురా” కీర్తన చక్కని చిట్ట స్వరముతో ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఇపుడు కొన్ని ప్రసిద్ధ రచనలు చూద్దాము.

 

శాస్త్రీయ సంగీతము
1 స్వరజతి సాంబశివా ఆది చిన్ని కృష్ణ దాసు
2 దారువర్ణం మాతే ఆది ముత్తయ్యభాగవతార్
3 కీర్తన సీతాపతే ఆది త్యాగయ్య
4 కీర్తన సుజనజీవన రూపక త్యాగయ్య
5 కీర్తన సారసముఖ రూపక స్వాతి తిరునాళ్
6 కీర్తన బ్రోచేవారెవరురా ఆది మైసూర్ వాసు దేవాచార్
7 కీర్తన పరమాత్ముని ఆది –  వీణ కుప్పయ్యర్
8 జావళి కొమ్మరో ఆది రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్
9 జావళి మరులుకొన్నాదిరా ఆది రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్
10 కీర్తన శింగార మూరితివి ఖండ చాపు అన్నమాచార్యులు

 

లలిత సంగీతం
1 వందనం అభివందనం వింజమూరి బాలమురళి
2 ఒక్కతెను వ్రజబాలను అరిపిరాలవిశ్వం చిత్తరంజన్

 

సినిమా సంగీతం
1 ఎందుకె నీకింత తొందర మల్లీశ్వరి భానుమతి
2 మేలుకోవయ్య గృహలక్ష్మి భానుమతి
3 ఓ చెలి కోపమా శ్రీకృష్ణ తులాభారం ఘంటసాల
4 మనసా వాచా గోదావరి చిత్ర, ఉన్ని కృష్ణన్

ఇవండీ ఖమాస్ రాగ విశేషాలు. వచ్చేనెల మరొక రాగ విశేషాలతో మీ ముందుంటా.  అంతవరకు సెలవు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.